కొత్తపాలెం తీరంలో క్షేమంగా ఒడ్డుకు చేరిన మత్స్యకారులు
సాక్షి, మచిలీపట్నం/కాట్రేనికోన: ఐదు రోజుల క్రితం చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణాజిల్లా క్యాంప్‌బెల్‌పేటకు చెందిన మత్స్యకారుల ఆచూకీ లభ్యమైంది. సముద్రంలో గాలివాటాన్ని బట్టి వారు ఉన్న బోటు గురువారం కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం కొత్తపాలెం సముద్ర తీరానికి చేరుకుంది. గమనించిన మెరైన్ పోలీసులు ఆ నలుగురిని క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. మచిలీపట్నం మండలం కరగ్రహారం పంచాయతీ క్యాంప్‌బెల్‌పేటకు చెందిన సుమారు 20 మంది నాలుగు బోట్లలో ఈ నెల 2వ తేదీన చేపల వేటకు వెళ్లారు.
అంతర్వేదికి చేరుకున్నాక ఓ బోటు అలల తాకిడికి ముందుకెళ్లలేక ఆగిపోయింది. ఎంత ప్రయత్నించినా బోటు ముందుకు కదలకపోవడంతో మత్స్యకారులు క్యాంప్‌బెల్‌పేటకు చెందిన ఏడుకొండలుకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సముద్రంలో చిక్కుకున్న రామాని నాంచారయ్య, మోకా వెంకటేశులు, విశ్వనాథపల్లి మస్తాన్, చెక్కా నరసింహను క్షేమంగా తీసుకొచ్చేందుకు మరికొంతమంది మత్స్యకారులు అంతర్వేదికి పయనమయ్యారు. అక్కడ వారి ఆచూకీ లభ్యం కాకపోవడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని), కలెక్టర్ రంజిత్‌బాషాకు సమాచారం ఇచ్చారు.
ఈ విషయాన్ని పేర్ని నాని సీఎంవో దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు వారి ఆచూకీ కోసం హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. మత్స్యశాఖ అధికారులు, మెరైన్ పోలీసులు, నేవీ తదితర అధికార యంత్రాంగం నాలుగు రోజుల పాటు సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టింది. ఎట్టకేలకు అధికార యంత్రాంగం అన్వేషణ ఫలించింది. అమలాపురం సమీపంలో మత్స్యకారుల ఆచూకీ కనుగొన్నారు.
ఆ నలుగురిని వెంటనే కాట్రేనికోన పీహెచ్‌సీకి తరలించి వైద్య సేవలు అందించారు. అనంతరం గురువారం రాత్రి ఆ నలుగురిని క్యాంప్‌బెల్‌పేటలోని కుటుంబీకులకు అప్పగించారు. మత్స్యకారుల ఆచూకీ తెలియడంతో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, ఇన్‌చార్జ్ కలెక్టర్ మహేష్‌కుమార్ రావిరాల అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment