
జీవితంలోని నిరాశ నిస్పృహలు ఎప్పటికీ అలాగే ఉండిపోవు. శోధించి, సాధించాలేగానీ సక్సెస్ మన పాదాక్రాంతమవుతుంది. దీనికి కావాల్సిందలా పట్టుదల, శ్రమ, ఓపిక. జీవితంలోని వైఫల్యాల్ని, కష్టాలనే ఒక్కో మెట్టుగా మలుచుకోవడం తెలియాలి. అంతేగానీ నాకే ఎందుకు ఇలా మానసికంగా కృంగిపోకూడదు. కాలేజీ క్యాంటీన్‌లో క్యాంటీన్‌లో గిన్నెలు కడగడం నుండి పెట్రోల్ పంపులో పని చేయడం వరకు. సంజిత్ కష్ట సమయాలను అధిగమించాడు. 40 మంది ఉద్యోగులతో కోట్లకు పడగలెత్తిన కాలేజీ డ్రాపవుట్ గురించి తెలిస్తే.. మీరు కూడా ఫిదా అవుతారు. బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా సక్సెస్ స్టోరీ తెలుసుకుందాం రండి.
బెంగళూరుకు చెందిన సంజిత్ కొండా (Sanjith Konda) మెల్‌బోర్న్‌లోని లా ట్రోబ్ విశ్వవిద్యాలయంలోని బుండూరా క్యాంపస్‌లో తన బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ స్టడీస్‌ను అభ్యసించడానికి ఆస్ట్రేలియాకు వెళ్లాడు జీవితంలో గొప్ప స్థానానికి ఎదగాలనే కలని సాకారం చేసుకునేందుకు ఇదో అవకాశంగా భావించాడు. కానీ అనుకున్నది అనుకున్నట్టు జరిగితే కిక్ ఏముంది అన్నట్టు కష్టాలు మొదలయ్యాయి. విశ్వవిద్యాలయ క్యాంటీన్‌లో పాత్రలు శుభ్రం చేశాడు. గ్యాస్ స్టేషన్లలో రాత్రి ఉద్యోగాలు చేశాడు. సెలవు రోజుల్లో గ్యాస్ స్టేషన్లలో పనిచేస్తూ వారానికి రూ. 33 వేలు సంపాదించేవాడు. విద్యార్థుల మండలి ఎన్నిక కావడంతో అతని జీవితం మరో మలుపుకు నాంది పలికింది.
2019లొ సంజిత్ స్టూడెంట్స్ యూనియన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. దీనికి గాను అతనికి రూ. 1.1 లక్షల స్టైఫండ్ వచ్చేది. ఈ సమయంలోనే విద్యార్థి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు. ఈవెంట్స్ ఉత్సవాలను నిర్వహించాడు. ఐదో సెమిస్టర్‌లో కళాశాల చదువు మానేసి సొంత వ్యాపారాన్ని స్థాపించాలనే ఆలోచన వచ్చింది. ఆస్ట్రేలియన్లు టీ, కాఫీలను ఇష్టంగా తాగుతారని గమనించాడు. పైగా తనకు చిన్నప్పటినుంచీ టీ అంటే ఇష్టం. ఈ క్రేజ్‌నే బిజినెస్‌గా మల్చుకున్నాడు. దీనికి మెల్‌బోర్న్‌లోని తన స్నేహితుడు అసర్ అహ్మద్ సయ్యద్‌తో చర్చించాడు. ఆరో సెమిస్టర్‌లో కాలేజీ నుంచి తప్పుకున్నాడు. ఎలిజబెత్ స్ట్రీట్‌లో 50 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తన మొదటి దుకాణాన్ని ప్రారంభించాడు. 'డ్రాపౌట్ చాయ్‌వాలా' గా సంజిత్ జర్నీ మొదలైంది. ప్రీతం అకు, అరుణ్ పి. సింగ్ అనే ఇద్దరు కళాశాల సీనియర్‌లను నియమించుకున్నాడు. అలా సంజిత్‌తో సహా కేవలం ఐదుగురు వ్యక్తులతో మరియు ఐదు రకాల చాయ్‌లతో ప్రారంభమైంది. మొదటి మూడు నెలలు అమ్మకాలు నెమ్మదిగా ఉన్నాయి. ఆ తరువాత ఉద్యోగులు, విద్యార్థులు ఆదరణతో బాగా పుంజుకుంది. ఒక్క ఏడాదిలోనే సంవత్సరంలోనే, చాయ్ ట్రక్‌తో సహా మరో రెండు ప్రదేశాల్లో తన షాపును ఓపెన్ చేశాడు. రకరకాల ప్లేవర్లను పరిచయం చేస్తూ ‘డ్రాపవుట్ చాయ్‌వాలా’ బాగా పాపులర్ అయ్యాడు. 40 మంది కార్మికులతో రూ. 5.57 కోట్లు టర్నోవర్ సాధించే స్థాయికి ఎదిగింది. ఫ్యూజన్ గ్రీన్ టీ, చాయ్‌పుచినో లాంటివాటితోపాటు, టోస్ట్, కుకీలు, బన్ మస్కా, బన్ మసాలా , వివిధ రకాల పేస్ట్రీలతో సహా తేలికపాటి స్నాక్స్‌ను కూడా అందిస్తుంది.
సంజిత్ తండ్రి ఒక మెకానికల్ ఇంజనీర్, అతను సౌదీ అరేబియా చమురు వ్యాపారంలో 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నాడు. సంజిత్ తల్లి గృహిణి. ఆమెకు ఇంటి పనుల్లో సాయ పడటం, తల్లి పాస్‌బుక్‌ను అప్‌డేట్‌కోసం బ్యాంకుకు వెళ్లడం, ఇంధన బిల్లు చెల్లించడం, ఇంటి అద్దె వసూలు లాంటి పనులతో అండగా నిలిచిన కొడుకు సక్సెస్‌తో సంజిత్ తల్లి చాలా సంతోషంగా ఉంది.
మూడేళ్ల సంబరం : డ్రాపౌట్ చాయ్‌వాలా ఇటీవల ముచ్చటగా మూడేళ్ల పండుగను పూర్తి చేసుకుంది. ఈ విజయం వెనుక అద్భుతమైన డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ బృందం ,సహోద్యోగులు ఉన్నారంటూ వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు సంజిత్.మీ అభిరుచి, కృషి, పట్టుదల, నమ్మకమే ఒక బ్రాండ్‌కు మించి ఎదిగిన కుటుంబం మనది అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు.