రోజూ గంటల తరబడి డెస్క్ జాబ్ చేసేవారికి నడుం నొప్పి, పోట్ట దగ్గర కొవ్వు పేరుకు పోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. వీటి నుంచి విముక్తికి ఈ వక్రాసనం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని ట్విస్టెడ్ పోజ్ అని కూడా అంటారు. పది నిమిషాలు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేసిన తర్వాత యోగాసనాలను సాధన చేయాలి.
వెన్నెముక బలంగా అవడానికి, మెడ నరాల పనితీరు మెరుగుదలకూ సహాయపడుతుంది. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. శ్వాస సమస్యలు తగ్గుతాయి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. రోజూ ఈ ఆసనాన్ని సాధన చేయడం వల్ల పోట్ట దగ్గరి కొవ్వు కరుగుతుంది.
నిటారుగా.. నిదానంగా!
విశ్రాంతిగా కూర్చొని ఒక కాలును పోట్ట దగ్గర నుంచి రెండవ కాలు మీదుగా తీసుకెళ్లి ఉంచాలి. చేతులను వ్యతిరేక దశలో ఉంచడంతో నడుము భాగం ట్విస్ట్ అవుతుంది. ఎడమచేతితో కుడికాలి పాదాన్ని పట్టుకోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచి, తలను భుజం మీదుగా సాధ్యమైనంత వెనుకకు తిప్పి, దాదాపు ఒక నిముషం పాటు ఆసనంలో ఉండాలి.
అనంతరం ఇదే విధంగా ఎడమ కాలితో కూడా చేసుకోవాలి. తర్వాత దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ ఎడమ చేత్తో కుడి మోకాలిని పోట్టవైపు నెడుతూ ఎడమ మోకాలిని పట్టుకోవాలి. ఈ ఆసనంలో ఉన్నప్పుడు ఐదు దీర్ఘశ్వాసలు తీసుకోవడం, వదలడం చేయాలి.
– జి.అనూషా కార్తీక్, యోగా గురు
Comments
Please login to add a commentAdd a comment