
కగక్కా గుబక్కా!
ఒకప్పుడు...రాత్రులు కథావేదికలయ్యేవి. ఆ కథల లోకంలో పిల్లలు ఎన్నో అద్భుతాలు చూసేవారు. అద్భుతాలు చేసేవారు. రాకుమారుడిగా మారి ఆకాశదేశంలో మాయా తివాచీపై గగన విహారం చేసేవారు.ఆకాశంలో చుక్కల్ని కోసుకొచ్చి పెరట్లోని మొక్కలకు బహుమానంగా ఇచ్చేవారు. ఎన్నో చేసేవారు. ఎన్నెన్నో చేసేవారు.
కాలం మారింది.
ఇప్పుడు ‘హోంవర్క్’లు, టీవీ ‘షో’లు తప్ప కథలు లేవు. ఆ కథలను వినిపించేవారూ లేరు. రకరకాల టీవీ కార్యక్రమాలు, సినిమాలు ఉన్నాయి కదా... పిల్లల్ని వినోదపరచడానికి ఏదైతే ఏంటీ అని సర్దిచెప్పుకోవడానికి లేదు. చూడడం కంటే వినడం, చదవడం ద్వారా పిల్లల్లో సృజనాత్మక శక్తులు వికసిస్తాయని మానసిక నిపుణులు చెబుతూనే ఉన్నారు.
‘అనగనగా...’ అని కథలు చెప్పే రోజులు ‘కల’గానే మిగిలిపోకూడదని, ఆ బంగారు రోజులు మళ్లీ రావాలనే ఆశయంతో పిల్లల కోసం మెట్రో సిటీ బెంగళూరులో ‘కగక్కా గుబక్కా’ను మొదలుపెట్టారు స్మృతి. ‘కగక్కా’ అంటే కాకి, ‘గుబక్కా’ అంటే పిచ్చుక.
మొదట తన ఆలోచనను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు స్మృతి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కాలేజీ విద్యార్థుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఉత్సాహవంతులైన కాలేజీ విద్యార్థులు, తల్లిదండ్రులతో కలసి ‘కగక్కా గుబక్కా’ పేరుతో బెంగళూరులో వివిధ ప్రాంతాల్లో ప్రతి వారం కథాపఠన సదస్సు నిర్వహిస్తున్నారు స్మృతి.
‘‘నేను ఉమ్మడి కుటుంబంలో పుట్టి పెరిగాను. రాత్రి అయితే చాలు పెద్దలు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని ఎన్నో కథలు వినిపించేవారు. ప్రతి సాయంత్రం ప్లేగ్రౌండ్‌కు వెళ్లి కొత్త కొత్త ఆటలు ఆడేవాళ్లం. ఇప్పుడు చాలామంది పిల్లలకు క్రికెట్ తప్ప మన సంప్రదాయ ఆటల గురించి ఏమీ తెలియదు. ఇప్పటి న్యూక్లియర్ కుటుంబాలలో ఆటలు ఆడేందుకు ప్లే గ్రౌండ్‌లు లేవు. కథలు చెప్పడానికి పెద్దలు లేరు. ఇది మంచి సూచన కాదు’’ అంటారు స్మృతి.ఒకప్పటి సృజనాత్మక వాతావరణాన్ని పునః పరిచయం చేయడానికి ‘కగక్కా గుబక్కా’కు శ్రీకారం చుట్టారు ఇంజనీరింగ్ చదివిన స్మృతి.
‘‘ఒకప్పుడు బహిరంగ ప్రదేశాలు ఎక్కువగా కనిపించేవి. బంధువులు ఎక్కువగా కనిపించేవారు. ఇరుగుపొరుగు బాగా కలిసిపోయేవాళ్లు. ఇప్పుడు ఎవరి లోకం వారిదై పోయింది. ఆ ఒంటరి లోకంలో కోల్పోతున్నదాన్ని ‘కగక్కా గుబక్కా’ తిరిగి తెచ్చివ్వాలనుకుంటుంది’’ అంటున్నారు స్మృతి.
సంప్రదాయ సంస్కృతుల మధ్య ఉన్న ఖాళీని పూరించడానికి ‘కగక్కా గుబక్కా’ పేరుతో ‘కథలు చెప్పడం’ ‘సంప్రదాయ ఆటలు ఆడడం’ అనేది నేటి తరం పిల్లలకు ఉపయోగపడు తుందని నమ్ముతున్నారు స్మృతి.
‘అక్బర్ బీర్బల్’ ‘తెనాలి రామలింగడు’ ‘పంచతంత్రం’ జాతక కథలతో పాటు మహాభారత కథలను కూడా సంప్రదాయ పద్ధతుల్లో పిల్లలకు చెప్పడానికి బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో స్టోరీ టెల్లింగ్ సెషన్‌లను నిర్వహిస్తుంది ‘కగక్కా గుబక్కా’
కథలు మాత్రమే కాకుండా కబడ్డీ, ఖోఖో, ఆవు–పులి, దాగుడు మూతలు, పులిజూదం... మొదలైన సంప్రదాయ ఆటలను పిల్లలకు నేర్పిస్తున్నారు. స్మృతి చేస్తున్న ప్రయత్నానికి పిల్లల నుంచి సానుకూల స్పందన వస్తుంది. ప్రతి సెషన్‌లో రెండు వందలకు పైగా పిల్లలు పాల్గొంటున్నారు. ఒక్కసారి పాల్గొన్న పిల్లలు మరోసారి పాల్గొనడానికి ఉత్సాహం చూపిస్తున్నారు.
‘‘ఈ స్టోరీ టెల్లింగ్ సెషన్‌లలో పాల్గొనడానికి ఎనిమిది సంవత్సరాల మా అబ్బాయి ఎంతో ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇప్పటి వరకు ఒక్క సెషన్ కూడా మిస్ కాలేదు. వారమంతా వీడియోగేమ్స్‌లో మునిగితేలే పిల్లలకు ఈ సెషన్స్ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. విలువైన మన సంస్కృతి, సంప్రదాయాల గురించి తెలుసుకోవడమే కాదు...ఫన్, ఫిజికల్ యాక్టివిటీ కూడా వీటి ద్వారా పెరుగుతుంది’’ అంటున్నారు ‘యాక్ట్ ఇండియా ఫౌండేషన్’ సభ్యురాలైన సుధా అభిరామ్.
కథలు, ఆటలతో పాటు ‘కోలాటం’లాంటి సంప్రదాయ నృత్యాలను కూడా నేర్పిస్తుంది కగక్కా గుబక్కా.కథల రూపంలోనో, ఆటల రూపంలోనో ప్రతి దేశానికి తనదైన ప్రత్యేక విలువ ఉంటుంది. ఆ విలువల గురించి భావితరానికి తప్పకుండా తెలియడానికి ‘కగక్కా గుబక్కా’లాంటి సంస్థలు మన దేశంలో మరిన్ని ముందుకు రావాలని ఆశిద్దాం.
స్టోరీ టెల్లింగ్ లాభాలు
నైతిక విలువల గురించి అవగాహన పెరుగుతుంది. సాంస్కృతిక మూలాల పరిచయం ఏర్పడుతుంది.భాష మీద పట్టు పెరుగుతుంది.ఏకాగ్రత పెరుగుతుంది.రకరకాల పాత్రల గురించి మనసులో ఊహించుకోవడం వల్ల ఊహాశక్తి పెరుగుతుంది.