పెట్టుబడులు పెట్టడానికి, స్థిరమైన రాబడులు పొందటానికి ఉత్తమైన ఆప్షన్ 'పోస్ట్ ఆఫీస్ పథకాలు'. పొదుపు చేసుకోవడానికి, ఉత్తమమైన రాబడులను అందుకోవడానికి.. అందుబాటులో ఉన్న 10 ఉత్తమమైన పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్ (Post Office Scheme) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ (Post Office Savings Account)
పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ అనేది రిటైల్ బ్యాంక్ అందించే సేవింగ్స్ ఖాతా. ఈ అకౌంట్ కోసం కనీస 500 రూపాయల బ్యాలెన్స్ అవసరం. ఖాతా ఓపెన్ చేసిన తరువాత రూ.50 నుంచి.. ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ కింద ఖాతాదారులకు 4 శాతం వడ్డీ లభిస్తుంది.
నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ ఖాతా
సామాన్య ప్రజలు సైతం ఉపయోగించడానికి ఉత్తమైన పోస్టాఫీస్ సేవింగ్ ఖాతాలలో ఒకటి ఈ 'నేషనల్ సేవింగ్స్ రికరింగ్ డిపాజిట్ అకౌంట్'. ఇందులో నెలకు 100 రూపాయలు కూడా డిపాజిట్ చేసుకోవచ్చు. దీనికి వడ్డీ మూడు నెలలకు ఒకసారి యాడ్ చేస్తారు. వార్షిక వడ్డీ 6.7 శాతంగా ఉంది.
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్
నేషనల్ సేవింగ్స్ టైమ్ డిపాజిట్ అకౌంట్ అనేది ఒకటి, రెండు, మూడు, ఐదు సంవత్సరాల కాల వ్యవధిలో అందుబాటులో ఉంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులు కోరుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఈ ఖాతాను కనిష్టంగా రూ. 1,000లతో ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో వడ్డీ రేటు కూడా కొంత ఎక్కువగానే ఉంటుంది.
నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్
ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు తమ అకౌంట్లో రూ.9 లక్షల వరకు ఉంచుకోవచ్చు. అయితే ఉమ్మడి ఖాతాలలో రూ.15 లక్షల వరకు ఉండొచ్చు. స్థిరమైన ఆదాయ వనరు కోసం వెతుకుతున్న వారు లేదా.. పదవీ విరమణ చేసిన వారికి ఇది ఓ మంచి ఎంపిక అవుతుంది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారులు సుమారు 7 శాతం వడ్డీ పొందవచ్చు.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)
60 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారి కోసం ఈ స్కీమ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో రూ. 1000 నుంచి రూ. 30 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. వన్-టైమ్ డిపాజిట్లకు కూడా ఇందులో అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా ఖాతాదారుడు కొంత ఎక్కువ వడ్డీని పొందవచ్చు. సాధారణ ఖర్చుల కోసం పెట్టుబడి రాబడిపై ఆధారపడే సీనియర్ సిటిజన్‌లకు అనువైనది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అకౌంట్
దీర్ఘకాలిక పొదుపుల కోసం ఎదురుకి హోసేవారికి ఇది మంచి ఎంపిక. ఇందులో రూ. 500 నుంచి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లు ఏక మొత్తంలో లేదా వాయిదాలలో చేయవచ్చు. ఇది రిటైర్మెంట్ ప్రణాళిక మరియు ఇతర దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుకూలంగా ఉంటుంది. ఇందులో 7.1 శాతం వడ్డీ లభిస్తుంది.
సుకన్య సమృద్ధి అకౌంట్ (SSA)
ప్రత్యేకంగా ఆడ పిల్లల కోసం అందుబాటులో ఉన్న స్కీమ్. ఇది వారి విద్య, భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఈ స్కీమ్ గరిష్టంగా 8.2 శాతం వడ్డీ అందిస్తుంది. ఫ్లెక్సిబుల్ డిపాజిట్ ఆప్షన్‌లతో ఒక ఆర్థిక సంవత్సరానికి రూ. 250 నుంచి రూ. 1.5 లక్షల వరకు పెట్టుబడులు పెట్టవచ్చు. ఈ పథకాన్ని బేటీ బచావో, బేటీ బడవో కింద 2015లో ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రారంభించారు.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (NSC)
భారతీయులలో పొదుపును అలవాటు చేయడానికి కేంద్రం ఈ పథకాన్ని పరిచయం చేసింది. ఇందులో ఖాతాదారులు కనిష్టంగా రూ. 1000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. దీనికి గరిష్ట పరిమితి అంటూ ఏమీ ఉండదు. ఇందులో ఖాతాదారుడు 7 శాతం కంటే ఎక్కువ వడ్డీని పొందవచ్చు.
ఇదీ చదవండి: నెలకు ₹10 వేలు.. రూ.7 కోట్ల ఆదాయం - ఎలాగంటే?
కిసాన్ వికాస్ పత్ర (KVP)
ఈ స్కీమ్ ద్వారా పెట్టే పెట్టుబడి సుమారు 124 నెలల్లో రెట్టింపు అవుతుంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది బెస్ట్ ఆప్షన్. ఇందులో కూడా పెట్టుబడిపి గరిష్ట పరిమితి అంటూ ఏమి ఉండదు. ఇందులో వడ్డీ రేటు 7 శాతం కంటే ఎక్కువే ఉంటుంది.
మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (MSSC)
మహిళలకు ఆర్థికంగా ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా ప్రారభించిన పథకమే ఈ 'మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్'. ఇందులో కనీస పెట్టుబడి రూ. 1000 కాగా, గరిష్టంగా రూ. 2 లక్షలు. ఆర్థిక భద్రత, వృద్ధిని కోరుకునే మహిళలకు ఇది సురక్షితమైన స్కీమ్.
Note: పోస్టాఫీస్ పథకాలలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా వీటి గురించి పూర్తిగా తెలుసుకోండి. ఈ పథకాలకు సంబంధించిన అనుమానాలను లేదా ఇతర వివరాలను తెలుసుకోవడానికి మీ సమీపంలోని పోస్ట్ ఆఫీసును సందర్శించండి. ఆన్‌లైన్ మోసాలు, సైబర్ నేరగాళ్లు పెరుగుతున్న తరుణంలో.. పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా అవసరం.
Comments
Please login to add a commentAdd a comment