
గిన్నిస్ రికార్డ్..
ఒత్తిడి సమస్యతో యోగాకు దగ్గరైన వసంత లక్ష్మి ఆ విద్యలోప్రావీణ్యం సాధించి రికార్డులు బ్రేక్ చేస్తోంది. తాజాగా... సమకోణాసనంలో 3.22 గంటలుగా నమోదైన గత గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. 3.42 గంటల పాటు సమకోణాసనం వేసి సరికొత్త రికార్డు సృష్టించింది తిరుపతి జిల్లా వెంకటగిరికి చెందిన వసంతలక్ష్మి.
‘నేర్చుకోవాలి–చదువుకోవాలి’ అనేది వసంతలక్ష్మి తారకమంత్రం. పెళ్లి అయిన తరువాత చదువుకు దూరం అయింది. ‘ఇక ఇంటి బాధ్యతలు చాలు’ అనుకునేలోపే తారకమంత్రం తనను అప్రమత్తం చేసింది.‘చదువుకోవాలి–నేర్చుకోవాలి’
అంతే...ఆమె మళ్లీ చదువుకు దగ్గర అయింది. తిరుపతిలో డిగ్రీ, హిందీ పండిట్ కోర్సు పూర్తి చేసింది. ఆ తరువాత భర్త ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడ ఓ ప్రైవేట్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసేది. మొదట్లో బాగానే ఉండేది కాని ఆ తరువాత కుటుంబ నిర్వహణ, సేల్స్ ఎగ్జిక్యూటివ్ పనుల వల్ల తీవ్ర ఒత్తిడికి గురయ్యేది. ఆ సమయంలో తనకు యోగా గుర్తుకు వచ్చింది. యోగా అనేది ఒత్తిడిని చిత్తు చేసే తారకమంత్రం అనే విషయం చాలాసార్లు విని ఉన్నది వనంతలక్ష్మి.
హైదరాబాద్ అమీర్‌పేటలోని ‘స్వామి వివేకానంద ఇన్ స్టిట్యూట్’లో యోగా క్లాస్‌లో చేరింది. ఇది తన జీవితానికి మేలి మలుపుగా చెప్పుకోవాలి. క్రమం తప్పకుండా సాధన చేసి యోగాలో కేంద్రప్రభుత్వం నుంచి క్వాలిటీ కౌన్సెలర్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) సర్టిఫికెట్ అందుకుంది. ఆ తరువాత నిజామాబాద్‌లోని యోగా ఇన్ స్టిట్యూట్‌లో గురువు రామచంద్ర దగ్గర అడ్వాన్స్ డ్ యోగాలో ఆరు నెలలపాటు శిక్షణ తీసుకుంది. తనలోని క్రమశిక్షణ, ప్రతిభను గుర్తించిన గురువు రామచంద్ర జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా వసంతలక్ష్మిని ప్రోత్సహించాడు.
తెలుగు రాష్ట్రాలతో సహా బెంగళూరు, గుజరాత్, హరియాణా, దిల్లీ, తమిళనాడులో నిర్వహించిన వివిధ పోటీల్లో సత్తా చాటి 25 స్వర్ణ, రజత పతకాలు సాధించింది. ఒకవైపు యోగా సాధన చేస్తూనే మరోవైపు ఎమ్మెస్సీ సర్టిఫికెట్ కోర్సు పూర్తి చేసింది. ‘యోగా అకాడమి’కి శ్రీకారం చుట్టింది. ఆఫ్‌లైన్, ఆన్ లైన్ లో ఎంతోమందికి యోగా నేర్పిస్తోంది.
చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలంలో అపోలో హెల్త్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రెండు సంవత్సరాల పాటు పిల్లలకు యోగాలో శిక్షణ ఇచ్చింది. గతంలో 45 మందితో 108 సూర్య నమస్కారాలను కేవలం 28 నిముషాల్లో పూర్తి చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, నోబెల్ వరల్డ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. తాజాగా గత రికార్డ్‌ను బ్రేక్ చేసి సమకోణాసనంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్‌లో చోటు సాధించింది.
ఆరోగ్య భారత్ కోసం....
రికార్డ్‌లు కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. గిన్నిస్ బుక్ రికార్డు సాధించడం సంతోషంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఆరోగ్య భారత్ కోసం ఒక ఆశ్రమం ఏర్పాటు చేయాలని ఉంది. ప్రజల అనారోగ్య సమస్యలకు యోగా ద్వారా పరిష్కారం చూపాలనేదే నా లక్ష్యం.
– వసంతలక్ష్మి
– నిడిగింటి విజయకుమార్, సాక్షి , తిరుపతి డెస్క్/
కలపాటి భాస్కర్, వెంకటగిరి రూరల్
Comments
Please login to add a commentAdd a comment