
ఉరుకుల పరుగుల హడావిడి జీవితాలే అందరివి. కాసేపు కుదురుగా నచ్చిన వంటకం వండుకుని తినే తీరికే లేదు చాలామందికి. భార్య భర్తలిద్దరు ఉద్యోగాలు, మరోవైపు పిల్లలు బాధ్యతలు.. కారణంగా ఏదో సింపుల్‌గా త్వరగా అయ్యే అల్పాహారం, వంటకాలకే ప్రాధాన్యత ఇస్తారు. మరీ ముఖ్యంగా బ్రెడ్ ప్యాకెట్ ఉంటే చాలు బ్రేక్‌ఫాస్ట్ ఈజీ అనే స్థాయికి వచ్చేశారు. అది లేకుండా రోజు గడవదు చాలామందికి. కానీ రుచిగా ఉండే ఈ వైట్ బ్రెడ్ జోలికి అస్సలు వెళ్లకూడదని..దాన్నిరోజు అల్పాహారంగా తీసుకుంటే ఇక ఆరోగ్యం అంతే అని స్ట్రాంగ్‌గా వార్నింగ్ ఇస్తున్నారు అంబానీ, సచిన్ టెండూల్కర్‌ల ఆరోగ్య కోచ్. అస్సలు బ్రెడ్ ఏవిధంగా ప్రమాదకరమో ఆయన మాటల్లోనే సవివరంగా తెలుసుకుందాం!.
అంబానీలు, సచిన్ టెండూల్కర్‌తో సహా అనేక మంది అగ్రశ్రేణి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులకు వెల్‌నెస్ కోచ్ డాక్టర్ మిక్కీ మెహతా. ఆయన తరుచుగా ఇన్‌స్టాలో ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. అలానే ఈసారి ప్రతిరోజు బ్రెడ్ తీసుకుంటే ప్రేగు ఆరోగ్యం ఎలా పాడవ్వుతుందో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో సవివరంగా వెల్లడించారు.
బ్రెడ్ వినియోగం వల్ల కలిగే ప్రమాదాలు..
ప్రజలు తమ దైనందిన జీవితంలో బ్రెడ్ తినడం అనేది అత్యంత సర్వసాధారణంగా మారిపోయిందని అన్నారు. భారతీయుల అల్పాహారంలో భాగమైపోయిందని కూడా అన్నారు. టీ విత్ బ్రెడ్, ఆమ్లెట్ బ్రెడ్, లేదా జామ్ విత్ బ్రెడ్, పోహా విత్ బ్రెడ్ లాగించేస్తున్నారు. కానీ ఈ తెల్లబ్రెడ్ ఆరోగ్యానికి అత్యంత ప్రమాకరమైనదని నొక్కి చెప్పారు మెహతా.
దీనివల్ల ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అనే సమస్య వస్తుందని చెప్పారు. ఇటీవల తన కుమార్తె ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. ఆమె అకస్మాత్తుగా తల తిరగడం, వంటి సమస్యలను ఎదుర్కొంది. అచ్చం మద్యం సేవించిన వ్యక్తి మాదిరిగా కళ్లుతిరిగిపడిపోయిందని అన్నారు.
బ్రూవరీ సిండ్రోమ్ అంటే..
ఆమె పెద్ద మొత్తంలో మల్టీగ్రెయిన్ బ్రెడ్ తింటున్నట్లు గమనించలేదని అన్నారు మెహతా. ఆమె ఎప్పుడైతే అనారోగ్యం పాలై ఆస్పత్రిలో చేరింది అప్పుడే అసలు విషయం తెలిసిందన్నారు డాక్టర్ మెహతా. అంటే జీర్ణం కాని బ్రెడ్ ఇథనాల్ లేదా ఆల్కహాల్‌గా మారుతుందట. ఇది శరీరంపై ఆల్కహాల్‌కి మించిన ప్రభావం చూపిస్తుందట. పైగా ప్రేగులను ఉక్కిరిబిక్కిరి చేస్తుందట. దాంతో నెమ్మది నెమ్మదిగా బ్రూవరీ సిండ్రోమ్‌కి దారితీస్తుందట.
ఇది ఒక అరుదైన వైద్య పరిస్థితి. దీన్ని గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఇక్కడ ఆల్కహాల్ సేవించకపోయినా..ఒక విధమైన మత్తులో ఉంటారట. అంటే.. అరగని బ్రెడ్ శరీరంలో జీర్ణశయాంతర ప్రేగులో కిణ్వ ప్రక్రియ ద్వారా ఆల్కహాల్ ఉత్పత్తి అవ్వకపోవడంతో ఈ పరిస్థితి ఎదరవ్వుతుంది.
నివారణ..
బ్రెడ్‌ని తినలేకుండా ఉండలేం అనుకున్నవారు..బాగా ఆకలేసి..అందుబాటులో ఏం లేకపోతే తప్ప బ్రెడ్ జోలికి వెళ్లొద్దని హెచ్చరిస్తున్నారు మెహతా. అలాగే మంచి ఫైబర్‌తో కూడిన ఆహారాని డైట్‌లో భాగం చేసుకుంటే..బ్రెడ్ వ్యర్థాలు సులభంగా బయటకు విసర్జించబడతాయని అన్నారు మెహతా. సో బ్రెడ్ తినేవాళ్లంతా కాస్తా జాగ్రత్తంగా ఉండటమే బెటర్..!.
గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
(చదవండి: కొందరు జస్ట్ 4 గంటలే నిద్రపోయినా ఆరోగ్యంగానే ఉంటారు! రీజన్ అదే అంటున్న నిపుణులు)