telugu culture
-
ఆ వీధిలో ఒకవైపు ఆంధ్రా, మరోవైపు ఒడిశా ఇళ్లు
శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం బలద పంచాయతీ కౌశల్యాపురం గ్రామమిది. ఈ గ్రామంలో కనిపిస్తున్న వీధిని ఒకసారి గమనించండి. వీధిలో ఉత్తరం వైపు ఉన్న ఇళ్లన్నీ ఒడిశావి కాగా, దక్షిణం వైపు ఉన్న ఇళ్లు ఆంధ్రావి. ఒకే గ్రామంలో రెండు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. ఇక్కడ ఆంధ్రా ఒడిశా కట్టుబాట్లు మిళితమై ఉంటాయి. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాల ప్రాంతాల కలయికతో ఉన్న ప్రాంతమిది. మెళియాపుట్టి మండలంలోని రట్టిణి గ్రామమిది. ఇక్కడ ఎడమ వైపు ఇళ్లన్నీ ఒడిశా పరిధిలో ఉన్నాయి. కుడివైపు ఉన్న ఇళ్లన్నీ ఆంధ్రా పరిధిలోనివి. తెలుగు సంప్రదాయాలు, ఒరియా సంప్రదాయాలు కలగలిపి ఉన్న గ్రామంగా ప్రత్యేకతను సంతరించుకుంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: రెండు రాష్ట్రాల సరిహద్దును పంచుకుని ఉన్న ఈ గ్రామాలు సంప్రదాయాల్లో కూడా భిన్నత్వాన్ని చూపిస్తున్నాయి. పెళ్లిళ్లు, పూజల్లో తెలుగు, ఒరియా సంప్రదాయాలు కలగలిపి కనిపిస్తుంటాయి. ఆంధ్రాలో ఉన్న దేవాలయాలను ఈ ప్రాంత ఒరియా వాళ్లు ఎక్కువగా ఇష్టపడతారు. అలాగే ఆంధ్రా ప్రజలు ఒరియా దేవాలయాలకు వెళ్తుంటారు. ఒరియా సంబంధించిన పండగలు చేసుకుంటారు. రెండు రాష్ట్రా ల సాంస్కృతిక, ఆధ్యాత్మిక కలయికతో అన్నదమ్ముల్లా అక్కడి ప్రజలు ఉంటున్నారు. పూజల్లో ప్రత్యేకతలు రట్టిణిలో ఉన్న శ్రీ నీలకంఠేశ్వర ఆలయానికి ఒడిశా వాసులు చైత్రమాసంలోని మొదటి నాలుగు మంగళవారాలు వస్తుంటారు. అదే ఆంధ్రాలో ఉన్న వారు ఎక్కువగా వైశాఖమాసంలో నాలుగు వారాల్లో మంగళ, ఆదివారాలలో వచ్చి పూజలు చేస్తుంటారు. ఆంధ్రా పరిధిలో ఉన్న వాళ్లు శుక్రవారం లక్ష్మిదేవిని పూజిస్తారు. కానీ ఒడిశా వారు గురువారం లక్ష్మీదేవికి పూజలు చేస్తుంటారు. దీంతో ఒకే గ్రామ పరిధిలో గురువారం, శుక్రవారం రెండు రోజులు లక్ష్మీపూజలు జరుగుతాయి. ఒడిశా వాళ్లు గౌరీ పౌర్ణమి నుంచి కార్తీక పౌర్ణమి వరకు కార్తీక మాసంగా భావించి నెల రోజులపాటు శివుడిని పూజిస్తుంటారు. ఆంధ్రా వాళ్లు దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు కార్తీకమాసంగా పూజిస్తుంటారు. ఒడిశా సంప్రదాయానికి చెందిన వారంతా ప్రత్యేకంగా రాధాకృష్ణులను పూజిస్తారు. రాధామాధవస్వామి ఆరాధనతో 56 రకాల పిండివంటలతో భోగారాధన చేస్తారు. వీటితో పాటు శివుడు, ఇతర దేవుళ్లను పూజిస్తారు. ఎక్కువగా ఒడిశాలో అమావాస్య నుంచి అ మావాస్య వరకు మంచిరోజులుగా భావించి పూజ లు, శుభకార్యాలు చేస్తుంటారు. ఆంధ్రాలో పౌర్ణమి నుంచి పౌర్ణమి వరకు మంచిరోజులుగా భావించి పూజలు, శుభకార్యాలు చేస్తుంటారు. ఫలితంగా ఈ గ్రామాల్లో అమావాస్య, పౌర్ణమి వారాలు నిత్యం పూజలు, శుభకార్యాలు కనిపిస్తుంటాయి. ఈ విధంగా ఒకే గ్రామంలో భిన్న ఆధ్యాత్మిక సంస్కృతి కనిపిస్తుంది. కౌశల్యాపురంలో భూ వివాదం కౌశల్యాపురంలో 250 కుటుంబాల మధ్య భూ వివాదాలు 1969 నుంచి ఉన్నాయి. 37 ఎకరాలు పంట భూమి వివాదంలో ఉంది. భూములు వివాదంలో ఉన్నందున భూములు శిస్తులు చెల్లించడంలో రైతులు రెండు రాష్ట్రాల రెవెన్యూ అధికారులతో ఇబ్బంది పడుతున్నారు. వివాదంలో ఉన్న భూము ల్లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేస్తున్న పక్కా ఇళ్ల నిర్మాణానికి ఒడిశా అధికారులు అడ్డుతగులుతున్నారు. కలిసిమెలిసి రట్టిణి, కౌశల్యాపురంలో ఆంధ్రా, ఒడిశా వాసులు పాఠశాలలు, దేవాలయాలకు కలిసి వెళ్తుంటారు. పండగలు కూడా కలిసి చేసుకుంటారు. పెళ్లిళ్లు జరిగిన దాఖలాలు కూడా ఉన్నాయి. వీధులే మారడంతో తమ్ముడు ఒడిశా పరిధిలో ఉంటే, అన్న ఆంధ్రా పరిధిలో ఉంటాడు. కూతుళ్ల పరిస్థితి కూడా అంతే. తండ్రి ఆంధ్రాలో ఉంటే...కూతురు ఒడిశా పరిధిలో ఉంటుంది. ఈ గ్రామాలకు చెందిన వారంతా ఒకే శ్మశానం వినియోగిస్తున్నారు. ఒడిశాకు చెందిన చెందిన పిల్లలు ఒరియా పాఠశాలకు వెళ్తా రు. ఆంధ్రాకు చెందిన పిల్లలు తెలుగు పాఠశాలలకు వెళ్తున్నారు. రెండింటిలోనూ తెలుగు, ఒరియా బోధన ఉంది. బయట వారు చెబితేనే.. ఒడిశా, ఆంధ్రా తేడా లేకుండా కలిసి మెలిసి ఉంటాం. ఒకే ఊరులో ఉండడం వల్ల మాకు రెండు రాష్ట్రాల ప్రజలమని అనిపించదు. బయట వారు వచ్చి చెబితే గానీ మాకు తెలియదు. – ప్రభాస్దాస్, రట్టిణి గ్రామం, మెళియాపుట్టి మండలం ఒరియా, తెలుగు బోధన ఒరియా, తెలుగు కలిపి ఒకే పాఠశాలలోనే చెబుతున్నాం. ఇద్దరు ఒరి యా ఉపాధ్యాయులు, ఇద్దరు తెలుగు ఉపాధ్యాయులు పాఠశాలలో పనిచేస్తున్నారు. పాఠశాలల అభివృద్ధి ఏపీ ప్రభుత్వం చేపట్టింది. ఇక్కడ ఒరియాకు తల్లిదండ్రులు ముందు ప్రాధాన్యత ఇస్తుంటారు. – జి.అప్పలస్వామి, ప్రధానోపాధ్యాయుడు, ఎంపీపీ పాఠశాల రట్టిణి -
జగనన్న సాంస్కృతిక సంబరాలు.. రాష్ట్రస్థాయి పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ‘జగనన్న సాంస్కృతిక సంబరాలు’ పేరుతో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యా ప్తంగా 40 వేలమందికి పైగా కళాకారుల ప్రదర్శనలకు వేదికలు సిద్ధం చేస్తోంది. వెయ్యిమందికి పైగా కళాకారులతో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాచీన కళావైభవం చాటేలా ప్రణాళికను రూపొందించింది. ప్రధానంగా కూచిపూడి, కొమ్ముకోయ, థింసా, తప్పెటగుళ్లు, గరగలు, పగటివేషాలు, బుర్రకథలు, ఆర్కెస్ట్రా (జానపద, సంప్రదాయ, గిరిజన) వంటి కళారూపాలను ఆవిష్కరించనుంది. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని డిసెంబర్ 19, 20 తేదీల్లో అట్టహాసంగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనుంది. చదవండి: 28, 29 తేదీల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కౌన్సెలింగ్ అందుబాటులో దరఖాస్తులు.. కళాకారులు, కళాబృందాలు నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. సాంస్కృతిక శాఖ https://culture.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తులను పూర్తిచేసి పంపవచ్చు. విజయవాడలోని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి కార్యాలయంతో పాటు విజయనగరం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలుల్లోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులను apculturalcompetitions@gmail.comకు మెయిల్చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఆడిషన్స్, రీజనల్ పోటీలు ఇలా... ♦నవంబర్ 19, 20, 21 తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల వారికి. ♦నవంబర్ 24, 25, 26 తేదీల్లో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల వారికి. ♦నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో రాజమహేంద్రవరంలోని వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల వారికి. ♦డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారికి. కళలకు ప్రోత్సాహం.. రాష్ట్రంలో ఎంతో ఘనమైన ప్రాచీన సంస్కృతి ఉంది. దాన్ని కాపాడుకోవడంతోపాటు భావితరాలకు చాటిచెప్పేలా ప్రభు త్వం కృషిచేస్తోంది. కళాకారులను ప్రోత్సహించేలా రాష్ట్రస్థాయిలో సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో కళాకారులందరినీ భాగస్వాములను చేసేలా ప్రత్యేక పోస్టర్లతో విస్తృత ప్రచారం కల్పించనున్నాం. గెలుపొందిన కళాకారులు, కళాబృందాలకు భారీ బహుమతులు ఇవ్వనున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి -
తెలుగింట కన్నడ శోభ
కర్ణాటక రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న జిల్లా పశ్చిమ ప్రాంతంలో కన్నడ సంప్రదాయలు వెల్లివిరుస్తున్నాయి. పర్వదినాల్లో, వేడుకల్లో, కల్యాణోత్సవాల్లో కర్ణాటక ఆచారాలు సందడి చేస్తున్నాయి. కళారూపాల్లో కూడా కన్నడ శోభ కనిపిస్తోంది. హోటళ్లలో కర్ణాటక రుచులను ఇక్కడి ప్రజలు ఆస్వాదిస్తున్నారు. మంత్రాలయం: జిల్లా పశ్చిమప్రాంతంలోని తెలుగు లోగిళ్లలో కర్ణాటక సంస్కృతి విరివిగా కనిపిస్తోంది. చిప్పగిరి, హొళగుంద, హాలహర్వి, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పెద్దకడబూరు, కౌతాళం, కోసిగి, మంత్రాలయం ప్రాంతాల్లో ఎక్కువగా కర్ణాటక సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. కర్ణాటకలో ప్రధానంగా అక్షయ తృతీయ రోజున బసవ జయంతి పర్వదినం జరుపుకుంటారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆదోని డివిజన్లో ఈ ఏడాది ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా శ్రీగురు బసవేశ్వరుడికి విశిష్టపూజలు చేసి, గ్రామాల్లోని వృషభాలకు అలంకరణలు చేసి ఊరేగించారు. వీరభద్ర వేషధారణలతో ఖడ్గాలు చదవడం, సంప్రదాయ నృత్యాలు చేయడం వంటి ఆచారాలను పాటించారు. యల్లె అమావాస్య కర్ణాటక నుంచి సంక్రమించిన మరో పండుగ యల్లె అమావాస్య. జనవరి నెలలో శివరాత్రి అమావాస్య ముందు దీనిని నిర్వహిస్తారు. పండుగ రోజు సజ్జపిండి, బెల్లం ఉండలతో వండిన వంటలను పొలాలకు తీసుకెళ్లి, పంచ పాండవులకు పూజలు నిర్వహించి పొలం చుట్టూ పొలి చల్లుతారు. అలాగే గురువుల పరంపరలో భాగంగా ఇక్కడి ప్రాంతంలో కోసిగి సిద్ధరూఢస్వామి, నదిచాగిలో తొంతరాధ్య, హాల్విలో మహంతేష్స్వామి, అర్లబండ కృష్ణావధూత ఉత్సవాలు చేసుకుంటారు. కౌతాళం మండలం హాల్వి, కోసిగి మండల కేంద్రం, పెద్దకడబూరు గ్రామాల్లో సిద్ధరూఢ స్వామి జాతరలు ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తారు. మఠం పీఠాధిపతుల ఆజ్ఞానుసారం శుభకార్యాలు చేస్తారు. కర్ణాటక తరహాలో పెళ్లి తంతు సరిహద్దు గ్రామాల్లో పెళ్లి తంతు సైతం కర్ణాటక సంప్రదాయంలో జరుగుతోంది. వీరశైవ లింగాయతీ వివాహాల్లో ముహూర్తం వేళ ప్రత్యేక ఉత్సవం చేసుకుంటారు. వీరభద్ర స్వామి వేషధారణలో గురువు బోరాబిందె మహత్యం వివరిస్తారు. ఉగ్గులం తంతులో భాగంగా బంధువులు నాలుక, పెదవులు, కనురెప్పలు, చేతులు, వీపు, కాళ్లకు ఇనుప శూలాలు గుచ్చుకుని ఊరేగుతారు. పెళ్లి పత్రికలు సైతం కన్నడ భాషలోనే ముద్రించుకుంటున్నారు. నాటకాల్లోనూ.. శ్రీకృష్ణరాయబారం, చింతామణి, హరిశ్చంద్ర నాటకాలకు బదులుగా పండుగలకు ఈ ప్రాంతంలో కన్నడ భాషలో సాగే బయలు నాటకాలు వేస్తారు. సంగీత కచేరీల్లో భాగంగా గురువులు, అవధూతలు రచించిన తత్వాలతో కూడిన భజనలు చేస్తారు. కర్ణాటక కళకారుడు దాదాపీర్‌ను ఆదర్శంగా తీసుకుని కచేరీలు చేస్తారు. రచ్చమర్రి నరసింహులు, మాలపల్లి ఈరన్న, రామాంజినేయులు ఇలా 20 మందికి పైగా కళకారులు ఉన్నారు. యూట్యూబ్‌ల్లో వీరి సంగీత తత్వాలాపనలకు మంచి గుర్తింపు ఉంది. గ్రామాల పేర్లు సైతం కర్ణాటక అర్థంలోనే పురుడోసుకున్నాయి. గ్రామాల చివర దిన్నె, హళ్లి (అగసలదిన్నె, చెట్నెహళ్లి) పదాలతో ముగియడం కర్ణాటక వారసత్వమే. కన్నడ అభి‘రుచి’ సరిహద్దు గ్రామాల్లో ఎక్కువగా కర్ణాటక ఖానావళి, లింగాయతీ హోటళ్లు వెలిశాయి. ఈ హోటళ్లలో ఎక్కువ పచ్చి కూరగాయలు, ఉల్లికోడు, పుదీన, కొత్తమీర పదార్థాలతో జొన్న రొట్టెలు వడ్డిస్తారు. రొట్టెల్లోకి కుసుమలు, నువ్వులు, వేరుశనగ విత్తనాలు కారం పొడులు స్వీకరిస్తారు. అన్నంలోకి మిరియాల చారు, టమాటా చెట్నీ వడ్డిస్తారు. మాంసాహారాలకు పూర్తిగా దూరంగా హోటళ్ల నిర్వహణ సాగుతుంది. సామూహిక వివాహాలు అంపయ్య పున్నమితోపాటు బసవ జయంతికి సామూహిక వివాహాలు నిర్వహిస్తారు. కౌతాళం మండలం ఉప్పరహాల్, కోసిగి మండలం కందకూరులో అంపయ్య పున్నమికి సామూహిక వివాహాలు జరుగుతున్నాయి. ఒక్కటి కాబోతున్న కొత్త జంటలకు దుస్తులు, మంగళసూత్రాలు, పూలదండలు, భోజన వసతి ఆలయ కమిటీ సభ్యులు సమకూర్చుతారు. -
మన ఇంట్లో భాష ఎలా ఉంది?
అమ్మ కడుపు నుంచి శిశువు మాతృభాషను వింటుంది. బడిలో చదువుతుంది. కాని ఆ భాషను తన భాషగా ఎప్పుడు చేసుకుంటుంది? ఎలా ఆస్వాదిస్తుంది? ఇంట్లో అమ్మమ్మలు సామెతలు చెబుతారు చలోక్తులు విసురుతారు. నానమ్మలు కథలు చెబుతారు. కథల పుస్తకాలు భాష ద్వారా ఊహను పంచుతాయి. సాహిత్యం మెల్లగా సంస్కారం అలవరుస్తుంది. బతకడానికి ఇంగ్లిష్. జీవించడానికి తెలుగు. పిల్లల తెలుగు కోసం ఇంట్లో ఏం చేస్తున్నాం? ఏం చేయాలి? ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ఏసి, కేబుల్ కనెక్షన్... ఇవి అవసరమే. కాని పిల్లల కళ్లకు రోజూ తెలుగును కనిపించేలా చేసే ఒక దినపత్రిక అవసరం అని చాలామందిమి అనుకోము. ఇంటి అల్మారాలో ఒక తెలుగు పుస్తకం అన్నా ఉంటే వారికి తెలుగు భాష పట్ల ఆసక్తి ఏర్పడుతుందని అనుకోము. ఇంగ్లిష్ మీడియంలో చేర్పించడం, ఇంగ్లిష్ భాష ప్రావీణ్యం ఎలా ఉందో గమనించడం... ఇవి అవసరమే. భవిష్యత్తులో ఉపాధి వేదికలను పెంచుకోవడానికి ఆ పని చేయాల్సిందే. కాని అలాగని ఇంటి భాషను, తల్లిభాషను ఇంటి వేదికగా పిల్లల్లో పాదుకునేలా ఏ మాత్రం చేయగలుగుతున్నాం అనేది నేడు తల్లిదండ్రులు తప్పక ప్రశ్నించుకోవాలి. అమ్మ అన్న పిలుపు ప్రతి తెలుగు శిశువు పలికే తొలి తెలుగు శబ్దం ‘అమ్మ’. అక్షర మాలలో అ అంటే అమ్మ అనే కదా నేర్పిస్తారు. శిశువుకు అమ్మ ద్వారా తెలుగును నేర్చుకునే హక్కు ఉంది. తల్లికి తన ద్వారా పిల్లలకు తెలుగు నేర్పించాల్సిన బాధ్యత ఉంది. పిల్లలకు ఏ భాష అయినా నాలుగు విధాలుగా వస్తుంది. 1.మాట్లాడటం 2.వినడం 3. చదవడం 4.రాయడం... ఈ నాలుగింటిలో పిల్లలు ఏవి ఎంత బాగా అభ్యాసం చేస్తున్నారో గమనించుకోవాలి. ఈ నాలుగింట్లో ఏ ఒక్కటి చేయకపోయినా భాష పూర్తిగా వచ్చే అవకాశం లేదు. ఈ నాలుగు జరగడంలో ఇంటి బాధ్యత విస్మరించి ‘మా పిల్లలకు తెలుగే రావడం లేదని’ అనుకోవడం నింద ఎవరో ఒకరి మీద వేయాలనుకోవడం సరి కాదు. ‘సబ్జెక్ట్స్’ స్కూల్లో నేర్పిస్తారు. తెలుగు కూడా ఒక ‘సబ్జెక్ట్’గా స్కూల్లో నేర్పుతారు. కాని భాష దాని జీవంతో అనుభూతితో అందంతో పిల్లలకు రావాలంటే ఇంటి మనుషులు, ఇంటి పరిసరాల వల్లే ఎక్కువగా సాధ్యం. పదం... పద్యం.. తెలుగు పదం.. తెలుగు పద్యం పిల్లలకు ఇంట్లో అలవాటు చేయడం గతంలో ఉండేది. వేమన పద్యాలు, సుమతి శతకం, పెద్దబాలశిక్ష చదివించడం, దేశభక్తి గేయాలు నేర్పించడం, పొడుపు కతలు, సామెతలు, పిల్లల పాటలు... ఇవి భాషను వారిలో గాఢంగా పాదుకునేలా చేసి ‘మన తెలుగు’ అనిపిస్తాయి. ఇవాళ్టి పిల్లలు ‘చందమామ రావే’ వినడం లేదు... ‘వీరి వీరి గుమ్మడిపండు’ ఆడటం లేదు. ప్లేస్కూల్లో ‘జానీ జానీ ఎస్ పాపా’ నేరుస్తున్నారు కాని ‘చిట్టి చిలకమ్మా అమ్మ కొట్టిందా’ చెవిన వేసుకోవడం లేదు. చిట్టి చిలకమ్మను అమ్మ కొట్టిందో లేదోగానీ తెలుగు భాష మీద పిల్లలకు ఉండాల్సిన ఇచ్ఛను అమ్మ (నాన్న) కొట్టకుండా చూసుకోవాలి. పత్రికలను పట్టించుకోని నిర్లక్ష్యం గతంలో నాన్నలు పిల్లల కోసం మిఠాయి కొనుక్కుని దాంతో పాటు మార్కెట్లోకి తాజాగా వచ్చిన ‘చందమామ’ సంచికను కొనుక్కొని వచ్చేవారు. ఆ స్తోమత లేకపోతే పక్కనే ఉన్న అద్దె పుస్తకాల షాపు నుంచి చందమామ, బాలమిత్ర, బొమ్మరిల్లు వంటివి తెచ్చి పిల్లలకు ఇచ్చేది అమ్మ . ‘రాకుమారుడు’, ‘మాంత్రికుడు’, ‘ముసలవ్వ’, ‘యోజనం’, ‘క్రోసు’, ‘పురం’, ‘బాటసారి’, ‘సత్రం’... ఇలాంటి పదాలతో కథలు చదువుతూ పిల్లలు భాషలోకి అడుగుపెట్టేవారు. భాష అంటే ఏమిటి? అది ఒక విలువను పాదుకునేలా చేసే మాధ్యమం. కథ చదివితే భాష వస్తుంది. బోనస్‌గా ఆ భాషతో పాటు జీవన విలువ, పాటించాల్సిన నీతి అలవడుతుంది. కాని తెలుగు సమాజం పిల్లల పత్రికల పట్ల చాలా నిర్లక్ష్యం వహించి నేడు అవి దాదాపుగా లేకుండా చేసే స్థితికి తెచ్చింది. పిల్లలు కథ ‘వింటే’ కథ ‘చెప్తారు’. కథ ‘చదివితే’ కథ ‘రాస్తారు’. ఈ విని, చెప్పి, చదివి, రాసే విధానాలను అలవర్చే పత్రికలు నేడు లేవు. దినపత్రికలు కొంతలో కొంత ఆ లోటును పూడుస్తున్నాయి. పిల్లలకు అందుకోసమని పత్రికలను చదవడం అలవాటు చేయాలి. కొన్ని తెలుగు భాషకు సంబంధించిన వెబ్సైట్లు బాల సాహిత్యాన్ని ఇస్తున్నాయి. అవి చదివించాలి. ఏ భాష చెవిన పడుతోంది? ఇంట్లో పిల్లలు వింటున్నది టీవీ భాష, సినిమా భాష మాత్రమే. తల్లిదండ్రులు మాట్లాడుకునే మాటల నుంచి నేర్చే పద సంపద పెద్దగా ఉండదు. ఇళ్లల్లో పెద్దవాళ్లు ఉంటే భాషకు ఉండే ధ్వని, రుచి పిల్లలకు తెలుస్తుంది కాని ఇవాళ చాలా ఇళ్లల్లో పెద్దలు ఉండటం లేదు. కనుక సీరియల్స్ భాష, వెకిలి కామెడీ షోల భాష పిల్లలకు వస్తోంది. ఈ భాష వ్యక్తిత్వ పతనానికి తప్ప నిర్మాణానికి పనికి రాదు. భాషా శాస్త్రజ్ఞులు ఏమంటారంటే మాతృభాష సరిగా వచ్చినవారికే అన్య భాషలు సరిగా వస్తాయి అని. మాతృభాషను బాగా నేర్చుకున్న పిల్లలు ఇంగ్లిష్ కూడా బాగా నేర్చుకోగలుగుతారు. తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోది చేసిన సారస్వతం వారికి అందకపోవడం దూరం కావడం. నన్నయ, తిక్కనల నుంచి శ్రీశ్రీ వరకు తమ జాతి సాహితీ ఔన్నత్యం తెలియకపోడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం. ఆ గొప్పదనం ఇచ్చే ఆత్మవిశ్వాసం వేరు. మాతృభాష నుంచి అందే గొప్ప బలం, శక్తిని పొందే హక్కు ప్రతి ఇంటి చిన్నారికి ఉందని ‘తెలుగు భాషా దినోత్సవం’ సందర్భంగా ప్రతి ఒక్క తల్లిదండ్రులు గ్రహించాల్సి ఉంది. తెలుగు భాష రాకపోవడం అంటే కొన్ని వందల ఏళ్లుగా తెలుగు సంస్కృతి ప్రోది చేసిన సారస్వతం వారికి అందకపోవడం లేదా దూరం కావడం. నన్నయ, తిక్కనల నుంచి శ్రీశ్రీ వరకు తమ జాతి సాహితీ ఔన్నత్యం తెలియకపోవడం. భాష గొప్పతనమే జాతి గొప్పదనం. -
సంస్కృతికి విరుద్ధంగా స్త్రీ వస్త్రధారణ
చిత్తూరు, తిరుపతి అన్నమయ్య సర్కిల్: నేటి ఆధునిక సమాజంలో సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయని, విలువలు దిగజారుతున్నాయని గాన గంధర్వుడు, సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం జరిగిన హరికథా వైభవోత్సవాల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ హరికథకులు అవధానులతో సమానమని కొనియాడారు. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో జానపదానికి చోటు కల్పించడం ఆహ్వానించదగ్గ విషయమన్నారు. ఇదే రీతిలో హరికథకులకు సైతం పద్మ అవార్డులు ఇవ్వాలన్నారు. ప్రచార సాధనాలు లేని రోజుల్లో ప్రజా సమస్యలనే కథా వస్తువుగా మార్చుకొని ప్రజలను చైతన్యవంతుల్ని చేసిన ఘనత హరికథకులకు దక్కుతుందన్నారు. అలాంటి కళను ఆదరించి భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. నేటి సమాజంలో స్త్రీ అశ్లీలత, అసహ్యమైన వస్త్రధారణతో కనిపించడం మన సంస్కృతా అని ప్రశ్నించారు. గత చిత్రాల్లో సావిత్రిలాంటి నటీమణులు కట్టుబొట్టు తీరును ప్రజలు ఆదరించి అభిమానించ లేదా అని పేర్కొన్నారు. అలాంటి సంస్కృతి నేడు మంటగలిచిందని వాపోయారు. భారత సంస్కృతిని ప్రపంచ దేశాలు పాటిస్తున్నాయన్నారు. తెలుగు భాషపై తెలుగు వారిలోనే మక్కువ తగ్గిందని వాపోయారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం జరిగిన హరికథా వైభవోత్సవాల ముగింపు కార్యక్రమంలో ప్రసంగిస్తున్న సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ప్రపంచ దేశాల్లోని భాష పట్ల గర్వం, అభిలాష, మక్కువ తక్కువగా ఉండేది తెలుగు వారిలోనేనని ఆవేదన వ్యక్తం చేశారు. విలువలకు దర్పణం పట్టే రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన రాజకీయంలో నేడు స్వార్థ రాజకీయాలు చోటు చేసుకోవడం మన దౌర్భాగ్యమన్నారు. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలోకి మారడం సమంజసమా అని ప్రశ్నించారు. గెలిపించిన ప్రజల ఇష్టానికి విరుద్ధంగా తమ స్వార్థం కోసం పార్టీలు మారడం విచాకరమన్నారు. హత్యలు, మానభంగాలు చేసిన వ్యక్తులు నేడు మంత్రులు, రాజనీతిజ్ఞులుగా వెలుగొందుతుండడం దౌర్భాగ్యమన్నారు. తిరుపతిలోని ఎంఎస్.సుబ్బలక్ష్మి విగ్రహాన్ని పట్టించుకునే నాథుడే లేడని దుయ్యబట్టారు. తాను తిరుపతిలో జన్మించి ఉంటే ప్రతి రోజూ విగ్రహాన్ని శుభ్రం చేసి పూజలు చేసేవాడినని తెలిపారు. తన తండ్రి హరికథా పండితారాద్యులు సాంబమూర్తి సంస్మరణార్థం ఏర్పాటు చేసే హరికథా వైభవోత్సవాలకు ప్రతి ఏటా రూ.లక్ష ఇస్తానని ప్రకటించారు. ఎస్పీ బాలు దంపతులతో పాటు కుమారుడు చరణ్ హరికథా గానామృతాన్ని విన్నారు. అనంతరం కుప్పం వాస్తవ్యులు హరికథా కళాకారులు కె.కేశవమూర్తి భాగవతార్, సీతారామయ్య భాగవతార్, మృదంగం విద్వాన్ అనేకల్ క్రిష్ణప్పకు బంగారు పతకాలు, హరికథా విద్వన్మణి బిరుదులతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ విశ్వనాథం, మహోపాధ్యాయ సముద్రాల లక్ష్మణయ్య, కందారపు మురళి, అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారుల యూనియన్ అధ్యక్షుడు చంద్రశేఖర్ భాగవతార్, కార్యదర్శి గంగులప్ప, పెద్ద సంఖ్యలో కళాకారులు, పురప్రజలు పాల్గొన్నారు. -
విశిష్ట ఫలదాయకం ధనుర్మాస వ్రతం
ధనుర్మాసం తెలుగు సంస్కృతిలో ఒక భాగం. దివ్యప్రార్థనకు అనువైన మాసం. ధనుర్మాసం అత్యంత పునీతమైనది. దేవాలయాల్లో జరిగే ఆగమ విహిత కైంకర్యాలలో స్థానిక ఆచార వ్యవహారాలు, ఇతర సంప్రదాయాలు కలగలసిన అంశాలలో ధనుర్మాసం ఒకటి. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు, సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. సహస్రనామార్చనలో తులసీదళాలకు బదులు బిల్వపత్రాలను ఉపయోగిస్తారు. శయన బేరంగా ఈ ధనుర్మాసంలో రజిత శ్రీకృష్ణస్వామిని అర్చిస్తారు. ఇది తిరుమలలో జరిగే సంప్రదాయం. విష్ణు ఆలయాలలో ఉదయం పూట అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. దీనిని బాలభోగం అని పిలుస్తారు. కాత్యాయనీ వ్రతం... పూజావిధానం రోజులానే ముందు పూజ చేసుకోవాలి... ఆ తరువాత శ్రీ కృష్ణ అష్టోత్తరం, గోదా అష్టోత్తరం చదువుకోవాలి... రంగనాథ అష్టోత్తరం కూడా చదివితే మరి మంచిది... ముందుగా ప్రార్థన చదవాలి...ఆ తరువాత వరుసగా తనయ చదవాలి...తిరుప్పళ్ళి యోళుచ్చి చదివేటప్పుడు ప్రారంభం కదిరవన్ చదవకుండా అది మొత్తం ఒక్కసారి చదివాక రెండవసారి చదివినప్పుడు కదిరవంతో కలిపి చదవాలి... తనయ చదువుతూ తొమ్మిది, పది తనయలు రెండు సార్లు చదవాలి.. చివర తిరుప్పళ్ళి యోళుచ్చి సంపూర్ణం అని చదవాలి..ఆ తరువాత ప్రార్థన చదవాలి.. తరువాత గోదాదేవి తనయ చదవాలి.. ఆ తరువాత పాశురాలు చదవడం ప్రారంభించాలి.. పాశురాలు చదివేటప్పుడు మొదటి పాశురం రెండుసార్లు చదవాలి.. అలాS మొత్తం అన్ని పాశురాలు రోజు చదవాలి... అలా వీలు కాని వారు మున్నిడి పిన్నిడిగా చదవాలి.(అంటే మొదటి పాశురంలో ఒక లైను, చివరపాశురంలో ఒక లైను చదవాలి.. చివరగా గోదా హారతి చదవాలి.. మంత్రపుష్పం కూడా చదవాలి.. మళ్ళీ ఏ రోజు పాశురం ఆ రోజు రెండుసార్లు చదివి హారతి ఇవ్వాలి... నైవేద్యం సమర్పించాలి (రోజూ పొంగలి, దద్ధోజనం, పరమాన్నం ఉండి తీరాలి.. .సమయం ఉంటే గోదాదేవి పాటలు కూడా పాడుకోవచ్చు... కాని ఇవన్నీ సూర్యోదయానికి ముందే మొదలవాలి. (డిసెంబర్ 16, శుక్రవారం నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. భోగితో ముగుస్తుంది) ఆమే – ఆండాళ్ శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగితేలినవారిని ‘ఆళ్వారులు’ అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్పకైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికింది. కన్నెపిల్లలకు మేలు చేసే వ్రతం వివాహం కాని, మంచి కోరికలు కలిగిన వారు తిరుప్పావై పారాయణం చేయడం వలన అవి ఫలిస్తాయని భావిస్తారు. విష్ణుచిత్తుడి కుమార్తెయైన గోదాదేవి మానవమాత్రులని కాక రంగనాథుడినే వివాహం చేసుకుంటానని దీక్ష బూనుతుంది. ఆ కారణంగా ఆమె ధనుర్మాసంలో వేకువనే లేచి నిత్యం విష్ణు పూజ చేస్తూ తనకి కలిగిన అనుభవాన్ని, భావాన్ని ఒక పద్యం అనగా పాశురం రూపంలో రచించేది. అలా 30 పాశురాలను ఆ మాసంలో రచించి వాటిని విష్ణువుకు అంకితం చేసింది. వెంటనే విష్ణువు ప్రత్యక్షమై ఆమెను శ్రీరంగం రమ్మని చెప్పగా ఆమె కోరికపై ఆమె తండ్రి గోదాదేవిని తీసుకొని శ్రీరంగం చేరి రంగనాథ స్వామితో వివాహం జరిపిస్తాడు. వివాహం జరిగినంతనే గోదాదేవి రంగనాథుని పాదాల చెంత మోకరిల్లి స్వామిలో కైంకర్యం అయిపోతుంది. ఈ ధనుర్మాసంలో ఉభయ సంధ్యలలో ఇల్లు శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల మహాలకీ‡్ష్మ అనుగ్రహం లభిస్తుందనీ. దరిద్రం దూరం అవుతుందనీ పెద్దలంటారు. ఈ మాసంలో రోజు బ్రహ్మముహూర్తంలో పాశురాలను పారాయణం చేసిన వారు దైవానుగ్రహానికి పాత్రులవటం తథ్యమని శాస్త్రవచనం. ఈ మాసంలో విష్ణువును మధుసూధనుడు అనే పేరుతో పూజించి, మొదటి పదిహేను రోజులు చక్కెర పొంగలి లేదా పులగం నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత పదిహేను రోజులు దద్యోజనం అర్పించాలి. పెళ్లీడు అమ్మాయిలు తమ ఇళ్లముందు ముగ్గులు, గొబ్బిళ్లతో పూజలు చేయటం వల్ల కోరిన వరుడు లభిస్తాడని ఆండాళ్ తల్లి పావన చరిత ద్వారా తెలుస్తుంది. గోదాదేవి మార్గళి వ్రతం పేరుతో విష్ణువును ధనుర్మాసమంతా పూజించింది. ప్రతిరోజూ ఒక పాశురంలో (కీర్తన) స్వామిని కీర్తించేది. ఈ వ్రతం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణునికి ధనుర్మాసం నెలరోజులూ తులసీమాల సమర్పించే యువతులకు, నచ్చిన వరునితో వివాహం జరుగుతుంది. ధనుర్మాస వ్రతం గురించి మొదట బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించినట్లు పురాణ కథనం. ధనుర్మాస వ్రతానికి సంబంధించిన అంశాలు బ్రహ్మాండ, ఆదిత్య పురాణాల్లో, భాగవతంలో, నారాయణ సంహితలో కనిపిస్తాయి. ఈ వ్రతం ఆచరించుకోవాలనుకునేవారు శక్తిమేరకు విష్ణుప్రతిమని తయారుచేయించి, పూజాగృహంలో ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిరోజూ సూర్యోదయానికి ముందు లేచి, స్నానాదికాలు ముగించాలి. పంచామృతాలతో శ్రీమహావిష్ణువును అభిషేకించాలి. అభిషేకానికి శంఖం ఉపయోగించడం మంచిది. తర్వాత తులసీ దళాలు, పూలతో అష్టోత్తర సహస్రనామాలతో స్వామిని పూజించి నైవేద్యం నమర్పించాలి. ఈ నెలరోజులూ విష్ణుకథలను చదవటం, తిరుప్పావై పఠించటం చెయ్యాలి. నెలరోజులూ చెయ్యలేనివారు పదిహేను రోజులు, 8 రోజులు లేదా కనీసం ఒక్కరోజైనా ఆచరించవచ్చు. వ్రతాచరణ తర్వాత బ్రహ్మచారికి దానమిచ్చి, ఆశీస్సులు అందుకోవాలి. ధనుర్మాస వ్రతం చేయడం వల్ల ఇహలోక సుఖాలు, పరలోక మోక్షం పొందుతారు. ఆత్మపరమాత్మను చేరడానికి ఉపకరించేదే ధనుర్మాస వ్రతం. ప్రాచీన కాలం నుంచి భారతీయులందరూ ఈ వత్రాన్ని ఆచరిస్తున్నారు. భక్తి మార్గం చేత భగవంతుని సులభంగా వశపరచుకోవచ్చని నిరూపించిన ఆరాధన తపస్విని గోదాదేవి తన పాశురాలలో చివరి పాశురంలో సూచించిన విధంగా ఈ తిరుప్పావై పారాయణ చేసిన వారికి, తిరుప్పావై గాన, శ్రవణం చేసిన వారికీ ఆయురారోగ్య అష్టైశ్వర్య ముక్తి ప్రదాయకం కాగలదనీ ఆశిద్దాం. ధనుర్మాసంలో నైవేద్యం ప్రత్యేకతలేంటి ? ఈ మాసంలో వేకువనే చేసే పూజలో ప్రసాదంగా పులగం, పాయసం, దధ్యోజనం సమర్పిస్తారు. చలికాలంలో కడుపులో జఠరాగ్ని పెరిగి తద్వారా ఆకలి పెరుగుతుంది. ఈ జఠరాగ్ని సాత్వికాహారం తీసుకోవడం వల్ల చల్లబడుతుంది. పాలు, పెరుగు, పెసరపప్పు, మిరియాలలో చలువ చేసే గుణం ఉన్నందువలన ప్రసాదంగా వాటిని వినియోగించటం జరుగుతుంది. ఆయుర్వేదం, జ్యోతిష్యం ప్రకారం ఈ ఆహారం తీసుకోవడం వలన సత్వ గుణం అలవడి సత్ఫలితాలు కలుగుతాయి. ధనుర్మాసంలో వివాహాలు ఎందుకు చేయరు? రవి ధనురాశిలో ప్రవేశించి మకరంలోకి వెళ్ళే సమయమే ధనుర్మాసం. ధనుస్సు, మీనంలో రవి ఉన్నప్పుడు రవి రాశి అయిన బృహస్పతిలో ఉన్నప్పుడు ఏ శుభకార్యమూ జరపకూడదు. తిరుప్పావై అంటే ఏమిటి? తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ‘తిరు’ అంటే శ్రీ అని, ’పావై’ అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవకన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించాడు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్రలేచి స్నానం చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్కు ఇష్టమైన పుష్పకైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగిరోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. – కూర్పు: డి.వి.ఆర్. -
ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి
మాజీ ప్రధాని దేవెగౌడ అంబరీష్, సుమలతకు ఎన్టీఆర్ పురస్కారం అందజేత బనశంకరి (బెంగళూరు): తెలుగు సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మహోన్నత వ్యక్తి అని మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కొనియాడారు. బెంగళూరులోని రవీంద్ర కళాక్షేత్రలో కర్ణాటక తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కన్నడ రెబల్ స్టార్, కర్ణాటక రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి అంబరీష్, సుమలత దంపతులకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ చిత్ర రంగంలోనే కాక రాజకీయాల్లో ప్రవేశించి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి తెలుగు జాతి ప్రతిష్టను ఇనుమడింప చేశారన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న అప్పట్లోనే ఇవ్వాల్సి ఉండేదన్నారు. అంబరీష్ మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరుతో జాతీయ పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. బెంగళూరు నగరంలో తెలుగు అకాడమీ భవన నిర్మాణానికిప్రభుత్వం స్థలం కేటాయించాలని కర్ణాటక తెలుగు అకాడమీ సభ్యులు కోరగా.. ప్రభుత్వంతో చర్చిస్తానని మంత్రి అంబరీష్ హామీ ఇచ్చారు. కర్ణాటక తెలుగు అకాడమీ అధ్యక్షుడు ఆర్వీ హరీష్ మాట్లాడుతూ ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి విన్నవిస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రి రామలింగారెడ్డి, సుమలత, రాధాకృష్ణ రాజు, మాజీ మంత్రి ఎం.రఘుపతి, ఎమ్మెల్యే గోపాలయ్య, బీబీఎంపీ విపక్ష నేత పద్మనాభరెడ్డి, గారెపాటి రామకృష్ణ, బలుసు శ్రీనివాసరావు, ఆర్.ఉమాపతి నాయుడు, శ్రీనివాసయ్య, మంజులనాయుడు, గణేష్శంకర్, హెచ్ఎన్ మంజునాథ్ పాల్గొన్నారు. -
శక్తి స్వరూపం
జగన్మాత ఆదిపరాశక్తి. శక్తిస్వరూపిణి. చెడుపై మంచి సాధించే అంతిమ విజయానికి ప్రతీక. అమ్మను నమ్ముకుంటే అపజయం ఉండదని భక్తుల విశ్వాసం. సంస్కృతికి స్త్రీయే ఆధారం. సెలవుల్లో ఉండే పిల్లలూ... ఇళ్లకు వచ్చే బంధువులూ... బంధాలు బలపడే ఈ దసరా పండుగలో లోగిళ్లు కళకళలాడే ఈ శరన్నవ వేడుకలలో స్త్రీయే కీలక పాత్రధారి. స్త్రీ విజయమే కుటుంబ విజయమై తెలుగు సంస్కృతి విరాజిల్లాలని అందుకు ఆ శక్తిస్వరూపిణి ఆశీస్సు ఎల్లెడలా ఉండాలని అశిస్తూ ఈ దశ అలంకరణల ప్రత్యేకం... 1 శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి (13వ తేది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి) - నైవేద్యం: చక్కెర పొంగలి అమ్మవారి తొలిరోజు అలంకరణ ఇది. స్వర్ణకవచంతో అత్యంత విశిష్టమైన రూపంతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో అమ్మవారిని దర్శించుకుంటే అష్టకష్టాలు తీరడమే కాకుండా, సమస్త దారిద్య్రబాధలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. 2 శ్రీ బాలా త్రిపురసుందరీదేవి (14వ తేది ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి-మిగులు) నైవేద్యం: కట్టెపొంగలి రెండోరోజు అభయముద్రతో బాలా త్రిపురసుందరీదేవి అలంకారం. ఆ రూపంలో ఉన్న బాలా త్రిపురసుందరీదేవిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగడమే కాకుండా, సత్సంతానం కలుగుతుందని ప్రతీతి. 3 శ్రీ గాయత్రీదేవి (15వ తేది ఆశ్వయుజ శుద్ధ్ద విదియ) నైవేద్యం: పులిహోర మూడో రోజు గాయత్రీదేవిగా భక్తులకు దర్శనం. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని చెబుతారు. 4 శ్రీ మహాలక్ష్మి (16వ తేది ఆశ్వయుజ శుద్ధ తదియ) నైవేద్యం: రవ్వకేసరి శ్రీమహాలక్ష్మి అలంకరణ. మూడు శక్తులలో ఒకటైన శ్రీమహాలక్ష్మి రూపాన్ని ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. 5 శ్రీ అన్నపూర్ణాదేవి (17వ తేది ఆశ్వయుజ శుద్ధ చవితి) నైవేద్యం: కొబ్బరి అన్నం ఐదో రోజు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనం. సమస్త జీవరాశులకు ఆహారాన్ని అందించే అమ్మవారిని అన్నపూర్ణ రూపంలో దర్శించుకుని, పూజిస్తే ఆకలి దప్పుల వంటి బాధలు ఉండవు. 6 శ్రీ లలితా త్రిపురసుందరీదేవి (18వ తేది ఆశ్వయుజ శుద్ధ పంచమి నైవేద్యం: అల్లంగారెలు ఆరో రోజు లలితా త్రిపురసుందరీదేవి అలంకారం. లక్ష్మీ సరస్వతులు వింజామరలు వీస్తుండగా శ్రీచక్ర అధిష్టాన శక్తిగా దర్శనమిచ్చే లలితా త్రిపురసుందరిని కొలిస్తే సమస్త దుఃఖాలు తొలగుతాయి. 7 శ్రీ సరస్వతీదేవి (19వ తేది ఆశ్వయుజ శుద్ధ షష్టి) నైవేద్యం: దద్ధోజనం చదువుల తల్లి సరస్వతీదేవి రూపం. బుద్ధిప్రదాయిని అయిన సరస్వతీ రూపంలో అమ్మవారిని దర్శించుకుని ఆరాధిస్తే బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. 8 శ్రీ దుర్గాదేవి (20వ తేది ఆశ్వయుజ శుద్ధ సప్తమి) నైవేద్యం: కదంబం ఎనిమిదో రోజు అమ్మ దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. సింహవాహనంపై మహిషాసురుడిని వధిస్తున్న దుర్గాదేవి రూపాన్ని ఆరాధిస్తే శత్రుబాధలు నశిస్తాయి. సమస్త దుర్గతులు దూరమవుతాయని ప్రతీతి. 9 శ్రీ మహిషాసురమర్దిని దేవి (21వ తేది ఆశ్వయుజ శుద్ధ అష్టమి) నైవేద్యం: బెల్లమన్నం తొమ్మిదోరోజు మహిషాసురమర్దిని. అష్టభుజాలతో ఒకచేత త్రిశూలాన్ని ధరించి, సింహవాహనంపై మహిషుడిని సంహరించిన రూపంలోని దేవిని కొలిస్తే సమస్త భయాలు తొలగి, ధైర్య స్థైర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. 10 శ్రీ రాజరాజేశ్వరీదేవి (22వ తేది ఆశ్వయుజ శుద్ధ నవమి, దశమి) - నైవేద్యం: పరమాన్నం పదోరోజు విజయదశమి నాడు అమ్మవారు రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తుంది. షోడశ విద్యాస్వరూపిణి, శ్రీచక్ర అధిష్టాన దేవత అయిన దేవికి విజయ అని కూడా పేరు ఉంది. రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తే అన్నింటా విజయాలు కలుగుతాయని ప్రతీతి. దేవీ నవరాత్రులు అమ్మ... అమ్మలగన్న యమ్మ... ముగురమ్మల మూలపుటమ్మ అయిన జగజ్జననిని ఆరాధించే నవరాత్రులనే దేవీ నవరాత్రులని అంటారు. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి నుంచి ఈ నవరాత్రులు మొదలవుతాయి. ఆ రోజు నుంచే శరదృతువు ప్రారంభం కావడంతో వీటిని శరన్నవరాత్రులంటారు. పాడ్యమి నుంచి నవమి వరకు నవరాత్రి వేడుకలు జరుగుతాయి. పదోరోజైన దశమి నాడు దసరా పండుగ జరుపుకొంటారు. దీనినే విజయదశమి అంటారు. దుర్గాదేవి మహిషాసురుడిని వధించిన రోజు కావడం వల్ల విజయదశమి జరుపుకొనే ఆచారం వచ్చినట్లు చెబుతారు. ఇంద్ర కీలాద్రి స్థలపురాణం తెలుగు రాష్ట్రాల్లో సుప్రసిద్ధమైన అమ్మవారి క్షేత్రం విజయవాడలోని కనకదుర్గ ఆలయం. ఇంద్రకీలాద్రిపై అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, ఆదిపరాశక్తి అయిన జగన్మాత... కనకదుర్గగా వెలసింది. ఇక్కడ దసరా నవరాత్రి వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరుగుతాయి. పూర్వం కీలుడనే యక్షుడు తపస్సు చేసి, పర్వతరూపంలో ఉన్న తన హృదయ కుహరంలో నివసించమని దుర్గాదేవిని కోరడంతో అమ్మవారు కీలాద్రిపై స్వయంభువుగా వెలిసింది. అప్పుడు ఇంద్రాది దేవతలు వచ్చి అమ్మవారిని పూజించారు. నాటి నుంచి ఇది ఇంద్రకీలాద్రిగా ప్రాశస్త్యం పొందింది. రాక్షసులను సంహరించిన అమ్మవారు ఇంద్రకీలాద్రిపై ఉగ్రరూపిణిగా ఉండేది. అద్వైత మత వ్యవస్థాపకుడైన ఆదిశంకరాచార్యులు ఇక్కడ అమ్మవారిని దర్శించి, ఆమె మహోగ్రశక్తులను శ్రీచక్రంలో నిక్షిప్తం చేసి, అమ్మవారి పాదాల చెంత శ్రీచక్రస్థాపన చేశారు. అప్పటి నుంచి అమ్మవారు శాంతరూపిణిగా భక్తులకు దర్శనమిస్తోంది. దుర్గమ్మ కనక కాంతులు బెజవాడ దుర్గమ్మగా జనసామాన్యంలో ప్రసిద్ధి పొందిన కనకదుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై నిత్యం కనక కాంతులతో భక్తులకు దర్శనమిస్తోంది. కనకదుర్గమ్మకు వజ్ర వైడూర్యాదులు పొదిగిన బంగారు వెండి ఆభరణాలతో పాటు ఆరు బంగారు కిరీటాలు ఉన్నాయి. వీటిలో రెండు కిరీటాలను నిత్యం వినియోగిస్తుంటే, మిగిలిన నాలుగింటిని పండుగ రోజుల్లో అలంకరిస్తారు. మకరతోరణం, నానుతాడు, మంగళసూత్రాలు, కంఠాభరణం (అష్టోత్తరార్చన మాల), నల్లపూసల గొలుసు, జడ, బొట్టు, బులాకీ, నత్తు, సూర్యచంద్రులు, శంఖుచక్రాలు, పాదాలు... ఇవన్నీ అమ్మవారికి గల కనకాభరణాలే. ఇవి కాకుండా, స్వర్ణకవచం అమ్మవారికి అదనపు ఆకర్షణగా ఉంటోంది. ఆలయ అర్చకులు ప్రతి గురువారం 108 స్వర్ణపుష్పాలతో అమ్మవారిని అర్చిస్తారు. భద్రకాళి ఆలయంలో... వరంగల్ భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. మొదటి రోజు ఉదయం ధ్వజారోహణంతో నవరాత్రి వేడుకలు ప్రారంభమవుతాయి. చివరి రోజు అంటే దశమి రోజున ఆలయం వద్దనున్న సరోవరంలో భద్రకాళి, భద్రేశ్వరుల తెప్పోత్సవంతో నవరాత్రి వేడుకలు ముగుస్తాయి. హన్మకొండ-వరంగల్ నడుమ కొండపై ఉన్న ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 625 ప్రాంతంలో చాళుక్య రాజు రెండవ పులకేశి నిర్మించాడని ప్రతీతి. చాళుక్యుల శిల్పకళా రీతికి ఈ ఆలయం అద్దం పడుతుంది. ఇక్కడకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, మహారాష్ట్ర, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. మహిషాసురమర్దిని బ్రహ్మ వల్ల వరాలు పొందిన మహిషాసురుడు తన అనుచరగణమైన రాక్షసులతో కలసి ముల్లోకాలలో అల్లకల్లోలం సృష్టించసాగాడు. మహిషుడిని అంతమొందించడానికి ఆదిపరాశక్తి తనలోని వివిధ అంశలను ఒక్కటిగా చేర్చి, జగదంబగా అవతరించింది. త్రిమూర్తులు, అష్టదిక్పాలకులు సహా దేవతలందరూ త్రిశూలం, శారఙ్గం, ధనుస్సు, ఖడ్గం, చక్రం, వజ్రం, పాశం, దండం, తోమరం, గద, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, రౌద్రాస్త్రం, పాశుపతాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం వంటి ఆయుధాలను ఆమెకు అందించారు. ఆ ఆయుధాలను ధరించిన అమ్మవారు సింహవాహనాన్ని అధిరోహించి, చండి, చాముండి, కాళి, బగళ, కామాక్షి, ఛిన్నమస్తా, బాల, త్రిపుర, తారిణి వంటి వివిధ అవతారాలను దాల్చి మహిషుడిని, అతడి అనుచరులైన రాక్షసులను