సామవేదం | sakshi food special | Sakshi
Sakshi News home page

సామవేదం

Published Fri, Nov 11 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

సామవేదం

సామవేదం

భోజనాన్ని నెమ్మదిగా తినాలి... బాగా నమిలి, రుచిని ఆస్వాదిస్తూ తినాలి!
ఆ భోజనం నిదానంగా జీర్ణం కావాలి... ఎక్కువ సేపు శక్తిని విడుదల చేయాలి!
నిజమే... ఇదే అసలైన ఆరోగ్యం... అందుకు చిరుధాన్యమే అనువైన ఆహారం.
కొర్రలు... రాగులు... జొన్నలు... సజ్జల జాబితాలో మరో చిరుధాన్యం సామలు.


సామ కేసరి
కావలసినవి: సామబియ్యం- ఒక గ్లాసు, పటిక బెల్లం పొడి- ముప్పావు గ్లాసు, అనాసపండు ముక్కలు- పావు కప్పు, యాలకుల పొడి- పావు చెంచా, నెయ్యి- రెండు చెంచాలు, జీడిపప్పు- గుప్పెడు, కిస్‌మిస్- గుప్పెడు, కుంకుమ పువ్వు- చిటికెడు, పాలు - అరకప్పు


తయారీ:  పాలు వేడి చేసి అందులో కుంకుమ పువ్వు వేసి పక్కన ఉంచాలి  మందపాటి బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్‌మిస్ వేయించి తీసి పక్కన పెట్టాలి. అదే బాణలిలో మిగిలిన నేతిలో సామబియ్యం వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. బియ్యం వేగేలోపు మరొక స్టవ్ మీద రెండున్నర కప్పుల నీటిని మరిగించాలి. బియ్యం వేగిన తర్వాత మరుగుతున్న నీటిని పోసి కలపాలి. మెత్తగా ఉడికిన తర్వాత అనాపసండు ముక్కలు, పటికబెల్లం పొడి, యాలకుల పొడి, కుంకుమపువ్వు పాలు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఒక నిమిషం తర్వాత మిశ్రమం అడుగుపట్టకుండా కలిపి దించాలి. చివరగా నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌తో గార్నిష్ చేయాలి.


సామ ఆపం
కావలసినవి: సామబియ్యం- ఒక గ్లాసు, అటుకులు- పిడికెడు, కొబ్బరికోరు- అర కప్పు, ఈస్ట్- అర చెంచా, పటికబెల్లం పొడి- ఒక చెంచా, ఉప్పు- తగినంత, నూనె- ఒక టేబుల్ స్పూన్


తయారీ:  సామబియ్యాన్ని కడిగి ఐదు గంటల సేపు నానబెట్టాలి  అరగ్లాసు వేడినీటిలో ఈస్ట్, పటికబెల్లం పొడి కలిపి పక్కన పెట్టుకోవాలి.  అటుకులను ఐదు నిమిషాలు నానబెట్టిన తర్వాత అందులో కొబ్బరికోరు, ఈస్ట్ మిశ్రమం, ఉప్పు కలిపి మెత్తగా రుబ్బాలి  ఈ పిండిని ఒక పాత్రలోకి తీసుకుని ఆరుగంటల సేపు కదిలించకుండా ఉంచాలి  ఆపం పెనం వేసి చేసి అందులో ఒక గరిటెడు పిండి వేసి అర చెంచా నూనె వేసి మూత పెట్టి సన్నమంట మీద కాల్చాలి. అర నిమిషానికి ఆపం కాలి అంచుల దగ్గర పైకి లేస్తుంది. అప్పుడు తీసేయాలి. ఆపాన్ని తిరగేసి కాల్చరాదు. ఒకవైపే కాల్చాలి. దీనికి కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్.


గమనిక: ఆపం పిండిని ఆపం బాణలిలో పోయడం చాలా నైపుణ్యంతో కూడిన పని. బాణలిలో పోసిన తర్వాత బాణలి అంచులు పట్టుకుని వలయాకారంగా తిప్పినప్పుడు పిండి బాణలిలో విస్తరిస్తుంది. అది ఒక దగ్గర మందంగా, మరొక దగ్గర పలుచగా రాకుండా అంతా సమంగా విస్తరించేటట్లు బాణలిని తిప్పడం సాధన మీద వస్తుంది.  ఈస్ట్ లేకపోతే ఒక స్పూను పెరుగు కలుపుకోవచ్చు లేదా బియ్యంలో ఒక చెంచా మెంతులు వేసుకోవచ్చు  వరిపిండితో గంజి కాచి ఆపం పిండిలో కలుపుకుంటే ఆపం మెత్తగా వస్తుంది. సమంగా విస్తరించి పలుచగానూ ఉంటుంది   ఇష్టమైతే ఆపం మీద క్యారట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవచ్చు.


సామ వెజ్ కిచిడి
కావలసినవి: సామల బియ్యం- ఒక గ్లాసు, ఉల్లిపాయ- ఒకటి, టొమాటో- ఒకటి, క్యారట్- ఒకటి, బీన్స్- ఐదు, పచ్చి బఠాణి- గుప్పెడు, అల్లంవెల్లుల్లి పేస్టు- ఒక టీ స్పూన్, పచ్చిమిర్చి- నాలుగు, జీలకర్ర- ఒక టీ స్పూన్, కరివేపాకు- రెండు రెమ్మలు, కొత్తిమీర తరుగు- ఒక టేబుల్‌స్పూన్, ఉప్పు- తగినంత, నూనె- నాలుగు టీ స్పూన్లు, పసుపు- అర టీ స్పూన్


తయారీ:  సామల బియ్యాన్ని కడిగి రెండున్నర గ్లాసుల నీరు పోసి పది నిమిషాల సేపు నానబెట్టాలి. ఉల్లిపాయ, క్యారట్, బీన్స్, పచ్చిమిర్చి, టొమాటోలను చిన్న ముక్కలుగా తరగాలి   ప్రెషర్ పాన్‌లో నూనె వేడి చేసి జీలకర్ర వేసి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిముక్కలు, కరివేపాకు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పది సెకన్లపాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి సన్నమంట మీద వేగనివ్వాలి. అవి మెత్తబడిన తర్వాత క్యారట్, బీన్స్, పచ్చిబఠాణి, పసుపు వేసి బాగా కలిసి మూత పెట్టి రెండు నిమిషాల సేపు ఉంచాలి


పైవన్నీ నూనెలో సన్నమంట మీద మగ్గిన తర్వాత సామబియ్యం నీటితోపాటు వేసి ఉప్పు కలిపి మూత పెట్టి మీడియం మంట మీద ఉడకనివ్వాలి. మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేయాలి. దీనిని నేరుగా బాణలిలో కూడా చేసుకోవచ్చు. అప్పుడు నీటి మోతాదు కొద్దిగా పెంచాలి. దించిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఈ కిచిడీకి ఆవకాయవంటి పచ్చళ్లు, పుదీన, వేరుశనగపప్పు చట్నీలు బాగుంటాయి.


గమనిక: బియ్యం ఉడికేటప్పుడు లవంగం, బిర్యానీ ఆకు వేసుకోవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement