మహిళల సంతోషమే దేశానికి సంపద : శ్రీ శ్రీ రవిశంకర్ | Women happiness is the wealth Guru Ravi Shankar International Women Conference | Sakshi
Sakshi News home page

మహిళల సంతోషమే దేశానికి సంపద : శ్రీ శ్రీ రవిశంకర్

Published Mon, Feb 17 2025 6:28 PM | Last Updated on Mon, Feb 17 2025 6:48 PM

Women happiness is the wealth Guru Ravi Shankar International Women Conference

అడ్డంకులను ఛేదించి అనుబంధాలను పెంచే చర్చావేదికగా అంతర్జాతీయ మహిళా సదస్సు

"మహిళలు సంతోషంగా లేని దేశం, సమాజం పేదరికంలోనే ఉండిపోతాయి." - 10వ అంతర్జాతీయ మహిళా సదస్సుప్రారంభోపన్యాసంలో గురు రవి శంకర్‌

బెంగుళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంతర్జాతీయ కేంద్రం  10వ అంతర్జాతీయ మహిళా సదస్సు ఘనంగా జరిగింది. వివిధ రంగాలకు చెందిన మహిళలు  పాల్గొన్న ఈ సదస్సులో తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుని, శ్రేయస్సును అందుకునే దిశగా అడుగులు పడ్డాయి. సామాజిక, లౌకిక విషయాలపై లోతైన చర్చలు, ప్రగాఢమైన మానసిక విశ్రాంతి నిచ్చే అంతరంగ ప్రయాణాలు, వాటికి తోడుగా సాంస్కృతిక ప్రదర్శనలు కలగలిసి ఆహుతుల కోసం ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. 

బహ్రెయిన్‌కు చెందిన మహిళా సైనిక సైనికాధికారిణి, ఒక భారతీయ నటి, టర్కీదేశపు డిజిటల్, కృత్రిమ మేధ కళాకారుడు కలుసుకుని,మనస్సు, చైతన్యం - వీటిపై సృజనాత్మకత ప్రభావం గురించి చర్చించారు.

ప్రముఖ బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ, “నేను ఎదుగుతున్న దశలో కళలు నాకు ధ్యానాన్ని నేర్పాయి. అది సహజంగా జరిగిపోయింది. ఐతే నేను ఇక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే నా శక్తిసామర్థ్యాలలో చిత్రమైన మార్పును గమనించాను. ప్రజలు మంచిగా ఉంటూ, అందరి మంచినీ కోరుకున్నప్పుడే సృజనాత్మకత వృద్ధి చెందుతుంది.” అని అన్నారు

బహ్రెయిన్ సైనిక, క్రీడా విభాగాలకు అధిపతిగా పనిచేస్తున్న కుమారి నూరా అబ్దుల్లా మాట్లాడుతూ, “సైన్యంలో ఆజ్ఞలను పాటించడమే తప్ప సృజనాత్మకతకు తావు లేదు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ను చూసిన తర్వాత, మార్పును సృష్టించేందుకు స్వేచ్ఛ అవసరమని, నిజమైన సృజనాత్మకత సమాజాభివృద్ధికి ఉపయోగపడుతుందని నేను గ్రహించాను.” అన్నారు.

ఈ సదస్సుకు చోదకశక్తిగా ఉన్న చైర్ పర్సన్  భానుమతి నరసింహన్ మాట్లాడుతూ, మహిళల జీవితంలో విశ్రాంతి, పని మధ్య సమతుల్యత ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. “మహిళలుగా మనము మరింత ఎక్కువగా, మరింత త్వరగా సాధించాలనే ఆతృతలో ఉంటాము. నిజానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకున్నపుడే మీరు అనుకున్నవి సాధించగలరు. ఇది విశ్రాంతిగా, ప్రశాంతంగా ఉండేందుకు తగిన సమయం.” అని పేర్కొన్నారు.

 శ్రీ శ్రీ రవిశంకర్‌ 
180 దేశాలలో కోట్లాదిప్రజలకు అంతర్గత శాంతిని అందించడంలో ప్రపంచ శాంతి నాయకుడు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ పోషించిన పాత్రను ఈ సదస్సుకు హాజరైన పలువురు ప్రముఖులు కొనియాడారు. ఆధ్యాత్మిక విలువలను పరిరక్షించడంలో గురుదేవ్ పాత్రను ప్రశంసిస్తూ భారత రాష్ట్రపతి  ద్రౌపది ముర్ము, “భారతదేశం ఆధ్యాత్మిక దేశం, కానీ మారుతున్న కాలంతో మనం మన మూలాలకు దూరమవుతున్నాము. అందుకోసమే, మనం మరచిపోయిన విలువలను గుర్తుచేందుకు, మనకు స్ఫూర్తినిచ్చేందుకుగురుదేవ్ వంటి ఆధ్యాత్మిక నాయకులు ఇక్కడ ఉన్నారు.” అని అన్నారు.

ప్రతిష్టాత్మకమైన విశాలాక్షి అవార్డు అందుకున్న సందర్భంగా కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ, "ఒక సాధుపుంగవునికి జన్మనిచ్చిన తల్లి పేరు మీద అవార్డును అందుకోవడం కంటే గొప్ప బహుమతి మరొకటి లేదు." అని భావోద్వేగానికి గురయ్యారు.

జపాన్ మాజీ ప్రథమ మహిళ అకీ అబే మాట్లాడుతూ, హింసలేని ప్రపంచం కోసం గురుదేవ్ దృక్పథాన్నితన స్వీయ అనుభవంతో పోల్చి చూశారు. ఆమె భర్త, జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దుండగుని కాల్పులలో మరణించిన సంగతి విదితమే.“ప్రతి నేరస్థుడిలో ఒక బాధితుడు ఉంటాడని గురుదేవ్ చెప్పడం నేను విన్నాను. నా భర్త ప్రాణం తీసిన వ్యక్తిని ద్వేషించే బదులు, నేను కరుణించగలనా? అటువంటి హింస జరుగకుండా ఉండేందుకు నేను ఏమైనా సహాయం చేయగలనా? కేవలం నేరం జరిగిన తర్వాత బాధితులకు మద్దతిచ్చే సమాజం కంటే, నేరాలు తక్కువ జరిగే సమాజమే ఖచ్చితంగా మెరుగ్గా ఉంటుంది.” అని ఆమె అన్నారు.

సీతా చరితం: సాంస్కృతికదృశ్య వైభవం

ఈ 10వ అంతర్జాతీయ మహిళా సదస్సు కేవలం చర్చలు, ఆత్మపరిశీలనలకు మాత్రమే పరిమితం కాకుండా, సీతా చరితం అనే చక్కని రంగస్థల సాంస్కృతిక ప్రదర్శనకు, వేదికగా కూడా మారింది. భారతీయ కావ్యమైన రామాయణాన్ని ఏ షరతులూ లేని ప్రేమ, జ్ఞానం, ఆత్మస్థైర్యం, భక్తి, కరుణరసాల కలయికగా సీతాదేవి దృక్కోణం నుండి చూపే ప్రయత్నం ఇక్కడ జరిగింది.  500మంది కళాకారులు 30 విభిన్న సంగీత నృత్య రీతులను మేళవించి, దేశంలో మొట్టమొదటిసారిగా 4-డి సాంకేతికతను ఉపయోగించి చేసిన  సంగీత నృత్య రూపకం ప్రపంచం నలుమూలలనుండి హాజరైన ఆహుతులను మంత్రముగ్ధులను చేసింది.

కాలానికి అతీతంగా, మానవాళికి ఆదర్శంగా నిలచిన రామకథను ఈ ప్రదర్శన 190 దేశాలకు తీసుకువెళుతుంది. ఇంగ్లీషులో రూపొందించిన స్క్రిప్ట్ కోసం 20కి పైగా వివిధ భాషలు, సంస్కృతులలోని రామాయణాలను పరిశీలించారనీ, ఇది నిజమైన ప్రపంచ సాంస్కృతిక అనుభూతిని కలిగిస్తుందని నిర్వాహకులు తెలిపారు. 

సీతా చరితం నిర్మాణం వెనుక ఉన్న ప్రేరణ గురించి సృజనాత్మక దర్శకురాలు శ్రీవిద్యా వర్చస్వి మాట్లాడుతూ, “సీతమ్మవారి కథ పరివర్తకు ప్రతిబింబంగా నిలుస్తుంది. అంతే కాక, ఈ నాటకం, స్క్రిప్ట్, డైలాగ్‌లు అన్నీ గురుదేవుల జ్ఞానంతో నిండి ఉన్నాయి.” అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement