‘గురి’ కుదరని బిల్లు | BJP to oppose communal violence Bill in Parliament | Sakshi
Sakshi News home page

‘గురి’ కుదరని బిల్లు

Published Sat, Jan 11 2014 5:51 AM | Last Updated on Wed, Apr 3 2019 6:20 PM

‘గురి’ కుదరని బిల్లు - Sakshi

‘గురి’ కుదరని బిల్లు

విశ్లేషణ: చిన్న పుకారు, చిన్న సంఘటన అగ్గిని రేపుతుంది. ఇది పోలీసులకు తెలుసు. ప్రతిసారీ దాడికి ముందే కొంత సమీకరణ జరుగుతుంది. అవసరమైన సరంజామా ముందే పోగు చేసుకుంటారు. ఆయుధాలు ఒక్కొక్కరికీ అందజేసి ఉంచుతారు. కాబట్టి నేరం జరగబోతున్నదని ముందే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. కాని చర్య తీసుకోరు.
 
 ‘కొట్టాలని ఉంది కాని, దెబ్బ తగులుతుందేమోనని భయం’ అన్నట్టుగా ఉన్నది 2013, మత, కుల గురి పెట్టిన హింసల బిల్లు. ఇది 2011లోనే తయారైంది. పెనం మీద రొట్టెను అటు ఇటు తిప్పి మాడ్చినట్టు  2013లో మరొక రూపం ఇచ్చారు. దీనిని కేంద్ర ప్రభు త్వం ఆమోదించింది. పార్లమెంటులో ప్రవేశపెట్టాల్సి ఉన్నది. ఇది బీజేపీ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉన్నది. ససేమిరా అంగీకరించనని బీజేపీ చెప్పేసింది కూడా. ఆ పార్టీ అంగీకరిస్తుందన్న ఆశతోనే మొదటి బిల్లును సవరించి, 2013 బిల్లు అని పేరు పెట్టి లోక్‌సభలో ప్రవేశపెట్టాలని చూస్తున్నారు ఇప్పుడు.
 
 బీజేపీకి ఏమిటి అభ్యంతరం!
 2011 బిల్లును ఒప్పుకోని బీజేపీని కొంత మెత్తపరచడానికి ఒకటి రెండు మార్పులు చేశామన్నారు. అయినా విపక్షం అంగీకరించేటట్లు లేదు. బీజేపీని దెబ్బ తీయడానికీ, ‘చూశారా! మేం ఎంత లౌకికవాదులమో!’ అని చెప్పుకో వటానికీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఈ బిల్లుతో విన్యాసాలు చేస్తున్నది. అంతగా బీజేపీ అభ్యంతరం పెట్టే అంశాలేమున్నాయి అందులో? ఈ బిల్లులో ప్రధానంగా పదమూడు రకాల నేరాలను పేర్కొన్నారు. కొన్ని మతానికి సంబం ధించిన హింసాత్మక ఘటనలు, కొన్ని కులానికి సంబంధించినవి, మరికొన్ని ‘గురిపెట్టిన హింస’కు సంబంధించినవి. అంటే ఒక మతానికి లేదా కులానికి లేదా సమూహానికి చెందిన వ్యక్తులను లక్ష్యం చేసుకొని దాడి చేయటం, ఇళ్లు తగలబెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయటం, పురుషులను చంపటం, పసిపిల్ల అని కూడా చూడకుండా ముక్కలు ముక్కలుగా నరికివేయటం, మనుషుల్ని చంపి మంటల్లో విసిరివేయటం, స్త్రీలను వారి కుటుంబ సభ్యులు చూస్తుండగా నగ్నం చేసి సామూహిక మానభంగానికి గురిచేసి చంపేయటం వంటి ఘోరకృ త్యాలు చేసి వికటాట్టహాసం చేస్తూ విజయోత్సవంలో కరాళనృత్యం చేయటం వంటి నేరాలు ఉన్నాయి.
 
 ఇటువంటి సంఘటనలు ముఖ్యంగా భారత శిక్షా స్మృతి (ఐపీసీ) కిందకి వస్తాయి. వీటికి సంబంధించిన దర్యాప్తు నేర విచారణ లాంటివి సీఆర్‌పీసీ కింద జరుగుతాయి. అయినా కొత్తగా ఏవో నిబంధనలు ప్రవేశపెడుతున్నట్టు బీజేపీ గగ్గోలుపెడుతున్నది. కులానికి సంబంధించిన నేరా లు కూడా ఐపీసీ కిందకే వస్తాయి. అయితే న్యాయవిచారణ త్వరగా జరిపించ డానికి, జాప్యంలేకుండా ముద్దాయిలను అరెస్టుచేసి విచారణ జరిపి శిక్షలు వేయించటానికి, దీనికోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పరచటం వంటివి ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద జరిపిస్తున్నారు. అవే నేరాలకు మళ్లీ ఈ బిల్లులో ప్రవేశపెట్టారు. అయితే ఒక కొత్త నేరాన్ని ప్రవేశ పెట్టారు. నిజానికి ఇదీ పాతదే. రూపం కొత్తది. ‘గురి పెట్టిన హింస’ అనేది ఒక మతానికి లేదా ఒక కులానికి, ఒక తెగకు లేదా ఒక సమూహానికి చెందిన వారిని గురిచేసి వారిపై హింసాకాండ జరపటం. అదే విధంగా ద్వేష ప్రభావం. ఇదీ పాతదే.
 
 పేర్లు మారిస్తే చాలదు
 జరగవలసింది ఏమిటంటే నేరాలు క్రోడీకరించి శిక్షలు సూచించటం కాదు. నేరం జరగకుండా చూడటం, నేరం జరిగిందని తెలిస్తే పోలీసులు వెంటనే రంగంలోకి దిగి నేరగాళ్లను అరెస్టు చేయటం, విచారణ ప్రక్రియను వేగవంతం చేయటం. అంతేకాని సమాజంలో జరుగుతున్న అవే నేరాలకు పేరు మార్చి శిక్షలు పెంచి ‘నేరాలను అరికట్టడానికి మేము ఏ చర్యలు తీసుకుంటున్నామో చూడండి’ అని చెప్పటం కాదు. నేరాన్ని ఆపలేకపోతే నేరం జరిగిన వెంటనే తీసుకోవలసిన చర్యలు తీసుకుంటే అవి మళ్లీ మళ్లీ జరగకుండా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటువంటి నేరాలు క్షణికోద్రేకంలో చేసినవి కావు. మత కలహాలు తలెత్తే అవకాశం ఉందని ముందే తెలిసిపోతుంది. అలాగే ఎస్సీ, ఎస్టీలపై దాడి జరగబోతుందని ముందే తెలుస్తుంది. వాటిని సులువుగా అరికట్ట వచ్చు. మత లేదా కుల ఘర్షణ జరగబోతుందని తెలిసినప్పుడు పోలీసులు రంగంలోకి దిగటం లేదు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి జరుగుతున్న మత కలహాలు, కుల దాడులు చూస్తే ఇదే దృశ్యం పదే పదే కనబడున్నది. కొన్ని కొన్ని సందర్భాలలో పోలీసులే లేదా రాజకీయ నాయకులే రంగంలో ఉండి దాడులు జరిపిస్తారు.
 
 ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా?
 ముజఫర్ నగర్‌లో ఇటీవల జరిగిన మారణహోమం చూస్తే అది ఎంత పకడ్బం దీగా, స్థానిక నాయకుల అండదండలతో జరిగిందో తెలుస్తుంది. పిల్లలని చూడక, స్త్రీలని చూడక, ముసలి వాళ్లని చూడక, గర్భిణులని చూడక వారిపై ఎంత అమానుషంగా హింసాకాండ సాగించారో ఊహకందదు. గర్భిణుల గర్భాన్ని చీల్చి అందులోని పిండాలను, పెరుగుతున్న శిశువులను కత్తులతో ముక్కలు ముక్కలుగా నరికి చంపి వేసిన సంగతి లాంటిది ఏ దేశంలోనూ, ఏ ఆటవిక సమాజాలలోను జరిగి ఉండదు! నిన్నటి వరకూ ఇరుగు పొరుగుగా జీవిస్తున్న వారు, ఉప్పు పప్పు పంచుకున్న వారు, ఒకే మంచంపై కూర్చుని హుక్కా పీల్చిన వారు ఆ తెల్లవారి అంత అకృత్యానికి పాల్పడుతున్నారంటే అది ఉద్రేకంతో చేసినవి కావు. మెజారిటీ మతం అని చెప్పుకుంటున్న వారు మైనారి టీల పట్ల ఇంత ద్వేషాన్ని కడుపులో పెట్టుకు తిరుగుతున్నారంటే నిర్ఘాం తపరుస్తుంది. ఒడిశాలో ఆదివాసీలపై జరిపిన మారణహోమం కూడా ఇలాం టిదే.
 
 ఒక క్రైస్తవ డాక్టరు భారతదేశానికి వచ్చి, ఇదే తన సొంత దేశంగా చేసు కొని, ఆదివాసీలకు వైద్య సేవలందిస్తున్నాడు. అతని సేవానిరతికి మానవతా దృక్పథానికి ఆకర్షితులైనవారు, వైద్య సేవలు పొందిన వారు క్రైస్తవ మతం వైపు ఆకర్షితులైతే అయుండవచ్చు. అందులో తప్పేమీ లేదు. అది నేరమూ కాదు. పాపమూ కాదు, అనైతికమూ కాదు. ఆదివాసీలనందరినీ క్రైస్తవ మతంలోకి మార్చివేస్తున్నాడన్న అభియోగంపై ఆ డాక్టర్ స్టెయిన్స్‌ని, అతని కొడుకులిద్దర్ని పెట్రోలు పోసి సజీవదహనం చేశారు. ఇది క్షణికోద్రేకంతో చేసిన పని అనగ లరా? ఒక జిల్లా అంతటా స్వైరవిహారం చేసి భీతావహం సృష్టించారు. ఇదీ యాదృచ్ఛికం కాదు. ఆదివాసీలు హిందువులు కాదు. వారు తెగలు. హిందూ మతంలో ఉన్న కులాలకూ, వారికీ సంబంధం లేదు. వారు క్రైస్తవ మతంలోకి వెళ్లినా హిందువులనుకుంటున్న వారికి నష్టంలేదు. అక్కడ ఉన్న ఒక మతా చార్యుని ఆదేశాల మేరకు ఈ నరమేథం జరిగింది. అయితే ముస్లింలు కూడా ప్రతీకార చర్యలకు తలపడుతున్నారు. వారికి గత్యంతరం కనబడటం లేదు.
 
 చట్టాలు లేకనా!
 ఎంతో దూరం కాదు. నిన్ననే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లక్షింపేటలో మాలలపై మెజారిటీ మతానికే చెందుతామనుకుంటున్న ఒక కులం వారు దాడి చేసి ఐదుగురిని పట్టపగలు నరికి చంపేశారు. అంతకు ముందు జరిగిన అనేక దారుణాలకు, దీనికీ తేడా ఏమీ ఉండదు. దాడి తీవ్రత, క్రూరత్వం ఒకటే. మరణాల సంఖ్య మారుతుంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, బీహార్‌లలో దళితుల్ని ఏభై చొప్పున, అరవై చొప్పున ఊచకోత కోస్తుంటారు. మెజారిటీ మత వర్గం ముస్లింల పట్ల జరుపుతున్న హింసాకాండ, ఎస్సీ, ఎస్టీల పట్ల అదే వర్గం జరుపుతున్న మారణకాండ ఎందుకు మళ్లీ మళ్లీ జరుగుతోంది? చట్టాలు లేకనా? లేక అవసరమైన చర్యలు తీసుకోవటానికి నిరాకరించటమా?
 
