తీగ లాగితే జ్యూస్ వచ్చింది
రుచిగా పాకుతుంది... ఆరోగ్యంగా అల్లుకుంటుంది... అందరి హృదయాలలో విస్తరిస్తుంది. నాలుకపై నాట్యమాడుతుంది... తీగలాగితే చాలు జ్యూస్ వస్తుంది... తీగకూరగాయలతో చేసిన జ్యూస్ స్పెషల్స్ ఇవి.
సొరకాయ జ్యూస్
కావల్సినవి: సొరకాయ – 1 (250 గ్రాములు); పుదీనా ఆకులు– 4–6; నీళ్లు – కప్పు; జీలకర్ర పొడి – టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత, అల్లం– చిన్నముక్క
తయారీ: సొరకాయను శుభ్రం చేసి, పైన తొక్క తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లం ముక్క వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో పుదీన, కొత్తిమీర ఆకులు వేయాలి. నిమ్మరసం వేయాలి. ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. దీంట్లో అర కప్పుడు నీళ్లు పోసి మరోసారి గుజ్జు మెత్తగా అయ్యేదాకా బ్లెండ్ చేయాలి. దీంట్లో మరికొన్ని నీళ్లు కలిపి, వడకట్టాలి. గ్లాసులో
పోసి సేవించాలి.
గుమ్మడికాయ జ్యూస్
కావల్సినవి: ఆప్రికాట్స్ – 10; నీళ్లు – ఒకటిన్నర కప్పు; యాపిల్ జ్యూస్ – 2 కప్పులు; దాల్చిన చెక్క – చిన్నముక్క; అల్లం – చిన్న ముక్క, నిమ్మరసం – టీ స్పూన్
తయారీ: గుమ్మడికాయ పై తొక్క నుంచి మెత్తటి ముక్కను వేరు చేయాలి. గింజలను తీసేయాలి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేయాలి. మిక్సర్ జార్‌లో వేసి బ్లెండ్ చేయాలి. దీనికి పంచదార/బెల్లం/తేనె/ యాపిల్ జ్యూస్ వాడచ్చు. దీంట్లో జాజికాయ పొడి, దాల్చిన చెక్క పొడి, అల్లం తరుగు, నిమ్మరసం కలపాలి. కూలింగ్ కావాలనుకునేవారు ఐస్ క్రష్ చేసి వేయాలి.
బీరకాయ జ్యూస్
కావల్సినవి: బీరకాయ – 1; పుదీనా ఆకులు – 4–6; నీళ్లు – కప్పు; జీలకర్ర పొడి – టీ స్పూన్; మిరియాల పొడి – అర టీ స్పూన్; నల్లుప్పు – తగినంత ఉప్పుకు బదులుగా తియ్యగా కావాలనుకునేవారు తేనె కలుపుకోవచ్చు.
తయారీ: బీరకాయను శుభ్రం చేసి, పైన తొక్క తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అల్లం ముక్క వేసి బ్లెండ్ చేయాలి. దీంట్లో పుదీన , కొత్తిమీర, నిమ్మరసం, నల్లుప్పు, మిరియాల పొడి వేసి మళ్లీ మెత్తగా బ్లెండ్ చేయాలి. దీంట్లో కప్పుడు నీళ్లు పోసి మరోసారి గుజ్జు మెత్తగా అయ్యేదాకా బ్లెండ్ చేయాలి. గ్లాసులో పోయాలి. చల్లగా కావాలనుకునేవారు ఐస్ క్రష్ చేసి కలుపుకోవచ్చు.
దొండకాయ జ్యూస్
కావల్సినవి: దొండకాయలు – 4; ఉసిరి ముక్కలు – 3; అల్లం – చిన్నముక్క; పుదీనా ఆకులు – 15; కొత్తిమీర తరుగు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత; నల్లుప్పు – తగినంత జీలకర్రపొడి – టేబుల్ స్పూన్; నిమ్మరసం – టీ స్పూన్ స్పూన్లు; ఐస్‌క్యూబ్స్ – తగినన్ని
తయారీ: దొండకాయలను శుభ్రం చేసి చిన్నముక్కలుగా కట్ చేయాలి. మిక్సర్‌జార్‌లో దొండకాయ ముక్కలు, అల్లం తరుగు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, జీలకర్ర పొడి వేసి బ్లెండ్ చేయాలి. దీనికి కప్పు నీళ్లు కలిపి వడకట్టాలి. దీంట్లో ఐస్‌క్యూబ్స్ వేసి అందించాలి.
దోసకాయ/కీరా జ్యూస్
కావల్సినవి: దోసకాయ/ కీరా – ఒకటి; జీలకర్ర పొడి – అర టీ స్పూన్; పుదీనా – 10; ఉప్పు – తగినంత; నిమ్మరసం – పావు టీ స్పూన్
తయారీ: దోసకాయ కడిగి, పై తొక్క తీసి ముక్కలు చేయాలి. ఈ ముక్కలను మిక్సర్‌జార్‌లో వేసి పుదీనా, జీలకర్రపొడి, ఉప్పు, నీళ్లు కలిపి బ్లెండ్ చేయాలి. దీంట్లో మరికొన్ని నీళ్లు కలిపి వడకట్టాలి. దీంట్లో పావు టీ స్పూన్ నిమ్మరసం కలిపి సర్వ్ చేయాలి. కూల్‌గా కావాలనుకునేవారు ఐస్‌క్యూబ్స్ వాడచ్చు.
కాకరకాయ జ్యూస్
కావల్సినవి:కాకరకాయలు – 5, నీళ్లు – గ్లాసుపసుపు – చిటికెడుఉప్పు – తగినంతనిమ్మరసం – టీ స్పూన్
తయారీ:కాకరకాయ పైన తొక్కను చెక్కేయాలి. మరీ ఎక్కువ కాకుండా పైన బొడిపెల్లా ఉన్నంత వరకు తీసేస్తే చాలు. సన్నని ముక్కలుగా కట్ చేయాలి. గ్లాసు నీళ్లలో కట్ చేసిన కాకర కాయముక్కలు, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసి కనీసం 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత వీటిని మిక్సర్‌జార్‌లో వేసి బ్లెండ్ చేసి, రసం పిండాలి. ఈ రసానికి నీళ్లు కలిపి, దీంట్లో నిమ్మరసం కలిపి సేవించాలి. అధికబరువు, మధుమేహం, ఆస్త్మా వంటి సమస్యలకు కాకరలోని ఔషధాలు అమోఘంగా పనిచేస్తాయి.