నేటి కాలంలో యువత ఉద్యోగం చేసేకన్నా వ్యాపారం చేయడమే ఉత్తమమని భావిస్తోంది. ఈ దిశగా అడుగులు వేస్తూ ముందుకు దూసుకుపోతోంది. ఈ కోవలో అమోఘమైన విజయాలు సాధించినవారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే అరూప్ కుమార్ ఘోష్. హైదరాబాద్‌లోని గుడిమాల్కాపూర్‌ను చూసిన ఆయన తన జీవితాన్నే పూలబాటగా మలచుకున్నారు.
కలలు సాకారమయ్యేందుకు..
పశ్చిమ బెంగాల్‌లోని కోలాఘాట్(Kolaghat)కు చెందిన అరూప్ కుమార్ ఘోష్ (33) కాలేజీ డ్రాపౌట్. అయితే ఆయన తన వ్యాపారంలో చూపిన అంకితభావం, కృషి అతనిని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయి. చాలామంది యువకులు కలలను కనడంవరకే పరిమితమైతే అరూప్ మాత్రం ఆ కలలను సాకారం చేసుకున్నాడు. ఒకప్పుడు రూ.3500 జీతానికి పనిచేసిన అరూప్ ఇప్పుడు భారీ స్థాయిలో పూల వ్యాపారం చేస్తున్నాడు. బంతి పూలు, వాటి విత్తనాలను విక్రయిస్తూ, తన వ్యాపార వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లను దాటించాడు. అయితే ఈ దిశగా సాగిన ప్రయాణంలో ఎన్నో ఒడిదుకులను ఎదుర్కొన్నాడు.
పూల దుకాణంలో పనికి కుదిరి..
అరూప్‌కి చిన్నప్పటి నుంచి పూలంటే ఎంతో ఆసక్తి ఉంది. అరూప్ కుటుంబం తొలుత వరి సాగు చేసేది. అయితే దాని నుండి వచ్చే సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది. ఇదే సమయంలో పూల వ్యాపారంలో అరూప్‌కు మంచి అవకాశాలు కనిపించాయి. దీంతో అరూప్ కళాశాల చదువును వదిలివేసి, పూల వ్యాపారం(Flower business)లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. తన 17 ఏళ్ల వయస్సులోనే పూల అమ్మకందారులతో కలసి పనిచేయడం మొదలుపెట్టాడు. పూల వ్యాపారం గురించి మరింత తెలుసుకునేందుకు హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌ను సందర్శించాడు. తరువాత నెలకు రూ.3,500 జీతం వచ్చేలా ఒక పూల దుకాణంలో పనికి కుదిరాడు. జీతం చాలా తక్కువే అయినప్పటికీ, పూల వ్యాపారం నేర్చుకునేందుకు మంచి అవకాశం వచ్చిందని అరూప్ భావించాడు. ఉద్యోగం చేస్తూ పూల వ్యాపారంలోని సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకున్నాడు.
ఆరంభంలో భారీ నష్టాలు
కొంతకాలం తరువాత అరూప్ కోలాఘాట్‌లోని తన ఇంటికి తిరిగి చేరుకున్నాడు. దేశంలోని వివిధ నగరాల్లోని పూల దుకాణాలకు బంతి పూలను విక్రయించడం మొదలుపెట్టాడు. మొదట్లో రూ.2000 నుంచి రూ.3000 వరకు లాభం వచ్చింది. దీంతో 2011లో కొంత భూమిని కౌలుకు తీసుకుని అరూప్ బంతిపూల సాగును ప్రారంభించాడు. ఆరంభంలో అరూప్ భారీ నష్టాలను చవిచూశాడు. తొలుత కోల్‌కతా రకం బంతి పూలు(Kolkata type marigolds) సాగుచేశాడు. ఆ పూలు చిన్నవిగా ఉండటంతో అమ్ముడుపోయేవికాదు. దీంతో అరూప్‌కు వ్యాపారంలో నష్టం వచ్చింది. అయినా అరూప్ నిరాశపడలేదు. 2011లో థాయ్ లాండ్ వెళ్లి మూడు నెలల పాటు అక్కడే ఉండి, పూల సాగులో మెళకువలు నేర్చుకున్నాడు. టెన్నిస్ బాల్ మేరిగోల్డ్ పూలు, వాటి విత్తనాలను ఉత్పత్తి చేసే సాంకేతికతను తెలుసుకున్నాడు. అక్కడి నుంచి ఒక్కో బంతిపూల రకానికి చెందిన విత్తనాలు తీసుకుని కోలాఘాట్‌కు చేరుకున్నాడు.
ఏటా రూ. 5 కోట్లకుపైగా ఆదాయం
థాయ్‌లాండ్ నుంచి తిరిగి వచ్చిన అరూప్ మరింత భూమిని లీజుకు తీసుకుని, అక్కడ టెన్నిస్ బాల్ రకం బంతి పూలను సాగుచేశాడు. కోలాఘాట్ మార్కెట్‌లో కిలో 100 రూపాయల చొప్పున బంతిపూలను విక్రయించాడు. డిమాండ్ పెరగడంతో బంతి పూల సాగును మరింతగా పెంచాడు. బంతిపూల విత్తనాలను కూడా అమ్మడం మొదలుపెట్టాడు. ఇప్పుడు అరూప్ బంతిపూలు, మొక్కలు, విత్తనాలను విక్రయించడం ద్వారా ఏటా రూ.5 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.
ఇది కూడా చదవండి: Paramahansa Yogananda: ‘ఒక యోగి ఆత్మకథ’తో ఆధ్యాత్మిక మార్గాన్ని చూపి..
Comments
Please login to add a commentAdd a comment