Bhagalpur
-
విగ్రహాల ధ్వంసంపై ఆందోళన.. నిందితుడు అరెస్ట్
భాగల్పూర్: బీహార్‌లోని భాగల్పూర్లో దేవతా విగ్రహాల ధ్వంసంతో స్థానికంగా కలకలం చోటుచేసుకుంది. సన్‌హౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోగల ఒక శివాలయంలో దేవుళ్లు, దేవతల విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతూ రోడ్లపైకి చేరుకుని ఆందోళనకు దిగారు.విగ్రహాల ధ్వంసం దరిమిలా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యగా సంహౌలా ప్రధాన మార్కెట్‌ను మూసివేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలో ప్రమేయమున్న ఒక వ్యక్తిని అరెస్టు చేశారు.భాగల్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సంహౌలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఆలయంలో కొన్ని విగ్రహాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శాంతి కమిటీ, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామని, పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, శాంతిభద్రతలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. వదంతులకు దూరంగా ఉండాలని స్థానికులకు పోలీసులు సూచించారు. ఇది కూడా చదవండి: నిమి–వసిష్ఠుల పరస్పర శాపాలు -
మరణించాడనుకుంటే, మోమోలు తింటూ కనిపించాడు
భాగల్పూర్: బిహార్‌లో భాగల్పూర్కు చెందిన నిశాంత్ కుమార్ అనే వ్యక్తి గత ఆరు నెలలుగా కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులందరూ ఆయన మరణించాడనే భావించారు. అయితే హఠాత్తుగా ఒక రోజు నోయిడాలో మోమోలు తింటూ ఆయన బావమరిదికే దొరకడం విశేషం. భాగల్పూర్లోని నౌగాచికి చెందిన నిశాంత్ కుమార్ ఒక పెళ్లి కోసం తన అత్త మామల ఇంటికి ఈ ఏడాది జనవరిలో వెళ్లాడు. ఆ తర్వాత కనిపించకుండా వెళ్లిపోయాడు. దీంతో సుశాంత్ తండ్రి తన కుమారుడిని అతని అత్తింటి సభ్యులే హత్య చేశాడని ఆరోపించారు. రెండు కుటుంబాల మధ్య రచ్చ వీధికెక్కింది. సుశాంత్ బావమరిది ఒక రోజు నోయిడా వెళితే అక్కడ మోమోలు అమ్మే దుకాణం దగ్గర ఒక బిచ్చగాడు కనిపించాడు. అతను ఆకలేస్తోందని మోమోలు అడిగితే దుకాణం దారుడు అతనిని పొమ్మని కసురుకుంటున్నాడు. దీంతో జాలిపడ్డ రవిశంకరే డబ్బులు ఇచ్చి అతనికి మోమోలు ఇమ్మని చెప్పాడు. ఆ తర్వాత అతని పేరేంటని అడగ్గా నిశాంత్ కుమార్ అని తమది బిహార్ అని చెప్పడంతో నిర్ఘాంత పోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిశాంత్ నోయిడాకి ఎలా చేరాడో, ఎందుకు రోడ్లు పట్టుకొని తిరుగుతున్నాడో పోలీసులు విచారణలో తేలాల్సి ఉంది. -
బిహార్‌లో కూలిన తీగల వంతెన
పట్నా: రూ.1,700 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న భారీ తీగల వంతెన కూలిపోయింది. బిహార్ రాష్ట్రం భాగల్పూర్ జిల్లాలో ఆదివారం ఈ సంఘటన జరిగింది. నిర్మాణంలో ఈ వారధి తొలుత రెండు ముక్కలుగా విడిపోయింది. ఒకదాని తర్వాత ఒకటి నేలకూలాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. బ్రిడ్జి కూలిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. గంగా నదిపై ఖగారియా.. అగువానీ, సుల్తాన్‌గంజ్ మధ్య ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు. రెండేళ్ల క్రితం కొంత భాగం కూలిపోవడంతో పునర్నిర్మించారు. రెండు నెలల క్రితం బలమైన ఈదురు గాలుల ధాటికి పగుళ్లు వచ్చాయి. ఆదివారం నేలకూలింది. దాదాపు ఐదు స్తంభాలు కూలిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిన ఘటనపై ప్రతిపక్ష బీజేపీ నేత విజయ్‌కుమార్ సిన్హా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి పనిలోనూ కమిషన్లు తీసుకోవడం ఒక సంప్రదాయంగా మారిపోయిందని నితీశ్ కుమార్ ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన ఆగిపోయిందని, ఆరాచకం, అవినీతి పెచ్చరిల్లిపోతున్నాయని ఆరోపించారు. ఇక్కడ వ్యవస్థలు భ్రష్టుపట్టిపోతుంటే సీఎం నితీశ్ విపక్షాల ఐక్యత గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. -
పేకమేడలా కూలిన తీగల వంతెన.. వీడియో వైరల్
బిహార్:బిహార్‌లో నిర్మాణంలో ఉన్న అగువాని-సుల్తాన్ గంజ్ తీగల వంతెన పేకమేడలా కుప్పకూలిపోయింది. బాగల్‌పురాలో సాయంత్రం 6 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై సీఎం నితీష్ కుమార్ దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దాదాపు 3,160 మీటర్ల పొడవు ఉన్న నాలుగ లైన్ల తీగల వంతెనను ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇందుకు రూ.1,710కోట్లను కేటాయించింది. 2014 ఫిబ్రవరి 23న నితీష్ కుమార్ దీనికి శంకుస్థాపన చేశారు. ఈ వంతెన రెండో సారి కూలిపోవడం గమనార్హం. ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వాన్ని విమర్శించారు. నితీష్ నేతృత్వంలోని ప్రభుత్వం అవనీతిమయమైందని ఆరోపించారు. స్థానికంగా పాలన క్షీణిస్తున్నా.. ప్రతిపక్ష ఐక్యత గురించి సీఎం నితీష్ మాట్లాడుతారని ఆరోపించారు. ఘటనపై కమిషన్ నియమించడం రాజకీయ సంప్రదాయంగా మారిందని విమర్శించారు. Meanwhile in Bihar: The under-construction bridge collapsed. Total cost: ₹1750 crore pic.twitter.com/y4FPFsei5p — BALA (@erbmjha) June 4, 2023 ఈ బ్రిడ్జ్ సుల్తాన్ గంజ్, ఖగారియా, సహర్ష, మాదెపుర జిల్లాల మీదుగా ఎన్‌హెచ్-31, ఎన్‌హెచ్ 107కు కలపబడుతుంది. ఇదీ చదవండి:హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలో మణిపూర్ అల్లర్లపై విచారణకు హోంశాఖ ఆదేశం -
అమ్మాయిలూ ‘జట్టు విరబోసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’
పాట్నా: ‘కళాశాలకు వస్తుంటే తల విరబూసుకుని జట్టు వేసుకోకుండా వస్తే ఇకపై అనుమతి లేదు. హీరోయిన్ మాదిరి తయారై వస్తే కళాశాలలోకి అడుగు పెట్టేదే లేదు’ అని బిహార్ భగల్పూర్లో ఉన్న సుందర్‌వతి మహిళా మహావిద్యాలయం నిర్ణయం తీసుకుంది. విద్యా ఆవరణలో క్రమశిక్షణ, పద్ధతిగా ఉండాలనే ఉద్దేశంతో ఆ విద్యాలయం తీసుకున్న ఈ నిర్ణయం వివాదాస్పదమవుతోంది. ఇటీవల విద్యాలయ ప్రిన్సిపల్ పలు నిబంధనలు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాటిలో అమ్మాయిలకు డ్రెస్ కోడ్‌తో పాటు అలంకరణ, వేషధారణ పలు విషయాలపై పరిమితులు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. (చదవండి: జర చూసి తినండి.. పిజ్జాలో ఇనుప నట్లు, బోల్టులు) కళాశాలకు వచ్చే విద్యార్థినులు కచ్చితంగా జడ వేసుకోవాలి. జుట్టు విరబూసుకుని రావొద్దు. కళాశాల గేటు లోపలకి వచ్చాక సెల్ఫీలు, ఫొటోలు దిగవద్దు. డ్రెస్ కోడ్ విధిగా పాటించాలి. రాయల్ బ్లూ బ్లేజర్ లేదా, చలికోటు ధరించాలి. పైవీ ఏవైనా ఉల్లంఘిస్తే కళాశాలకు అనుమతించరు. ఈ నిబంధనలను విధిగా పాటించాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొనట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రమణ్ సిన్హా తెలిపారు. ఈ నిబంధనలపై విమర్శలు రావడంపై కొట్టిపారేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ తప్పుబట్టింది. ఇదో తుగ్లక్ నిర్ణయమని ఎద్దేవాచే సింది. మరికొన్ని విద్యార్థి సంఘాలు ఈ నిబంధనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ విద్యాలయంలో మొత్తం విద్యార్థులు 1,500మంది ఉన్నారు. చదవండి: గుండెల్ని పిండేస్తున్న అమెజాన్ వీడియో -
