
అధిక బరువును తగ్గించుకోవడం ఒక ఛాలెంజ్. అందులోనూ కొండలా పెరిగిన బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడం పెద్ద సమస్య. పొట్ట చుట్టూ పెరిగిపోతున్న కొవ్వు (ఆడవాళ్లైనా, మగవాళ్లైనా) లుక్‌ను మార్చేయ డమే కాదు, అనేక ఆరోగ్య సమస్యల్ని కూడా తెచ్చిపెడుతుంది. అయితే బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవడం అంత కష్టమేమీ కాదు. మంచి ఆహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే ముఖ్యంగా కొన్ని యోగాసనాల ద్వారా బెల్లీ ఫ్యాట్‌ను కరిగించవచ్చని యోగా నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒకసారి చూద్దామా..!
యోగా ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ప్యాట్ రిడక్షన్ కోసం అనేక యోగాసనాలు మనకు అందుబాటులో ఉన్నాయి. కొన్ని యోగాసనాలు ఉదర కండరాలను దృఢం చేస్తాయి. హృదయ స్పందన రేటును పెంచుతాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అలాగే బెల్లీఫ్యాట్‌కు కారణమైన ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. జీవక్రియను మెరుగుపరచడం, కోర్ కండరాలను బలోపేతం చేయడం, ఒత్తిడిని తగ్గించడం ద్వారా బెల్లీ ఫ్యాట్ కరిగించుకోవచ్చు. ఒక విధంగా ఇది ఉదరం చుట్టూ కొవ్వు పేరుకుపోవడానికి ఇవే ప్రధాన కారణం. బెల్లీ ఫ్యాట్ కరిగించేలా మధ్యాహ్నం పూట వేసే కొన్ని ఆసనాలను చూద్దాం.
భుజంగాసనం : ఇది పొత్తికడుపును సాగదీస్తుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు జీవక్రియను పెంచుతుంది.
నేలపై పడుకుని, ముఖం నేలకు సమానంగా నిలపాలి.
అరచేతులను రెండు వైపులా ఉంచి నెమ్మదిగా మీ మొండెం ఎత్తాలి.
అరచేతులు, దిగువ శరీరం మాత్రమే నేలను తాకేలా ఉండాలి.
ఇలా 30 సెకన్ల పాటు ఉండాలి. తిరిగి యథాస్థితికా రావాలి.ఇలా 3-4 సార్లు చేయాలి.
ధనురాసనం : ఇది ఉదర కండరాలను బలోపేతం చేసి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
ధనురాసనం వేయడానికి ముందుగా బోర్లా పడుకోవాలి.
అలా పొట్ట మీద పడుకుని రెండు మోకాళ్లనూ వెనక్కు మడిచి ఉంచాలి.
రెండు చేతులనూ వెనక్కి తీసుకెళ్లి కుడిచేత్తో కుడికాలి మడాన్ని, ఎడమచేత్తో ఎడమకాలి మడాన్ని పట్టుకోవాలి. తర్వాత పొట్ట మీద బరువు మోపుతూ పైకి లేవాలి.
ఇలా ఉండగలిగినంత సేపు ఉండి, మెల్లగా శ్వాస వదులుతూ యథాస్థితికి వచ్చి, తలను, కాళ్లను కింద పెట్టేయాలి. తర్వాత మెల్లగా శ్వాస తీసుకుంటూ మరోసారి చేయాలి. అలా మూడు నుంచి నాలుగుసార్లు ఈ ఆసనం చేయాలి.
ఇదీ చదవండి: ‘అమ్మను నాన్నే...’’ గుండెలు పగిలే ఐదేళ్ల కుమార్తె మాటలు, డ్రాయింగ్స్
పశ్చిమోత్తనాసనం: పశ్చిమోత్తనాసన ఆసనం జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది, పొత్తికడుపు కండరాలను టోన్ చేస్తుంది. ఉదర కొవ్వును తగ్గిస్తుంది
మొదటగా బల్లపరుపు నేలపై రెండు కాళ్లు ముందుకు చాచి కూర్చోవాలి.
తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ పొట్టను తొడలపై పెట్టాలి.
అలాగే తలను మోకాళ్లపై ఆన్చాలి. ఇప్పుడు రెండు చేతులను ముందుకు చాచి రెండు పాదాలను పట్టుకోవాలి.
ఈ భంగిమలో రెండు మోకాళ్లు, చేతులు నిటారుగా ఉండాలి.
వెన్నుపూసను వీలైనంతవరకూ పైకి లేవకుండా నిటారుగా ఉండేదుకు ప్రయత్నించాలి.
ఇలా సాధ్యమైనంత సేపు ఆగి పూర్వ స్థితిలోకి వచ్చి రిలాక్స్ అవ్వాలి.
సేతు బంధాసన
ముందుగా నేలపై పడుకొని రిలాక్స్ అవ్వాలి.
ఇప్పుడు రెండు కాళ్లను మడిచి, పాదాలు రెండు చేతులతో పట్టుకోవాలి.
భుజాలు, పాదాలు ఆధారంగా చేసుకొని, నడుము భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి. తల నేలపైనే ఉండాలి.
ఈ పొజిషన్‌లో కొన్ని డీప్ బ్రీత్స్ తీసుకున్న తర్వాత సాధారణ స్థితికి వచ్చి రిలాక్స్ అవ్వాలి.
ఉస్ట్రాసన : జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఒత్తిడికి సంబంధించిన కొవ్వును కరిగిస్తుంది
ముందుగా ఓ చోటు మోకాళ్లపై కూర్చోవాలి.
శ్వాస తీసుకొని చేతులు పైకి ఎత్తాలి. ఆ తర్వాత నడుమును వెనక్కి వంచాలి.
నడుము వెనక్కి వంచి.. అరచేతులతో అరికాళ్లను పట్టుకోవాలి.
ఆ భంగిమకు చేరాక శ్వాస వదలాలి. ఆ భంగిమలో కొన్ని సెకన్ల పాటు ఉండాలి.
ఉస్ట్రాసన్నాన్ని ఒంటె ఆసనం అని కూడా అంటారు.
నోట్: వీటిని క్రమం తప్పకుండా, ఓపికగా ఆచరించడంతోపాటు, తాజా పళ్లు, కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ, పీచు పదార్థం ఎక్కువగా ఆహారాన్ని తీసుకోవాలి. తగినన్ని నీళ్లు తాగాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ప్రతీ రోజు కనీసం 7 గంటల నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. యోగాసనాలను నిపుణుల సలహా, పర్యవేక్షణలో చేయడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment