యోగా చిచ్చరపిడుగు
* రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన భవాని
రామాయంపేట: ఆ విద్యార్థిని యోగాలో ఆరితేరింది. చిన్నప్పటి నుంచి యోగాసనాల పట్ల ఆసక్తి చూపిన ఆమెను పాఠశాల ఉపాధ్యాయులు ప్రోత్సహించారు. దాంతో పాఠశాలలో శిక్షణ పొందిన రాగి భవాని జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొని పలు ఆవార్డులు కైవసం చేసుకుంది. మండలంలోని అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న భవాని ఎలాంటి ఆసనాన్నయినా అవలీలగా వేస్తుంది. ఇటీవల మెదక్ మండలం చిట్యాలలో జరిగిన 17 ఏళ్లలోపు విభాగం యోగా పోటీల్లో పాల్గొన్న ఆమె జిల్లాలో ప్రథమ స్థానం పొంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది.
ప్రస్తుతం భవాని రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి మహబూబ్‌నగర్ వెళ్లింది. ఇటీవల జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు పాఠశాలకు వ చ్చిన సందర్భంగా ఆమె వేసిన ఆసనాలు ఆకట్టుకున్నాయి. యోగాతోపాటు భవాని చదువులో కూడా ముందుందని ఉపాధ్యాయులు తెలిపారు. భవిష్యత్తులో ఆమె పాఠశాలకు మంచిపేరు తెస్తుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో ముందుకెళ్తున్నాను. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనందుకు సంతోషంగా ఉంది. భవిష్యత్తులో యోగాలో ఉన్నత స్థానానికి ఎదుగుతాననే నమ్మకం ఉంది.
- రాగి భవాని, విద్యార్థిని