తప్పుపట్టడమే కాంగ్రెస్ నైజం
డెహ్రీ/గయ/భగల్పూర్: దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న ఏ నిర్ణయాన్ని అయినా వ్యతిరేకించాలన్నది కాంగ్రెస్ పార్టీ విధానమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా శుక్రవారం మూడు ప్రచార సభల్లో ప్రధాని పాల్గొన్నారు. రోహ్తస్, గయ, భగల్పూర్ సభల్లో పాల్గొని తన ప్రచారాన్ని మోదీ ప్రారంభించారు. ఈ సభల్లో ప్రధానితో పాటు బీజేపీ మిత్రపక్షం జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వేదికను పంచుకున్నారు. దాదాపు 15 ఏళ్ల పాటు ఆర్జేడీ ప్రభుత్వం రాష్ట్రంలో నేరమయ, దోపిడీ పాలన సాగించిందని ప్రధాని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాఖ్‌పై నిషేధం, అయోధ్యలో రామాలయ నిర్మాణం, సరిహద్దుల్లో మిలటరీ ఆపరేషన్లు.. ఇలా తమ ప్రభుత్వం తీసుకున్న అన్ని జాతి ప్రయోజన నిర్ణయాలను కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకించాయని మోదీ పేర్కొన్నారు. ‘ఆర్టికల్ 370 రద్దు కోసం దేశమంతా ఎదురు చూడలేదా? ఇప్పుడు అధికారంలోకి వస్తే మళ్లీ ఆ అధికరణను అమల్లోకి తీసుకు వస్తామని కాంగ్రెస్ చెబుతోంది. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లోకి తన పిల్లలను పంపించిన బిహార్ ప్రజలను ఇది అవమానించడం కాదా? అయినా, ఓట్లు వేయండంటూ మీ దగ్గరకే రావడానికి వారికి ఎంత ధైర్యం?’ అని ప్రధాని మండిపడ్డారు. గల్వాన్ లోయలో చైనా దళాలతో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ.. ‘దేశం కోసం బిహార్ బిడ్డలు ప్రాణాలర్పించారే కానీ.. దేశమాతను తలదించుకునేలా చేయలేదు’ అన్నారు. విపక్షాలు దళారుల తరఫున మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయని, రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు సమయంలోనూ అవి దళారులు, మధ్యవర్తుల తరఫుననే మాట్లాడాయని విమర్శించారు. మొదట పాల్గొన్న డెహ్రీ సభలో ఇటీవల మరణించిన ఎల్జేపీ నేత, కేబినెట్ సహచరుడు రామ్‌విలాస్ పాశ్వాన్, మాజీ కేంద్రమంత్రి రఘువంశ్ ప్రసాద్ సింగ్‌లకు నివాళులర్పిస్తూ ప్రధాని ప్రసంగాన్ని ప్రారంభించారు. లాలు నేతృత్వంలో ఆ చీకటి పాలనను బిహార్ ప్రజలు మర్చిపోలేరన్నారు. సైనికులను ప్రధాని అవమానించారు తూర్పు లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించలేదని చెప్పి ప్రధాని మోదీ సైనికులను అవమానించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత భూభాగంలోకి చైనా సైనికులు వచ్చారన్నది వాస్తమన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిసువాలో జరిగిన ప్రచార సభలో శుక్రవారం రాహుల్ పాల్గొన్నారు. చైనా సైనికులను ఎప్పుడు వారి భూభాగంలోకి తరిమేస్తారో ప్రధాని చెప్పాలని డిమాండ్ చేశారు. లాక్డౌన్ సమయంలో బిహార్‌కు చెందిన వలస కార్మికులను ఇతర రాష్ట్రాల్లో తరిమేశారని, అయినా ప్రధాని ఏమీ మాట్లాడలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. -
అతని వయస్సు 19 ఏళ్లే కానీ..