 నేరానికి సంబంధించి మూడు దశలు ఉంటాయి: ఒకటి నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవటం. రెండు: నేరం జరగకుండా నిరోధించటం. మూడు: సహాయ పునరావాస చర్యలు చేపట్టడం. ఇందులో ఏ ఒక్కటీ సవ్యంగా జరగటం లేదు. ఇదిలా జరగడానికి ప్రధాన కారణం, దాడులు చేస్తున్న వారు ఎక్కువ సంఖ్యలో ఉన్న ‘హిందువులు’. దాడికి గురవుతున్న వారు ముస్లింలు, ఎస్సీ, ఎస్టీలు. వీరు ప్రతిచోటా తక్కువ సంఖ్యలో ఉంటారు. ఈ దేశంలో ముస్లింలను, ఎస్సీ, ఎస్టీలను చాలా సులువుగా గుర్తించగలరు. పైగా ఒకే చోట ఉంటున్న వారికి ఆ ఇబ్బంది ఉండదు. వాళ్ల ఇళ్లూ, వాడలు సులువుగా గుర్తుపట్టవచ్చు.
 
 చిన్న పుకారు, చిన్న సంఘటన అగ్గిని రేపుతుంది. ఇది పోలీసులకు తెలుసు. ప్రతిసారీ దాడికి ముందే కొంత సమీకరణ జరుగుతుంది. అవసరమైన సరంజామా ముందే పోగు చేసుకుంటారు. ఆయుధాలు ఒక్కొక్కరికీ అందజేసి ఉంచుతారు. కాబట్టి నేరం జరగబోతున్నదని ముందే పోలీసుల దగ్గర సమాచారం ఉంటుంది. కాని చర్య తీసుకోరు. ఎందుకంటే హత్యాకాండకు సిద్ధమైన వాళ్లు, పాల్పడిన వారు మెజారిటీకీ చెందినవారు. అధికారంలో ఉన్న వారు వారే. పోలీసు విభాగంలో అధికారం వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. నేర పరిశోధన చేయవలసిన వారు కూడా తల పక్కకు తిప్పుకుంటున్నారు కాబట్టి, వారి విధులను సక్రమంగా నిర్వర్తించటం లేదు కాబట్టి సాక్షాత్తు సుప్రీంకోర్టు తానే స్వయంగా దర్యాప్తును పర్యవేక్షణ చేస్తున్నది. ఈ పరిస్థితి మారనంత కాలం ఇదే పరిస్థితి పునరావృతమవుతుంది.
 
 ఎక్కడ జరుగుతుంది న్యాయం?
 కొత్త చట్టాలు చేయటం కాదు. ఈ బిల్లులో చూపిన అన్ని నేరాలకూ ఐపీసీ సమా ధానం చెబుతుంది. ఆ చట్టం ఉండి, ఆ చట్టం కింద నేరాలకు శిక్షలు వేసినా నేరాలు తగ్గటంలేదు. సంఘటన జరిగిన ఐదు, పది ఏళ్ల వరకూ కేసు అతీగతీ కనపడకపోతే, చివరకు ‘సాక్ష్యాలు చాలవు, లేదా నమ్మదగినవిగా లేవు’ అని కేసులు కొట్టేస్తే బాధితులకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇటువంటి పరి స్థితిని చక్కదిద్దటానికి కొత్త చట్టాలు రావాలి. కొత్త దృక్పథం ఏర్పడాలి. మతా నికి, కులానికి, జాతికి అతీతంగా నిష్పాక్షికంగా నేరపరిశోధన, న్యాయ విచారణ జరగాలి. అంబేద్కర్ అన్నట్టు ‘‘ప్రజాస్వామ్యం అనేది మనం తగిలించుకున్న ముసుగు, ప్రధానంగా ఈ దేశం అప్రజాస్వామికమే ఇంకా!’   

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement