
‘శతమానం భవతి’ అన్నారు మన పెద్దలు. నూరేళ్లు జీవించి పిల్ల పాపల ఆనందాలు చూసి వీడ్కోలు తీసుకోవాలని భారతీయులు కోరుకుంటారు. ఒకప్పుడు ఆయుఃప్రమాణం బాగా తక్కువగా ఉండేది. ఇప్పుడు ఆధునిక వైద్య విధానాల వల్ల ఆయుఃప్రమాణం పెరిగింది. అయితే వైద్య విధానం ఎంత ఆధునికంగా ఉన్నా అది పూర్తిగా జబ్బు నయం చేయలేనివే ఎక్కువ. యధాతథ స్థితిని కొనసాగించి ఆయుష్షును పొడిగించగలుగుతున్నాయి. ఇది ఒక రకంగా వరం. మరో రకంగా ఇబ్బందిగా మారుతోంది. పెద్దవాళ్లు జబ్బుపడి ఎక్కువ రోజులు సహాయం పొందే స్థితికి వస్తే ఇంటిలో సమస్యలు మొదలవుతున్నాయి. మరి వీటిని ఎలా నివారించాలి?
మన దేశంలో 70 ఏళ్ల వయసు దాటాక స్త్రీల కంటే పురుషులే ఎక్కువ జబ్బుల గురించి ఆందోళన చెందుతున్నారట. దానికి కారణం మంచాన పడితే ఎవరు చూడాలి అనేది ఒకటైతే పూర్తి కదలికలు నియంత్రణలోకి వెళితే జీవితం చాలా కష్టంగా మారుతుందనే భయం ఒకటి.
స్త్రీలకు సేవ చేసే స్త్రీలు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటే పురుషులకు సేవ చేసేవారు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలో 70లు 80లకు చేరుకున్న తల్లిదండ్రులు అనారోగ్యాల బారిన పడితే బాధ్యత ఎవరు తీసుకోవాలనే విషయం మీద చాలా ఇళ్లల్లో ఒక అనిశ్చితి నెలకొంటోంది.
స్పష్టత వచ్చే వీలు ఉందా?
తల్లిదండ్రులు జబ్బుపడితే వారి బాగోగులు చూసే స్థితిలో ఇప్పుడు సంతానం ఉండటం లేదు. దానికి కారణం బిజీ బతుకుల్లో భార్యాభర్తలు ఇద్దరూ సం΄ాదించాల్సి వస్తోంది. దానికితోడు పిల్లల కెరీర్‌లకు వారి అవసరాలకు సమయం చాలదు. మధ్య తరగతి అయినా ఎగువ మధ్యతరగతి అయినా త్రీ బెడ్ నివాసాలు ఉండి జబ్బుపడ్డ తల్లిదండ్రులకు ఒక గది ఇచ్చే వీలు 90 శాతం ఇళ్లల్లో ఉండటం లేదు.
దీంతో తల్లిదండ్రులు ఆరోగ్యంగా ఉండగానే భవిష్యత్తులో రాబోయే అనారోగ్యాలను దృష్టిలో ఉంచుకుని అంటీముట్టనట్టు తయారవుతున్న సంతానం ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇది తల్లిదండ్రులను మరింత బాధపెడుతోంది. ఇప్పుడే ఇలా వీరుంటే రేపెలా అనే చింత పట్టుకుంటోంది.
కూర్చుని మాట్లాడుకోవాలి
అంతా బాగున్నప్పుడే తల్లిదండ్రులు, పిల్లలు కూచుని మాట్లాడుకోవాలి. తల్లిదండ్రుల అనారోగ్యం కోసం వారు సొంతంగా దాచుకున్న నిధిని, పిల్లలు తమ వంతుగా ఇవ్వగలిగిన నిధిని కలిపి ఒకచోట ఉంచి దాని గురించి సమాచారం ఇచ్చుకోవాలి.
చూసే వీలు లేకపోతే ఏజెన్సీల సహాయం ఎలా తీసుకోవాలో తెలుసుకుని ఉండాలి. ఆరోగ్యం బాగలేనప్పుడు ఏ హాస్పిటల్‌లో చేర్చాలో ముందే నిర్ణయించుకొని ఆ హాస్పిటల్‌లో తరచూ చెకప్‌లు చేయిస్తూ ఉంటే సమయానికి కొత్త పేషంట్‌గా మారే పరిస్థితి ఉండదు.
బడ్జెట్‌కు సంబంధించిన ఇబ్బందులు ఉంటే ఏయే అనారోగ్యాలకు ప్రభుత్వ/చారిటీ ఆస్పత్రులు అతి తక్కువ చార్జీలకు వైద్యసేవలు ఇవ్వగలవో తెలుసుకుని అందరూ ఆ సమాచారం పంచుకోవడం మంచిది. తల్లిదండ్రులు తమ సంతానం కోసం జీవితాన్నే వెచ్చించి ఉంటారు కాబట్టి వారికి కచ్చితంగా సమయం ఇవ్వగలమని, బాధ్యతను పంచుకోగలమనే నమ్మకం వారిలో కలిగించాలి. సాధారణంగా ఎవరో ఒకరి నెత్తి మీద ఈ బాధ్యతను తోసే ధోరణి కొందరిలో ఉంటుంది. అది సమస్యను తీవ్రంగా పెంచుతుంది.
పంతాలు విడవాలి
తల్లిదండ్రులు పెద్దవయసు వచ్చే వేళకు జీవితంలో వారి వల్ల లేదా సంతానం వల్ల ఎన్నో తప్పొప్పులు జరిగి పంతాలు పట్టింపులు ఏర్పడి ఉండవచ్చు. కాని తల్లిదండ్రులు అనారోగ్య స్థితికి చేరుకునేవేళకు అవి సమసే వాతావరణం కల్పించుకోవాలి. క్షమ చాలా సమస్యలు దూరం చేస్తుంది. మనుషులు దూరమయ్యాక చేయగలిగింది ఏమీ లేదు.
అందుకే పెద్దవారు వారి చివరిదశను ప్రశాంతంగా గడిపేలా చూసుకోవాలి. ఇందుకు సామరస్య వాతావరణంలో ఎంత మాట్లాడుకుంటే అంత స్పష్టత వస్తుంది. వాట్సప్‌లు, ఫోన్ కాల్స్ మాని ఎదురుబొదురు కూచుంటే తప్ప ఇలాంటి సందర్భాలలో పరిష్కారాలు దొరకవు. అసలే జబ్బుపడ్డ పెద్దవారికి ఆత్మీయమైన ఇంటి వాతావరణానికి దగ్గర చేయడం అతిఒక్క కుటుంబ సభ్యుని బాధ్యత.
(చదవండి: కాన్పులో రక్తస్రావం కావడంతో ఇచ్చిన ఐరన్ టాబ్లెట్స్ పడకపోతే ఏం చేయాలి..?)
Comments
Please login to add a commentAdd a comment