పాట్నా: బీహార్‌కు చెందిన 19 ఏళ్ల గోపాల్ జీ అతి చిన్న వయస్సులోనే అద్భుత ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. భాగల్పూర్ జిల్లాకు చెందిన గోపాల్‌కు నాసా ఆహ్వానం లభించింది. అమోఘమైన తెలివితేటలతో రెండు పేటెంట్ల (మేథోసంపత్తి హక్కుల)ను గోపాల్ సాధించాడు. సమాజానికి సేవ చేయడానికి తన ఆవిష్కరణలు ఉపయోగపడాలన్నదే తన ఆకాంక్షగా అతడు పేర్కొన్నాడు. తండ్రి రంజన్ కున్వర్ సాధారణ రైతు అని, కుటుంబ పరిస్థితులను అధిగమించి ఉన్నత చదువులు అభ్యసించినట్లు తెలిపాడు. గోపాల్ గొప్ప ఆవిష్కర్తగా, పరిశోధకుడిగా, డిజిటల్ విద్యా సంస్థల బ్రాండ్ అంబాసిడర్‌గా, ప్రేరణ కలిగించే ఉపన్యాసాలతో సమాజానికి తన సేవలను అందిస్తున్నాడు. గోపాల్ ప్రస్తుతం డెహ్రాడున్‌లోని గ్రాఫిక్ ఎరా యూనివర్సిటీ నుంచి బీటెక్ డిగ్రీ చదువుతున్నాడు. అరటి, బయో కణాలకు సంబంధించిన ప్రయోగాలు సఫలం కావడంతో గోపాల్ రెండు పేటెంట్లు పొందాడు. అతడి ప్రతిభకు మెచ్చి తైపీ ఎగ్జిబిషన్లో 10 దేశాలకు చెందిన 30 స్టార్టప్ కంపెనీలు అతడిని ఆహ్వానించాయి. 2017లో ప్రధాని నరేంద్ర మోదీని కలిసానని, ఆయనతో పది నిముషాలు మాట్లాడినట్లు గోపాల్ తెలిపాడు. మోదీతో మాట్లాడాక సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాన్ని సందర్శించానని, తరువాత తనను అహ్మదాబాద్‌లోని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్ఐఎఫ్) కు పంపించారని..అక్కడ మూడు ఆవిష్కరణలు చేసినట్లు తెలిపాడు. అరటి ఆకు ఆవిష్కరణకు గాను తనకు ఇన్స్పైర్ అవార్డు లభించిందని గోపాల్ పేర్కొన్నాడు. -
నేనేందుకు లొంగిపోవాలి?
న్యూఢిల్లీ : భాగల్పూర్లో మతఘర్షణ కేసులో లొంగిపోయేది లేదని కేంద్ర సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే కుమారుడు అరిజిత్ శష్వత్ చౌబే అన్నారు. పోలీసుల ఎదుట తాను లొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన న్యాయస్థానమే తనకు రక్షణ కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. ‘నేనేందుకు లొంగిపోవాలి? కోర్టు వారెంట్ జారీ చేసింది కానీ అదే కోర్టు నాకు రక్షణ కల్పిస్తుంది. పోలీసులు ఒక్కసారి కోర్టుకు వెళ్లితే అక్కడ ఏమి జరుగుతుందో తెలుస్తుంద’ని అన్నారు. తాను ఎక్కడికి పారిపోవట్లేదని, జనం మధ్యలో ఉన్నానని తెలిపారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే సహకరిస్తానని, కోర్టుకు వెళ్లి ముందుస్తు బెయిల్ తెచ్చుకుంటానని చెప్పారు. బిహర్‌లోని భాగల్పూర్లో మార్చి 17న రెండు వర్గాల మధ్య మతఘర్షణలను ప్రేరేపించేలా మాట్లాడినందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో అరిజిత్‌తో సహా మరో ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు శనివారం అరెస్ట్ వారెంట్ జారీచేసింది. కాగా ఈ అంశంపై ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ స్పందిస్తూ... రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో సీఎం నితీశ్‌కుమార్ విఫలమయ్యారని విమర్శించారు. అరిజిత్‌ను కాపాడేందుకు డమ్మి అరెస్ట్ వారెంట్ జారీచేశారని ఆరోపించారు. -
ప్రారంభానికి ముందే కుప్పకూలిన డ్యామ్
-
ప్రారంభానికి ముందే కుప్పకూలిన డ్యామ్
భాగల్పూర్ : నీటిపారుదల స్కీమ్ కింద చేపట్టిన కెనాల్ ప్రాజెక్టు డ్యామ్ ప్రారంభోత్సవానికి ముందే కుప్పకూలింది. మరో 24 గంటల్లో సీఎం ఈ డ్యామ్‌ను ప్రారంభం చేస్తారనగా ఈ ఘటన చోటుచేసుకుంది. బిహార్‌లోని భాగల్పూర్లో కహల్గావ్ వద్ద ఇరిగేషన్ స్కీమ్ కింద బతేశ్వర్ పంత్ కెనాల్ ప్రాజెక్ట్ ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్ట నిర్మించడానికి ప్రభుత్వం రూ.389.31 కోట్లను ఖర్చుచేసింది. మరో 24 గంటల్లో ఆ ఆనకట్టను ఆ రాష్ట్ర సీఎం నితీష్ కుమార్ ప్రారంభించనున్నారు. కానీ ప్రారంభానికి కంటే ముందస్తుగానే ఈ ఆనకట్ట కుప్పకూలిపోయింది. పూర్తి సామర్థ్యంలో నీటి విడుదల కారణంగా ఈ ఆనకట్టు కూలిపోయిందని ఆ రాష్ట్ర నీటివనరుల మంత్రి లలాన్‌సింగ్ చెబుతున్నారు. ఈ అనుకోని సంఘటన వల్ల ఆనకట్టు ప్రారంభోత్సవాన్ని రద్దు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఆనకట్ట ముఖ్య ఉద్దేశ్యం కెనాల్లో నీటిని సేకరించి, వ్యవసాయదారులకు నీరు అందించడం. వ్యవసాయదారులు ఎలాంటి సమస్యలను ఎదుర్కొనకూడదని ఈ ఆనకట్టను నిర్మించారు. ఈ ఆనకట్టు కూలిపోవడంతో, లోతట్టు ప్రాంతాల్లో చాలా గృహాలు, ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ ప్రాజెక్టు ద్వారా భాగల్పూర్లో 18620 హెక్టార్లలో, జార్ఖాండ్‌లోని గోడ జిల్లాలో 22658 హెక్టార్లలో నీటి పారుదల సౌకర్యం కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టును నిర్మించడానికి, పూర్తిచేయడానికి ప్రభుత్వానికి చాలా కాలం పట్టింది. -
ఆర్జేడీ నేత దారుణ హత్య
పట్నా : ఆర్జేడీ నేత వినోద్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. బిహార్ రాజధాని పట్నాకు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగల్ పూర్ జిల్లా నౌగచియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల యాదవ్ నౌగచియా నగర్ పంచాయతీ సభ్యుడు. నౌగచియాలోని రాసల్పూర్ ప్రాంతంలో మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన యాదవ్‌పై, మోటర్ సైకిల్‌పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని ఆర్జేడీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి నాథ్ తెలిపారు. ఘటనాస్థలంలోనే ఆయన మృతిచెందినట్టు వెల్లడించారు. ఘటనాస్థలం నుంచి ఓ తుపాకీని, నాలుగు ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు నౌగచియా సూపరిడెంట్ ఆఫ్ పోలీసు(ఎస్పీ) పంకజ్ సిన్హా చెప్పారు. యాదవ్ హత్య వెనుక వ్యక్తిగత శత్రుత్వమే కారణమై ఉండవచ్చని ఎస్పీ అనుమానిస్తున్నారు. యాదవ్‌కు చాలా క్రిమినల్ కేసుల్లో హస్తమున్నట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నౌగచియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. యాదవ్ మేనల్లుడు అజిత్‌కు ఈ హత్యలో భాగమున్నట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.