జగ్గిరెడ్డికి వైఎస్సార్ సీపీ శ్రేణుల అభినందనలు
రావులపాలెం: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు. సోమవారం గోపాలపురంలోని జగ్గిరెడ్డి స్వగృహానికి వచ్చిన ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రి పాపారాయుడు అభినందనలు తెలిపారు. అలాగే మండపేట మండల జెడ్పీటీసీ కురుపూడి భవాని రాంబాబు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పలివెల సుధాకర్ ఇతర నాయకులతో కలిసి గోపాలపురంలోని జగ్గిరెడ్డి నివాసానికి వచ్చారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డికి శాలువా కప్పి పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జగ్గిరెడ్డి నాయకత్వంలో జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆకాంక్షించారు.
జీవో 35తో
జెడ్పీ ఏవోలకు అన్యాయం
అమలాపురం టౌన్: పంచాయతీరాజ్ శాఖలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో నెం.35తో ఎంపీడీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న ఏవోలకు పదోన్నతులపరంగా తీరని అన్యాయం జరుగుతోందని అమలాపురానికి చెందిన ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్ట్రీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కాండూరి శ్రీనివాసరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు అమలాపురంలో ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా పరిషత్ పర్యవేక్షణలో ఎంపీడీవో కార్యాలయాల్లో పనిచేసే ఏవోలు ఈ జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. ఈ జీవో వల్ల ఏవోలు ఎంపీడీవోలుగా పదోన్నతి పొందాలంటే చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఫీడర్ కేటగిరికి అనుగుణంగా ఎంపీడీవోల పదోన్నతుల్లో ఏవోలకు 34 శాతం అమలు చేసేవారని, ఇప్పుడు 27 శాతానికి కుదించడం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ జీవోను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు.