సంహరించింది. దుర్గముడనే రాక్షసుడిని సంహరించడం వల్ల జగదంబకు దుర్గ అనే పేరు వచ్చింది. మహిషుడిని సంహరించినందున ఆమె మహిషాసురమర్దినిగా ప్రఖ్యాతి పొందింది. శక్తిరూపేణ సంస్థితా... ‘యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా’ అని జగజ్జననిని ఆరాధిస్తారు. దేవీ నవరాత్రులలో శక్తిపూజ ప్రధానం. దేవి దయాతత్వాన్ని అంబ అని, అతిలోక సౌందర్యాన్ని త్రిపుర సుందరి అని, రౌద్ర రూపాన్ని కాళి అని ఉపాసిస్తారు. మహిషాసురుడిని వధించిన అమ్మ దుర్గాదేవిగా పూజలందుకుంటోంది. ‘దుర్గే దుర్గతి నాశిని’... అంటే దుర్గతులను నశింపజేసేది కనుక ఆమెకు దుర్గ అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతాయి. జ్ఞాన పరిమళాలను ఆమె నిరంతరం వెదజల్లుతూనే ఉంటుంది. అందువల్ల అమ్మవారికి జ్ఞానప్రసూనాంబ అనే పేరూ ఉంది. స్వర్ణ కవచాలంకరణ ప్రత్యేకత శరన్నవరాత్రి వేడుకల్లో తొలిరోజు అమ్మవారిని స్వర్ణకవచంతో అలంకరిస్తారు. స్వర్ణకవచాలంకృత రూపంలో కనకదుర్గమ్మను ఆరాధించడం వెనుక ఒక గాథ ఉంది. పూర్వం మాధవవర్మ అనే రాజు విజయవాటికాపురిని ధర్మబద్ధంగా పాలించేవాడు. ఆయన అమ్మవారికి పరమభక్తుడు. ఒకనాడు ఆయన కుమారుడు నగర సందర్శనానికి బయలుదేరినప్పుడు, ఒక బాలుడు ప్రమాదవశాత్తు అతడి రథచక్రం కింద పడి మరణించాడు. బాలుడి తల్లిదండ్రులు రాజును కలుసుకుని, న్యాయభిక్ష కోరారు. తన కుమారుడే వారి దుర్గతికి కారణమని తెలుసుకున్న రాజు మాధవవర్మ తన కుమారుడికి మరణదండన విధించాడు. రాజు ధర్మనిరతికి మెచ్చిన అమ్మవారు మృతిచెందిన బాలుడిని బతికించడమే కాకుండా, విజయవాటికాపురిలో కొన్ని గంటల సేపు కనకవర్షాన్ని కురిపించింది. అప్పటి నుంచి అమ్మవారు కనకదుర్గగా పూజలందుకుంటోంది. కనకవర్షం కురిపించిన అమ్మవారికి నవరాత్రి వేడుకల్లో తొలిరోజున స్వర్ణకవచాలంకరణ చేయడం కూడా అప్పటి నుంచే ఆనవాయితీగా మారింది. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దారిద్య్రాలూ నశిస్తాయని ప్రతీతి. వివిధ ప్రాంతాలలో నవరాత్రులు దేవీ నవరాత్రులను దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వివిధ రీతుల్లో జరుపుకొంటారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, మైసూరు ప్రాంతాలలో శరన్నవరాత్రులను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా గల శక్తి పీఠాలు నవరాత్రి వేడుకల్లో భక్తులతో కళకళలాడుతూ కనిపిస్తాయి. భారతదేశంలోనే కాకుండా, హిందువులు ఎక్కువగా ఉండే నేపాల్, మారిషస్ వంటి దేశాల్లోనూ దసరా నవరాత్రి వేడుకలను ఘనంగా జరుపుకొంటారు. దాదాపు అన్నిచోట్ల దసరా రోజున ఆయుధపూజలు నిర్వహిస్తారు. కొన్నిచోట్ల నవరాత్రుల చివరిరోజున రావణదహనాన్ని కూడా నిర్వహిస్తారు. మహర్నవమి రోజున శ్రీరాముడి చేతిలో రావణ సంహారం జరిగింది ఈరోజే అని భావిస్తారు. అయితే, పదితలలు గల రాక్షసరాజైన రావణుడిని దహనం చేయడం వెనుక ఒక ఆధ్యాత్మిక మర్మం ఉందని చెబుతారు. రావణుడి పది తలలూ మనలోని పది అవలక్షణాలైన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలకు, స్వార్థం, అన్యాయం, అమానవత్వం, అహంకారాలకు ప్రతీకలని అంటారు. పాఢ్యమి నుంచి దశమి వరకు జరిగే ఈ వేడుకల్లో రావణుడి పది తలల వంటి ఈ పది అవలక్షణాలను మనలోంచి తుడిచిపెట్టేయడానికి సంకేతంగానే రావణదహనం తంతును జరుపుతారని చెబుతారు. చివరి రోజైన దసరా పండుగ నాడు కనకదుర్గాదేవి, మల్లేశ్వరస్వామి హంసవాహనంపై కృష్ణానదిలో నదీవిహారం చేస్తారు. అమ్మవారి త్రిలోక సంచారానికి సంకేతంగా హంసవాహనాన్ని మూడుసార్లు నదిలో తిప్పుతారు. కన్నుల పండుగగా జరిగే ఈ ఉత్సవంతోనే నవరాత్రి వేడుకలు ముగుస్తాయి. -
వంగపండు ప్రసాదరావుకు అరుదైన గుర్తింపు
తెలుగు జానపద సంఘాల గౌరవ అధ్యక్షునిగా నియామకం పార్వతీపురం: నవ్యాంధ్రప్రదేశ్ తెలుగు సంస్కృతి, జానపద సంఘాలకు గౌరవ అధ్యక్షునిగా తనను నియమించినట్లు ప్రముఖ జానపద, విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదరావు తెలిపారు. బుధవారం ఆయన పార్వతీపురంలోని తన నివాసంలో ‘సాక్షి’తో మాట్లాడారు. అధ్యక్షునిగా తెలుగు విభాగ నాయకులు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కార్యదర్శిగా పుంగనూరు నటరాజ్, కోశాధికారిగా వసంత నాగేశ్వరరావులు వ్యవహరిస్తారన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ ఏర్పడిన సందర్భంగా విజయవాడలోని ఘంటసాల సంగీత ప్రాంగణంలో ఏప్రిల్ 26, 27, 28 తేదీల్లో తెలుగు భాషా సాంస్కృతిక, జానపద మహాసభలు నిర్వహించనున్నట్టు తెలిపారు. -
తెలుగు సంస్కృతిపై మమకారం
* అమెరికా నుంచి వచ్చి ఇల్లెందులో వివాహం ఇల్లెందు: అమెరికాలో పుట్టి పెరిగిన అమ్మాయి.. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించింది. అమెరికా అబ్బాయినే మనుమాడినా తన పూర్వీకుల ఊరైన ఖమ్మం జిల్లా ఇల్లెందులో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకుంది. ఇల్లెందుకు చెందిన కొలిశెట్టి నాగేశ్వరరావు 30 ఏళ్ల క్రితం అమెరికా వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే లిన్ అనే మహిళను వివాహమాడారు. వీరి కూతురు జయలిన్ సుశీల అప్పుడప్పుడు తాత వెంకటేశ్వర్లు వద్దకు (ఇల్లెందుకు) వచ్చిపోయేది. ఈ క్రమంలో జయలిన్కు పాట్రిక్ కోయల్ బార్కో అనే అ మెరికన్తో నిశ్చితార్థం జరిగింది. అయితే.. తమ పెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారమే జరగాలని జయలిన్ పట్టుపట్టి వరుడి సహా ఇల్లెందుకు వచ్చి వేదమంత్రాల నడుమ వివాహం చేసుకుంది. -
తెలుగు సంస్కృతి, కళల పరిరక్షణకు సరికొత్త వేదిక
అనంతపురం జేఎన్టీయూ పూర్వ విద్యార్థుల చొరవ ‘తెలుగు కల్చరల్ అసోసియేషన్’ ఏర్పాటు సాక్షి, బెంగళూరు : కన్నడ నాడులో తెలుగు సంస్కృతీ సౌరభాలను పరిమళింపజేయడంతో పాటు తెలుగు వారికి మాత్రమే సొంతమైన ప్రత్యేక కళలను పరిరక్షించేందుకు కొత్త వేదిక ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పుట్టిపెరిగి, అనంత పురం జేఎన్టీయూలో చదివి, బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో విభిన్న ఉద్యోగాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు నగరంలో తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు. సంస్థ కార్యకలాపాలు శనివారం నుంచి ప్రారంభమైన సందర్భంగా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఐటీఎస్ డెరైక్టర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ...రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరినీ సంస్కృతి పరమైన బంధంతో ఏకం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇందులో భాగంగా రానున్న రోజుల్లో సంస్థ తరఫున కవితాగోష్టులు, కోలాటం, కూచిపూడి తదితర కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న మూడు నెలల్లో సంస్థలో వెయ్యి మంది సభ్యులను చేర్పించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. సంస్థ తరఫున తెలుగు కళలు, సాంప్రదాయాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కళల పరిరక్షణకు కూడా పాటుపడతామని చెప్పారు. తెలుగు కల్చరల్ అసోసియేషన్ కి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరేందుకు త్వరలోనే రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీని సంస్థ సభ్యులు కలవనున్నారన్నారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక సభ్యులు ఎం.సి.ఎస్.రెడ్డి, డి.వి.జె.ఎస్.శ్రీధర్, హన్నన్, శ్రీధర్ గుప్తా, హరి తదితరులు పాల్గొన్నారు. -
ఆకాశమంతెత్తు ఆ రెండు శిఖరాలు!
తాజా పుస్తకం: ఒకప్పుడు బెజవాడ చుట్టూ చాలా కొండలుండేవి. వాటి సిగపాయల్లో మరెన్నో శిఖరాలు మెరుస్తుండేవి. కాలపురుషుడు వాటిలో చాలావాటిని -ఉల్లిపాయలు తరిగినట్లు- నరికిపారేశాడు. కానీ, కొన్ని శిఖరాలు ఇప్పటికీ ఠీవిగా తలెత్తుకు తిరుగుతూనే ఉన్నాయి. కాలపురుషుడే కాదు- కాలయముడు కూడా మమ్మల్నేం చెయ్యలేడు అన్నట్లు నిటారుగా నిలిచివుండే శిఖరాలవి. ఈ మధ్యన బెజవాడ వెళ్లినప్పుడు అలాంటి శిఖరాల్ని చూసి ముచ్చటించి ఆనందపడ్డాను. ఏలూరు రోడ్డులోని సీతారాంపురంలో కనకదుర్గా సినిమాటాకీసు ఉండేది. అదిప్పుడు లేదు. అక్కడ కట్టిన అపార్టుమెంట్లలో పెద్దిభొట్ల సుబ్బరామయ్య ఉంటున్నారు. ఎంచేతో గానీ, సుబ్బరామయ్యగారు మాచవరం, మారుతీనగర్, చుట్టుగుంట, సీతారాంపురం - ఆ చుట్టుపక్కలే ఉంటుంటారు. ‘ఇది ఈ మధ్యన మొదలయిందేం కాదు- నేను ఎస్సారార్‌లో చదివే రోజుల్నించీ నాకిక్కడే అలవాటు. అప్పట్లో (విశ్వనాథ) సత్యనారాయణగారు ఇక్కడ ఉండడం వల్ల కావచ్చు. విశాలాంధ్రలో నా స్నేహితులు చాలామంది ఉద్యోగాలు చేస్తూండడం వల్ల కావచ్చు. నాకే కాదు- ఇంట్లో వాళ్లందరికీ ఈ ప్రాంతం అలవాటయిపోయినందువల్ల కావచ్చు. మొత్తానికి ఎక్కువభాగం ఇక్కడే ఉండిపోయాం. ఆ మాటకొస్తే, నా డెబ్బయ్యారేళ్ల జీవితంలో గట్టిగా పదేళ్లు తప్పిస్తే మిగతాదంతా బెజవాడలోనే గడిచిపోయింది. ఎన్నో చేదు అనుభవాలూ మరెన్నో తియ్యని అనుభూతులూ ఇక్కడే ఎదురయ్యాయి నాకు’ అన్నారు పెద్దిభొట్ల. ‘నేనీ ప్రపంచానికి ఏమివ్వగలిగానో ఎప్పుడూ పరామర్శించుకోలేదు. కానీ, ప్రపంచం మాత్రం నాపైన బోలెడంత కరుణ కురిపించింది. నేను డిగ్రీ ఇలా పూర్తి చేశానోలేదో లయోలా కాలేజ్ యాజమాన్యం నన్ను పిల్చి ట్యూటరు ఉద్యోగమిచ్చింది. అప్పట్లో రెవెన్యూ డిపార్టుమెంటులో గుమాస్తాలకు 48 రూపాయలిచ్చేవాళ్లు. అలాంటిది, లయోలావాళ్లు నాకు 116 రూపాయల నెలజీతంమీద ఉద్యోగమిచ్చారు. నిజానికి నాకు విశాఖ వెళ్లి ఆంధ్రా యూనివర్సిటీలో ఫోర్తానర్సు చెయ్యాలని ఉండేది. కానీ, మా అమ్మ మాటమీద లయోలాలో చేరాలని -ఓ శనివారం ఉదయం- బయల్దేరా. దార్లో లీలా మహల్ బయట ఓ బోర్డు పెట్టిఉంది. సత్యజిత్ రాయ్ తీసిన ‘పథేర్ పాంచాలీ’ ఆ పూట ఒకే ఒక్క షో వేస్తున్నారట. బస్సుదిగి తిన్నగా వెళ్లి హాల్లో కూర్చుని, ఆటయ్యాక ఇంటికెళ్లిపోయా. సోమవారం నాడు లయోలాకు వెళ్లి ట్యూటరుగా చేరిపోయాను. అక్కడే రిటైరయినాను. ఈ మధ్యే మా కాలేజ్ వాళ్లు నన్ను పిల్చి సన్మానం చేసి -అదిగో, ఆ జ్ఞాపిక చేతికిచ్చి పంపించారు’ అంటున్నప్పుడు సుబ్బరామయ్యగారి మొహం -సంతృప్తితో కాదు, సంతోషంతో- తళతళలాడింది. ‘విషయమేమిటంటే, నాకు విశాఖ వెళ్లాలనుకున్నా వెళ్లివుండలేకపోవచ్చు. కానీ, పథేర్ పాంచాలీ సినిమా చూడదల్చుకున్నప్పుడు చూసేశాను! అంటే మంచి కథో మంచి సినిమానో అంటే ఉండే పిచ్చి అది. ఆ పిచ్చిని అర్థం చేసుకున్నారు కాబట్టే చెప్పిన టైముకు రాకపోయినా లయోలా ఫాదర్లు నా మీద కోపగించలేదు. సరిగదా, మా కాలేజ్‌లో ఓ మంచి రైటరున్నాడర్రా అని కేరళలో అందరికీ మచ్చటగా చెప్పుకునే వారట కూడా. అలాగే, నేనేదో నా బుద్ధికి తోచిన కథలేవో రాసుకుపోయానంతే. సెంట్రల్ సాహిత్య అకాడెమీ వాళ్లు బహుమతిచ్చారు. ఓ రోజు మధ్యాహ్నం భోంచేసి కూర్చున్నా. ఎవరో అపరిచితులు ఫోన్ చేశారు. ‘నా పేరు అప్పాజోస్యుల సత్యనారాయణ- మా అజోవిభొ ఫౌండేషన్ పురస్కారం మీకివ్వాలనుకుంటున్నాం!’ అన్నారాయన. అది చాలా పెద్దపేరున్న సంస్థ అని తెలుసు తప్ప వాళ్ల అడ్రెస్గానీ, కనీసం ఫోన్ నంబరుగానీ నాకు తెలీవు. అయినా పిల్చి పీటేయడం వాళ్ల ఔదార్యం’ అన్నారు పెద్దిభొట్ల తొణకని బెణకని ఆత్మ గౌరవంతో. ఆ తర్వాత సిద్ధార్థ కాలేజ్ దాటి, సున్నపు బట్టీల మీదుగా, క్రీస్తురాజపురం వైపు వెళ్తుంటే, ఓ సందులో ‘అభ్యాస’ స్కూలు బస్సులు కనిపించాయి. అదే సందులో సి.రాఘవాచారిగారిల్లుంది. వరవరరావులాంటి వాళ్లను మార్క్సిజం ప్రభావ పరిధిలోకి ఆకర్షించిన ప్రతిభ ఆయనది. అరవై దశకంలో పేట్రియాట్, లింక్ పత్రికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రాఘవాచారిగారు గొప్ప వ్యాఖ్యలను -రిపోర్టుల పేరిట- రాశారు. వాటి గురించి ‘అప్ కంట్రీ’ జర్నలిస్టులు ఇప్పటికీ ప్రస్తావిస్తూ ఉండడం కద్దు. ఇక, విశాలాంధ్ర పత్రికను తెలుగు సాంస్కృతిక జీవిత ప్రతినిధిగా దిద్దితీర్చడంలో ఆయన పాత్ర అందరికీ తెలిసిందే. బెజవాడలో జరిగే చెప్పుకోదగిన సభలన్నింటికీ రాఘవాచారిగారే అధ్యక్షత వహించడం ఓ స్థానిక సంప్రదాయంగా పరిణమించింది. డైలీ జర్నలిజం నుంచి విరమించినప్పటికీ, ఇప్పటికీ, విజయవాడ మేధో జగత్సహోదరులకు పెద్దదిక్కుగా ఆయన కొనసాగుతూనే ఉన్నారు. ‘మాది వరంగల్లు. మా మేనమామలది పశ్చిమగోదావరి జిల్లా పెన్నాడ. తెలుగు సంస్కృతిలోని భిన్నత్వాన్నీ దాన్లోని ఏకత్వాన్నీకూడా చిన్నప్పుడే గ్రహించినవాణ్ణి నేను. వ్యక్తిగత జీవితంలో, వృత్తిగత జీవనంలో అరుదయిన వ్యక్తులను అతిసన్నిహితంగా చూశాను. అది వరంగల్లులోని కాళోజీలే కావచ్చు- హైదరాబాద్‌లోని మఖ్దూం, రాజ్‌బహదూర్ గౌర్, మొహిత్ సేన్లే కావచ్చు- విజయవాడ వచ్చాకా విశాలాంధ్ర పెద్దలయిన చంద్రంగారూ, బలరామమూర్తిగారే కావచ్చు. సంపాదక ప్రముఖులు నండూరి రామమోహనరావు, పొత్తూరి వెంకటేశ్వరరావుగారే కావచ్చు. రాంభట్ల, మల్లారెడ్డి, బూదరాజులాంటి అభ్యుదయ రచయితలే కావచ్చు. వీళ్లలో ప్రతిఒక్కరితోనూ ఆత్మీయ అనుబంధం ఏర్పడింది నాకు. ఆ బాంధవ్యం ప్రాతిపదికగానే మా స్నేహం మారాకు వేస్తూ వచ్చింది.’ అన్నారు రాఘవాచారి సగర్వంగా. ‘నేనన్నమాటకు అర్థం పైన చెప్పినవాళ్లతో నాకు భిన్నాభిప్రాయాలే లేవని కాదు సుమా!’ అని హెచ్చరించారాయన. ‘ఎప్పుడూ ఎవరితోనూ మూసకట్టు ‘అభిప్రాయభేదాలు’ పెంచుకోలేదన్నది నా పాయింటు. మన గీటురాళ్లు మనం జాగ్రత్తగా పెట్టుకోవడం ముఖ్యం.’ ఆ తర్వాత చాలామాటలే నడిచాయి. ఎన్నెన్ని అనుభవాలు, ఎన్నెన్ని జ్ఞాపకాలు. పెద్దిభొట్ల, రాఘవాచారి... ఇద్దరూ వయసు తాలూకు అలసటగాని అనారోగ్యపు అస్థిమితత్వాన్నిగాని లెక్క చేయకుండా హుషారుగా ఉన్నారు. దప్పికేసిన వాళ్లకు దాహం అందించే చలివేంద్రాల్లానే ఉన్నారు. దేశమంటే మట్టికాదు మనుషులు అంటే అర్థం అదే. ఒక ఊరంటే ఆ ఊరి మనుషులే. పర్లేదు. బెజవాడ భేషుగ్గానే ఉంది. - మందలపర్తి కిశోర్ 99122 29931 -
2014 సమావేశాలకు ‘నాటా’ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికాలో తెలుగు సంస్కృతి పరిరక్షణ కోసం కృషి చేస్తున్న నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(నాటా) 2014 సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. 2014 జూలై 4 నుంచి మూడు రోజులపాటు నిర్వహించే ‘నాటా 2014 కాన్వకేషన్’ ప్రచారంలో భాగంగా అక్టోబర్ 18, 19 తేదీల్లో ‘మీట్ అండ్ గ్రీట్’ గెట్ టుగెదర్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఉత్తర అమెరికా నలుమూలల నుంచి 600 మంది తెలుగు ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2014 కాన్వకేషన్ కోసం విరాళాలను సేకరించగా ఒక్క రోజులోనే 7 లక్షల అమెరికన్ డాలర్ల విరాళాలు అందినట్లు నాటా సలహా మండలి అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డి వెల్లడించారు. మీట్ అండ్ గ్రీట్‌లో పాల్గొన్న ప్రముఖ ఫిలాంత్రోపిస్ట్ డాక్టర్ ప్రేమ్ రెడ్డి, డాక్టర్ మల్లారెడ్డి చెరో లక్ష డాలర్ల విరాళాలు అంద జేశారన్నారు. అట్లాంటాలో జరిగే 2014 నాటా కాన్వకేషన్‌లో 10 వేల మంది తెలుగువారు పాల్గొననున్నారని పేర్కొన్నారు. -
దారులన్నీ రాజధాని వైపే
సాక్షి, ఏలూరు : ‘తెలుగు జాతిని ముక్కలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవాలనే స్వార్థపరుల కుట్రలు, కుతంత్రాలకు దీటైన సమాధానం చెప్పాలి. తెలంగాణ నాది.. రాయలసీమ నాది.. కోస్తా, ఉత్తరాంధ్ర అన్నీ కలిసిన విశాలాంధ్ర నాది అంటూ తెలుగు వారు ముక్తకంఠంతో నినదిం చాలి. ఆ నినాదం ఎలా ఉండాలంటే.. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న ఢిల్లీ పెద్దల గుండెలదరాలి. పదవుల్ని పట్టుకుని వేలాడుతున్న నేతలకు వణుకుపుట్టాలి. ఈ పోరాటం బలి కోరితే అందుకోసం ప్రతి సమైక్యవాది ముందుండాలి’ ఏపీ ఎన్జీవోలు చేసిన ప్రతిజ్ఞ ఇది. ఆ దిశగా సమైక్యవాదులను చైతన్యపరిచేందుకు, సమైక్య రాష్ట్ర ఆవశ్యకతను తెలియజెప్పేందుకు ఏపీ ఎన్జీవోలు నడుం బిగించారు. జిల్లాలోని అన్ని విభాగాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులంతా ఈ యజ్ఞంలో భాగస్వాములయ్యూరు. పాలకుల నిరంకుశ వైఖరిపై గర్జిస్తున్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం హైదరాబాద్‌లో తలపెట్టిన ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు శుక్రవారం ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా తరలివెళ్లారు. జిల్లా నలుమూలల నుంచి 15 వేలకు పైగా ఉద్యోగులు శుక్రవారం రాజధానికి తరలివెళ్లారు. ఏలూరు నుంచి 20, తణుకు నుంచి 20, తాడేపల్లిగూడెం నుంచి 17, భీమవరం నుంచి 12, నరసాపురం నుంచి 8, పాలకొల్లు నుంచి 5, నిడదవోలు నుంచి 5, కొయ్యలగూడెం నుంచి 5, కొవ్వూరు నుంచి 7, జంగారెడ్డిగూడెం నుంచి 7, ఉండినుంచి 6, గోపాలపురం నుంచి 4, ఆకివీడు నుంచి 4, పోలవరం నుంచి 3, ఉంగుటూరు నుంచి 3, ఆచంట నుంచి 2 , ఇతర ప్రాంతాల నుంచి మరో 25 చొప్పున కనీసం 153 బస్సులు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ బయలుదేరాయి. వెరుు్యకి పైగా కార్లు, ఇతర వాహనాల్లో ఉద్యోగులు తరలివెళ్లారు. రైళ్లనూ ఆశ్రయించారు. చాగల్లు, చింతలపూడి, లింగపాలెం, దేవరపల్లి, గోపాలపురం వంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా ఉద్యోగులు ఈ సభకు బయలుదేరడం విశేషం. అటెండర్ స్థాయి నుంచి జిల్లా అధికారి వరకూ సొంత ఖర్చులతో హైదరాబాద్ వెళ్లారు. మరోవైపు ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సభకు జిల్లాలోని అన్నివర్గాల ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోంది. సభను అడ్డుకుంటామంటున్న తెలంగాణ వాదులను వెంటనే అరెస్ట్ చేసి కేసులు నమోదు చేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ఈలి నాని డిమాండ్ చేశారు. సేవ్ ఆంధ్రప్రదేశ్‌కు మద్దతుగా తాడేపల్లిగూడెం, దేవరపల్లి మండలాల్లో శనివారం బంద్ పాటిస్తున్నట్టు జేఏసీలు ప్రకటించారుు. దాడులకు బెదరక... చింతలపూడి ప్రాంత ఉద్యోగులతో బయలుదేరిన బస్సుపై ఖమ్మం జిల్లా పెనుబల్లి, బంజర్ గ్రామాల మధ్య తెలంగాణ వాదులు దాడికి తెగబడ్డారు. 7 గంటల ఆటోల్లో వచ్చిన వ్యక్తులు తెలంగాణ నినాదాలు చేసుకుంటూ బస్సుపై రాళ్లు రువ్వారు. దీంతో బస్సు వెనుక అద్దాలు ధ్వంసమయ్యూరుు. తెలంగాణవాదులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వెళ్లి తీరతామని ఆ బస్సులోని ఉద్యోగులంతా స్పష్టం చేశారు. వారంతా ఏమాత్రం బెదరక సభకు హాజరయ్యేందుకు ముందుకు కదిలారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు వెళ్తున్న బస్సుపై దాడి చేయటాన్ని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్‌కుమార్ ఖండించారు. బెదిరింపులకు వెరవం... సేవ్ ఆంధ్రప్రదేశ్ సభకు వచ్చే వారిని అడ్డుకుంటామంటూ తెలంగాణవాదులు చేసిన హెచ్చరికలకు బెదిరేది లేదని ఎన్జీవోల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎల్.విద్యాసాగర్ స్పష్టం చేశారు. సభను శాంతియుతంగా జరపాలనే తమ అభిమతానికి విరుద్ధంగా తెలంగాణవాదులు రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సభను అడ్డుకోవాలని చూస్తే ప్రతిఘటనచ తప్పదని హెచ్చరించారు. నిజాలు మాట్లాడతామనే భయంతోనే తెలంగాణవాదులు ఈ సభ గురించి భయపడుతున్నారని ఆయన పేఒర్కన్నారు. ప్రయాణంలో దారిపొడవునా గర్తుతెలియని వ్యక్తులు ఇచ్చే ఆహార, మంచినీటి ప్యాకెట్లను సమైక్యవాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ తీసుకోవద్దని ఆయన సూచించారు.