అతడు సత్యవంతుడు | Heart touching story of Vijay Mandal, Bhagalpur, Bihar | Sakshi
Sakshi News home page

అతడు సత్యవంతుడు

Published Thu, Feb 27 2025 12:52 AM | Last Updated on Thu, Feb 27 2025 12:52 AM

Heart touching story of Vijay Mandal, Bhagalpur, Bihar

అనుబంధం

సత్యవంతుడి కోసం సావిత్రి యముడితో పోరాడింది... నేను నా భార్యకోసం సత్యవంతుడిలా పోరాడుతున్నాను... అంటున్నాడు విజయ్‌ మండల్‌.

గత నాలుగేళ్లుగా ఇతను భార్యకు 24 గంటల్లో కావలసిన 3 ఆక్సిజన్‌ సిలిండర్లను రోజూ భుజంపై మోస్తున్నాడు. ఇందుకోసం సిలిండర్‌తో రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తాడు. అలుపు లేదు. ఆగిందీ లేదు. బిహార్‌ భాగల్‌పూర్‌కు చెందిన ఈ భర్తకు  భార్య కన్నీటి కృతజ్ఞత తెలుపుతుంటోంది.  నేటి ఉలిక్కిపడే వార్తల మధ్య 
ఈ అనుబంధం ఎంతో ఆదర్శం.

భర్త కోసం భార్యలు పోరాడిన గాథలు ఉన్నాయి. కాని భార్య కోసం భర్తలు చేసే త్యాగాలు లోకం దృష్టికి రావడం తక్కువ. కాని విజయ్‌ మండల్‌ కథ విస్మరించను వీలు కానిది. ఒక మనిషి నిజమైన హృదయంతో పూనుకుంటే తప్ప ఇలాంటి ఘనకార్యాన్ని, ఘనమైన సేవను చేయలేడు. బిహార్‌లోనే ఇటువంటి భర్తలు ఉన్నారేమో. గతంలో దశరథ్‌ మాంఝీ అనే అతను తన భార్యకు సమయానికి వైద్యం అందనివ్వకుండా అడ్డుగా నిలిచిన కొండను ఒక్కడే తొలిచి, దారి వేసి ‘మౌంటెన్‌ మేన్‌’ అనిపించుకున్నాడు. కరోనా తర్వాత రోగగ్రస్త అయిన భార్య కోసం నాలుగేళ్లుగా పట్టుదలగా ఆక్సిజన్‌ సిలిండర్లు మోస్తున్న విజయ్‌ మండల్‌ను ‘ఆక్సిజన్‌ మేన్‌’ అనొచ్చేమో.

భాగల్‌పూర్‌ నుంచి
విజయ్‌ మండల్‌ది బిహార్‌లోని భాగల్‌పూర్‌కు దగ్గరలోని కహల్‌గావ్‌. ఇక్కడ అతను చిన్న కిరాణా షాపు నడిపేవాడు. భార్య అనితాదేవికి 2021లో కరోనా సోకింది. పరిస్థితి చాలా సీరియస్‌ అయ్యింది. భార్యను బతికించుకోవడానికి విజయ్‌ మండల్‌ చేయని ప్రయత్నం లేదు. కూతురి పెళ్లి కోసం దాచిన 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. చివరకు ఢిల్లీ ఎయిమ్స్‌కు కూడా తీసుకెళ్లారు.

 వాళ్లు ఆమెను చేర్చుకొని అన్ని విధాలా వైద్యం చేసి చివరకు ‘ఈమె ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకోవు. బతికి ఉన్నంత కాలం ఆక్సిజన్‌ మీద బతకాల్సిందే’ అని చెప్పి ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ ఇచ్చి పంపారు. అది సంవత్సరంలో చెడిపోయింది. ఇంకోటి కొన్నా దాని పరిస్థితీ అంతే. దాంతో స్థానికంగా దొరికే ఆక్సిజన్‌ సిలిండర్లే మేలని వాటితో భార్యను బతికించుకోవాలని విజయ్‌ మండల్‌ నిశ్చయించుకున్నాడు.

ఉదయాన్నే 4 గంటలకు లేచి
ఒక్కో సిలిండర్‌ 8 గంటలు వస్తుంది. అందుకే ఖాళీ అయిన దానిని వెంటనే ఇచ్చి నిండింది తెచ్చుకోవాలి. విజయ్‌ మండల్‌ దినచర్య ఇలా ఉంటుంది. అతడు తన ఊరు రసల్‌పూర్‌ నుంచి తెల్లవారుజాము 4 గంటలకు లేచి ఐదు కిలోమీటర్ల దూరంలోని ‘ఇక్‌చారి’ రైల్వేస్టేషన్‌కు సిలిండర్‌ మోసుకొని బయలుదేరుతాడు. అక్కడ రైలు పట్టుకుని 50 నిమిషాల దూరంలోని భాగల్‌పూర్‌ చేరుకుంటాడు. 

అక్కడి నుంచి ఆక్సిజన్‌ దొరికే చోటుకు వెళ్లి సిలిండర్‌ తీసుకుని 9 గంటలకు ఇల్లు చేరుతాడు. మళ్లీ 11కు వెళ్లి ఒంటి గంటకు వస్తాడు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లి 7కు తిరిగి వస్తాడు. అంటే రోజులో భుజాన సిలిండర్‌తో 30 కిలోమీటర్లు అతడు నడుస్తాడు. అతని భుజం కదుం కట్టి పోయింది. ‘ఎందుకు ఆక్సిజన్‌ మోస్తూ కనిపిస్తావు’ అని ఎవరైనా అడిగితే ‘ఒక పక్షి దాహంతో ఉంది. దాని కోసం’ అని సమాధానం చెబుతాడు.

ఆయుష్మాన్‌ కార్డు
‘ఒకరికొకరు తోడుండటమే వివాహం అంటే. ఆమె మరణించేవరకూ నేనే తోడు’ అంటాడు విజయ్‌ మండల్‌. ఇతని గాథ అందరికీ తెలిసినా స్థానిక అధికారులు ఆయుష్మాన్‌ కార్డు ఇచ్చి సరిపెట్టారు. ఒక మనిషి ఆక్సిజన్‌ కోసం ఇంతగా ఎందుకు తిరగాలి పర్మినెంట్‌ సొల్యూషన్‌ ఏమిటి అనేది ప్రభుత్వం ఆలోచించడం లేదు. పిచ్చివాడిలా గడ్డం పెంచుకుని తిరుగుతున్న ఆ భర్తను చూసి భార్య రెండు చేతులూ జోడిస్తుంటుంది.

 ‘ఉత్త పుణ్యానికి భార్యలను హతమార్చే ఈ రోజుల్లో అనారోగ్యంతో ఉన్న నన్ను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్నాడు నా భర్త’ అని కన్నీరు కారుస్తుంది. విజయ్‌ మండల్‌ ఆ మాటలు పట్టించుకోడు. తనకు మిగిలిన టైమ్‌లో ఆమె దగ్గర కూచుంటాడు. పాదాలు నొక్కుతాడు. కబుర్లు చెబుతాడు. ఆమెలో జీవితేచ్ఛ నశించకుండా చూసుకుంటాడు. ఒక మనిషి ఇంత గొప్పగా ఉంటాడా? ఉంటాడు. ప్రతి మనిషి ఇలా ఉంటే కనీసం ఇంతలో కొంతగా అయినా ఉంటే ఎంత బాగుణ్ణు.          

ఇంట్లోని గదినే ఐసియుగా మార్చి...
‘నేను బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. భార్యను ఎంత బాగా చూసుకోవాలనే విషయం పై నేను ఒక ఉదాహరణగా నిలవాలి’ అన్నాడు విజయ్‌ మండల్‌. అతను తాను నడిపే కిరాణా దుకాణాన్ని కొడుక్కు అప్పజెప్పి జీవితాన్ని ఇక పూర్తిగా భార్యకు అంకితం చేశాడు. మూడు ఆక్సిజన్‌ సిలిండర్లను పర్మినెంట్‌గా ఉండేలా కొనేశాడు. వాటిని నింపుకొని రావడమే ఇప్పుడతని కర్తవ్యం.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement