
చైతన్య కళా సమాఖ్య కృషి
వర్ధమాన నటులను ప్రోత్సహిస్తున్న సమాఖ్య
ఒక జాతి సంస్కృతి తెలుసుకోవాలంటే.. ఆ జాతి ఏర్పాటు చేసుకున్న రంగస్థలమేంటో తెలుసుకుంటే సరిపోతుందంటారు సామాజికవేత్తలు. తెలుగు జాతి సంస్కృతి, సంప్రదాయాలు, సమకాలీన సమస్యలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో చూపడంలో రంగస్థలం అత్యంత ప్రధానమైంది. నలభయ్యేళ్లుగా ప్రవాహంలా సాగిపోతున్న నాటక రంగానికి తమవంతు బాధ్యతగా దశాదిశ చూపే ప్రయత్నం చేస్తున్నారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు (Thorrur) ప్రాంత కళాకారులు.
తొర్రూరు ప్రాంతానికి చెందిన చైతన్య కళా సమాఖ్య ప్రతినిధులు 1985 నుంచి నాటక రంగానికి జీవం పోస్తున్నారు. నాటక ప్రదర్శనల్లో.. తెలుగు రాష్ట్రాల్లోనే చైతన్య కళా సమాఖ్య మూడో స్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 200 పైచిలుకు నాటక ప్రదర్శనలకు అవకాశమిచ్చిన కళా సమాఖ్య.. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ గుర్తింపు పొందుతోంది.
ఆదర్శం.. చైతన్య కళా సమాఖ్య నాటక సేవ
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో 1985లో మన్నూరు ఉమ బృందం చైతన్య కళా సమాఖ్యను స్థాపించింది. అప్పటినుంచి సమాఖ్య 40 ఏళ్లుగా కళా రంగానికి తన వంతు సేవ చేస్తోంది. ఏటా మార్చిలో వారం రోజుల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీలను ఘనంగా నిర్వహిస్తోంది. ఈ నెల 10 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ జాతీయ తెలుగు ఆహ్వాన నాటికల పోటీల్లో.. తెలుగు రాష్ట్రాల నుంచి అనేక నాటక సంఘాలు ప్రదర్శనలిచ్చాయి. హైదరాబాద్, కరీంనగర్, గుంటూరు కళాకారులు నాటకాలను ప్రదర్శించారు. ఈ కళా సమితి వేదికపై ప్రదర్శనలు ఇచ్చి పలువురు గుర్తింపు పొందారు.

మూస ధోరణికి భిన్నంగా..
1980 వరకు గ్రామాల్లో, పట్టణాల్లో పండుగల సందర్భాల్లో నాటకాలను ప్రదర్శిస్తుండేవారు. వాటికి విపరీతమైన ఆదరణ ఉండేది. ఒకప్పుడు వెలుగొందిన ఈ కళ.. నేడు సినిమా, టీవీల ప్రభావంతో మసకబారుతోంది. ప్రస్తుతం నాటక ప్రదర్శనలకు పెద్దలు మినహా నేటితరం యువత రావడం లేదు. ఇలాగే కొనసాగితే తెలుగు నాటకం (Telugu Natakam) మసకబారే ప్రమాదముందని భావించిన తొర్రూరు చైతన్య కళా సమాఖ్య కొత్త ప్రయోగాలకు శ్రీకారం చుట్టింది. ఉత్తమ నాటకాలను ఎంచుకుని ప్రదర్శనలకు ఆహ్వానిస్తోంది. పోటీకి వచ్చిన నాటికల్లో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి నగదు బహుమతులు అందజేస్తోంది. ఉత్తమ నటులకు ప్రోత్సాహకాలు అందిస్తోంది.
చదవండి: దేవాలయాల్లో రావి, వేప చెట్లు ఎందుకు ఉంటాయి?
నాటక వారసత్వాన్ని కొనసాగించాలని..
ప్రస్తుతం టీవీ, సినిమాలు చూస్తే.. వాటిలో ఎలాంటి సందేశం ఉండటం లేదు. కానీ నాటకాలను తిలకించినప్పుడు.. అందులోని పాత్రలు, సారాంశం నిజ జీవితానికి అద్దం పట్టేలా ఉంటాయి. నాటకాల వారసత్వాన్ని నేటి తరానికి అందించే లక్ష్యంతో చైతన్య కళా సమాఖ్య ఏటా పోటీలు నిర్వహిస్తోంది. కళా సమాఖ్య ద్వారా తొర్రూరులో మా వంతుగా కళా రంగాభివృద్ధికి కృషి చేస్తున్నాం.
– మన్నూరు ఉమ, అధ్యక్షుడు, చైతన్య కళా సమాఖ్య, తొర్రూరు
నాటకానికి జవసత్వాలు నింపాలి
ప్రాచీన కళలు అంతరించి పోకుండా ఐక్యంగా కృషి చేయాలి. నాటక పోటీల ద్వారా ఈ రంగానికి జవసత్వాలు నిండాలన్నదే మా ఆకాంక్ష. ఇటీవల తొర్రూరులో నిర్వహించిన జాతీయ స్థాయి తెలుగు ఆహ్వానిత నాటక పోటీలకు ఎన్నడూ లేనంత ఆదరణ లభించింది. ప్రేక్షకులు నాటకాలు వీక్షించేందుకు గంటల తరబడి కుర్చీలకే అతుక్కుపోయారు. రానున్న రోజుల్లోనూ నాటక ప్రదర్శనలు కొనసాగిస్తాం.
– సుంకరనేని పినాకపాణి, ప్రధాన కార్యదర్శి, చైతన్య కళా సమాఖ్య
Comments
Please login to add a commentAdd a comment