marigold
-
బంతీ.. చామంతీ.. ముద్దాడుకున్నాయిలే..!
పూలంటే ఇష్టం లేని వారు ఉండరు. అలాంటిది బంతి, చామంతి (chamanthi) పూలంటే మరీ ఇష్టం. అవే పూలు వివిధ రంగుల్లో ఉండి కనువిందు చేస్తే ఇక వారి ఆనందానికి హద్దే ఉండదు.ఇలాంటి ఫొటోలను చూసే కాబోలో ఓ సినీ రచయిత బంతీ.. చామంతీ ముద్దాడుకున్నాయిలే అంటూ చరణం కట్టినట్లున్నారు.బేతంచెర్ల (betamcherla) నుంచి కర్నూలుకు (Kurnool) వెళ్లే ప్రధాన రహదారిలో దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పూల తోటలు ప్రయాణికులను మంత్రముగ్దులను చేస్తున్నాయి.సీతారామాపురం, శంకలాపురం, బైనపల్లె, యంబాయి, మండ్ల వానిపల్లె, రుద్రవరం, ముద్దవరం, వీరాయపల్లె గ్రామాల రైతులు బోరుబావుల కింద బంతి, చేమంతి పూలు (chrysanthemum) సాగు చేశారు.సుమారు 300 ఎకరాల్లో సాగు చేసిన చేమంతి, బంతి పూల తోటలు కోత దశకు వచ్చాయి. కర్నూలు ప్రధాన రహదారి వెంట రాకపోకలు సాగించే ప్రయాణికులకు కొత్త ప్రాంతానికి వచ్చామా అనే అనుభూతిని కలిగిస్తున్నాయి.– బేతంచెర్ల -
బంతిపూలకు మాత్రమే ఆ ప్రత్యేకత.. అందుకే పూజల్లో వాడుతారు
వేడుక వచ్చిందంటే చాలు బంతిపూల తోరణాలతో ఇళ్లూ వాకిళ్లు కళకళలాడుతూ ఉంటాయి. బంతిపూలకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే బంతిని మనకు ప్రకృతి ఇచ్చిన బహుమతిగా చెప్పచ్చు. తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే భూమిలోని చీకట్లు తొలగి వెలుగు రేకలు అంతటా వ్యాపిస్తాయి. అదేవిధంగా, బంతిపువ్వును చూడగానే, మన మనస్సు తన బాధలను మరచిపోయి సంతోషిస్తుంది. ఈ సారూప్యత వల్ల బంతిపువ్వును సూర్యభగవానుడికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. గణేష్ చతుర్థి, నవరాత్రుల నుండి దీపావళి వరకు ఈ పూలకు చాలా డిమాండ్ ఉంది. మ్యారిగోల్డ్ శాస్త్రీయ నామం టాగెట్స్. భారతదేశానికి 350 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వారి రాకతో మెక్సికో నుండి చేరుకుంది బంతి. చాలా అందంగా కనిపించే పసుపు, కుంకుమ రంగులో ఉండే ఈ పువ్వులను అందరూ ఇష్టపడతారు. విస్తారంగా సాగు.. మన దేశంలో బంతిపూల సాగు పెద్ద ఎత్తున చేస్తుంటారు రైతులు. ఇది మతపరమైన ఆచారాలతో పాటు, అనేక ఉత్పత్తుల తయారీలలో కూడా ఉపయోగపడుతుంది. సీజన్‌ను బట్టి బంతి పువ్వులను సాగు చేస్తారు. ఇది ఏప్రిల్, మే నెలల్లో సాగును ప్రారంభిస్తే ఆగస్టు–సెప్టెంబర్లలో చలికాలం ప్రారంభమవడానికి ముందు పంట చేతికొస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా 50 రకాల బంతి పువ్వులు ఉన్నాయి, వాటిలో మూడు జాతులు వాణిజ్య, వ్యవసాయం కోసం పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల పొలాలు బంతి పువ్వులతో వెలిగిపోతుంటాయి. త్యాగానికి పేరు బంతి పువ్వు బృహస్పతికి ఇష్టమైనదిగా జ్యోతిష్యులు చెబుతుంటారు. దేవతల గురువు బృహస్పతిని బంతి పువ్వులతో పూజిస్తే జ్ఞానం పెంపొందుతుందని నమ్మకం. పసుపు–కుంకుమపువ్వును కలిపినట్టుగా ఉండే ఈ రంగు త్యాగానికి ప్రసిద్ధి చెందింది, మరోవైపు ఇది అగ్ని వంటి ఉగ్రమైన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రజల మొదటి ఎంపిక ప్రజలు తమ ఇళ్లను బంతి పువ్వులతో అలంకరిస్తారు. కోల్‌కతా నుంచి వచ్చే బంతిపూలలో ఒకటి ఎరుపు, మరొకటి పసుపు. ఈ రంగు పువ్వులను బసంతి మేరిగోల్డ్ అంటారు. ఇదే అన్ని చోట్ల జనం మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారు. బంతిపూలతో అందంగా మెరిసిపోవచ్చు బొబ్బలు, కాలిన గాయాలు, దురదలు, చర్మవ్యాధుల నివారణలో బంతి పువ్వులను ఉపయోగిస్తారని ఆయుర్వేదంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రక్తకణాలను ఉత్పత్తి చేసి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మార్చగలవు. బంతి పువ్వులు వాపునే కాదు అలసటను తగ్గించడానికి కషాయంలా కూడా ఉపయోగిస్తారు. బంతి పువ్వు పొడి ముడతలు పడిన చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. బంతి పువ్వులు సహజ యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడతాయి. అందమైన ప్రయోజనాలు బంతిపూలు యాంటీ బయొటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. మేరిగోల్డ్ ఫేస్ ప్యాక్ ముఖ చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు చర్మకాంతిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమలు, ముఖంపై మచ్చలు ఉన్నవారు బంతి పువ్వు ఫేస్ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు. అందుకే, సౌందర్య ఉత్పత్తులు, మసాజ్ నూనెలు, లోషన్లు, సబ్బులు.. మొదలైన ఉత్పత్తులలో బంతిపువ్వులను ఉపయోగిస్తారు. దీని ఉపయోగం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని నొప్పి, వాపును తగ్గించడానికి, పేగు, కడుపు రుగ్మతల నుండి ఉపశమనానికి, అల్సర్లను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. -
బంతిపూల సాగు ప్రయోజనకరంగా ఉంటుందంటున్న రైతులు..!
-
బంతి పూల సాగుతో..లాభాలు బాగు
-
12,638 వజ్రాలతో ఉంగరం
మీరట్: హైదరాబాద్‌కు చెందిన నగల వ్యాపారి కొట్టి శ్రీకాంత్ నెల క్రితమే 7,801 వజ్రాలు పొదిగిన ఉంగరం తయారు చేసి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన నగల దుకాణదారు ఆ రికార్డును బద్దలు కొట్టారు. మీరట్‌కు చెందిన హర్షిత్ బన్సాల్ ఏకంగా 12,638 వజ్రాలు పొదిగిన రింగ్‌ను తయారు చేశారు. 8 పొరలతో 165.45 గ్రాముల బరువున్న ఉంగరానికి మారిగోల్డ్ డైమండ్ రింగ్ అనే పేరు పెట్టారు. ఇది గిన్నిస్ ప్రపంచ రికార్డుల్లో స్థానం సంపాదించింది. రూపశిల్పి, 25 ఏళ్ల హర్షిత్ మాట్లాడుతూ.. ‘6,690 వజ్రాలతో తయారైన ఉంగరం గిన్నిస్ రికార్డుల్లో ఉన్నట్లు 2018లో తెలుసుకున్నాను. అనంతరం 2018లో మొదలుపెట్టిన ఈ బృహత్తర కార్యక్రమం చివరికి 2020 ఫిబ్రవరిలో ముగింపునకు వచ్చింది. గిన్నిస్ ప్రపంచ గుర్తింపు లభించింది. ఇలా భారీ సంఖ్యలో వజ్రాలు పొదిగిన ఉంగరాన్ని రూపొందించడం క్లిష్టమైన పనే’ అని చెప్పారు. ఉంగరం తయారీలో ఇంటర్నేషనల్ జెమాలజీ లేబొరేటరీ ధ్రువీకరించిన శుద్ధమైన వజ్రాలను వినియోగించినట్లు తెలిపారు. ‘రింగ్ డిజైన్‌పై చాలా కసరత్తు చేసి చివరికి మా పెరట్లోని మారిగోల్డ్ పుష్పం రూపం బాగా నచ్చింది. ఆ పువ్వు రేకులను పోలిన డిజైన్‌తో చేయాలని నిర్ణయిం చుకున్నాను. ఉంగరంలోని ఏ రెండు రేకులు కూడా ఒకేలా ఉండకపోవడం దీని ప్రత్యేకత. ఈ రింగ్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. అమ్మాలనుకోవడం లేదు. దీనిని నాతోనే ఉంచుకుంటాను’అని చెప్పారు. -
పని ‘గట్టు’కుని పండిస్తున్నారు..!
రాజ్యాలు పోయాయి. రాజులూ పోయారు. కానీ రాచరికపు ఆనవాలుగా బంతిపూలు ఇప్పటికీ ఆ ఊరి గడపన గుభాళిస్తున్నాయి. వందల ఏళ్లుగా బంతితో పెనవేసుకుపోయిన వారి అనుబంధం ఇంకా పచ్చగానే పరిఢవిల్లుతోంది. ఒకప్పుడు వ్రతాలు, పూజల కోసం పొలం గట్లపై బంతిపూలను సాగు చేసిన రెంటికోట గ్రామస్తులకు ఇప్పుడు అదే జీవనాధారమైంది. అంతరపంటగా బంతి సాగు చేస్తున్నా.. అసలు ఆదాయాన్ని ఈ పంటే తెచ్చి పెడుతోంది. అదెలాగంటే.. కాశీబుగ్గ : రాజ వంశీయులకు, కుటుంబాలకు కోటలో జరిగే పూజలకు, వ్రతాలకు వినియోగించే పూలను అందించే గ్రామంగా రెంటికోట రెండు వందల ఏళ్ల చరిత్రను కలిగి ఉంది. ఈ గ్రామంలో ఎటుచూసినా బంతిపూలే కనిపిస్తుంటాయి. పంటపొలాల్లో పండిస్తున్న పంటలకు ఎలాంటి ఆటంకం కలుగకుండా అంతర పంటగా బంతిని పండిస్తున్నారు. కార్తీక మాసంలో ప్రారంభించి సంక్రాంతి వెళ్లిన వరకు పూల సేకరణ కొనసాగిస్తారు. ఏ రోజుకు ఆరోజు చేతికందిన పూలను వివిధ ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్నారు. ఇంటి ఆవరణతోపాటు పంటపొలాలు, ఖాళీ స్థలాలను సైతం వినియోగిస్తుంటారు. ఏటా వివిధ రకాల మొక్కలతో పా టు బంతిపూలకు ప్రాధాన్యత ఇస్తూ నిరంతర ప్రక్రియగా పండిస్తున్నారు. ఒడిశా, ఆంధ్రా సరిహద్దుకు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ గ్రామంలో అధిక మంది ఒరియా వేషభాషలను పాటిస్తుంటారు. వీరంతా పలాస–కాశీబుగ్గ, మందస, గొప్పిలి, హరిపురం ప్రాంతాలకు పూలను తరలించి విక్రయిస్తుంటారు. అయ్యప్పస్వామి, భవానీ, శివ, గోవింద, శ్రీరా మ మాలలు వేసుకున్నవారే వీరి ప్రధాన కస్టమర్లు. పరిసర ప్రాంతాలలో ఎవరి ఇళ్లల్లో ఎలాంటి పూజా కార్యక్రమాలు చే సినా రెంటికోట గ్రామ బంతిపూలు ఉండాల్సిందే. ఆ మట్టితో విడదీయరాని బంధం.. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. ఇక్కడ విత్తనాలు ఎక్కడ చల్లినా మొక్కలవుతాయి. ప్రత్యేక సంరక్షణ అవసరం లేదు. బంతిపూలకైతే ప్రతి ఇంటి ఆవరణాన్ని వినియోగిస్తారు. సమీపంలోని తర్లాకోట రాజవారి కోటకు ఇక్కడి పూలను వినియోగించే వారని ప్రతీతి. పొలం గట్టును నమ్ముకుంటారు.. పొలాలను నమ్ముకుని పంటలను పండిస్తున్న రైతులను చూసి ఉంటాం గానీ పొలం గట్టును సైతం విడవకుండా అంతరపంటలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. సొంత పొలం లేకున్నా బంధువులు, మిత్రులకు సంబంధించిన పొలం గట్లపై అనుమతులు తీసుకుని బంతి మొక్కలను పెంచుతున్నారు. రోజుకు రూ.500 వరకు అమ్ముతాం వరి పంటలను పండిస్తున్న పంటతో సంబంధం లేకుండా బంతి పంటను పండిస్తాం. ఈ క్రమంలో సుమారు 300 మీటర్ల విస్తీర్ణంలో పంటను పండిస్తున్నాం. రోజుకు ఐదు వందల రూపాయలు వస్తుంది. ఒకోసారి వెయ్యి రెండు వేలు అమ్మిన సందర్భాలు ఉన్నాయి. పలాస, కాశీబుగ్గతో పాటు ఇతర పట్టణాల నుంచి స్వయంగా ఇంటికి వచ్చి మరీ కొనుగోలు చేస్తారు. – రంభ దొర, బంతిపూల సాగుచేసే మహిళా రైతు, రెంటికోట పరస్పరం పంటలకు రక్షణ.. రెంటికోట గ్రామంలో ఉన్న పంట పొలాల్లో బంగారం పండుతాయని చెప్పవచ్చు. ఇక్కడ మట్టి సారవంతమైనది. ఇక్కడ పంటలకు మధ్యలో ఉన్న గట్లపై బంతిని పెంచుతున్నాము. దీని ద్వారా పశువులు గట్లపైకి రావడానికి అవకాశం లేకుండా రక్షణగా ఉంటుంది. ఇదే క్రమంలో బంతి మొక్కలు పాడవకుండా వరిచేను రక్షణగా ఉంటుంది. గ్రామంలో వందల మంది మహిళలు పురుషులతో సంబంధం లేకుండా వీటిని పండిస్తారు. – పుచ్చకాయల కుమారి, మహిళారైతు, రెంటికోట -
విరగబూసిన పూలు.. విలపిస్తున్న రైతులు !
