State level competitions
-
జగనన్న సాంస్కృతిక సంబరాలు.. రాష్ట్రస్థాయి పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం
సాక్షి, అమరావతి: తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా ‘జగనన్న సాంస్కృతిక సంబరాలు’ పేరుతో రాష్ట్రస్థాయి పోటీల నిర్వహణకు సాంస్కృతిక శాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యా ప్తంగా 40 వేలమందికి పైగా కళాకారుల ప్రదర్శనలకు వేదికలు సిద్ధం చేస్తోంది. వెయ్యిమందికి పైగా కళాకారులతో రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రాచీన కళావైభవం చాటేలా ప్రణాళికను రూపొందించింది. ప్రధానంగా కూచిపూడి, కొమ్ముకోయ, థింసా, తప్పెటగుళ్లు, గరగలు, పగటివేషాలు, బుర్రకథలు, ఆర్కెస్ట్రా (జానపద, సంప్రదాయ, గిరిజన) వంటి కళారూపాలను ఆవిష్కరించనుంది. సీఎం వైఎస్ జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని డిసెంబర్ 19, 20 తేదీల్లో అట్టహాసంగా రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించనుంది. చదవండి: 28, 29 తేదీల్లో జగనన్న విదేశీ విద్యాదీవెన కౌన్సెలింగ్ అందుబాటులో దరఖాస్తులు.. కళాకారులు, కళాబృందాలు నవంబర్ 10వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలి. సాంస్కృతిక శాఖ https://culture.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తులను పూర్తిచేసి పంపవచ్చు. విజయవాడలోని రాష్ట్ర సృజనాత్మకత, సంస్కృతి సమితి కార్యాలయంతో పాటు విజయనగరం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, కర్నూలుల్లోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలు, పాఠశాలల్లో నేరుగా దరఖాస్తులు అందజేయవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులను apculturalcompetitions@gmail.comకు మెయిల్చేసే వెసులుబాటు కూడా కల్పించారు. ఆడిషన్స్, రీజనల్ పోటీలు ఇలా... ♦నవంబర్ 19, 20, 21 తేదీల్లో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్, సత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు జిల్లాల వారికి. ♦నవంబర్ 24, 25, 26 తేదీల్లో గుంటూరు వెంకటేశ్వర విజ్ఞానమందిరంలో ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణాజిల్లాల వారికి. ♦నవంబర్ 29, 30, డిసెంబర్ 1 తేదీల్లో రాజమహేంద్రవరంలోని వెంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాల వారికి. ♦డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో విశాఖపట్నంలోని ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో అనకాపల్లి, విశాఖ, అల్లూరి సీతారామరాజు, మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల వారికి. కళలకు ప్రోత్సాహం.. రాష్ట్రంలో ఎంతో ఘనమైన ప్రాచీన సంస్కృతి ఉంది. దాన్ని కాపాడుకోవడంతోపాటు భావితరాలకు చాటిచెప్పేలా ప్రభు త్వం కృషిచేస్తోంది. కళాకారులను ప్రోత్సహించేలా రాష్ట్రస్థాయిలో సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీల్లో కళాకారులందరినీ భాగస్వాములను చేసేలా ప్రత్యేక పోస్టర్లతో విస్తృత ప్రచారం కల్పించనున్నాం. గెలుపొందిన కళాకారులు, కళాబృందాలకు భారీ బహుమతులు ఇవ్వనున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి -
నేటి నుంచి రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలు
సాక్షి,వరంగల్ స్పోర్ట్స్: మూడు రోజులపాటు కొనసాగనున్న నాలుగో తెలంగాణ రాష్ట్ర స్థాయి సబ్‌జూనియర్స్ బాలబాలికల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్స్–2018 పోటీలకు హన్మకొండలోని సుబేదారిలోని వరంగల్ క్లబ్ ముస్తాబైంది. రాష్ట్రంలోని ఉమ్మడి 10 జిల్లాల నుంచి హాజరైన క్రీడాకారులకు గురువారం క్వాలీఫైయింగ్ రౌండ్స్ నిర్వహించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను చాంపియన్‌షిప్స్‌కు ఎంపిక చేశారు. వరంగల్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల వివరాలను సాయంత్రం వరంగల్ క్లబ్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్‌కుమార్ వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు జరగనున్న పోటీలను శుక్రవారం ఉదయం 9 గంటలకు అంతర్జాతీయ మాజీ క్రీడాకారుడు బి.చేతన్ ఆనంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభిస్తారని తెలిపారు. పది జిల్లాల నుంచి 150 మంది క్రీడాకారులు, 50 మంది టెక్నికల్ అఫీషియల్స్ పాల్గొంటున్నారని తెలిపారు. వారందరికీ నగరంలోని కిట్స్, నిట్‌తోపాటు వివిధ ప్రైవేట్ హోటళ్లలో వసతి సదుపాయాలను కల్పించామని తెలిపారు. 11న జరిగే ముగింపు వేడుకలకు వరంగల్‌కు చెందిన అంతర్జాతీయ మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణీ సీహెచ్ దీప్తి హాజరై విజేతలకు బహుమతులను అందజేస్తారని తెలిపారు. ఆఫీసర్స్ క్లబ్ కార్యదర్శి ప్రేమ్‌సాగర్‌రెడ్డి మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు క్లబ్ సభ్యులు ఎల్లవేళలా ముందుంటారని అన్నారు. మూడు రోజులపాటు సాగనున్న క్రీడల నేపథ్యంలో తమ సభ్యులు సహకరించాలని కోరినట్లు తెలిపారు. సమావేశంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్రదాన కార్యదర్శి పి.రమేష్‌రెడ్డి, కోశాధికారి నాగకిషన్ , టెక్నికల్ అఫీషియల్స్ కొమ్ము రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఎడ్ల పోటీలు
శోభనాద్రిపురం (హనుమాన్‌జంక్షన్ రూరల్) : బాపులపాడు మండలంలోని శోభనాద్రిపురంలో రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని వివిధ కేటగిరీల్లో నిర్వహిస్తున్న గూటీ లాగుడు పోటీలు తొలిరోజు ఉత్సాహపూరిత వాతావరణంలో సాగాయి. తొలిరోజు కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి 16 జతల ఎడ్లు పోటీలో పాల్గొన్నాయి. 57 అంగుళాల ఎత్తులోపు ఎడ్ల పోటీలు నిర్వహించారు. ఈ నెల 30వ తేదీ వరకు ఎడ్ల పోటీలు కొనసాగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఎడ్ల పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. తొలుత ఈ పోటీలను తెలుగురైతు జిల్లా అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు పోటీలను ప్రారంభించారు. తెలుగురైతు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమావరప్రసాద్, తెలుగు యువత మండల అధ్యక్షుడు కలపాల సూర్యనారాయణ, నిర్వాహకులు చింతపల్లి సుమన్, మొవ్వా బోసు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
యోగా చిచ్చరపిడుగు
* రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన భవాని రామాయంపేట: ఆ విద్యార్థిని యోగాలో ఆరితేరింది. చిన్నప్పటి నుంచి యోగాసనాల పట్ల ఆసక్తి చూపిన ఆమెను పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. దాంతో పాఠశాలలో శిక్షణ పొందిన రాగి భవాని జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని పలు ఆవార్డులు కైవసం చేసుకుంది. మండలంలోని అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న భవాని ఎలాంటి ఆసనాన్నయినా అవలీలగా వేస్తుంది. ఇటీవల మెదక్ మండలం చిట్యాలలో జరిగిన 17 ఏళ్లలోపు విభాగం యోగా పోటీల్లో పాల్గొన్న ఆమె జిల్లాలో ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ప్రస్తుతం భవాని రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి మహబూబ్‌నగర్ వెళ్లింది. ఇటీవల జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు పాఠశాలకు వ చ్చిన సందర్భంగా ఆమె వేసిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. యోగాతోపాటు భవాని చదువులో కూడా ముందుందని ఉపాధ్యాయులు తెలిపారు. భవిష్యత్తులో ఆమె పాఠశాలకు మంచిపేరు తెస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నాను. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో యోగాలో ఉన్నత స్థానానికి ఎదుగుతాననే నమ్మకం ఉంది. - రాగి భవాని, విద్యార్థిని