ఒకప్పుడు జీర్ణవ్యవస్థ అంటే ఆహారాన్ని జీర్ణం చేయడం వరకే దాని పని అనుకునేవారు. కానీ... దాని పని ‘అంతకు మించి’అంటూ ఇటీవలి ఎన్నో పరిశోధనలు తెలుపుతున్నాయి.
జీర్ణ వ్యవస్థ అనేది చాలా సంక్లిష్టమైన వ్యవస్థ అంటూ కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో కోటాను కోట్ల (ట్రిలియన్ల కొద్దీ) బ్యాక్టీరియా, వైరస్‌లు, ఫంగీ వంటి జీవులు నివసిస్తుంటాయి. వాటినే సంక్షిప్తంగా ‘గట్ బయోమ్’గా పేర్కొంటున్నారు. ఈ జీవులే మానవుల సంపూర్ణారోగ్య నిర్వహణకు తోడ్పడుతున్నాయనీ, ఇవి కేవలం ఒక జీర్ణం(Digestion) చేసే పనే కాకుండా...
ఆ వ్యక్తి తాలూకు వ్యాధి నిరోధక వ్యవస్థ, మానసిక ఆరోగ్యం వంటివాటినీ సమర్థంగా నిర్వహిస్తున్నాయని అధ్యయనాల్లో తేలింది. అంతేకాదు... ఓ వ్యక్తికి వచ్చే దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు(రిస్క్)లు కూడా ఆ బయోమ్‌పైనే ఆధారపడి ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. దీన్నిబట్టి తెలిసేదేమిటంటే... ఓ వ్యక్తి తీసుకునే ఆహారంపైనే అతడి గట్ బయోమ్ ఆధారపడి ఉండటం, ఇక దాని మీదనే అతడి సంపూర్ణ ఆరోగ్యం కూడా ఆధారపడి ఉంటోంది.
సూక్ష్మ సమాచార వారధి
జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్ అన్నది దేహానికి మేలు చేసే అనేక రకాల సూక్ష్మజీవుల సముదాయం. ఈ అనేక రకాల సూక్ష్మజీవుల సముదాయం తాలూకు సమతౌల్యత మీదే ఓ వ్యక్తి తాలూకు సంపూర్ణ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆ జీవవైవిధ్యత వల్లనే ఆహారం సరిగా జీర్ణం కావడం, జీర్ణమైనది ఒంటికి పట్టడం, జీవక్రియలన్నీ సక్రమంగా జరగడం.
అన్నిటికంటే ముఖ్యంగా ఆ బయోమ్ కారణంగానే అతడి వ్యాధి నిరోధక శక్తి ఇనుమడించడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ బయోమ్ వల్లనే జీర్ణవ్యవస్థకూ, మెదడుకూ మధ్య నిరంతరం ఓ సమాచార వ్యవస్థ (గట్–బ్రెయిన్ ఏక్సిస్) నడుస్తుంటుంది. ఈ బయోమ్ వ్యవస్థ బాగుంటేనే... ఓ వ్యక్తితాలూకు భావోద్వేగాలు (మూడ్స్), నిద్ర, అతడి మానసిక ఆరోగ్యం ఇవన్నీ బాగుంటాయి.
నేచురల్ సమతౌల్యం
మంచి సమతులాహారం తీసుకుంటూ గట్ మైక్రోబయోమ్(Gut Micorbiome) తాలూకు సమతౌల్యతను కాపాడుకోవడం ద్వారా ఓ వ్యక్తి తాలూకు జీవనశైలిని సానుకూలంగా అంటే పాజిటివ్‌గా మలచేందుకు ఆస్కారముంటుంది. భారతీయ సంప్రదాయ ఆహారంలోనివి... అంటే ముఖ్యంగా మొక్కలు, వృక్షాల నుంచి లభ్యమయ్యే చిరుధాన్యాలు, సుగంధద్రవ్యాలు, పులవడానికి సిద్ధంగా ఉన్న ఆహారాల వంటివి ఈ గట్‌బయోమ్ సమతౌల్యాన్ని స్వాభావికంగా (నేచురల్‌గా) నిర్వహితమయ్యేలా చేస్తాయి.
మన జీర్ణవ్యవస్థలోని గట్ బయోమ్ సరిగా వృద్ధిచెందడానికైనా లేక అవి సరిగా అభివృద్ధి చెందకపోవడానికైనా మన ఆహారమే కారణమవుతుంది. మంచి ఆహారం తీసుకుంటే అవి సానుకూలంగా అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాలు, పప్పులు (దాల్), శెనగలు, ఆకుపచ్చరంగులో ఉండే పాలకూర, గోంగోర వంటి ఆకుకూరల వల్ల జీర్ణవ్యవస్థలో మనకు మేలు చేసే బ్యాక్టీరియా వృద్ది చెందుతాయి.
మంచి ఆరోగ్యం కోసం...
కేవలం ఆహారంపైనే కాకుండా మన జీవనశైలి కూడా గట్ మైక్రోబియమ్ మీద ప్రభావం చూపుతుంది. మన ప్రపంచంలోని వివిధ ఖండాల్లో చాలా ఆరోగ్యకరమైన రీతిలో ప్రజలు నివసించే ప్రాంతాలను బ్లూ జోన్స్‌గా పరిగణిస్తుంటారు. ఈ బ్లూ జోన్స్‌లో నివసించే వారు మిగతా ప్రజల కంటే సుదీర్ఘ కాలం జీవిస్తుంటారు.
అలాగే వారు సంపూర్ణారోగ్యంతో జీవనం సాగిస్తుంటారు. ఈ బ్లూ జోన్స్‌గా గుర్తించిన ప్రాంతాలు... సార్డీనియా (ఇటలీ), నికోయా (కోస్టా రికా), ఇకారియా (గ్రీస్), లోమా లిండా (కాలిఫోర్నియా) వంటివి. వీటిల్లో నివసించే వాళ్లను, వారి జీవనశైలిని పరిశీలించినప్పుడు... వారి జీవనశైలి మూలంగా జీర్ణవ్యవస్థ తాలూకు ఆరోగ్యం మెరుగుపరుచుకోడానికి అవలంబించాల్ని కొన్ని పద్ధతులు తెలిశాయి. అవి...
నిద్రపోదాం
నాణ్యత లేని నిద్ర, తరచూ నిద్రాభంగం కావడం వంటి సమస్యల వల్ల జీర్ణవ్యవస్థలోని గట్ బయోమ్ దెబ్బతింటుంది. దాంతో జీర్ణసమస్యలు వస్తాయి. బ్లూజోన్‌లోని ప్రజలు కంటి నిండా నిద్రపోవడంతోపాటు వేళకు నిద్రకు ఉపక్రమిస్తారు.
ఇది కూడా వాళ్ల ఆరోగ్యానికి కావడం వల్ల ఆరోగ్యాన్ని కోరుకునేవారంతా రోజూ కనీసం 7 – 8 గంటల నాణ్యమైన నిద్రకు ప్రాధాన్యమివ్వాలి. దీనివల్ల వాళ్లకు గట్ ఆరోగ్యంతోపాటు సంపూర్ణ ఆరోగ్యమూ సిద్ధిస్తుంది.
చురుగ్గా ఉందాం...
మనలో రోజువారీ కదలికలు ఎక్కువగా ఉంటే... అలా ఉండటం వల్ల సమకూరే వ్యాయామం కారణంగా జీర్ణవ్యవస్థలోని మైక్రోబయోమ్ ఆరోగ్యంగా ఉండటం, ఆహారం బాగా జీర్ణం కావడం జరుగుతుంది. బ్లూజోన్‌లోని ప్రజలు తమ స్వాభావికమైన కదలికలతోనే తమ రాకపోకలు సాగిస్తుంటారు.
ఉదాహరణకు నడక, సైక్లింగ్ వంటివి. అలాగే తోటపని లాంటి పనుల వల్ల దేహపు కదలికలు బాగా చురుగ్గా జరుగుతుంటాయి. అంతేకాకుండా నడక, యోగా, వంటి తేలికపాటి వ్యాయామాలు, దేహపు కదలికల వల్ల... వాళ్ల జీర్ణవ్యవస్థ మరింత మెరుగ్గా, ఆరోగ్యంగా ఉంటుంది.
నీళ్లు తాగుదాం...
నీళ్లు తాగడమన్నది మంచి జీర్ణవ్యవస్థకూ, ఆహారం బాగా జీర్ణం కావడానికీ, తిన్నవి బాగా ఒంటికి పట్టడానికి తోడ్పడుతుంది. బ్లూజోన్‌లోని ప్రజలు కూడా నీళ్లు తాగడాన్ని ఓ మంచి అలవాటుగా పాటిస్తారు. వాళ్లు చక్కెరతో కూడిన తియ్యటి పానీయాలను చాలా పరిమితంగా తీసుకుంటారు.
మంచి ఆరోగ్యం కోసం రోజంతా తరచూ కొద్దికొద్దిగా నీళ్లు తాగుతూ ఉండటం, అలాగే తీయ్యటివీ, కెఫిన్‌తో కూడిన పానీయాలు చాలా పరిమితంగా తీసుకుంటూ ఉండాలి. పులవడానికి సిద్ధంగా ఉండే ఆహారాలైన పెరుగు, ఇడ్లీ, దోశ వంటివి ప్రోబయాటిక్ ఆహారాలుగా పనిచేస్తూ... గట్‌లో ఉండే సూక్ష్మజీవరాసుల వృద్ధికీ, సమతౌల్యతకూ తోడ్పడతాయి. మళ్లీ వీటి కారణంగానే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది.
వీటితోపాటు ప్రీ–బయాటిక్ సమృద్ధిగా ఉండే వెల్లుల్లి, ఉల్లి, అరటి, ఓట్స్ వంటి ఆహారాలతో గట్‌లో ఉండే సూక్ష్మవృక్షజీవరాసులు అభివృద్ధి చెందుతాయి. అలాగే పసుపు, అల్లం, జీలకర్ర వంటి వాటితో దేహంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ) ప్రక్రియ జరుగుతుంది.
మరీ ముఖ్యంగా చెప్పాలంటే పసుపులో ఉండే కర్కుమైన్ అనే సంక్లిష్ట పోషకాలు దేహంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఇక కాయధాన్యాలైన వరి, బార్లీతో తోపాటు చిరుధాన్యాల్లో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్‌ను ఆరోగ్యకరంగానూ, సమతౌల్యంతోనూ పెరిగేలా చూస్తాయి.
ఒత్తిడిని ఎదుర్కొందాం...
దీర్ఘకాలికమైన ఒత్తిడి జీర్ణవ్యవస్థలో ఇన్‌ఫ్లమేషన్‌కూ, ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడానికీ... అది మళ్లీ జీర్ణవ్యవస్థలో మైక్రోబియమ్ బలహీనపడటానికి దారితీస్తుంది. ధ్యానం, బాగా లోతుగా శ్వాస తీసుకోవడం, ప్రకృతితో సమన్వయమై వీలైనంత ఎక్కువసేపు గడపటం వంటి అంశాలు ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తాయి.
ఉదాహరణకు జపాన్‌లోని ‘ఒకినవా’ అనే ప్రాంతంలోని ప్రజలు ‘ఇకిగయి’ అనే జీవనవిధానం ద్వారా ఒత్తిడి తగ్గించుకుని, మానసిక ప్రశాంతతను పొందుతారు. ఇలాంటి ఆరోగ్యకరమైన జీవన విధానాలను అనుసరించడం ద్వారా మానసిక ఆరోగ్యమూ సమకూరుతుంది. తద్వారా జీర్ణవ్యవస్థ ఆరోగ్యమూ మెరుగుపడుతుంది.
విచక్షణతో తిందాం...
బ్లూ జోన్‌లో ఉన్న ఆరోగ్యవంతులైన ప్రజలు తమ కడుపు 80 శాతం నిండగానే తినడం ఆపేస్తారు. దీనివల్ల తిన్నది బాగా జీర్ణమవుతుంది. వాళ్లు భోజనాన్ని బాగా ఆస్వాదిస్తూ, మెల్లమెల్లగా నములుతూ హాయిగా తింటారు. దీనివల్ల కడుపుబ్బరం, అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలేవీ రావు. గట్‌కూ, మెదడుకూ మంచి సమన్వయమూ ఉంటుంది.
టేక్...కేర్
భోజనంలోని ఆహారాల్లో... తగినన్ని కాయధాన్యాలు, ఆకుకూరలు, కాయగూరలు, పప్పులు, పండ్లు ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి∙
పులవడానికి సిద్ధంగా ఉన్న ఆహారాలను ఆహారంలో భాగం చేయాలి.
ప్రాసెస్‌డ్ ఆహారాలూ, చక్కెరతో కూడిన ఆహారాలు గట్ మైక్రోబయోమ్‌ను దెబ్బతీస్తాయి కాబట్టి వాటిని చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి
ఒళ్లంతా మంచి కదలికలతో రోజంతా చాలా చురుగ్గా ఉండాలి∙
స్ట్రెస్‌ను అదుపులో ఉంచుకోడానికి మంచి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించాలి
వేళకు కంటి నిండా నిద్రపోతూ గట్ – బ్రెయిన్ ఆరోగ్యం కోసం ప్రయత్నించాలి.
దీర్ఘాయుష్మాన్‌భవ...
జీర్ణాశయం ఆరోగ్యం కోసం ప్రయత్నించడమంటే అది కేవలం గట్ తాలూకు ఆరోగ్యం కోసం మాత్రమే కాదు... నిజానికి అది సంపూర్ణారోగ్యం కోసం చేసే ప్రయత్నమని గుర్తుంచుకోవాలి. బ్లూజోన్‌లో నివసించేవాళ్ల నుంచి స్ఫూర్తి ΄పొందుతూ అందరమూ మన జీవనశైలినీ, భారతీయ సంప్రదాయ ఆహారాలైన మొక్కల నుంచి లభ్యమయ్యేవీ, పులిసేందుకు సిద్ధంగా ఉండేవీ, పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఇది కేవలం జీర్ణవ్యవస్థ ఆరోగ్యం కోసం మాత్రమే కాకుండా ఓ వ్యక్తి తాలూకు సంపూర్ణారోగ్యానికి దోహదపడుతుంది.
ప్రో బయాటిక్
పులవడానికి సిద్ధంగా ఉండే ఆహారాలైన పెరుగు, ఇడ్లీ, దోశ వంటివి ప్రో బయాటిక్ ఆహారాలుగా పనిచేస్తూ... గట్‌లో ఉండే సూక్ష్మజీవరాసుల వృద్ధికీ, సమతౌల్యతకూ తోడ్పడతాయి. మళ్లీ వీటి కారణంగానే వ్యాధి నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వీటితో పాటు ప్రీ–బయాటిక్ సమృద్ధిగా ఉండే వెల్లుల్లి, ఉల్లి, అరటి, ఓట్స్ వంటి ఆహారాలతో గట్‌లో ఉండే సూక్ష్మవృక్షజీవరాసులు అభివృద్ధి చెందుతాయి.
అలాగే పసుపు, అల్లం, జీలకర్ర వంటి వాటితో దేహంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్‌ఫ్లమేటరీ) ప్రక్రియ జరుగుతుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే పసుపులో ఉండే కర్కుమైన్ అనే సంక్లిష్ట పోషకాలు దేహంలోని ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి. ఇక కాయధాన్యాలైన వరి, బార్లీతోపాటు చిరుధాన్యాల్లో పీచుపదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ జీర్ణవ్యవస్థలో ఉండే గట్ బయోమ్‌ను ఆరోగ్యకరంగానూ, సమతౌల్యంతోనూ పెరిగేలా చూస్తాయి.
డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఛైర్మన్ అండ్ చీఫ్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ, ఏఐజీ హాస్పిటల్స్,హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment