
సాంకేతిక సాయంతో ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలతో సవాళ్లకు సమాధానమిస్తుంటారు శాస్త్రవేత్తలు. అలానే తాజాగా పరిశోధకులు సరికొత్త ప్రయోగంతో ఓ గొప్ప ఆవిష్కరణకు నాంది పలికారు. ఇంతవరకు జ్ఞానేంద్రియాలకు సంబంధించి క్లిష్టతరమైన ప్రయోగాల్లో ఎదురవ్వుతున్న సమస్యకు చెక్‌పెట్టేలా ముందడుగు శారు. ఈసారి ఏకంగా రుచిని గుర్తించే ఇ-నాలుక(E-Tongue)ను అభివృద్ధి చేశారు. రుచిని కోల్పోయిన వ్యక్తులకు ఈ ఆవిష్కరణ ఒక వరంగా ఉంటుందని చెబుతున్నారు కూడా. మరీ ఆ ఆవిష్కరణ విశేషాలేంటో చూద్దామా..!.
యిజెన్ జియా నేతృత్వంలోని ఒహియో స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఇ-టేస్ట్(E-Tongue) అనే నాలుక వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఆహార నమూనాలను విశ్లేషించడం తోపాటు రుచులను పాక్షికంగా గుర్తించలేనివారికి ఇది ఉపయోగాపడేలా రూపొందించారు. ఈ సాంకేతికత ప్రాథమిక అభిరుచికి అనుగుణంగా ఐదు కీలక రుచులను సులభంగా గుర్తిస్తుంది.
సోడియం క్లోరైడ్ (ఉప్పు), సిట్రిక్ ఆమ్లం (పుల్లని), గ్లూకోజ్ (తీపి), మెగ్నీషియం క్లోరైడ్ (చేదు), గ్లూటామేట్ (ఉమామి). ఈ ఐదు రుచులు మన రోజువారీ ఆహారంలో తప్పనిసరి ఉండేవే అని పరిశోధకుడు జియా చెబుతున్నారు. ఈ సరికొత్త ఎలక్ట్రానిక్ నాలుక ఇ టంగ్ కేక్, ఫిష్ సూప్ వంటి రుచులను గుర్తించగలదు. అయితే వాసనను ప్రభావితం చేసే రుచిని మాత్రం గుర్తించలేదు. ఇది ఇంకా వాసన ఆధారంగా రుచిని ఐడెంటిఫై చేయలేదని పరిశోధకులు తెలిపారు.
ఎలా వర్క్ చేస్తుందంటే..
ఆహారంలో రుచి భాగాల సాంద్రత గుర్తించడానికి ఇ-టేస్ట్ సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. డేటాను డిజిటల్ సిగ్నల్‌లుగా మారుస్తుంది. ఒక పంపు సాయంతో ఒక వ్యక్తి నాలుక కింద ఉన్న గొట్టం ద్వారా ఫ్లేవర్డ్ హైడ్రోజెల్‌లను కచ్చితమైన మొత్తంలో పంపిణీ చేస్తుంది. ముందుగా ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో టెస్ట్ చేయడానికి మొదట ఇది రుచులను ఎలా పునరుత్పత్తి చేస్తుందో అంచనా వేశారు.
ఆ తర్వాత పది మంది వ్యక్తుల్లో దీని సామర్థ్యాన్ని పరీక్షించగా.. కృత్రిమ రుచి ఒరిజనల్ రుచికి సమానంగా ఉందని చెప్పారు. ఆ తర్వాత నిమ్మరసం, కేక్, వేయించిన గుడ్డు, చేపల సూప్, కాఫీతో సహా సంక్లిష్ట రుచులను గుర్తించగలదో లేదో అని పరీక్షించారు. అయితే పరిశోధకులు ఆహారం ఫ్లేవర్ కంటే దాని రుచే ప్రధానమని చెబుతున్నారు. వాసన, రంగువంటి ఇంద్రియ అంశాలు ఆహారాన్నిఎలా గ్రహిస్తామనే దానిపై కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ఎందుకంటే ముక్కు, కళ్లు మూసుకుంటే స్ట్రాబెర్రీలు పుల్లగా అనిపిస్తాయట, అదే చూసి తింటే వాటి ఎరుపుదనం వల్ల తీపిదనంతో కూడిన అనుభూతి కలుగుతుందట. అందువల్ల తాము రూపొందించిన ఈ ఇ టేస్ట్ పులుపు, తీపి వంటి రుచులను చూడగలిగినా..మానవ నాలుకలా రుచిని పూర్తిగి ఆస్వాదింప చేయలేదని వెల్లడించారు పరిశోధకులు.
(చదవండి: పనిప్రదేశాల్లో పాలివ్వడాన్ని అవమానంగా చూడొద్దు: సుప్రీం కోర్టు)