communal riots
-
సంచలనం: మత ఘర్షణల్లో పోలీస్ సిబ్బంది
సాక్షి, ముంబై: ఔరంగబాద్ మత ఘర్షణలకు సంబంధించి సంచలన వీడియో ఫుటేజీ ఒకటి బయటికి పొక్కింది. ఘర్షణల్లో పాల్గొన్న కొందరికి పోలీసులు సాయం చేశారన్న ఆరోపణలకు బలం చేకూర్చేదిగా ఉంది. తమ కళ్ల ముందే వాహనాలను తగలబెడుతున్నా పోలీస్ సిబ్బంది వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవటం గమనార్హం. శుక్రవారం రాత్రి రెండు వర్గాల మధ్య ఘర్షణతో ఆ ప్రాంతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. శనివారం వేకువ ఝామున నవాబుపుర ప్రాంతంలో పోలీసులు గస్తీ కాస్తున్నారు. ఆ సమయంలో అల్లరి మూక, పోలీసు సిబ్బందితో కలిసి నడుచుకుంటూ వెళ్లింది. భారతీయ నర్సింగ్ హోం వద్దకు చేరుకోగానే పార్కింగ్‌లో ఉన్న వాహనాలపై అల్లరిమూక తమ ప్రతాపం చూపింది. కొందరు వాహనాలను ధ్వంసం చేసి ఆపై తమ వెంట తెచ్చుకున్న పెట్రోల్ క్యాన్లను పోసి తగలబెట్టారు. ఓ భవనంలోంచి ఓ వ్యక్తి కిటీకి గుండా ఈ ఘటనను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అయితే అల్లర్లు చెలరేగిన వెంటనే ఇంటర్నెట్ సేవలు నిలిపేయటంతో ఆ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మొత్తం 9 నిమిషాల నిడివి ఉన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఘటనపై మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సిబ్బందిపై వేటు వేసి, అత్యున్నత దర్యాప్తునకు ఆదేశించి. ఇక ఈ వీడియోపై అల్లర్లను పర్యవేక్షించిన అదనపు డీజీపీ బిపిన్ బిహారీ మాట్లాడారు. చట్టాన్ని చేతుల్లో తీసుకుంది ఎవరైనా సరే ఉపేక్షించబోమని ఆయన అన్నారు. అల్లర్లకు కారణం.. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నల్లా కనెక్షన్లను తొలగించే కార్యక్రమాన్ని ప్రారంభించడంతో గత కొన్నిరోజులుగా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు కార్పొరేషన్ సిబ్బంది మోతీకరంజాలోని ఓ ప్రార్థనాలయంలో ఉన్న అక్రమ నల్లా కనెక్షన్‌ను తొలగించడంతో వివాదం రాజుకుంది. తమ కనెక్షన్‌తో పాటు మరో వర్గానికి చెందిన ప్రార్థనాస్థలంలో ఉన్న అక్రమ నీటి కనెక్షన్‌ను కూడా తొలగించాలని ఓ వర్గం డిమాండ్ చేయడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో అల్లర్లు మోతీకరంజా నుంచి గాంధీనగర్, రాజా బజార్, షా గంజ్, సరఫా ప్రాంతాలకు విస్తరించాయి. రెచ్చిపోయిన ఆందోళనకారులు 100 దుకాణాలకు, 80 వాహనాలకు నిప్పుపెట్టారు. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ యువకుడు(17)చనిపోగా, ఆందోళనకారులు మంట లు అంటించడంతో ఓ షాపులో 65 ఏళ్ల వృద్ధుడు దుర్మరణం చెందాడు. -
మమత చేతులకు కూడా మట్టి అంటిందా?
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం నాడు చెలరేగిన అల్లర్లు ఇప్పటికీ అక్కడక్కడ కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు అలాగే ఉన్నాయి. ఆది, సోమ వారాల్లో ఇరువురు మరణించగా పలువురు గాయపడ్డారు. ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకున్న కేంద్ర హోం శాఖ అల్లర్లకు దారితీసిన పరిస్థితులపై తక్షణమే నివేదికను సమర్పించాల్సిందిగా మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా బలపడుతున్న భారతీయ జనతా పార్టీ హిందువుల ఓటు బ్యాంకును పెంచుకోవడం కోసం గతేడాది నుంచి శ్రీరామ నవమి సందర్భంగా ఆయుధాలు ధరించి హిందూ సంఘాల కార్యకర్తలతో బెంగాల్ వీధుల్లో ప్రదర్శన నిర్వహిస్తోంది. గతేడాది ప్రదర్శనల్లో పాల్గొన్న ఆరెస్సెస్, భజరంగ్ దళ్ కార్యకర్తలు రాష్ట్రంలో జిహాదీ శక్తులకు వ్యతిరేకంగా హిందువులంతా ఏకం కావాలంటూ నినాదాలు చేశారు. వారిని అదుపుచేయడంలో నాడు విఫలమైన మమతా బెనర్జీ ప్రభుత్వం ఈ సారి మరింత ఘోరంగా విఫలమైంది. దానికి కారణం బీజేపీ–ఆరెస్సెస్ ప్రదర్శనలకు పోటా పోటీగా ఆయుధాలు ధరించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోని ప్రదర్శనలు నిర్వహించడమే. వీలు చిక్కినప్పుడల్లా తాను లౌకికవాదినంటూ ప్రచారం చేసుకునే మమతా బెనర్జీ హిందువుల ఓట్ల కోసం ఇలాంటి ఎత్తుగడలు వేస్తారా? అంటూ దేశంలోకి లౌకిక రాజకీయ శక్తులు కూడా ఆశ్చర్య పోతున్నాయి. రాష్ట్రంలో 67 శాతం హిందువులు ఉండగా, 30 శాతం ముస్లింలు ఉన్నారు. ఈసారి శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారని, అసలు ఆయుధ ప్రదర్శనలను చట్టపరంగా నిషేధిస్తారని రాజకీయ విశ్లేషకులు భావించారు. గతేడాది ఆయుధాల ప్రదర్శనలకు నాయకత్వం వహించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్యే ఈసారి కూడా ఆయుధ ప్రదర్శనలకు నాయకత్వం వహించారంటూ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోలేక పోయారు. ఎందుకంటే తృణమూల్ పార్టీ ఆధ్వర్యాన కూడా కత్తులు, కటార్లు ధరించి శ్రీరామ నవమి జెండాలతో ప్రదర్శనలు నిర్వహించడమే. మమతా బెనర్జీ ముస్లింల పక్షపాతంటూ బీజేపీ–ఆరెస్సెస్ కార్యకర్తలు చేస్తున్న ప్రచారం కూడా ప్రజలపై ప్రభావం చూపుతోంది. ఈ పరిస్థితుల్లోనే మమతా బెనర్జీ తన సహజ వైఖరిని మార్చుకున్నట్లు ఉన్నారు. ఇటీవల బీర్భమ్ జిల్లాలో ఆమె ప్రభుత్వం ఏర్పాటు చేసిన బ్రాహ్మణ సమ్మేళనంలో ఆమె స్వయంగా పాల్గొనడమే కాకుండా సమ్మేళనంలో పాల్గొన్న వారందరికి భగవద్గీతలను పంచి పెట్టారు. ఇలాంటి జిమ్మికుల వల్ల హిందువులు అంత తొందరగా ఆమెను విశ్వసించక పోవచ్చు. దేశ స్వాతంత్య్ర యోధుడు, దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలామ్ ఆజాద్ విగ్రహాన్ని శ్రీరామ నవమి నాడు బీజేపీ–ఆరెస్సెస్ కార్యకర్తలు కూల్చేస్తే కూడా ఆమె దాన్ని నేరుగా ఖండించలేకపోయారు. అంటే ఆమె గందరగోళ రాజకీయ పరిస్థితుల్లో పడిపోయినట్టున్నారు. రాష్ట్రంలో ఎలాగైన హిందూత్వను అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఆమె తొలుత ప్రాంతీయ సంస్కృతి వాదాన్ని తీసుకొచ్చారు. బెంగాల్‌కున్న ప్రత్యేక సంస్కృతిని రక్షించాలంటూ రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో బెంగాలీ భాషను తప్పనిసరి చేస్తూ చట్టం చేశారు. నవమి సందర్భంగా ఆయుధ ప్రదర్శనలు జరపడం బెంగాలీ సంస్కృతి కాదని, పూర్తి పరాయి సంస్కృతి అంటూ విమర్శించారు. బెంగాల్‌కున్న ప్రత్యేక సంస్కృతిని రక్షించడంలో ఆమె మేధావులను, పండితులను, కళాకారులను కలుపుకోలేకపోయారు. ఒంటరిగా పోరాడి లాభం లేదనుకొని పంథా మార్చుకొని మరీ పల్టీ కొట్టారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకే కేంద్రం నివేదికను డిమాండ్ చేసినప్పటికీ ఆమె ఎలాంటి సమాధానం ఇస్తారో ఆమెకే తెలియాలి. రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు ముందునుంచి ఉన్నందున ముందే వ్యూహాత్మకంగాద కేంద్ర హోం శాఖ సహాయాన్ని ఆమె కోరి ఉండాల్సింది. త్రిపురలో విజయం సాధించామన్న గర్వంతో బీజేపీ సేనలు బెంగాల్లో వీర విహారం చేస్తుంటే ఆఖరి కోటను కూడా పోగొట్టుకున్నామన్న నిర్వేదంలో బెంగాల్ సీపీఎం నాయకులు పడిపోయారు. -
నేనేందుకు లొంగిపోవాలి?
న్యూఢిల్లీ : భాగల్పూర్లో మతఘర్షణ కేసులో లొంగిపోయేది లేదని కేంద్ర సహాయమంత్రి అశ్విని కుమార్ చౌబే కుమారుడు అరిజిత్ శష్వత్ చౌబే అన్నారు. పోలీసుల ఎదుట తాను లొంగిపోవాల్సిన అవసరం లేదన్నారు. అరెస్ట్ వారెంట్ ఇచ్చిన న్యాయస్థానమే తనకు రక్షణ కల్పిస్తుందని వ్యాఖ్యానించారు. ‘నేనేందుకు లొంగిపోవాలి? కోర్టు వారెంట్ జారీ చేసింది కానీ అదే కోర్టు నాకు రక్షణ కల్పిస్తుంది. పోలీసులు ఒక్కసారి కోర్టుకు వెళ్లితే అక్కడ ఏమి జరుగుతుందో తెలుస్తుంద’ని అన్నారు. తాను ఎక్కడికి పారిపోవట్లేదని, జనం మధ్యలో ఉన్నానని తెలిపారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి వస్తే సహకరిస్తానని, కోర్టుకు వెళ్లి ముందుస్తు బెయిల్ తెచ్చుకుంటానని చెప్పారు. బిహర్‌లోని భాగల్పూర్లో మార్చి 17న రెండు వర్గాల మధ్య మతఘర్షణలను ప్రేరేపించేలా మాట్లాడినందుకు స్థానిక పోలీస్ స్టేషన్లో అరిజిత్‌తో సహా మరో ఎనిమిది మంది బీజేపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక కోర్టు శనివారం అరెస్ట్ వారెంట్ జారీచేసింది. కాగా ఈ అంశంపై ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ స్పందిస్తూ... రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో సీఎం నితీశ్‌కుమార్ విఫలమయ్యారని విమర్శించారు. అరిజిత్‌ను కాపాడేందుకు డమ్మి అరెస్ట్ వారెంట్ జారీచేశారని ఆరోపించారు. -
ఫేస్‌బుక్కా? ఫేక్‌బుక్కా?
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నెలకొన్న మత ఉద్రిక్తతలకు సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఫేస్బుక్లో ప్రచారమవుతున్న తప్పుడు వార్తలు ఆజ్యం పోస్తున్నాయి. ఓ భోజ్‌పురి సినిమాలో ఓ యువతి పైట లాగుతున్న దృశ్యాన్ని పోస్ట్ చేసి మత ఘర్షణలు చెలరేగిన 24 పరిగణాల జిల్లాలో ఓ హిందూ యువతి పైటలాగుతున్న ముష్కరలు అంటూ కామెంట్ పెట్టారు. ఆ దృశ్యంలో యువతి మేకప్ వేసుకొని ఉండడం, పిల్లలు, పెద్దలంతా కలసి ఆ దృశ్యాన్ని చూస్తుంటే అది సినిమా షూటింగ్ లేదా సినిమాలో స్టిల్ అని కచ్చితంగా అర్థమవుతుంది. ఎవరో ఆకతాయి చేసిన ఈ పోస్ట్‌ను సాక్షాత్తు బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయ్ వర్గియా సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద చిత్రాన్ని వేసి ప్రస్తుత బెంగాల్ మత ఉద్రిక్తతలకు కారణమైన యువకుడి తల్లిదండ్రులను 24 పరిగణాల జిల్లాలోని బడూరియాలో ఎలా హింసించారో చూడండి అంటూ ఫేస్బుక్లో మరో చిత్రాన్ని పోస్ట్‌చేసి కామెంట్ రాశారు. అసలు ఆ యువకుడికి తల్లే లేదని ఇరుగుపొరుగువారు చెబుతున్నారు. పైగా ఆ చిత్రం బంగ్లాదేశ్‌లో 2014లో జరిగిన ఓ గొడవకు సంబంధించినదని ఆన్లైన్లో తప్పుడు వార్తలను వెతికిపట్టుకొనే సైట్ ‘ఆల్ట్‌న్యూస్ డాట్ ఇన్’ వెల్లడించింది. ఒకప్పుడు శాంతి, సౌభ్రాతత్వాలు విరాజిల్లిన బెంగాల్ నేడు అన్ని రంగాల్లో విఫలమైందన్న వ్యాఖ్యలతో ఆటోట్రాలీ తగులబడుతున్న దశ్యాన్ని పోస్ట్ చేశారు. ఈ తగులబడుతున్న దశ్యం ఈనాటిది కాదు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రాష్ట్రంలో 2002లో జరిగిన అల్లర్లకు సంబంధించినది. దీన్ని బీజీపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఫేస్బుక్ ఫేక్బుక్గా మారుతోందని, తాను ఫేస్‌బుక్‌ను ఎంతైనా ప్రేమిస్తానని, ఫేక్బుక్ను ద్వేషిస్తానని బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదు. -
డబ్బులిస్తే మత ఘర్షణలు సృష్టిస్తామన్న నేతలు
న్యూఢిల్లీ: భారత్ లాంటి దేశంలో మత కల్లోలాలు చెలరేగడం, వాటిల్లో వందలాది మంది మృత్యువాత పడడం మనకు కొత్తేమి కాదు. ఆ మతకల్లోలాలను అవకాశంగా తీసుకొని రాజకీయం చేసే పార్టీల సంగతి తెలియందీ కాదు. మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు బహిరంగ వేదికలపై రాజకీయ నాయకులు విద్వేషపూరిత ప్రసంగాలు చేయడము కూడా మనకు అనుభవమే. దేశంలో ఇప్పటివరకు జరిగిన మత కల్లోలాలన్నీ ప్రజల మనోభావాలు దెబ్బతిన్న కారణంగా ప్రజల నుంచి అప్పటికప్పుడు అనూహ్యంగా వచ్చిన ఆక్రోశం ఫలితం అనుకుంటే పొరపాటే. అన్నీ కాకపోయిన కొన్నైనా రాజకీయ నాయకుల ప్రోద్బలంతో, డబ్బు కక్కుర్తితో జరిగినవన్న విషయం కూడా మనకు లీలామాత్రంగా తెలుసు. అందుకు ప్రత్యక్ష సాక్షాధారాలు దొరక్కపోవడానికి కారణం ఇంత వరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా నిజాయితీతో దర్యాప్తు జరిపిన సందర్భాలు లేకపోవడమే. పార్టీలు, మత విశ్వాసాలతో సంబంధం లేకుండా కొంత మంది రాజకీయ నాయకులు డబ్బులకు కక్కుర్తి పడి తామే మత కల్లోలను సృష్టించి అమాయక ప్రజల మారణకాండకు కూడా వెనుకాడరనే విషయం ఇప్పుడు ఓ టీవీ ఛానెల్ చేసిన స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలయింది. ఇండియా టుడే టీవీకి చెందిన ఓ జర్నలిస్టు ‘బ్లాస్ ఫెమస్ (దైవదూషణ)’ పేరిట ఓ డాక్యుమెంటరీని ఉత్తరప్రదేశ్‌లో తీస్తున్నామని, ఇందుకు విస్తృత ప్రచారాన్ని కల్పించడంలో భాగంగా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు, కల్లోలాలు సృష్టించాలంటూ కొంత మంది రాజకీయ నాయకులను ఆశ్రయించారు. పది రోజులపాటు కొనసాగిన ఈ స్టింగ్ ఆపరేషన్‌లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. బూటకపు డాక్యుమెంటరీ జర్నలిస్ట్ ముందుగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా ఆస్పత్రి బెడ్‌పై ఉన్న హిందూ స్వాభిమాన్ సంఘటన్, ధర్మసేన యూనిట్‌కు చెందిన నాయకుడు పరమీందర్ ఆర్యాను కలుసుకున్నారు. తాము రాముడు అయోధ్యలో పుట్టలేదనే వాదనతో ఆయనకు వ్యతిరేక మైన కాన్సెప్ట్‌తో డాక్యుమెంటరీని తీస్తున్నామని చెప్పారు. ప్రజల దృష్టిలో ప్రజలకు ఆయన పట్ల ఉన్న ఇమేజ్ ప్రకారం పరమీందర్ ఆర్యా, రాముడికి వ్యతిరేకంగా సినిమా తీయడం ఏమిటంటూ అభ్యంతరం పెట్టాలి, తన వద్దకు వచ్చిన వ్యక్తిని ఈసడించుకోవాలి. ఆయన అదేమి చేయకపోగా, డాక్యుమెంటరీకి విస్తృత ప్రచారం కల్పించడం కోసం దానికి వ్యతిరేకంగా ఏ స్థాయిలో అంటే ఆ స్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తానని, అందుకు ప్రతిఫలం (డబ్బు) బాగా ముట్టాలని డిమాండ్ చేశారు. ముస్లింల జిహాద్‌కు వ్యతిరేకంగా ఇటీవల యూపీలో కొంత మంది హిందూ యువతకు పరమీందర్ ఆర్య ఆయుధ శిక్షణ ఇప్పించిన వార్తలు పత్రికల్లో ప్రముఖంగా వచ్చిన విషయం తెల్సిందే. ‘మీరు ఎక్కడైతే డాక్యుమెంటరీని ప్రదర్శిస్తారని చెబుతారో అక్కడికి మా కుర్రాళ్లు యాభై మంది వచ్చి గొడవ చేస్తారు. గందరగోళం సృస్టిస్తారు. ముందుగా సూచిస్తే ఎవరి చొక్కాలు చింపమంటే వారి చొక్కాలను చింపుతారు. ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు కొట్టుకోవడం, రాళ్లు రువ్వడం లాంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ‘జో రామ్ కా నహీ కిసీ కా కామ్ కా నహీ, రామ్ కా అపమాన్, నహీ సహేగా హిందుస్థాన్’...లాంటి నినాదాలిస్తూ మా కుర్రవాళ్లు మీ సినిమా పోస్టర్లను, బ్యానర్లను చింపేస్తారు. డాక్యుమెంటరీకి సంబంధించి మీరు కూడా మీడియాలో స్టేట్మెంట్లు ఇవ్వండి, నేను కూడా మీడియాలో ఇంటర్వ్యూలు ఇస్తాను. మీడియా కవరేజ్ కూడా చూసుకుంటా. పెద్ద సమస్య కాదు. డీల్ పెద్దగా ఉండాలంతే. ఇప్పటి వరకు మీతో నాకు పరిచయం లేదు. అయినా ఫర్వాలేదు. నేను మాటిచ్చానంటే మాట మీద నిలబడతా. అనుకున్న ప్రకారం అన్ని ఏర్పాట్లు చేసేందుకు నాకు పది రోజుల సమయం కావాలి. ఇంతకు యాభై మంది కుర్రాళ్లు సరిపోతారా, ఇంకా ఎక్కువ మంది కావాలా? ఇందులో మా వాళ్లకు కూడా దెబ్బలు తగిలే అవకాశం ఉందికనుక డీల్ ఎక్కువగా ఉండాలి. ఒకటి, రెండు రోజుల్లో మళ్లీ కులుద్దాం. అప్పుడు డీల్ గురించి మాట్లాడుకుందాం, ఈలోగా ఫోన్లో మాట్లాడితే కోడ్ భాషలో మాట్లాడుకుందాం’ అన్న ఆర్య మాటలను జర్నలిస్టులు స్టింగ్ ఆపరేషన్‌లో రికార్డు చేశారు. ఆ తర్వాత 2013లో హిందూ ముస్లింల అల్లర్లు చెలరేగిన ముజాఫర్‌నగర్‌కు బూటకపు డాక్యుమెంటరీ బృందం వెళ్లింది. అందులో ఓ జర్నలిస్టు బీజేపీ ఎమ్మెల్లే కపిల్ దేవ్ అగర్వాల్‌ను కలసుకున్నారు. ఆర్య ముందు వేసిన రికార్డునే ఆయన ముందు వేశారు. దానిపై ఆయన స్పందిస్తూ ‘ఈ డాక్యుమెంటరీ మీద గొడవ సృష్టిస్తే నామేమి వస్తుంది. దాని వల్ల మీకేమి లబ్ధి చేకూరుతుంది’ అని ప్రశ్నించారు. ఆ వెంటనే ఆయనే విషయాన్ని గ్రహించి ‘ఓహో! దీని వల్ల మీకు మీకు పబ్లిసిటీ లభిస్తుంది. నాకెంత ఇస్తారో తెలిస్తే చెబుతా, మళ్లీ కలుద్దాం’ అంటూ ఆయన వెళ్లిపోయారు. రెండు రోజుల తర్వాత టీవీ జర్నలిస్ట్ మళ్లీ రెండోసారి కలసుకోగా విఫులంగా మాట్లాడారు. మా కుర్రాళ్లను పంపించి గొడవ చేయిస్తాను. సినిమాను బ్యాన్ చేయాలంటూ స్టేట్మెంట్ కూడా ఇస్తాను. నా స్టేట్మెంట్ ద్వారా కూడా ఎక్కువ ప్రచారం లభిస్తుంది. నాకు ముట్టే డబ్బులు మాత్రం ఎక్కువగా ఉండాలి. డ బ్బుల ఆఫర్ నాకు నచ్చితేనే నేను పనిచేయిస్తా’ అని బీజేపీ ఎమ్మెల్యే మాటిచ్చారు. అనంతరం ఆ టీవీ జర్నలిస్టు సమాజ్‌వాది పార్టీ హరిద్వార్ యూనిట్ అధ్యక్షుడు హఫీజ్ మొహమ్మద్ ఇర్ఫాన్‌ను కలసుకున్నారు. ఈసారి ‘బ్లాస్ఫెమస్’ అనే డాక్యుమెంటరీ ముస్లింలకు వ్యతిరేకమని చెప్పారు. ‘నిరసనలు, ప్రదర్శనలు, వ్యతిరేక నినాదాలు అవేగదా, మీకు కావల్సిందీ?’ అని ఇర్ఫాన్ ప్రశ్నించగా, అంతకంటే ఎక్కువే కావాలి. ఘర్షణలు జరగాలి అని జర్నలిస్టు అడిగారు. అందుకు ఆయన స్పందిస్తూ ‘నో ప్లాబ్లమ్. అన్ని జరిగిపోతాయ్. 5 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఎందుకంటే యాభై, అరవై కుర్రవాళ్లతో అనుకున్నది చేయించాలి. అందుకని ఐదు లక్షల ఇవ్వండి. మీడియా పబ్లిసిటీ కూడా చేసి పెడతా’ అని ఇర్ఫాన్ చెప్పారు. ఆ తర్వాత స్టింగ్ ఆపరేషన్‌పై ఇర్ఫాన్‌ను టీవీ జర్నలిస్ట్ అధికారికంగా ప్రశ్నించగా, నేను ఎలాంటి డీల్‌కు ఒప్పుకోలేదంటూ ఇర్ఫాన్ సమాధానం ఇచ్చారు. పరమీందర్ ఆర్యను వివరణ కోరగా, ఇది ప్రతిపక్షాల కుట్రని ఖండించారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధుల స్పందన కోరగా, టీవీ ఫుటేజ్‌ను పూర్తిగా తెప్పించుకొని చూశాక స్పందిస్తామని చెప్పారు. పైగా శాంతి భద్రతల సమస్య రాష్ట్ర ప్రభుత్వాలదంటూ అర్థపర్థంలేని సమాధానాలు ఇచ్చారు. కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీలు మాత్రం తీవ్రంగా స్పందించాయి. ముందు నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మత కల్లోలాలను సృష్టిస్తున్నవి ఈ రెండు పార్టీలేనని ఆరోపించాయి. స్టింగ్ ఆపరేషన్ చేసిన టీవీ జర్నలిస్ట్ అన్ని రాజకీయ పార్టీల నాయకుల వద్దకు వెళ్లి ఆఫర్లు ఇస్తే ఇంకెన్ని రాజకీయ పార్టీల నాయకులు దొరికేవారో, ఏమో! -
‘గురి’ కుదరని బిల్లు
విశ్లేషణ: చిన్న పుకారు, చిన్న సంఘటన అగ్గిని రేపుతుంది. ఇది పోలీసులకు తెలుసు. ప్రతిసారీ దాడికి ముందే కొంత సమీకరణ జరుగుతుంది. అవసరమైన సరంజామా ముందే పోగు చేసుకుంటారు. ఆయుధాలు ఒక్కొక్కరికీ అందజేసి ఉంచుతారు. కాబట్టి నేరం జరగబోతున్నదని ముందే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. కాని చర్య తీసుకోరు. ‘కొట్టాలని ఉంది కాని, దెబ్బ తగులుతుందేమోనని భయం’ అన్నట్టుగా ఉన్నది 2013, మత, కుల గురి పెట్టిన హింసల బిల్లు. ఇది 2011లోనే తయారైంది. పెనం మీద రొట్టెను అటు ఇటు తిప్పి మాడ్చినట్టు 2013లో మరొక రూపం ఇచ్చారు. దీనిని కేంద్ర ప్రభు త్వం ఆమోదించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ఇది బీజేపీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నది. ససేమిరా అంగీకరించనని బీజేపీ చెప్పేసింది కూడా. ఆ పార్టీ అంగీకరిస్తుందన్న ఆశతోనే మొదటి బిల్లును సవరించి, 2013 బిల్లు అని పేరు పెట్టి లోక్‌సభలో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు ఇప్పుడు. బీజేపీకి ఏమిటి అభ్యంతరం! 2011 బిల్లును ఒప్పుకోని బీజేపీని కొంత మెత్తపరచడానికి ఒకటి రెండు మార్పులు చేశామన్నారు. అయినా విపక్షం అంగీకరించేటట్లు లేదు. బీజేపీని దెబ్బ తీయడానికీ, ‘చూశారా! మేం ఎంత లౌకికవాదులమో!’ అని చెప్పుకో వటానికీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఈ బిల్లుతో విన్యాసాలు చేస్తున్నది. అంతగా బీజేపీ అభ్యంతరం పెట్టే అంశాలేమున్నాయి అందులో? ఈ బిల్లులో ప్రధానంగా పదమూడు రకాల నేరాలను పేర్కొన్నారు. కొన్ని మతానికి సంబం ధించిన హింసాత్మక ఘటనలు, కొన్ని కులానికి సంబంధించినవి, మరికొన్ని ‘గురిపెట్టిన హింస’కు సంబంధించినవి. అంటే ఒక మతానికి లేదా కులానికి లేదా సమూహానికి చెందిన వ్యక్తులను లక్ష్యం చేసుకొని దాడి చేయటం, ఇళ్లు తగలబెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం, పురుషులను చంపటం, పసిపిల్ల అని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికివేయటం, మనుషుల్ని చంపి మంటల్లో విసిరివేయటం, స్త్రీలను వారి కుటుంబ సభ్యులు చూస్తుండగా నగ్నం చేసి సామూహిక మానభంగానికి గురిచేసి చంపేయటం వంటి ఘోరకృ త్యాలు చేసి వికటాట్టహాసం చేస్తూ విజయోత్సవంలో కరాళనృత్యం చేయటం వంటి నేరాలు ఉన్నాయి. ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కిందకి వస్తాయి. వీటికి సంబంధించిన దర్యాప్తు నేర విచారణ లాంటివి సీఆర్పీసీ కింద జరుగుతాయి. అయినా కొత్తగా ఏవో నిబంధనలు ప్రవేశపెడుతున్నట్టు బీజేపీ గగ్గోలుపెడుతున్నది. కులానికి సంబంధించిన నేరా లు కూడా ఐపీసీ కిందకే వస్తాయి. అయితే న్యాయవిచారణ త్వరగా జరిపించ డానికి, జాప్యంలేకుండా ముద్దాయిలను అరెస్టుచేసి విచారణ జరిపి శిక్షలు వేయించటానికి, దీనికోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పరచటం వంటివి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద జరిపిస్తున్నారు. అవే నేరాలకు మళ్లీ ఈ బిల్లులో ప్రవేశపెట్టారు. అయితే ఒక కొత్త నేరాన్ని ప్రవేశ పెట్టారు. నిజానికి ఇదీ పాతదే. రూపం కొత్తది. ‘గురి పెట్టిన హింస’ అనేది ఒక మతానికి లేదా ఒక కులానికి, ఒక తెగకు లేదా ఒక సమూహానికి చెందిన వారిని గురిచేసి వారిపై హింసాకాండ జరపటం. అదే విధంగా ద్వేష ప్రభావం. ఇదీ పాతదే. పేర్లు మారిస్తే చాలదు జరగవలసింది ఏమిటంటే నేరాలు క్రోడీకరించి శిక్షలు సూచించటం కాదు. నేరం జరగకుండా చూడటం, నేరం జరిగిందని తెలిస్తే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నేరగాళ్లను అరెస్టు చేయటం, విచారణ ప్రక్రియను వేగవంతం చేయటం. అంతేకాని సమాజంలో జరుగుతున్న అవే నేరాలకు పేరు మార్చి శిక్షలు పెంచి ‘నేరాలను అరికట్టడానికి మేము ఏ చర్యలు తీసుకుంటున్నామో చూడండి’ అని చెప్పటం కాదు. నేరాన్ని ఆపలేకపోతే నేరం జరిగిన వెంటనే తీసుకోవలసిన చర్యలు తీసుకుంటే అవి మళ్లీ మళ్లీ జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి నేరాలు క్షణికోద్రేకంలో చేసినవి కావు. మత కలహాలు తలెత్తే అవకాశం ఉందని ముందే తెలిసిపోతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీలపై దాడి జరగబోతుందని ముందే తెలుస్తుంది. వాటిని సులువుగా అరికట్ట వచ్చు. మత లేదా కుల ఘర్షణ జరగబోతుందని తెలిసినప్పుడు పోలీసులు రంగంలోకి దిగటం లేదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరుగుతున్న మత కలహాలు, కుల దాడులు చూస్తే ఇదే దృశ్యం పదే పదే కనబడున్నది. కొన్ని కొన్ని సందర్భాలలో పోలీసులే లేదా రాజకీయ నాయకులే రంగంలో ఉండి దాడులు జరిపిస్తారు. ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? ముజఫర్ నగర్లో ఇటీవల జరిగిన మారణహోమం చూస్తే అది ఎంత పకడ్బం దీగా, స్థానిక నాయకుల అండదండలతో జరిగిందో తెలుస్తుంది. పిల్లలని చూడక, స్త్రీలని చూడక, ముసలి వాళ్లని చూడక, గర్భిణులని చూడక వారిపై ఎంత అమానుషంగా హింసాకాండ సాగించారో ఊహకందదు. గర్భిణుల గర్భాన్ని చీల్చి అందులోని పిండాలను, పెరుగుతున్న శిశువులను కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి చంపి వేసిన సంగతి లాంటిది ఏ దేశంలోనూ, ఏ ఆటవిక సమాజాలలోను జరిగి ఉండదు! నిన్నటి వరకూ ఇరుగు పొరుగుగా జీవిస్తున్న వారు, ఉప్పు పప్పు పంచుకున్న వారు, ఒకే మంచంపై కూర్చుని హుక్కా పీల్చిన వారు ఆ తెల్లవారి అంత అకృత్యానికి పాల్పడుతున్నారంటే అది ఉద్రేకంతో చేసినవి కావు. మెజారిటీ మతం అని చెప్పుకుంటున్న వారు మైనారి టీల పట్ల ఇంత ద్వేషాన్ని కడుపులో పెట్టుకు తిరుగుతున్నారంటే నిర్ఘాం తపరుస్తుంది. ఒడిశాలో ఆదివాసీలపై జరిపిన మారణహోమం కూడా ఇలాం టిదే. ఒక క్రైస్తవ డాక్టరు భారతదేశానికి వచ్చి, ఇదే తన సొంత దేశంగా చేసు కొని, ఆదివాసీలకు వైద్య సేవలందిస్తున్నాడు. అతని సేవానిరతికి మానవతా దృక్పథానికి ఆకర్షితులైనవారు, వైద్య సేవలు పొందిన వారు క్రైస్తవ మతం వైపు ఆకర్షితులైతే అయుండవచ్చు. అందులో తప్పేమీ లేదు. అది నేరమూ కాదు. పాపమూ కాదు, అనైతికమూ కాదు. ఆదివాసీలనందరినీ క్రైస్తవ మతంలోకి మార్చివేస్తున్నాడన్న అభియోగంపై ఆ డాక్టర్ స్టెయిన్స్ని, అతని కొడుకులిద్దర్ని పెట్రోలు పోసి సజీవదహనం చేశారు. ఇది క్షణికోద్రేకంతో చేసిన పని అనగ లరా? ఒక జిల్లా అంతటా స్వైరవిహారం చేసి భీతావహం సృష్టించారు. ఇదీ యాదృచ్ఛికం కాదు. ఆదివాసీలు హిందువులు కాదు. వారు తెగలు. హిందూ మతంలో ఉన్న కులాలకూ, వారికీ సంబంధం లేదు. వారు క్రైస్తవ మతంలోకి వెళ్లినా హిందువులనుకుంటున్న వారికి నష్టంలేదు. అక్కడ ఉన్న ఒక మతా చార్యుని ఆదేశాల మేరకు ఈ నరమేథం జరిగింది. అయితే ముస్లింలు కూడా ప్రతీకార చర్యలకు తలపడుతున్నారు. వారికి గత్యంతరం కనబడటం లేదు. చట్టాలు లేకనా! ఎంతో దూరం కాదు. నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లక్షింపేటలో మాలలపై మెజారిటీ మతానికే చెందుతామనుకుంటున్న ఒక కులం వారు దాడి చేసి ఐదుగురిని పట్టపగలు నరికి చంపేశారు. అంతకు ముందు జరిగిన అనేక దారుణాలకు, దీనికీ తేడా ఏమీ ఉండదు. దాడి తీవ్రత, క్రూరత్వం ఒకటే. మరణాల సంఖ్య మారుతుంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్లలో దళితుల్ని ఏభై చొప్పున, అరవై చొప్పున ఊచకోత కోస్తుంటారు. మెజారిటీ మత వర్గం ముస్లింల పట్ల జరుపుతున్న హింసాకాండ, ఎస్సీ, ఎస్టీల పట్ల అదే వర్గం జరుపుతున్న మారణకాండ ఎందుకు మళ్లీ మళ్లీ జరుగుతోంది? చట్టాలు లేకనా? లేక అవసరమైన చర్యలు తీసుకోవటానికి నిరాకరించటమా? నేరానికి సంబంధించి మూడు దశలు ఉంటాయి: ఒకటి నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవటం. రెండు: నేరం జరగకుండా నిరోధించటం. మూడు: సహాయ పునరావాస చర్యలు చేపట్టడం. ఇందులో ఏ ఒక్కటీ సవ్యంగా జరగటం లేదు. ఇదిలా జరగడానికి ప్రధాన కారణం, దాడులు చేస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న ‘హిందువులు’. దాడికి గురవుతున్న వారు ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు. వీరు ప్రతిచోటా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ దేశంలో ముస్లింలను, ఎస్సీ, ఎస్టీలను చాలా సులువుగా గుర్తించగలరు. పైగా ఒకే చోట ఉంటున్న వారికి ఆ ఇబ్బంది ఉండదు. వాళ్ల ఇళ్లూ, వాడలు సులువుగా గుర్తుపట్టవచ్చు. చిన్న పుకారు, చిన్న సంఘటన అగ్గిని రేపుతుంది. ఇది పోలీసులకు తెలుసు. ప్రతిసారీ దాడికి ముందే కొంత సమీకరణ జరుగుతుంది. అవసరమైన సరంజామా ముందే పోగు చేసుకుంటారు. ఆయుధాలు ఒక్కొక్కరికీ అందజేసి ఉంచుతారు. కాబట్టి నేరం జరగబోతున్నదని ముందే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. కాని చర్య తీసుకోరు. ఎందుకంటే హత్యాకాండకు సిద్ధమైన వాళ్లు, పాల్పడిన వారు మెజారిటీకీ చెందినవారు. అధికారంలో ఉన్న వారు వారే. పోలీసు విభాగంలో అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. నేర పరిశోధన చేయవలసిన వారు కూడా తల పక్కకు తిప్పుకుంటున్నారు కాబట్టి, వారి విధులను సక్రమంగా నిర్వర్తించటం లేదు కాబట్టి సాక్షాత్తు సుప్రీంకోర్టు తానే స్వయంగా దర్యాప్తును పర్యవేక్షణ చేస్తున్నది. ఈ పరిస్థితి మారనంత కాలం ఇదే పరిస్థితి పునరావృతమవుతుంది. ఎక్కడ జరుగుతుంది న్యాయం? కొత్త చట్టాలు చేయటం కాదు. ఈ బిల్లులో చూపిన అన్ని నేరాలకూ ఐపీసీ సమా ధానం చెబుతుంది. ఆ చట్టం ఉండి, ఆ చట్టం కింద నేరాలకు శిక్షలు వేసినా నేరాలు తగ్గటంలేదు. సంఘటన జరిగిన ఐదు, పది ఏళ్ల వరకూ కేసు అతీగతీ కనపడకపోతే, చివరకు ‘సాక్ష్యాలు చాలవు, లేదా నమ్మదగినవిగా లేవు’ అని కేసులు కొట్టేస్తే బాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇటువంటి పరి స్థితిని చక్కదిద్దటానికి కొత్త చట్టాలు రావాలి. కొత్త దృక్పథం ఏర్పడాలి. మతా నికి, కులానికి, జాతికి అతీతంగా నిష్పాక్షికంగా నేరపరిశోధన, న్యాయ విచారణ జరగాలి. అంబేద్కర్ అన్నట్టు ‘‘ప్రజాస్వామ్యం అనేది మనం తగిలించుకున్న ముసుగు, ప్రధానంగా ఈ దేశం అప్రజాస్వామికమే ఇంకా!’ -
తగ్గుతున్న అల్లర్లు
ముంబై: రాష్ట్రంలో మతకల్లోలాలు, ఉగ్రవాదదాడులు గతంలో చాలాసార్లు సంభవించినా, వాటి సంఖ్య మెల్లగా తగ్గుముఖం పడుతున్నట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా ఇలాంటి అల్లర్లు 50 శాతం తగ్గాయని తెలిపాయి. హింసాత్మక ఘటనల నిరోధానికి పటిష్ట చర్యలు తీసుకోవడం వల్లే సత్ఫలితాలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. అల్లర్ల బాధితుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేయడం సానుకూల మార్పులకు కారణమవుతోంది. దేశవ్యాప్తంగా జరిగిన మతఘర్షణలపై బీజేపీ ఎంపీ గోపీనాథ్ ముండే, శివసేన సభ్యుడు ఆనంద్ పరాంజపే పార్లమెంటులో ఇటీవల అడిగిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి ఆర్పీఎన్ సింగ్ సవివర సమాధానాలు చెప్పారు. కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం వివరాలిలా ఉన్నాయి. మహారాష్ట్రలో 2010లో 117 హింసాత్మక ఘటనలు సంభవించగా, 16 మంది మరణించారు. అయితే ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కేవలం 64 ఘటనలు నమోదుకాగా 11 మంది మృతి చెందారు. మనదేశంలో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా మతఘర్షణలు జరిగాయి. ఈ ఏడాది అక్కడ 500 ఘటనలు జరగగా, 95 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఎలా నియంత్రించారంటే.. మహారాష్ట్రలో గత 15-20 ఏళ్లకాలంలో సంభవించిన మతఘర్షణలు, హింసాత్మక ఘటనలను లోతుగా విశ్లేషించిన అధికారులు, అలాంటివి పునరావృతం కాకుండా నిరోధించడానికి పటిష్ట చర్యలు మొదలుపెట్టారు. మతపరంగా సున్నితపరమైన ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాల్సిందిగా కమిషనర్లు, జిల్లా ఎస్పీలను ఆదేశించారు. మతసారస్య సాధనకు మొహల్లా కమిటీలను నియమించారు. ధుళే జిల్లాలో 2008లో జరిగిన మతఘర్షణలపై మహారాష్ట్ర సీనియర్ అధికారి ఒకరు స్పందిస్తూ... అక్కడ హింసకు దారితీసిన పరిస్థితుల గురించి సమాచారం సేకరించడానికి ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించామని తెలిపారు. ‘చిన్న వివాదం తదనంతరం ఆ జిల్లాలో హింస మొదలయిందని మాకు తెలిసింది. విధుల్లో నిర్లక్ష్యం వహించి తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమైన కొందరు పోలీసు అధికారులను కూడా సస్పెండ్ చేశాం. ధుళే అల్లర్ల నుంచి మేం ఎంతో నేర్చుకున్నాం. మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లోని అన్ని వర్గాల నాయకులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహించి సుహృద్భావ వాతావరణం నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వివరించారు. తరచూ మొహల్లా కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ అశాంతితగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు. ఆ ప్రాంతంలోని సంఘవ్యతిరేక శక్తులపై గట్టి నిఘా పెట్టడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జాగ్రత్తపడుతున్నారు. అంతేకాదు మతఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో శాంతిసాధనకు ముఖ్యమంత్రి, హోంమంత్రి నేతృత్వంలో సమావేశాలు నిర్వహించడం సత్ఫలితాలను ఇచ్చిందని రాష్ట్ర హోంశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘పోలీసుల నిర్లక్ష్యాన్ని మేం ఎంతమాత్రమూ సహించడం లేదు. ఘర్షణల నిరోధంలో విఫలమైన వారిని వెంటనే వెనక్కి పిలిపించి చర్యలు తీసుకుంటున్నాం’ అని ఆయన వివరించారు. నిఘా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడం, అత్యవసర సమయాల్లో బలగాలను రాష్ట్రానికి పంపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం కూడా ఎంతగానో సాయపడిందని ఆయన వెల్లడించారు. ఉగ్రదాడులు, మతఘర్షణలు, నక్సల్స్ దాడుల వల్ల నష్టపోయిన వారికి కూడా కేంద్రం ఆర్థికసాయం అందజేస్తోంది. అల్లర్ల కారణంగా అనాథలుగా మారిన చిన్నారులకు చదువు చెప్పిండానికి కేంద్రం జాతీయ మతసామరస్య సంస్థ కూడా సహకరిస్తోంది. -
నేడు తృతీయ కూటమి నేతల భేటీ
న్యూఢిల్లీ: దేశంలో పేట్రేగుతున్న మతతత్వ దాడులపై లౌకిక వాద పార్టీలు, నేతలు పోరు సాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం నేత సీతారాం ఏచూరి అన్నారు. ఈ క్రమంలో దీనిపై చర్చించేందుకు తృతీయ కూటమి పార్టీల నేతలు బుధవారం ఇక్కడ భేటీ అవుతున్నట్టు మంగళవారం ఆయన తెలిపారు. అయితే, 2014 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సదరు ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకే ఈ భేటీని ఏర్పాటు చేశారా? అన్న పాత్రికేయుల ప్రశ్నను ఏచూరి తోసిపుచ్చారు. ‘ఈ సదస్సుకు, 2014 ఎన్నికలకు ఎలాంటి సంబంధమూ లేదు. లౌకిక విలువలను కాపాడుకునేందుకుగాను మతతత్వంపై ఐకమత్యంగా పోరాడేందుకు అనుసరించాల్సిన వ్యూహంపైనే చర్చ జరగనుంది. మతతత్వంపై పోరాడేందుకు ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని మేం పిలుపునిస్తున్నాం’ అని ఏచూరి స్పష్టం చేశారు. ఈ భేటీకి సీపీఎం, సీపీఐ సహా ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, ఎస్పీ, జేడీయూ, జేడీఎస్, ఏజీపీ, ఏఐఏడీఎంకే, జేవీఎం, బీజేడీ, ఎన్సీపీ, ఆర్పీఐ పార్టీల నేతలు హాజరయ్యే అవకాశం ఉంది. మా ఆహ్వానంపై బాబు స్పందించలేదు: ఏచూరి సాక్షి, న్యూఢిల్లీ: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మీతో కలిసి పనిచేశారు కదా...? మరి, మతతత్వ వ్యతిరేక సదస్సుకు ఆయనను ఆహ్వానించ లేదా...? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీపీఎం నేత సీతారాం ఏచూరి సమాధానమిస్తూ... ఆహ్వానించినా బాబు తన స్పందన తెలియజేయలేదన్నారు. ‘అందరికన్నా ముందు ఆయనను(చంద్రబాబునాయుడు) మేము సదస్సుకు ఆహ్వానించాం. తమ పార్టీలో ఇతర నేతలతో చర్చించిన తర్వాత వచ్చేది రానిది చెబుతానన్నారు. కానీ, ఇప్పటివరకు బాబు ఏ స్పందనను తెలుపలేదు. ’అని ఏచూరి తెలిపారు. కాంగ్రెస్, బీజేపీయేత ర 14 సెక్యులర్పార్టీల నేతలు బుధవారం జరగబోయే మతతత్వ వ్యతిరేక సదస్సులో పాల్గొననున్నారు.