ముమ్మిడివరం: పదో తరగతికి శుక్రవారం జరిగిన బయోలజికల్ సైన్స్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో 22 మండలాల్లో 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 19,133 మంది పరీక్షలు రాయాల్సి ఉండగా 19,015 మంది హాజరయ్యారు. 118 మంది గైర్హాజరయ్యారు. 18,934 మంది రెగ్యులర్, 81 మంది ప్రైవేటు విద్యార్థులు పరీక్షలు రాశారు. మొత్తం 99.38 శాతం మంది పరీక్షలకు హాజరైనట్టు జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ షేక్ సలీం బాషా తెలిపారు. డీవైఈవో జి.సూర్యప్రకాష్ ప్రభుత్వ పరీక్షల విబాగం అసిస్టెంట్ కమిషనర్ బి.హనుమంతరావుతో పాటు ఐదు ప్లయంగ్ స్క్వాడ్‌లతో డీఈఓ జిల్లాలో మొత్తం 24 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ అమలు చేశారు.
సర్వేశ్వరశర్మకు సైన్స్ పాపులరైజేషన్ అవార్డు
అమలాపురం టౌన్: కోనసీమ సైన్స్ పరిషత్ అధ్యక్షుడు, అమలాపురం వాసి డాక్టర్ సీవీ సర్వేశ్వరశర్మ సైన్స్ పాపులరైజేషన్ పురస్కారానికి ఎంపికయ్యారు. హైదరాబాద్ అకాడమి ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ డాక్టర్ సర్వేశ్వరశర్మకు ఈ అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ సంస్థ నుంచి ఆయనకు లిఖితపూర్వక సమాచారం అందింది. ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఈ అవార్డుకు ఆయన ఒక్కరే ఎంపికయ్యారు. వచ్చే ఏప్రిల్ 22న హైదరాబాద్‌లోని బిర్లా సైన్స్ సెంటరు భాస్కర ఆడిటోరియంలో జరిగే ఆ సంస్థ వార్షికోత్సవ సభలో శర్మ ఈ అవార్డును అందుకోనున్నారు.
అమలేశ్వరికి వెండి ఆభరణాల సమర్పణ
అమలాపురం రూరల్: మండలం రోళ్లపాలెంలో కొలువైన అమలేశ్వరీ సమేత అమలేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారికి భక్తులు వెండి ఆభరణాలను సమర్పించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సూమారు రెండులక్షలతో తయారు చేసిన కిరీటం, దండ, హారం, ముక్కపుడక, కళ్లు, కనుబొమ్మలు తదితరులు ఆభరణాలను వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వాటిని అమ్మవారికి అలకరించారు. హోమం నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమాధనఅధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రేపటి నుంచి సీఆర్‌సీ ఉగాది నాటికల పోటీలు
రావులపాలెం: ఉగాది సందర్భంగా రావులపాలెం కాస్మోపాలిటన్ రిక్రియేషన్ క్లబ్ (సీఆర్‌సీ) కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల స్థాయిలో 25వ ఉగాది ఆహ్వాన నాటికల పోటీలను నిర్వహిస్తున్నట్టు సీఆర్‌సీ అధ్యక్షుడు తాడి నాగమోహనరెడ్డి, ప్రధాన కార్యదర్శి నల్లమిల్లి వీరరాఘవరెడ్డి తెలిపారు. సీఆర్‌సీలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ నెల 30, 31, ఏప్రిల్ ఒకటో తేదీల్లో ఏడు నాటికలు, సీఆర్‌సీ ప్రత్యేక ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఆదివారం నృత్య ప్రదర్శనలతో వేడుకలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ ఏడాది కాటన్ కళా పురస్కారాన్ని సినీ నటుడు తనికెళ్ల భరణికి అందిస్తామన్నారు. 30వ తేదీన తాడేపల్లి వారి అరవింద్ ఆర్ట్స్ విడాకులు కావాలి నాటిక, అమరావతి ఆర్ట్స్ గుంటూరు వారి చిగురు మేఘం నాటిక, 31న విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి స్వేచ్ఛ నాటిక, మైత్రి కళానిలయం విజయవాడ వారి బ్రహ్మ స్వరూపం నాటిక, మిత్ర క్రియేషన్స్ హైదరాబాద్ వారి ఇది రహదారి కాదు నాటిక, ఏప్రిల్ 1న సహృదయ ద్రోణాదుల బాపట్ల వారి వర్క్ ఫ్రమ్ హోమ్ నాటిక, శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరి వారి జనరల్ బోగీలు నాటిక, సీఆర్‌సీ వారి ప్రత్యేక ప్రదర్శన అలా ఎలా? నాటికలు ప్రదర్శించడం జరుగుతుందన్నారు.
అనంతరం నాటికల ప్రదర్శనలకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కళాపరిషత్ డైరెక్టర్లు కె.సూర్య, పడాల సత్యనారాయణరెడ్డి, సత్తి సూర్య భాస్కరరెడ్డి (చిన్నబుజ్జి), కె.రంగనాయకులు, సింగంశెట్టి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

పదో తరగతి పరీక్షలకు 19,015 మంది హాజరు