పోస్టాఫీసులో రూ.1.5 కోట్ల నిధుల హాంఫట్
గార: శ్రీకాకుళం జిల్లా గార పట్టణంలోని పోస్టఫీసులో ఉపాధి హామీ పనులకు సంబంధించిన రూ.1.5 కోట్ల నిధులు స్వాహా అయ్యాయి. బాధితుల ఫిర్యాదు చేయడంతో విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. విషయం తెలిసిన వెంటనే పోస్టల్ సూపరింటెండెంట్ గురువారం ఉదయం గార నగరానికి వచ్చి సబ్ పోస్టుమాస్టర్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పోస్టల్ ఉన్నతాధికారులందరూ గారకు వచ్చారు.
పోస్టాఫీసు తలుపులు మూసి రికార్డులు తనిఖీ చేశారు. మీడియా వాళ్లను లోపలికి అనుమతించలేదు. ఉపాధి హామీ కూలీలకు ఇవ్వాల్సిన నిధులు రూ.1.5 కోట్ల రూపాయలు గల్లంతయ్యాయి. బినామీ పేర్లతో డ్రా చేశారు. లభ్దిదారులు తమ డబ్బుల కోసం వెళ్తే ఇంతకు ముందే తీసుకున్నారని సమాధానం రావడంతో వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సబ్ పోస్టుమాస్టరే నిధులు నొక్కేశారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారుల విచారణలో నిజానిజాలు బయటపడే అవకాశం ఉంది.