పుష్పవిలాపం!
- పతనమైన పూల ధరలు
- గిట్టుబాటుకాక తోటలోనే వదిలేస్తున్న రైతులు
- మార్కెట్‌లోనే పారబోస్తున్న వైనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బతుకు ‘పూల’బాటేనని భావించిన రైతాంగానికి ఈ ఏడాది నష్టాల మూటే మిగిలింది. మార్కెట్‌లో ఒక్కసారిగా ధరల పతనం కావడం.. అకాల వర్షాలు పంటను ముంచేశాయి. దీంతో రైతులు కష్టాల్లో కూరుకుపోయారు. ఒకవైపు పూలసాగు విస్తీర్ణం పెరగడం.. దిగుబడి గణనీయంగా ఉండడం ధరల పతనానికి కారణంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో ఏ రకం పూలకయినా డిమాండ్ బాగా ఉండేది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు తలకిందులయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 10 వేల ఎకరాల్లో చామంతి, బంతి, గులాబీ, కనకాంబర పూల తోటలు సాగవుతున్నాయి. నగర శివారు మండలాలైన శంషాబాద్, మొయినాబాద్, షాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, మహేశ్వరం, కందుకూరులో పూల పంట విరివిగా సాగుతోంది. ఇక్కడి నుంచి గుడిమల్కాపూర్ పూల మార్కెట్‌ను ఉత్పత్తులను తరలిస్తారు.
ముహూర్తం కుదరక..
సాధారణంగా సంక్రాంతి నుంచి జూన్ వరకు మంచి ముహూర్తాలతో వివాహాలు, శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతుంటాయి. ఈ సీజన్‌ను దృష్టిలో పెట్టుకున్న రైతులు పుష్పాల సాగు చేపడతారు. గతేడాది చివర్లో అధికమాసం కారణంగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ క్రమంలో ప్రస్తుత ఏడాదిపై గంపెడాశలు పెట్టుకుని పూల రైతులు సాగు విస్తీర్ణాన్ని పెంచారు. చాందిని, బంతి, చామంతి తదితర పుష్పజాతులను వేశారు. జిల్లాలో రైతులు సాగు చేసిన పూబంతులతోపాటు కర్ణాటక నుంచి సుమాలు గుడిమల్కాపూర్ మార్కెట్‌ను ముంచెత్తుతుండడంతో ధరలు పడిపోయాయి. కొనేవారు లేక రైతులు మార్కెట్లోనే పారబోసి వెళుతున్నారు.
పూల కట్ట ధర రూ.10:ఇంట్లో జరిగే చిన్నపాటి శుభకార్యం మొదలు పెళ్లి మండపాల వరకు ఎక్కువగా జర్బరా, కార్నేషన్ పూలను అలంకరణ కోసం వాడుతున్నారు. ఈ సారి వీటి ధరలు నేల చూపులు చూస్తుండడంతో ఈ పూల సాగు చేపట్టిన రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. సాధారణంగా ఈ సీజన్‌లో పది పూల కట్ట ధర రూ.50 నుంచి రూ.100 పలుకుతుంది. ఇవి ప్రస్తుతం పది రూపాయలకే అమ్ముడుపోతున్నాయి.
అకాల వర్షాలతో అపార న ష్టం: అర ఎకరంలో హైబ్రీడ్ బంతి సాగుకు రూ.30 వేలు ఖర్చు చేయాల్సి వస్తుంది. దిగుబడి ఆశాజనకంగా ఉన్నా గిట్టుబాటు ధరలు లేక ఆదాయం రావడంలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ముహుర్తాల రోజున కొంత ధరలు పలుకుతుండగా మిగతా రోజుల్లో రైతుల పూలను మార్కెట్లో పారబోసి వెళ్తున్నారు. వారం రోజుల నుంచి అడపాదడపా కురుస్తున్న అకాల వర్షాలు పూల పంటలపై తీవ్రప్రభావం చూపుతున్నాయి.
పెట్టుబడి 30 వేలు అయింది
అర ఎకరంలో హైబ్రిడ్ బంతి సాగు చేశా. విత్తనాలు, కూలీలు, మందుల ఖర్చు రూ. 30 వేలు అయింది. ఇప్పటి వరకు పూలు అమ్మితే కేవలం రూ.2 వేలు వచ్చాయి. చేనులో నిండుగా పూలున్నాయి. ఏమి చేయాలో అర్థం కావడంలేదు.
- తూర్పు జగన్‌రెడ్డి, అమ్డాపూర్
కూలీ ఖర్చులు రావడంలేదు..
పూలకు ధరలు లేక చాలా నష్టపోవాల్సి వస్తోంది. ఒక్కోసారి పూలు అమ్ముడుపోకుంటే మార్కెట్లోనే పారబోసి వస్తున్నాం. అర ఎకరంలో చాందిని సాగుచేస్తే కిలో రూ.10కి కూడా ఎవరూ అడగడంలేదు. వర్షాలకు పంట దెబ్బతిన్నది. పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవు.
- కట్కూరి శ్రీశైలంగౌడ్, కె.బి.దొడ్డి,
డిమాండ్ కంటే ఎక్కువ పంట
డిమాండ్ కంటే ఎక్కువ దిగుబడి రావడంతోనే ఈ పరిస్థితి నెలకొంది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు చాందిని, బంతి పూల వాడకం తగ్గింది. జర్బరా, కార్నేషన్ పూల సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి బాగా ఉండడంతో ధరలు లేవు.
- బూర్గు మహిపాల్‌రెడ్డి, వ్యాపారి,గుడిమల్కాపూర్ పూల మార్కెట్
ఒడిదుడుకులు సహజమే...
ఇటీవల భారీగా పెరిగిన సాగు విస్తీర్ణంతో పూల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అయితే, అంతమాత్రాన దిగాలు పడాల్సిన పనిలేదు. వారం రోజుల్లో ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశముంది. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. అదే సమయంలో శుభకార్యాలు కూడా ఈ మధ్యకాలంలో తక్కువగా జరుగుతున్నాయి. రైతులు కుంగిపోవాల్సిన అవసరంలేదు. జూలై వరకు పూలకు గిరాకీ ఉంటుంది.
- వేణుగోపాల్,జిల్లా ఉద్యానశాఖ
సహాయసంచాలకులు