బంతిపూలకు మాత్రమే ఆ ప్రత్యేకత.. అందుకే పూజల్లో వాడుతారు | Significance Of Marigold Flowers In Rituals And Festivals | Sakshi
Sakshi News home page

వేడుక ఏదైనా బంతిపూలు ఉండాల్సిందే.. ఎందుకంత ప్రత్యేకతో తెలుసా?

Published Sat, Nov 11 2023 10:19 AM | Last Updated on Sat, Nov 11 2023 10:35 AM

Significance Of Marigold Flowers In Rituals And Festivals - Sakshi

వేడుక వచ్చిందంటే చాలు బంతిపూల తోరణాలతో ఇళ్లూ వాకిళ్లు కళకళలాడుతూ ఉంటాయి. బంతిపూలకు మాత్రమే ఈ ప్రత్యేకత ఉంది. అందానికి, ఆరోగ్యానికి మేలు చేసే బంతిని మనకు ప్రకృతి ఇచ్చిన బహుమతిగా చెప్పచ్చు.  

తెల్లవారుజామున సూర్యుడు ఉదయించగానే భూమిలోని చీకట్లు తొలగి వెలుగు రేకలు అంతటా వ్యాపిస్తాయి. అదేవిధంగా, బంతిపువ్వును చూడగానే, మన మనస్సు తన బాధలను మరచిపోయి సంతోషిస్తుంది. ఈ సారూప్యత వల్ల బంతిపువ్వును సూర్యభగవానుడికి చిహ్నంగా చెప్పుకోవచ్చు. గణేష్‌ చతుర్థి, నవరాత్రుల నుండి దీపావళి వరకు ఈ పూలకు చాలా డిమాండ్‌ ఉంది. మ్యారిగోల్డ్‌ శాస్త్రీయ నామం టాగెట్స్‌. భారతదేశానికి 350 సంవత్సరాల క్రితం పోర్చుగీసు వారి రాకతో మెక్సికో నుండి చేరుకుంది బంతి. చాలా అందంగా కనిపించే పసుపు, కుంకుమ రంగులో ఉండే ఈ పువ్వులను అందరూ ఇష్టపడతారు.

విస్తారంగా సాగు.. 
మన దేశంలో బంతిపూల సాగు పెద్ద ఎత్తున చేస్తుంటారు రైతులు. ఇది మతపరమైన ఆచారాలతో పాటు, అనేక ఉత్పత్తుల తయారీలలో కూడా ఉపయోగపడుతుంది. సీజన్‌ను బట్టి బంతి పువ్వులను సాగు చేస్తారు. ఇది ఏప్రిల్, మే నెలల్లో సాగును ప్రారంభిస్తే ఆగస్టు–సెప్టెంబర్‌లలో చలికాలం ప్రారంభమవడానికి ముందు పంట చేతికొస్తుంది. 

ఈ రాష్ట్రాల్లో ఎక్కువ
ప్రపంచవ్యాప్తంగా 50 రకాల బంతి పువ్వులు ఉన్నాయి, వాటిలో మూడు జాతులు వాణిజ్య, వ్యవసాయం కోసం పెరుగుతాయి. ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల పొలాలు బంతి పువ్వులతో వెలిగిపోతుంటాయి.

 

త్యాగానికి పేరు బంతి పువ్వు 
బృహస్పతికి ఇష్టమైనదిగా జ్యోతిష్యులు చెబుతుంటారు. దేవతల గురువు బృహస్పతిని బంతి పువ్వులతో పూజిస్తే జ్ఞానం పెంపొందుతుందని నమ్మకం. పసుపు–కుంకుమపువ్వును కలిపినట్టుగా ఉండే ఈ రంగు త్యాగానికి ప్రసిద్ధి చెందింది, మరోవైపు ఇది అగ్ని వంటి ఉగ్రమైన వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తుంది. 

ప్రజల మొదటి ఎంపిక
ప్రజలు తమ ఇళ్లను బంతి పువ్వులతో అలంకరిస్తారు. కోల్‌కతా నుంచి వచ్చే బంతిపూలలో ఒకటి ఎరుపు, మరొకటి పసుపు. ఈ రంగు పువ్వులను బసంతి మేరిగోల్డ్‌ అంటారు. ఇదే అన్ని చోట్ల జనం మొదటి ఎంపికగా ఎంచుకుంటున్నారు. 

బంతిపూలతో అందంగా మెరిసిపోవచ్చు
బొబ్బలు, కాలిన గాయాలు, దురదలు, చర్మవ్యాధుల నివారణలో బంతి పువ్వులను ఉపయోగిస్తారని ఆయుర్వేదంలో ఉంది. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు రక్తకణాలను ఉత్పత్తి చేసి చర్మాన్ని మృదువుగా, ఆరోగ్యంగా మార్చగలవు. బంతి పువ్వులు వాపునే కాదు అలసటను తగ్గించడానికి కషాయంలా కూడా ఉపయోగిస్తారు. బంతి పువ్వు పొడి ముడతలు పడిన చర్మాన్ని మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. బంతి పువ్వులు సహజ యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి కాలుష్యం నుండి చర్మాన్ని కాపాడతాయి.

అందమైన ప్రయోజనాలు
బంతిపూలు యాంటీ బయొటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను కలిగి ఉంటాయి. మేరిగోల్డ్‌ ఫేస్‌ ప్యాక్‌ ముఖ చర్మాన్ని బిగుతుగా చేయడంతో పాటు చర్మకాంతిని పెంచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. మొటిమలు, ముఖంపై మచ్చలు ఉన్నవారు బంతి పువ్వు ఫేస్‌ ప్యాక్‌ని ఉపయోగించవచ్చు.

అందుకే, సౌందర్య ఉత్పత్తులు, మసాజ్‌ నూనెలు, లోషన్లు, సబ్బులు.. మొదలైన ఉత్పత్తులలో బంతిపువ్వులను ఉపయోగిస్తారు.  దీని ఉపయోగం శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. దీన్ని నొప్పి, వాపును తగ్గించడానికి, పేగు, కడుపు రుగ్మతల నుండి ఉపశమనానికి, అల్సర్లను నయం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement