న్యూఢిల్లీ : భాగల్పూర్‌లో మతఘర్షణ కేసులో లొంగిపోయేది లేదని కేంద్ర సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే కుమారుడు అరిజిత్ శష్వత్ చౌబే అన్నారు. పోలీసుల ఎదుట తాను లొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన న్యాయస్థానమే తనకు రక్షణ కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. ‘నేనేందుకు లొంగిపోవాలి? కోర్టు వారెంట్ జారీ చేసింది కానీ అదే కోర్టు నాకు రక్షణ కల్పిస్తుంది. పోలీసులు ఒక్కసారి కోర్టుకు వెళ్లితే అక్కడ ఏమి జరుగుతుందో తెలుస్తుంద’ని అన్నారు. తాను ఎక్కడికి పారిపోవట్లేదని, జనం మధ్యలో ఉన్నానని తెలిపారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే సహకరిస్తానని, కోర్టుకు వెళ్లి ముందుస్తు బెయిల్ తెచ్చుకుంటానని చెప్పారు.
బిహర్‌లోని భాగల్పూర్‌లో మార్చి 17న రెండు వర్గాల మధ్య మతఘర్షణలను ప్రేరేపించేలా మాట్లాడినందుకు స్థానిక పోలీస్ స్టేషన్‌లో అరిజిత్‌తో సహా మరో ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు శనివారం అరెస్ట్ వారెంట్ జారీచేసింది.
కాగా ఈ అంశంపై ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ స్పందిస్తూ... రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో సీఎం నితీశ్‌కుమార్ విఫలమయ్యారని విమర్శించారు. అరిజిత్‌ను కాపాడేందుకు డమ్మి అరెస్ట్ వారెంట్ జారీచేశారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment