పట్నా : ఆర్జేడీ నేత వినోద్ యాదవ్ దారుణ హత్యకు గురయ్యారు. శనివారం ఉదయం ఆయన్ను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. బిహార్ రాజధాని పట్నాకు 240 కిలోమీటర్ల దూరంలో ఉన్న భాగల్ పూర్ జిల్లా నౌగచియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 50 ఏళ్ల యాదవ్ నౌగచియా నగర్ పంచాయతీ సభ్యుడు. నౌగచియాలోని రాసల్పూర్ ప్రాంతంలో మార్నింగ్ వాకింగ్కు వెళ్లిన యాదవ్పై, మోటర్ సైకిల్పై వచ్చిన ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని ఆర్జేడీ జిల్లా అధ్యక్షుడు తిరుపతి నాథ్ తెలిపారు. ఘటనాస్థలంలోనే ఆయన మృతిచెందినట్టు వెల్లడించారు.
ఘటనాస్థలం నుంచి ఓ తుపాకీని, నాలుగు ఖాళీ తూటాలను స్వాధీనం చేసుకున్నట్టు నౌగచియా సూపరిడెంట్ ఆఫ్ పోలీసు(ఎస్పీ) పంకజ్ సిన్హా చెప్పారు. యాదవ్ హత్య వెనుక వ్యక్తిగత శత్రుత్వమే కారణమై ఉండవచ్చని ఎస్పీ అనుమానిస్తున్నారు. యాదవ్కు చాలా క్రిమినల్ కేసుల్లో హస్తమున్నట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నౌగచియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు ఎస్పీ పేర్కొన్నారు. యాదవ్ మేనల్లుడు అజిత్కు ఈ హత్యలో భాగమున్నట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఆర్జేడీ నేత దారుణ హత్య
Published Sat, Aug 20 2016 1:44 PM | Last Updated on Mon, Sep 4 2017 10:06 AM
Advertisement