సాక్షి, అమరావతి: తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ‘జగనన్న సాంస్కృతిక సంబరాలు’ పేరుతో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యా ప్తంగా 40 వేలమందికి పైగా కళాకారుల ప్రదర్శనలకు వేదికలు సిద్ధం చేస్తోంది. వెయ్యిమందికి పైగా కళాకారులతో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాచీన కళావైభవం చాటేలా ప్రణాళికను రూపొందించింది. ప్రధానంగా కూచిపూడి, కొమ్ముకోయ, థింసా, తప్పెటగుళ్లు, గరగలు, పగటివేషాలు, బుర్రకథలు, ఆర్కెస్ట్రా (జానపద, సంప్రదాయ, గిరిజన) వంటి కళారూపాలను ఆవిష్కరించనుంది. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని డిసెంబర్ 19, 20 తేదీల్లో అట్టహాసంగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనుంది.
చదవండి: 28, 29 తేదీల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కౌన్సెలింగ్
అందుబాటులో దరఖాస్తులు..
కళాకారులు, కళాబృందాలు నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. సాంస్కృతిక శాఖ https://culture.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులను పూర్తిచేసి పంపవచ్చు. విజయవాడలోని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి కార్యాలయంతో పాటు విజయనగరం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలుల్లోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులను apculturalcompetitions@gmail.comకు మెయిల్‌చేసే వెసులుబాటు కూడా కల్పించారు.
ఆడిషన్స్, రీజనల్ పోటీలు ఇలా...
♦నవంబర్ 19, 20, 21 తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల వారికి.
♦నవంబర్ 24, 25, 26 తేదీల్లో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల వారికి.
♦నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో రాజమహేంద్రవరంలోని వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల వారికి.
♦డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్స్ థియేటర్‌లో అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారికి.
కళలకు ప్రోత్సాహం..
రాష్ట్రంలో ఎంతో ఘనమైన ప్రాచీన సంస్కృతి ఉంది. దాన్ని కాపాడుకోవడంతోపాటు భావితరాలకు చాటిచెప్పేలా ప్రభు త్వం కృషిచేస్తోంది. కళాకారులను ప్రోత్సహించేలా రాష్ట్రస్థాయిలో సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో కళాకారులందరినీ భాగస్వాములను చేసేలా ప్రత్యేక పోస్టర్లతో విస్తృత ప్రచారం కల్పించనున్నాం. గెలుపొందిన కళాకారులు, కళాబృందాలకు భారీ బహుమతులు ఇవ్వనున్నాం.
– ఆర్కే రోజా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment