- అనంతపురం జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థుల చొరవ
- ‘తెలుగు కల్చరల్ అసోసియేషన్’ ఏర్పాటు
సాక్షి, బెంగళూరు : కన్నడ నాడులో తెలుగు సంస్కృతీ సౌరభాలను పరిమళింపజేయడంతో పాటు తెలుగు వారికి మాత్రమే సొంతమైన ప్రత్యేక కళలను పరిరక్షించేందుకు కొత్త వేదిక ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పుట్టిపెరిగి, అనంత పురం జేఎన్‌టీయూలో చదివి, బెంగళూరుతో పాటు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల్లో విభిన్న ఉద్యోగాల్లో ఉన్న పూర్వ విద్యార్థులు నగరంలో తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేశారు.
సంస్థ కార్యకలాపాలు శనివారం నుంచి ప్రారంభమైన సందర్భంగా వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఐటీఎస్ డెరైక్టర్ బ్రహ్మయ్య మాట్లాడుతూ...రాష్ట్రంలోని తెలుగు ప్రజలందరినీ సంస్కృతి పరమైన బంధంతో ఏకం చేయడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఇందులో భాగంగా రానున్న రోజుల్లో సంస్థ తరఫున కవితాగోష్టులు, కోలాటం, కూచిపూడి తదితర కళా ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న మూడు నెలల్లో సంస్థలో వెయ్యి మంది సభ్యులను చేర్పించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. సంస్థ తరఫున తెలుగు కళలు, సాంప్రదాయాలతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కళల పరిరక్షణకు కూడా పాటుపడతామని చెప్పారు.
తెలుగు కల్చరల్ అసోసియేషన్ కి రాష్ట్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరేందుకు త్వరలోనే రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఉమాశ్రీని సంస్థ సభ్యులు కలవనున్నారన్నారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక సభ్యులు ఎం.సి.ఎస్.రెడ్డి, డి.వి.జె.ఎస్.శ్రీధర్, హన్నన్, శ్రీధర్ గుప్తా, హరి తదితరులు పాల్గొన్నారు.