- గుచ్చుకుంటున్న గులాబీ – కంటతడి పెట్టిస్తున్న కనకాంబరం – లొల్లి చేస్తున్న లిల్లీ – బాధపెడుతున్న బంతి – ధరలు లేక అల్లాడుతున్న రైతులు తాడేపల్లి రూరల్ : ‘గులాబీలు గుచ్చుకుంటున్నాయి. కనకాంబరాలు కంటతడి పెట్టిస్తున్నాయి. లిల్లీ పూలు లొల్లి చేస్తున్నాయి. బంతి పూలు సైతం బాధపెడుతున్నాయి. అసలు ఈ సంవత్సరం పూలు ఎందుకు సాగు చేశామురా.. దేవుడా..’ అంటూ రైతులు కన్నీరుపెడుతున్నారు. తాడేపల్లి, ఉండవల్లి, పెనుమాక, కుంచనపల్లి, మెల్లెంపూడి, వడ్డేశ్వరం తదితర ప్రాంతాల్లో రైతులు అధికంగా పూలు సాగు చేస్తున్నారు. ఈ ఏడాది పూలు విరగబూశాయి. అయితే గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. ధర కన్నా కూలి ఎక్కువ ! – మార్కెట్లో దళారులు రైతుల నుంచి వంద గులాబీ పూలను ఐదు రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. రైతు మాత్రం ఉదయం ఐదు నుంచి తొమ్మిది గంటల వరకు పూలు కోసిన ఒక్కో మహిళకు రూ.80 ఇవ్వాల్సి వస్తోంది. గులాబీ రేటు తలుచుకుంటేనే గుండెల్లో ముళ్లు గుచ్చుకుంటున్నాయని రైతులు వాపోతున్నారు. – కనకాంబరాలు ధర చెబితేనే కంటనీరు పెట్టుకుంటున్నాడు. కేజీ కనకాంబరాలు రైతుల వద్ద నుంచి రూ.60లకు కొనుగోలు చేస్తున్నారు. పూలు కోయించినందుకు కూలీ మాత్రం రూ.100 చెల్లించాల్సి వస్తోంది. – కిలో లిల్లీ పూలు రూ. 20, బంతిపూలు రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు తోటను తీసేయలేక, పూలను పారబోయలేక రైతులు సతమతమవుతున్నారు. రేటు వచ్చేవరకు కోయకుండా ఉంచితే తోట పూర్తిగా పాడవుతుందని చెబుతున్నారు. కూలీలు, పెట్టుబడి ఖర్చులు కూడా రావడంలేదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. కర్ణాటక నుంచి పూల దిగుమతి వల్లే.. ధరలు అనూహ్యంగా తగ్గడానికి కర్ణాటక నుంచి అధికంగా పూలు మార్కెట్‌కు రావడమేనని వ్యాపారులు చెబుతున్నారు. తాము రైతుల వద్ద పూలు కొనుగోలు చేసినా.. విక్రయించలేక రెండురోజుల్లో చెత్తకుండీల్లో పడేయాల్సి వస్తోందని తెలిపారు. -
పుష్పవిలాపం!
పతనమైన పూల ధరలు గిట్టుబాటుకాక తోటలోనే వదిలేస్తున్న రైతులు మార్కెట్లోనే పారబోస్తున్న వైనం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బతుకు ‘పూల’బాటేనని భావించిన రైతాంగానికి ఈ ఏడాది నష్టాల మూటే మిగిలింది. మార్కెట్లో ఒక్కసారిగా ధరల పతనం కావడం.. అకాల వర్షాలు పంటను ముంచేశాయి. దీంతో రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు పూలసాగు విస్తీర్ణం పెరగడం.. దిగుబడి గణనీయంగా ఉండడం ధరల పతనానికి కారణంగా కనిపిస్తోంది. ఈ సీజన్లో ఏ రకం పూలకయినా డిమాండ్ బాగా ఉండేది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 10 వేల ఎకరాల్లో చామంతి, బంతి, గులాబీ, కనకాంబర పూల తోటలు సాగవుతున్నాయి. నగర శివారు మండలాలైన శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల, శంకర్పల్లి, మహేశ్వరం, కందుకూరులో పూల పంట విరివిగా సాగుతోంది. ఇక్కడి నుంచి గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌ను ఉత్పత్తులను తరలిస్తారు. ముహూర్తం కుదరక.. సాధారణంగా సంక్రాంతి నుంచి జూన్ వరకు మంచి ముహూర్తాలతో వివాహాలు, శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి. ఈ సీజన్‌ను దృష్టిలో పెట్టుకున్న రైతులు పుష్పాల సాగు చేపడతారు. గతేడాది చివర్లో అధికమాసం కారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాదిపై గంపెడాశలు పెట్టుకుని పూల రైతులు సాగు విస్తీర్ణాన్ని పెంచారు. చాందిని, బంతి, చామంతి తదితర పుష్పజాతులను వేశారు. జిల్లాలో రైతులు సాగు చేసిన పూబంతులతోపాటు కర్ణాటక నుంచి సుమాలు గుడిమల్కాపూర్ మార్కెట్‌ను ముంచెత్తుతుండడంతో ధరలు పడిపోయాయి. కొనేవారు లేక రైతులు మార్కెట్లోనే పారబోసి వెళుతున్నారు. పూల కట్ట ధర రూ.10:ఇంట్లో జరిగే చిన్నపాటి శుభకార్యం మొదలు పెళ్లి మండపాల వరకు ఎక్కువగా జర్బరా, కార్నేషన్ పూలను అలంకరణ కోసం వాడుతున్నారు. ఈ సారి వీటి ధరలు నేల చూపులు చూస్తుండడంతో ఈ పూల సాగు చేపట్టిన రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సాధారణంగా ఈ సీజన్లో పది పూల కట్ట ధర రూ.50 నుంచి రూ.100 పలుకుతుంది. ఇవి ప్రస్తుతం పది రూపాయలకే అమ్ముడుపోతున్నాయి. అకాల వర్షాలతో అపార న ష్టం: అర ఎకరంలో హైబ్రీడ్ బంతి సాగుకు రూ.30 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు లేక ఆదాయం రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ముహుర్తాల రోజున కొంత ధరలు పలుకుతుండగా మిగతా రోజుల్లో రైతుల పూలను మార్కెట్లో పారబోసి వెళ్తున్నారు. వారం రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలు పూల పంటలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడి 30 వేలు అయింది అర ఎకరంలో హైబ్రిడ్ బంతి సాగు చేశా. విత్తనాలు, కూలీలు, మందుల ఖర్చు రూ. 30 వేలు అయింది. ఇప్పటి వరకు పూలు అమ్మితే కేవలం రూ.2 వేలు వచ్చాయి. చేనులో నిండుగా పూలున్నాయి. ఏమి చేయాలో అర్థం కావడంలేదు. - తూర్పు జగన్‌రెడ్డి, అమ్డాపూర్ కూలీ ఖర్చులు రావడంలేదు.. పూలకు ధరలు లేక చాలా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్కోసారి పూలు అమ్ముడుపోకుంటే మార్కెట్లోనే పారబోసి వస్తున్నాం. అర ఎకరంలో చాందిని సాగుచేస్తే కిలో రూ.10కి కూడా ఎవరూ అడగడంలేదు. వర్షాలకు పంట దెబ్బతిన్నది. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవు. - కట్కూరి శ్రీశైలంగౌడ్, కె.బి.దొడ్డి, డిమాండ్ కంటే ఎక్కువ పంట డిమాండ్ కంటే ఎక్కువ దిగుబడి రావడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు చాందిని, బంతి పూల వాడకం తగ్గింది. జర్బరా, కార్నేషన్ పూల సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి బాగా ఉండడంతో ధరలు లేవు. - బూర్గు మహిపాల్‌రెడ్డి, వ్యాపారి,గుడిమల్కాపూర్ పూల మార్కెట్ ఒడిదుడుకులు సహజమే... ఇటీవల భారీగా పెరిగిన సాగు విస్తీర్ణంతో పూల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే, అంతమాత్రాన దిగాలు పడాల్సిన పనిలేదు. వారం రోజుల్లో ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశముంది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో శుభకార్యాలు కూడా ఈ మధ్యకాలంలో తక్కువగా జరుగుతున్నాయి. రైతులు కుంగిపోవాల్సిన అవసరంలేదు. జూలై వరకు పూలకు గిరాకీ ఉంటుంది. - వేణుగోపాల్,జిల్లా ఉద్యానశాఖ సహాయసంచాలకులు