bojja tharakam
-
దళితుల హక్కులే ఊపిరిగా ఉద్యమించిన తారకం
విరసం నేత వరవరరావు అమలాపురం టౌన్ : దళితుల హక్కులే ఊపిరిగా ఉద్యమించిన నేత బొజ్జా తారకమని విరసం నేత వరవరరావు కొనియాడారు. తలపండిన రాజకీయ నేతగా... సమాజాన్ని కాచి వడబోసిన సామాజికవేత్తగా...న్యాయ కోవిదుడిగా... ఉద్యమ నేతగా దళితుల అభ్యున్నతి కోసం తారకం పోషించిన పాత్రలు సమాజాన్ని తట్టి లేపాయని చెప్పారు. భారత రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో అమలాపురం గడియారం స్తంభం సెంటరులో శనివారం సాయంత్రం జరిగిన బొజ్జా తారకం సంస్మరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగిస్తూ ప్రధానిమంత్రిగా మోదీ పదవి చేపట్టాక దేశంలో దళితులపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. చివరకు ఆవుల చర్మాలు వలుచుకుని కుల వృత్తితో జీవించే చర్మకారులపై కూడా గోవుల ముసుగులో కోనసీమలో దాడులు జరగటం బాధాకరమన్నారు. రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమాల సుధీర్ అధ్యక్షతన జరిగిన సభకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.అంజయ్య, మరో విరసం నేత యు.భీమారావు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రత్యేక అతి«థులుగా హాజరై తారకం ఉద్యమ త్యాగాలను కొనియాడారు. కోనసీమ నుంచే తారకం తన ఉద్యమ పంథాకు పదును పెట్టి తన పోరాట గళాన్ని ఉభయ రాష్ట్రాల్లోనే కాకుండా ఢిల్లీలో కూడా వినిపించారని ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు అంజయ్య అన్నారు. తొలుత తారకం చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. పీసీపీ ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, జిల్లా మానవ హక్కుల వేదిక అధ్యక్షుడు నామాడి శ్రీధర్‌తో పాటు ఆర్పీఐ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు. -
సమానత్వం కోసం పోరాడిన యోధుడు బొజ్జతారం
– సంస్మరణ సభలో ప్రొఫెసర్ శేషయ్య ప్రొద్దుటూరు టౌన్: అన్యాయాలను ప్రశ్నించడానికి హక్కులే ఆయుధాలని, సమానత్వం కోసం జీవిత కాలం పోరాటం చేసిన యోధుడు బొజ్జా తారకం అని ప్రొఫెసర్ శేషయ్య అన్నారు. బొజ్జా తారకం సంస్మరణ సభను పట్టణంలోని శ్రీరాములపేటవీధిలో ఉన్న సీఆర్సీ భవనంలో బుధవారం విరసం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ మాట్లాడుతూ పీడిత ప్రజల హక్కుల గొంతుగా బొజ్జాతారకం తెలుగు జాతి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. ఎమర్జన్సీ నేర్పిన నిర్బంధ పాఠశాలలోనే బొజ్జా తారకం పుస్తకం రాశారన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ సజావుగా ఉండాలంటే హక్కుల ఉల్లంఘన లేకుండా ఉండటమే ప్రమాణమని వివరించారు. విరసం రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి మాట్లాడుతూ బొజ్జా తారకం 1970లో ఏర్పడిన విరసం మొదటి మహాసభలో కార్యవర్గ సభ్యుడన్నారు. కార్యక్రమంలో విరసం కార్యవర్గ సభ్యుడు రవి, సాహితీ వేత్త డాక్టర్ రామచంద్ర, జింకా సుబ్రమణ్యం, కేశవరావు, సుబ్బయ్య, మహమూద్, ఉపాధ్యాయులు, జేవీవీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌రావు, దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమానికి అనంతపురం విరసం యూనిట్ కన్వీనర్ డాక్టర్ శశికళ అధ్యక్షత వహించారు. -
బొజ్జా తారకంకు హైకోర్టు ఘన నివాళి
సాక్షి, హైదరాబాద్: ఇటీవల మృతి చెందిన సీనియర్ న్యాయవాది బొజ్జా తారకంకు ఉమ్మడి హైకోర్టు మంగళవారం ఘనంగా నివాళులు అర్పించింది. తారకంకు నివాళులు అర్పించేందుకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలో న్యాయమూర్తులందరూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో తారకం కుటుంబ సభ్యులు, తెలంగాణ అదనపు ఏజీ రామచంద్రరావు, ఏపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోసాని వెంకటేశ్వర్లు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. న్యాయవ్యవస్థకు తారకం చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. అణగారిన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేశారని ఏసీజే అన్నారు. తారకం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం అంతా రెండు నిమిషాల పాటు మౌనం పాటించి సంతాపం తెలిపారు. -
‘బొజ్జా తారకం సేవలు మరువలేనివి’
నిర్మల్ టౌన్ : బొజ్జా తారకం సేవలు మరువలేనివని పలువురు నాయకులు పేర్కొన్నారు. పట్టణంలోని టీఎన్జీవో సంఘ భవనంలో మంగళవారం దళిత సంఘాల ఆధ్వర్యంలో బొజ్జా తారకం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బొజ్జాతారకం మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న దాడులపై ఆయన ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. తన కలంతో దళితులను చైతన్యవంతులను చేశారని పేర్కొన్నారు. ప్రజల కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన బొజ్జాతారకం మనలో లేకపోవడం విచారకరమన్నారు. ఈ సందర్భంగా ఆయన మతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. టీఎన్జీవో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రభాకర్, అమర్నాథ్రెడ్డి, దళిత సంఘాల నాయకులు డి. రాములు, బొడ్డు లక్ష్మణ్, జగన్మోహన్, అంబకంటి ముత్తన్న, ప్రభాకర్, వై. సాయన్న తదితరులు పాల్గొన్నారు. -
అస్తమయం
గుడి, జైలు... బంధించడానికే రెండూ! ఇద్దరు డిటెన్యూలు చాలా గొప్ప విషయాలు చెప్పారు. వారి దగ్గర రోజూ కూర్చుని నోట్స్ వ్రాసుకున్నాను. ఇంతవరకూ తెలుగు సాహిత్యంలోకి రాని విషయాలు సేకరించాను. రెండు నవలలుగా వ్రాయాలనుకున్నాను. ఆ నోట్స్ జైల్లో ఉండే పోలీస్ అధికారి కంటబడింది. తీసుకున్నాడు. నా ఎదుటనే కాల్చివేశాడు. 1975 జూన్ ఇరవై ఆరో తారీఖున అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కొన్ని వేల మందిని జైళ్ళలో నింపారు. దేశం అంతా భయం ఆవరించింది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అరెస్టయ్యారు. ‘ఇందిరాగాంధీ విధానాలు వ్యతిరేకిస్తున్నారు’ అనుకున్నవాళ్ళను అరెస్టు చేశారు. రాజకీయ కార్యకర్తలకు ఎలానూ తప్పదు; రచయితలను కూడా అరెస్ట్ చేశారు. ‘‘ప్రజలతో ఇప్పటికే చాలా సంబంధాలు పెట్టుకున్నాడు, అంతేకాదు ఇతను రచయిత కూడా’’ అని పోలీసులు నా గురించి రిపోర్టులు పంపిస్తున్నారు ఎప్పటినుంచో. జూలై నాలుగో తారీఖు... సాయంత్రం కొంచెం ఆలస్యంగా వచ్చాను కోర్టు నుంచి. చీకటి పడింది. కొద్దిగా చినుకులు పడుతున్నాయి. పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ‘మిమ్మల్ని ఎస్.పి. గారు రమ్మంటున్నారు’ అన్నాడు. నాకు అర్థమయింది. భారతితో(బి.విజయభారతి) చెప్పాను ‘అరెస్టు చేస్తారు’ అని. పోలీస్ జీప్‌లో వెళ్ళాను. ఎస్.పి. గారింటివద్ద పోలీసు వ్యాన్లు... జీప్‌లు... హడావుడిగా ఉంది. ఆయన చెప్పారు ‘‘మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’’ అని. ‘మరి ఇంట్లో చెప్పి వస్తాను’ అన్నాను. అదే జీప్‌లో పంపించారు. అప్పటికే జీప్ నిండా తుపాకీ పట్టుకున్న పోలీసులు. ఇంటికి వెళ్ళేసరికి చుట్టూ పోలీసు కాపలా. లోపలికి వెళ్తుంటే నా కూడా తుపాకీతో పోలీసు... నిజామాబాద్‌లో మొదటి అరెస్ట్... పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్ళారు. ఆ తర్వాత ఒకర్నీ ఒకర్నీ పట్టుకొచ్చారు. దాదాపు పదిహేను మంది. ఆ రాత్రంతా మెలకువతోనే ఉన్నాను. చూడడానికి వచ్చిన జనాన్ని చెదరగొట్టేశారు. పోలీసు స్టేషన్లో రెండు రోజులుంచారు. ఆ తర్వాత కోర్ట్‌లో హాజరు పరిచి జైలుకు తీసుకువెళ్ళారు. నిజామాబాద్ జైలు చాలా ఎత్తై కొండమీద ఉంది. పెద్ద పెద్ద మెట్లు ఎక్కి వెళ్ళాలి. దేవాలయాన్ని నిజాం ప్రభుత్వం జైలుగా మార్చిందంటారు. ఎవరో ఒకర్ని బంధించడానికే రెండూను. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత్వం వ్రాసినందుకు దాశరథిని ఇదే జైల్లో ఉంచారు. రచయితగా నేను రెండోవాడిని. జైల్లో ఒక రాత్రి బాగా జ్వరం వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకు వెళ్తామన్నారు. బేడీలు వేస్తామన్నారు. నేను రానన్నాను. తప్పదన్నారు. జ్వరం తీవ్రంగా ఉంది. హాస్పిటలుకు వెళ్ళక తప్పలేదు. నాకు బేడీలు వేసినందుకు డిటెన్యూలంతా బాధపడ్డారు. భారత రక్షణ చట్టం క్రింద మమ్మల్ని అరెస్టు చేశారు; కాబట్టి బెయిలు కోసం దరఖాస్తు పెట్టాము. కోర్టు బెయిలు ఇచ్చింది. బెయిలు ఆర్డరు కంటే ముందుగానే పోలీసు వ్యాన్లు వచ్చాయి జైలుకు. జైలంతా తెలిసిపోయింది మళ్ళీ అరెస్టు చేస్తారని. నాతో మరో ఇద్దర్ని విడుదల చేయమని కోర్టు ఆర్డర్. ముగ్గురమూ కిందికి దిగి వచ్చాం. పోలీసు ఇన్స్పెక్టర్ సరిగ్గా మెట్ల దగ్గర ఉన్నాడు... చుట్టూ సాయుధులైన పోలీసులు... వాళ్ళిద్దర్నీ ఏమీ అనలేదు. నన్నొకణ్ణే అరెస్టు చేశారు... ఈసారి ఆంతరంగిక భద్రతా చట్టం క్రింద. పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్ళారు... కందికుప్ప నుంచి నాన్న వచ్చారు. ఆ రాత్రే తీసుకువచ్చారు చెంచల్గూడా సెంట్రల్ జైలుకు. జ్వరంలోనే తీసుకు వచ్చారు. రాత్రి ఒంటిగంటకు బస్‌లో ప్రయాణం. నాకు రెండు వైపులా తుపాకీలతో పోలీసులు. అరెస్టు అయిన వ్యక్తి కంటే చూసేవాళ్ళు హడలిపోవాలి... అక్కడ దాదాపు సంవత్సరం ఉన్నాను. డిటెన్యూలు రెండు వందల మందిపైగా. వారందరితో జైలు జీవితం చాలా గొప్ప అనుభవం. జైలులో డైరీ వ్రాస్తూ ఉండేవాడిని. మొదటి మూడు నెలలు ఎవర్నీ కలవనివ్వలేదు. ఎవర్నీ చూడడానికి రానివ్వలేదు. ఉత్తరాలు కూడా లేవు. మేమంతా హైకోర్టుకు వెళ్తే ‘నెలకొక వ్యక్తి చూడొచ్చు’ అన్నారు. అదయినా చాలా దగ్గర బంధువు. దానిని కొన్నాళ్ళకు పదిహేను రోజుల కొకసారి చేశారు. ఆ నిర్బంధ వాతావరణంలో వ్యక్తుల మనస్తత్వాలు చాలా చిత్రంగా ఉండేవి. నిర్బంధం, ఒత్తిడి మనస్సుపై ఎంత ప్రభావం చూపుతాయో జైల్లో ప్రత్యక్షంగా చూశాను. ఇద్దరు డిటెన్యూలు చాలా గొప్ప విషయాలు చెప్పారు నాకు. వారి దగ్గర రోజూ కొంతసేపు కూర్చుని నోట్స్ వ్రాసుకున్నాను. ఇంతవరకూ తెలుగు సాహిత్యంలోకి రాని విషయాలు సేకరించాను. గత ఏభై ఏళ్ళ చరిత్ర అది. రెండు ప్రాంతాల గాథలవి. రెండు పోరాట కథలు... చాలా గొప్ప కథలు... ఇద్దరివీ గొప్ప అనుభవాలే... రెండు నవలలుగా వ్రాయాలనుకున్నాను. ఆ నోట్స్ జైల్లో ఉండే స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారి కంటబడింది. తీసుకున్నాడు. నా ఎదుటనే కాల్చివేశాడు. ఎంత బాధపడ్డానో చెప్పలేను. మూడు నెలలయిన తర్వాత కొందరం హైకోర్టులో రిట్ వేశాం. కోర్టుకు మమ్మల్ని తీసుకు వెళ్ళేవారు.. బయట ప్రపంచాన్ని చూడటం అదే... చాలా రోజులు విచారణ చేసి విడిచి పెట్టేశారు... కోర్టు బయటికి వస్తుంటేనే పోలీసులు అంటున్నారు... ‘మళ్లీ అరెస్ట్ చేస్తామ’ని. కొందరు కోర్టు నుంచే సరాసరి వెళ్ళిపోయారు. మేం జైలుకు వచ్చాం. గబగబ సర్దుకొని బయటపడ్డాం. ఆ రాత్రి హైద్రాబాద్‌లోనే ఉన్నాను. ఉదయం పోలీసులు వచ్చారు. మళ్ళీ అరెస్ట్ చేశారు. జైలుకు వెళ్ళేసరికి చాలామందిని అప్పటికే తీసుకొచ్చేశారు. మళ్ళీ మామూలు కథే... అలా ఆరు నెలలు గడిచిపోయాయి. ఒక రోజు ఎందుకో హఠాత్తుగా ‘నీతో చెప్పనే లేదు’ అన్న వాక్యాలు వచ్చాయి... వ్రాశాను... ఆ తర్వాత... ఏదో ఆలోచన ఉబికి వచ్చేది... వాక్యాలు తొణికి వచ్చేవి... వ్రాసుకుంటూ వెళ్ళిపోయాను. మిత్రులకు చదివి వినిపిస్తుండే వాడిని. మెచ్చుకొనేవారు. శివుని త్రిశూలంలా ఉండేవి పువ్వులు ఒక చెట్టుకి... ఆ చెట్టు కింద కూర్చుని చదువుకొనేవాణ్ణి. అక్కడే కూర్చుని వ్రాసుకుంటూ ఉండేవాడిని. (సెప్టెంబర్ 16న మరణించిన దళిత, వామపక్ష, పౌరహక్కుల ఉద్యమనేత, న్యాయవాది, రచయిత బొజ్జా తారకం... 1983 మార్చిలో తన కవితా సంకలనం ‘నది పుట్టిన గొంతుక’కు రాసుకున్న ముందుమాటలోంచి...) బొజ్జా తారకం 27 జూన్ 1939 - 16 సెప్టెంబర్ 2016 -
హక్కుల యోధుడికి అశ్రు నివాళి
⇒ కడసారి వీడ్కోలు పలికిన అభిమానులు, ప్రముఖులు ⇒ నివాళులర్పించిన డిప్యూటీ సీఎంలు కడియం, మహమూద్, పలువురు మంత్రులు, వైఎస్సార్సీపీ అధినేత జగన్ సాక్షి, హైదరాబాద్: హక్కుల యోధుడు, ప్రముఖ న్యాయవాది, సాహితీవేత్త బొజ్జా తార కం అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానం శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దళిత, పౌరహక్కుల కార్యకర్త లు, అభిమానులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చి హక్కుల సూరీ డుకి అంతిమ వీడ్కోలు పలికారు. ‘నీల్ సలామ్.. నీల్ సలామ్’...‘కోనసీమ ముద్దుబిడ్డ..నీల్ సలామ్..’ ‘బొజ్జా తారకం అమర్ రహే’..‘దళిత ముద్దుబిడ్డ అమర్ రహే..’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. మహప్రస్థానం శక్తిస్థల్‌లోని విద్యుత్ దహనవాటికలో ఆయన కుమారుడు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ముగించారు. అంతకుముందు మధ్యాహ్నం 2.30 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించా రు. అక్కడ్నుంచి తారకం భౌతికకాయాన్ని మహాప్రస్థానం శ్మశానవాటికకు తరలిం చారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సురేంద్రమోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. తరలివచ్చిన ప్రముఖులు బొజ్జా తారకం భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు, రాజకీయ పార్టీలు, ప్రజా సం ఘాల నేతలు, మేధావులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తరలివచ్చారు. అశోక్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి పార్థివ దేహాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తీసుకువచ్చి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉంచారు. వివిధ జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున అభిమానులు రావడంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం పరిసరాలు కిక్కిరిసిపోయాయి. వైఎస్ జగన్ , ప్రముఖుల నివాళి బొజ్జా తారకం భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన వెంట పార్టీ నేతలు పార్థసారథి, పినిపె విశ్వరూప్ తదితరులున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నారుుని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి, టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ నేత కె.నారాయణ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, విరసం నేత వరవరరావు, ప్రజా గాయకుడు గద్దర్, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి తదితరులు తారకం పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. బొజ్జా తారకం మృతిపట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. -
దళిత ఉద్యమ శిఖరం తారకం
దళిత ఉద్యమ సముత్తేజం, అలుపెరుగని పౌరహక్కుల ఉద్యమ సేనాని, రచయిత, మేధావి, దళిత రాజకీయవేత్త, తెలుగునేల మీద ప్రత్యామ్నాయ సంస్కృతి నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన బొజ్జా తారకం (జూన్ 27, 1939-సెప్టెంబర్ 16, 2016) నిర్యాణం దళితులకే కాదు, మానవ హక్కుల ఉద్యమానికే తీరని లోటు. ఈ ఐదు దశా బ్దాల్లో తెలుగునేలలో ఆవిర్భవించిన మేధావుల్లో తారకం ఒకరు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కంది కుప్పలో బొజ్జా మావులమ్మ, అప్పలస్వామి దంపతులకు ఆయన జన్మించారు. అప్పల స్వామి కూడా దళిత రాజకీయ ఉద్యమకారుడే. శ్రీమతి తారకం బొజ్జా విజయభారతి ప్రఖ్యాత కవి బోయి భీమన్న కుమార్తె. ప్రముఖ రచయిత్రి. తారకం గొప్ప మనిషి. ఇంగ్లిష్, తెలుగు భాషల్లో అనర్గళమైన పాండిత్యం ఆయనది. అంబేడ్కర్ రచనలో 1, 4 భాగాల తెలుగు అనువాదానికి సంపాదకత్వం వహించారు. బాబాసాహెబ్ జీవితంలో కీలక ఘట్టాల్ని అనువదించారు. ఆయనకు తెలుగు సాహిత్యం మీద కూడా సాధికారత ఉంది. విరసంలో ఆయన ఉన్న ప్పుడు హిందూ సామ్రాజ్యవా దాన్ని ప్రశ్నించే గ్రంథాలు తీసుకురావాలని వాదించారు. రాజ్యాంగం మీద ఆయనకున్న సాధికారత అసమాన్యమైంది. ‘పోలీసులు అరెస్ట్ చేస్తే’, ‘కులం వర్గం’, ‘నేల- నాగలి- మూడెద్దులు’, ‘పంచతంత్రం’ వంటి రచనలతో బహు ముఖీనమైన కృషి చేశారు. మా ఇద్దరిది నలభై ఏళ్ల బంధం. కారంచేడు దురంతంలో నాతోపాటు ఉద్యమ నిర్మాణంలో పాలుపంచుకుని, దళితులకు స్ఫూర్తి దాత అయ్యాడు. ఆ ఉద్యమంలో సీబీసీఐడీ జ్యుడీ షియల్ ఎంక్వైరీలోకి ప్రధాన ముద్దాయి దగ్గుబాటి చెంచురామయ్య రానప్పుడు ప్రైవేట్ కేసు వేసి ఆయ నను చీరాల కోర్టుకు నడిపించారు. ఉద్యమంలో భాగంగా నేను విశాఖ జైలులో ఉంటే, మా అమ్మ, నా భార్య స్వర్ణకుమారితో కలసి ఎన్.టి. రామారావు ఇల్లు చుట్టుముట్టి పోరాటం చేసి నన్ను విడిపించారు. ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభను రూపొందించే క్రమంలో వందలాది సభల్లో మేమిద్దరం కలసి మాట్లాడాము. 1985 నుంచి 1989 వరకు ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభకు ఆయన అధ్యక్షుడు, నేను ప్రధాన కార్యదర్శిని. దళిత మహాసభ నిర్వహించిన అనేక సభల్లో రాజ్యాంగ హక్కుల గురించి సామాన్య ప్రజలకు అర్థమయ్యే పద్ధతిలో వివ రించేవారు. అంబేడ్కర్ బోధనలను కూడా సరళమైన భాషలో ఆవిష్కరించేవారు. కారంచేడు నుండి దళిత అనే శబ్దాన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యతా శబ్దంగా తీసు కెళ్లటమేకాక ప్రత్యామ్నాయ తత్వవేత్తలైన బుద్ధుడు, మహాత్మాఫూలే, అంబేడ్కర్, పెరి యార్ రామస్వామినాయకర్ ఆలోచనలను ఆంధ్రదేశంలో ముందుకు తీసుకువెళ్లారు. దేశ వ్యాప్తంగా ఉన్న దళిత నాయకులందరినీ మేము ఏకం చేశాం. రామ్‌దాస్ అటాలే (ముంబై), జోగేందర్ కవాడే (నాగ్‌పూర్), దళిత్ ఏలుమలై (తమిళనాడు), సి.ఆర్.దాస్ (కేరళ, కొట్టాయం), భగవాన్‌దాస్ (ఢిల్లీ), ప్రకాశ్ అంబేడ్కర్ (ముంబై) వంటి దళిత మేధావులను, నాయకులను ఆహ్వానించి దళిత స్ఫూర్తిని జాతీయస్థాయికి తీసుకెళ్లడానికి నాతో కలసి తారకం ఎంతో శ్రమించారు. ఆంధ్రదేశంలో దళితులపై జరిగిన దాడుల ఘటనల్లో హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు న్యాయపోరాటం తీసుకువెళ్లడంలో ఆయనది అద్వితీయమైన పాత్ర. నిజామాబాద్ జిల్లాలో అంబేడ్కర్ యువజన సంఘాన్ని నిర్మించి, తెలంగాణ దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారు. హిందూ సామ్రాజ్యవాదానికి ఎదురు తిరగకుండా కమ్యూనిస్టులు ఏమీ సాధించ లేరని దళిత ఉద్యమం తెలియచెప్పగలిగింది. మార్క్సిస్ట్, లెనినిస్టులు, మావోయిస్టులు, మార్క్సిస్ట్ సాంప్రదాయవాదులు దళిత ఉద్యమం బ్రాహ్మణవాదానికి నిజమైన ప్రత్యా మ్నాయం అని తెలుసుకోలేని సందర్భంలో దళిత ఉద్యమం తారకంగారి రచనల ద్వారా, నా రచనల ద్వారా ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక, సాహిత్య వ్యవస్థని నిర్మించింది. దళిత ఉద్యమ స్ఫూర్తి నుంచే ఎం.ఎల్. పార్టీలో ఉన్న కె.జి.సత్యమూర్తి (శివసాగర్), కంచె ఐలయ్య, ఉ.సాంబశివరావు వంటి మేధావులు దళిత ఉద్యమ సిద్ధాంత కర్తృత్వంలోకి వచ్చారు. 1989లో తారకంగారు, మేము ఆంధ్రదేశానికి బిఎస్పీపీని ఆహ్వానించి బహు జన రాజకీయ ఉద్యమాన్ని విస్తృతం చేయటం జరిగింది. ఆ తర్వాత ఆయన ఆర్.పి.ఐ. రాష్ట్ర బాధ్యతలు స్వీకరించారు. తారకంగారికి భారతదేశ వైరుధ్యాల మీద స్పష్టమైన అవగాహన ఉంది. ఆయన లేని లోటును వారసులు తీర్చగలగాలి. దళిత బహుజన మైనార్టీలను, అగ్రకులాల్లో ఉన్న పేదల్ని, మార్క్సిస్ట్ల్లో వున్న కుల నిర్మూలనావాదుల్ని, మావోయిస్టుల్లో వున్న అంబే డ్కర్వాదులను సమన్వయించి ఒక ఉన్నత రాజకీయ ఉద్యమాన్ని నిర్మించి ఇప్పుడున్న హిందూ సామ్రాజ్యవాద అగ్రకుల రాజ్యాధికారానికి ప్రత్యామ్నాయంగా బౌద్ధ భారతాన్ని రూపొందించటమే ఆయనకిచ్చే ఘనమైన నివాళి. దళితుల రాజ్యాధికారమే ఆయన అంతిమ లక్ష్యం. తారకం- భారత సామాజిక, రాజకీయ వినీలాకాశంలో ఓ నీలిపతాక. డా. కత్తి పద్మారావు వ్యాసకర్త సామాజిక తత్వవేత్త, వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ మొబైల్ : 9849741695 -
దళితుల గొంతు ఆగింది
– బొజ్జా తారకం భౌతికకాయానికి నివాళులు అర్పించిన చిత్తర్వు హైదరాబాద్ (హిమాయత్‌నగర్) : సుదీర్ఘకాలంపాటు దళితుల పక్షాన పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి బొజ్జా తారకం అని ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్స్ అసోసియేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు చిత్తర్వు నాగేశ్వరరావు అన్నారు. క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందిన బొజ్జా తారకం భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చిత్తర్వు నాగేశ్వరరావు శనివారం సందర్శించారు. బొజ్జా తారకం కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా చిత్తర్వు మాట్లాడుతూ ఎంతోకాలం దళితుల సమస్యలపై సింహాస్వప్నంలా పోరాడిన వ్యక్తి బొజ్జా తారకం అని కొనియాడారు. ఆయనమృతి తీరని లోటని పేర్కొన్నారు. -
బొజ్జా తారకానికి వైఎస్ జగన్ ఘన నివాళి
హైదరాబాద్ : పౌర హక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత బొజ్జా తారకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బొజ్జా తారకం భౌతికకాయాన్ని వైఎస్ జగన్ సందర్శించి, అంజలి ఘటించారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు. వైఎస్ జగన్ తో పాటు పార్టీ నేతలు పార్థసారధి, విశ్వరూప్, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి కూడా ఉన్నారు. కాగా సందర్శకుల కోసం బొజ్జా తారకం భౌతికకాయాన్ని సాయంత్రం మూడు గంటల వరకూ ఇక్కడే ఉంచుతారు. నాలుగు గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. గత నాలుగేళ్లుగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన శుక్రవారం రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. -
‘ఆయన పంచుకున్న జ్ఞాపకాల అనుబంధం’
నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ఆ రోజు ఉదయం నుంచే ఆ ఊరి జనం మాట్లాడ్డం మానేశారు. ఒకరితో ఒకరు కాదు.. తమలో తాము కూడా. వీధి అరుగులు నిర్మానుష్యం. ఊరి జనం చుట్టూ చీకటి ఆవరించింది. నిజానికి ఆ రోజు ఆ ఊరికి అది చీకటి రోజే. అయితే ఆ చీకటి దళితవాడది. దళితవాడలో అలుముకున్న ఆ దట్టమైన చీకటి గురించి దళితులు కానీ, దళితేతరులు కానీ నోరువిప్పి మాట్లాడలేని పరిస్థితి. ఆ రోజు ఆ పల్లెలో జరిగిన దారుణం గురించి మాట్లాడితే, ఆ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తిని నిలదీస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అందుకే అంతా అసలేమీ జరగనట్లుగానే ఉండిపోయారు. అప్పటికి చాలారోజులుగా ఆ ఊరి భూస్వామి పొలంలో పనిచేస్తున్న వ్యక్తి ఆ రోజే శవమయ్యాడు. ఒంటిమీదఉన్న గాయాలు చెబుతూనే ఉన్నాయి. అది హత్య అని. భూస్వామి కొట్టిన దెబ్బలకే అతడు చనిపోయాడని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలా ఒక దారుణం శాశ్వతంగా సమాధిఅవుతున్న తరుణంలో ఆ ఊళ్లోకి ప్రవేశించాడు ఒక న్యాయవాది. ఆ హత్యోదంతాన్నివెలుగులోకి తెచ్చాడు. న్యాయపోరాటంలో విజయం సాధించాడు. ఆయనే ప్రముఖ న్యాయవాది, దళిత హక్కుల ఉద్యమనేత, రచయిత బొజ్జా తారకం. దళిత విద్యార్థినేతగా, హక్కుల ఉద్యమాలకు కేంద్రబిందువుగా, మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని మేళవించి ఉద్యమించిన అరుదైన నాయకుడిగా ప్రజలకు చేరువైన ఆ పోరాటయోధుడు శుక్రవారం రాత్రి తనవు చాలించారు. గతంలో సాక్షితో ఆయన పంచుకున్న జ్ఞాపకాల అనుబంధం మరోసారి.. – ‘మాతాత బొజ్జా గోవిందదాసు. అంటరానితనం ఒక మహమ్మారిలా సమాజాన్ని పట్టిపీడిస్తున్న తరుణంలో ఆయన కులాన్ని జయించారు. జీవితంలోని బాధలను,కష్టాలను, కడగళ్లను, వైరాగ్యాన్ని తత్వాల రూపంలో బోధిస్తూ ప్రజలకు చేరువయ్యారు. ఆయన తత్వాలు, పాటలు, బోధనలు అన్ని వర్గాలను, అన్ని కులాలను ఆకట్టుకున్నాయి. మానవత్వాన్ని, మానవసంబంధాల్లోని గొప్పతనాన్ని తన బోధనల ద్వారా చాటుతూకులరహిత సమాజాన్ని కాంక్షించిన వ్యక్తి. మా నాన్న బొజ్జా అప్పలస్వామి. దళితుల భూమికోసం, విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం జీవితాంతం ఉద్యమించిన వ్యక్తి. వీరిద్దరిప్రభావం నాపై చాలా ఉంది. అంబేద్కర్‌తో కలిసి నాన్న... తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కందికుప్ప మా ఊరు. మాది మాలపల్లె. దళితుల అజ్ఞానానికి, వెనుకబాటుతనానికి, వారిపై కొనసాగుతున్న అణిచివేత, అంటరానితనానికి కారణం చదువు లేకపోవడం, వాళ్ల చేతుల్లో భూమి లేకపోవడమేనని గ్రహించిన మా నాన్న‘ఆదిఆంధ్ర’ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దళితుల చదువుల కోసం పిఠాపురంమహారాజా వారి సహాయ సహకారాలు, అంటరానితనానికి వ్యతిరేకంగా రఘుపతివెంకటరత్నంనాయుడు నేతృత్వంలో పనిచేసిన బ్రహ్మసమాజం మా నాన్నకు స్ఫూర్తిప్రదాతలు. ఈ క్రమంలోనే ఆయన లంక భూములు దళితులకే దక్కాలనేలక్ష్యంతో కోనసీమలో భూపోరాటాలు చేపట్టారు. 1942లో కాకినాడ పర్యటనకు విచ్చేసిన అంబేద్కర్‌తో ఆయనకు పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి అంబేద్కర్‌తో కలిసి పనిచేశారు. ఆల్ ఇండియా ఎస్సీ ఫెడరేషన్‌జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టారు. 1952లో ఫెడరేషన్ నుంచిపోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. దళితుల కోసం పోరాడే క్రమంలో సహజంగానే అగ్రవర్ణాలతో ఘర్షణలు, కొట్లాటలు తప్పలేదు. సరిగ్గాఇలాంటి వాతావరణంలోనే నేను పుట్టి పెరిగాను. నా చదువంతాకాకినాడలోనే సాగింది. మెక్లారిన్ హైస్కూల్లో, పీఆర్ కాలేజీలోచదువుకున్నాను. అంటరానితనానికి వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవాళ్లం. కాలేజీలో బీఏ చదువుతున్నరోజుల్లో చుట్టుపక్కల ఊర్లలో నాటకాలు వేసేవాళ్లం, పాటలుపాడుతూ ప్రజల్ని చైతన్యవంతం చేసేవాళ్లం. ఆ విద్యార్థి ఉద్యమానికినేను నాయకుడిని. ఎస్సీ స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశా. ఆ రోజుల్లోనే ఎస్సీ విద్యార్థుల సమస్యలపై 30 రోజుల పాటు పెద్దఎత్తున ఆందోళన చేసి సమస్యలను పరిష్కరించుకున్నాము. చీకటి రోజుల్లో.. ఆభూపోరాటం తరువాత నిజామాబాద్‌లో జరిగిన అనేక పోరాటాల్లో అంబేద్కర్ యువజన సంఘం, రైతుకూలి సంఘం కలిసి పనిచేశాయి. స్వతహాగా రచయితనైన నేనువిరసంలో చేరాను. చైనా–ఇండియా ఫ్రెండ్షిప్ అసోసియేషన్లోనూ, పౌరహక్కుల సంఘంలోనూ క్రియాశీలకమైన బాధ్యతలు చేపట్టాను. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ చీకటి రోజులు వచ్చాయి. నిజామాబాద్‌లో ఉండగానే నన్ను పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ఏడాది పాటు జైలు జీవితం. ఆ రోజుల్లోనే ‘నది పుట్టిన గొంతుక’ కవిత్వం రాశాను. ‘పోలీసులు అరెస్టు చేస్తే’ అనే పుస్తకం కూడారాశాను. ఒక విప్లవకారుడి జీవితాన్ని నవలగా అక్షరీకరించాను. కానీ జైలు నుంచి బయటకు వచ్చేటప్పుడుదాన్ని తీసుకురావడం సాధ్యపడలేదు. ఎమర్జెన్సీ తరువాత వచ్చిన ఎన్నికల్లో నిజామాబాద్ నియోజకవర్గంనుంచి సీపీఐ(ఎంఎల్) మద్దతుతో పోటీ చేశాను. కానీ ఓడిపోయాను. అప్పుడే హైదరాబాద్‌కు వచ్చేశాను. ఎమర్జెన్సీకి ముందు, తరువాత జరిగిన అన్ని కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాల్లో పాల్గొన్నాను. పదిరికుప్పం, కారంచేడు నుంచిలక్షింపేట ఘటన వరకు అన్ని ఆందోళనల్లో నేను ఉన్నాను. దళితుల ఊచకోత జరిగినా.. ఎన్కౌంటర్ పేరిట పోలీసులు నక్సలైట్లను హతమార్చినా.. ఒక నిజనిర్ధారణ కమిటీని వేసి అది ఇచ్చే నివేదిక ఆధారంగా ఉద్యమ నిర్మాణం చేపట్టాము. ఒకసారిహయత్నగర్ సమీంపలోని ఊర్లో ఒక దళిత వర్గానికి చెందిన కుర్రాడ్ని చంపి పొలంలో పాతిపెట్టారు. అంబేద్కర్ యువజనసంఘం ఈ దారుణాన్ని నా దృష్టికి తెచ్చింది. నేను వెళ్లి శవాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేయించాను. అలా పాతిపెట్టినశవాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేసిన సంఘటన రాష్ట్రంలో అదే మొదటిది. అప్పట్లో ఇదొక పెద్ద సంచలనం. లాయర్ అవుతాననుకోలేదు... బీఏ(మ్యాథ్స్) చదివిన నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ (మ్యాథ్స్)లో చేరాలనిహైదరాబాద్ వచ్చాను. అప్పటికి మా నాన్న ఎమ్మెల్యేగా ఇక్కడే ఉంటున్నారు. ఎంఏలో సీటురాలేదు. దాంతో నగరం నుంచి తిరిగి వెళ్లడం ఇష్టం లేక ఎల్ఎల్బీలో చేరాను. చదువు పూర్తయిన తరువాత తిరిగి కాకినాడకు వెళ్లిపోయాను. అక్కడే లాయర్‌గా ప్రాక్టీస్ ప్రారంభించాను.కానీ ఎంతో కాలం కొనసాగలేదు. 1968లో విజయభారతి(బోయి భీమన్న కుమార్తె)తో వివాహమైంది. ఆమె నిజామాబాద్ ఉమెన్స్ కాలేజీలో లెక్చరర్. అలా నిజామాబాద్ వచ్చేశాను. నిజామాబాద్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టిన మొట్టమొదటి ఎస్సీ లాయర్‌ను నేను. అలాంటి రోజుల్లోపాలెం అనే ఊర్లో ఆ ఊరి భూస్వామి తన దగ్గర పని చేసే వ్యక్తిని కొట్టి చంపాడు. దీనిపైఎవ్వరూ నోరు మెదప లేదు. అందరూ భయపడ్డారు. ‘ఇలాంటి దారుణాలను ప్రశ్నించకపోతే,దోషులకు శిక్షపడకపోతే మరిన్ని సంఘటనలు జరుగుతాయి. అమాయకులైన దళితులు బలవుతారు.’ అనే ఆలోచన నాలో కలిగింది. వెంటనే నిజామాబాద్‌లోనే ఒకలారీ మాట్లాడుకొని, నాకు తెలిసిన 50 మందివిద్యార్థులను వెంటేసుకొని పాలెం బయలుదేరాను. ఆ ఊరి దళితులు చాలా భయపెట్టారు. వెనుదిరిగివెళ్లమన్నారు. ఆ భూస్వామి చంపేస్తాడని హెచ్చరించారు. నా వెంట వచ్చిన వాళ్లకు కూడా భయం మొదలైంది. ‘చావాల్సి వస్తే మొట్టమొదట నేను చస్తాను. మీరేం భయపడొద్దు రండి’అన్నాను. ఊర్లో ర్యాలీ ప్రారంభించాము. ఆ హత్యనునిరసిస్తూ పెద్దఎత్తున నిరసన సభ నిర్వహించాము. అప్పటి వరకు భయంగా ఉన్నదళితులంతా కదిలి వచ్చారు. ఈ సంఘటన వారికి గొప్ప ఆత్మసై్థర్యాన్నిచ్చింది. ఆభూస్వామిపై న్యాయపోరాటానికిదిగాము. ఒకవైపు ఈ పోరాటం కొనసాగుతుండగానే మరోవైపు ‘అంబేద్కర్యువజన సంఘాన్ని’ స్థాపించి అగ్రవర్ణాల దౌర్జన్యాలు, అణచివేతలకు వ్యతిరేకంగా, అంటరానితనం నిర్మూలనేలక్ష్యంగా పోరాటాలు చేశాం. జిల్లాఅంతటా అంబేద్కర్ యువజన సంఘంకార్యకలాపాలు విస్తరించాం. వర్గకుల పోరాటాల్లో.. దోపిడీ, పీడన, అసమానతలు అంతరించిపోవాలంటే వర్గ, కులపోరాటాలు రెండూ ముఖ్యమైనవని ఆర్మూర్ ‘పచ్చల్నడుకుడ’ భూపోరాటంనిరూపించింది. రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు, వెనుకబడిన వర్గాలకుపంపిణీ చేసేందుకు ఈ పోరాటం చేపట్టాం. భూమి ఆ ఊరి అగ్రకులాలకు చెందిన వ్యక్తుల చేతుల్లోఉంది. దానిని మేం స్వాధీనం చేసుకుని సాగులోకి తెచ్చేందుకు పెద్ద ఎత్తున పోరాడాల్సి వచ్చింది. ఈక్రమంలో అంబేద్కర్ యువజన సంఘంతో కలిసి పనిచేసేందుకు సీపీఐ(ఎంఎల్) అనుబంధ రైతుకూలిసంఘం ముందుకు వచ్చింది. పోరాటం నడిచే రోజుల్లో ఎస్సీలు ఒక చోట, బీసీలు ఒక చోట వేరువేరుగా కూర్చొని మధ్యాహ్న భోజనాలు చేసేవారు. పోరాటం కొనసాగిన కొద్దీ వాళ్ల మధ్య సంబంధాలు బలపడ్డాయి. ఒకే చోట కలిసి కూర్చోవడంతో మొదలైంది. ఆ తరువాత ఒకరి కూరలు ఒకరువడ్డించుకున్నారు. కలిసి అన్నం తిన్నారు. ఆ తరువాత అక్కడే వంటలు చేసుకొని భోజనాలు చేయడంతో ఎస్సీలు, బీసీలు ఒక్కటయ్యారు. ఇండియాలో విప్లవం విజయవంతం కావాలంటే మార్క్సిజంఎంత కీలకమైందో అంబేద్కరిజం కూడా అంతే కీలకమైందన్న నా అవగాహన ఈ ఒక్క సంఘటనలోనే కాదు.. ఆ తరువాత అనేక సంఘటనల్లోనూ రుజువైంది. ‘పోలీసులు అరెస్ట్ చేస్తే’... ఎమర్జెన్సీలో రాసిన ‘పోలీసులు అరెస్ట్ చేస్తే..’ పుస్తకం1980 తరువాత పబ్లిష్ అయింది. హక్కుల ఉద్యమానికిఅది మార్గదర్శకంగా నిలిచింది. ప్రతి ఒక్కరికిప్రశ్నించడం నేర్పించింది. ఆ పుస్తకం ప్రజల చేతుల్లోకి వెళ్లకుండా పోలీసులు 40 వేల కాపీలనుతగలబెట్టారు. ‘కమాండో’పబ్లిషర్స్ దగ్గరఉన్న మరో 30 వేల కాపీలను కొనుగోలు చేశారు. ఎవరి దగ్గరైనా ఆ పుస్తకం కనిపిస్తే చాలు కేసులు పెట్టేవాళ్లు. దాంతో ఆ పుస్తకాన్ని చాలా రహస్యంగా చదవాల్సి వచ్చేది. -
బొజ్జాతారకం మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
హైదరాబాద్: పౌర హక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బొజ్జాతారకం(77)మృతి పట్ల వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్ది తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నాలుగేళ్లుగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న బొజ్జాతారకం శుక్రవారం రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సందర్శకుల కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. 4 గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. -
హక్కుల సేనాని అస్తమయం
⇒ బ్రెయిన్ కేన్సర్‌తో కన్నుమూసిన బొజ్జా తారకం ⇒ దళిత హక్కుల కోసం జీవితాంతం పరితపించిన నేత ⇒ సీఎం కేసీఆర్ సహా పలువురి సంతాపం.. నేడు అంత్యక్రియలు సాక్షి, హైదరాబాద్: హక్కుల సేనాని ఇక లేరు. పౌర హక్కుల నేత, రచయిత, ప్రముఖ న్యాయవాది, దళిత ఉద్యమ నేత, తెలంగాణ ప్రజాస్వామిక వేదిక కన్వీనర్ బొజ్జాతారకం(77) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. నాలుగేళ్లుగా బ్రెయిన్ కేన్సర్‌తో బాధపడుతున్న ఆయన రాత్రి 10.20 గంటలకు హైదరాబాద్ అశోక్‌నగర్‌లోని తన స్వగృహంలో మృతి చెందారు. పది రోజుల కిందట ఆయనను కిమ్స్ ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. శనివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సందర్శకుల కోసం ఆయన భౌతికకాయాన్ని ఉంచుతారు. 4 గంటలకు ఫిలింనగర్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. 1939 జూన్ 27న తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని కందికుప్పలో బొజ్జా మావూళ్లమ్మ, అప్పలస్వామికి బొజ్జా తారకం జన్మించారు. ఆయనకు భార్య విజయభారతి, కూతురు డాక్టర్ మహిత, కుమారుడు రాహుల్ బొజ్జా (హైదరాబాద్ కలెక్టర్) ఉన్నారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కారంచేడు ఘటనపై తారకం.. దళిత పక్షాన నిలబడి సుప్రీంకోర్టులో కేసు వేసి పోరాడారు. దోషులకు శిక్షపడేలా చేశారు. తోట త్రిమూర్తులు దళితులకు శిరోముండనం చేయించిన కేసుకు సంబంధించి ఎమినిది నెలల కిందట వైజాగ్ స్పెషల్ కోర్టుకు వెళ్లారు. అదే సందర్భంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అక్కడ్నుంచి తీసుకువచ్చి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆగస్టు 15 నుంచి జొబ్జా తారకం నోటి నుంచి మాట రావడం లేదు. అంబేడ్కర్ రచించిన ‘రాముడు, కృష్ణుడు ర హస్యాలు’ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన తారకం.. అంబేడ్కర్ స్థాపించిన రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలో కీలకంగా పనిచేశారు. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖను రిజిస్టర్ చేయించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలుకు ఏర్పాటు చేసిన కేంద్ర కమిటీలో తారకం కీలకంగా పనిచేశారు. ‘పోలీసులు అరెస్టుచేసే’్త‘ కులం-వర్గం’, ‘నేల-నాగలి-మూడెద్దులు’‘పంచతంత్రం’ (నవల)‘నది పుట్టిన గొంతుక’ వంటి రచనలు చేశారు. సీఎం సంతాపం బొజ్జా తారకం మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తంచేశారు. కవిగా, రచయితగా, న్యాయవాదిగా బహుముఖ సేవలందించిన బొజ్జా తారకం అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందినవారైనప్పటికీ తెలంగాణ ఉద్యమంలో ధర్మాన్ని గుర్తించి, తనకు, ఉద్యమానికి మద్దతుగా నిలిచారని గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. విరసం నేత వరవరరావు తదితరులు కూడా సంతాపం తెలిపారు. -
ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం మృతి
ప్రముఖ న్యాయవాది, దళిత నాయకుడు బొజ్జా తారకం శుక్రవారం రాత్రి మృతిచెందారు. దళిత, వామపక్ష ఉద్యమాలలో ఆయన కీలక పాత్ర పోషించారు. పోలీసులు జరిపిన ఎన్ కౌంటర్లపై కేసులో నమోదుచేసి విచారణ జరపాలంటూ పౌరహక్కుల నేత బొజ్జా తారకం సుప్రీంకోర్టులో పోరాడి గెలిచారు. బొజ్జా తారకం మృతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. విరసం నేత వరవరరావు, 'కమిటీ రిలీజ్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్' సభ్యుడు రవీంద్రనాథ్, ఇతర ప్రముఖులు బొజ్జా తారకం మృతిపై సంతాపం ప్రకటించారు. -
పౌరులకు జీవించే హక్కు లేకుండాపోయింది- బొజ్జా తారకం
స్వాతంత్య్రం వచ్చి 66 ఏళ్లు దాటిన పౌరులకు జీవించే హక్కు లేకుండా పోయిందని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ బొజ్జ తారకం అన్నారు. రాజ్యాంగం క ల్పించిన హక్కులు పేదవాడికి అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని ఎస్వికె ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజ్యాంగం-పౌరహక్కులు అనే అంశంపై చర్చా గోష్టి జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బొజ్జ తారకం మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యంతో రాజ్యాంగ హక్కులు సామాన్యులకు అందకుండా పోతున్నాయని అన్నారు. పౌర హక్కుల కోసం ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు పోరాడాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగం లో ఉన్న ఏ హక్కులు సక్రమంగా అమలు కావడం లేదని.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ ఉదంతం.. దీనికి ఒక ఉదాహరణ అని అన్నారు. యూనివర్సిటీల్లో వెలివాడలు.. జాతికి అవమానకరం అని ఆవేదన వ్యక్తంచేశారు. వీసీ అప్పారావు ప్రవర్తన బాధాకరం అని అన్నారు. కుల విక్ష ఉన్నంత కాలం.. జీడీపీ ఎంత పెరిగినా.. ప్రపంచ దేశాల సరసన భారత్ నిలబడ లేదని అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడి రోహిత్ దేశ ముద్దు బిడ్డ అని కన్నింటి పర్వమయ్యాడని అయినప్పటికి ఆయన మృతికి కారణమైన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్య మంత్రి వర్సిటీవైపు కన్నెత్తి చూడలేదన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులను కూడా కొంత మంది స్వార్థప్రయోజనాల కోసం హరించి వేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి విమర్శించారు. చట్టాలు చట్టబండలుగా మారాయని అన్నారు. దేశంలో అసహనం, ఉగ్రవాదం పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వికె కార్యదర్శి ఎస్.వినయ్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ చల్లా కొండయ్య కూతురు శోభారాణి, మనువడు శ్రీశాంత్, మనువరాలు అజిత తదితరులు పాల్గొన్నారు. -
ల్యాండ్ పూలింగ్ మోసపూరితం: బొజ్జా తారకం
మంగళగిరి(గుంటూరు): ల్యాండ్‌ఫూలింగ్ అనేదే మోసపూరితమని, పైగా రైతుల నుంచి భూమిని పోగుచేసి కార్పొరేట్లకు కట్టబెట్టి రాజధాని నిర్మాణం చేయడమేమిటని హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం ధ్వజమెత్తారు. భూ సమీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర రైతుకూలీ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బొజ్జాతారకం పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు తనను ప్రధానిగా ఊహించుకుంటూ రోజకో దేశం తిరుగుతూ... ఒకరోజు సింగపూర్, మరో రోజు జపాన్, మరో రోజు చైనాను నిర్మిస్తానంటూ అతిపెద్ద వేషదారుడిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. అన్నపూర్ణలాంటి భూములను ధ్వంసం చేసేందుకు చంద్రబాబుకు మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. వ్యవసాయాభివృద్ధికి చర్యలు తీసుకోవాల్సింది పోయి, పచ్చని పొలాలను ధ్వంసం చేసి ఆకాశ హర్మ్యాలు నిర్మిస్తాననడం ఎంతవరకు సమంజసమన్నారు. రైతులు, రైతు కూలీలు, కౌలు రైతులు స్థానిక ప్రజలు చేస్తున్న పోరాటం న్యాయబద్దమైందన్నారు. పోలీసుల బల ప్రయోగంతో ప్రభుత్వ పెద్దలు తాత్కాలికంగా విజయం సాధించినా ప్రజాపోరాటమే అంతిమ విజయం సాధిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు కూలీసంఘం అధ్యక్షుడు సింహాద్రి ఝాన్సీ, కార్యదర్శి కొప్పుల కోటయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఐటీ సంక్షోభంపై పోరాడాలి: బొజ్జాతారకం
హైదరాబాద్ సిటీ : ప్రస్తుతం ఐటీ రంగం తీవ్ర సంక్షోభానికి గురవుతుందని, ఆ రంగంలో పనిచేసే ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందని రిపబ్లికన్ పార్టి ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) జాతీయ ప్రధాన కార్యదర్శి బొజ్జా తారకం అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఐటీ రంగంలో దిగ్గజాలైన ఎన్నో సంస్థల్లో ఏ కారణం చూపకుండా ఇష్టం వచ్చినట్లు ఉద్యోగులను తొలగిస్తున్నారని ఇది కార్మిక వ్యతిరేక విధానమని, ఇది వారి జీవించే హక్కును హరించడమే నని తారకం అన్నారు. భారతదేశంలో ఏ రంగానికీ ఇవ్వని ట్యాక్స్ మినహాయింపు ఐటీ రంగానికి ఇస్తున్నారని, ట్యాక్స్ కట్టే సాధారణ పౌరుని డబ్బులను తీసుకు వెళ్లి ఐటీ రంగాలకు ట్యాక్స్ మినహాయింపు ఇస్తున్నారని దీనిని వ్యతిరేకించాలని కోరారు. ఏఐటీయూసీ రాష్ట్ర అద్యక్షుడు టి. నర్సింహ్మ, సీఐటీయూ జాతీయ కార్యదర్శి సుధా భాస్కర్, ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి సూర్యం, ఫరం ఫర్ ఐటీ ఎంప్లాయిస్ కో - ఆర్డినెటర్ నాజర్ తదితరులు పాల్గొన్నారు. -
ఇక జైళ్లు సగం నోరు తెరుచుకుంటాయి!
విచారణ పూర్తయి శిక్ష అంటూ పడితే, ఎంత శిక్ష పడుతుందో, దానిలో సగ కాలం విచారణ లేకుండా జైళ్లలో గడిపి ఉంటే, వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. వాస్తవానికి ఈ రకమైన తీర్పును సుప్రీంకోర్టు ఇవ్వనవసరం లేదు. విచారణకు నోచుకోకుండా ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గుతున్న అభాగ్యులకు ఎట్టకేలకు విముక్తి లభించింది! ఏదో అభియోగం మీద అరెస్టు చేసి, అతను నేరం చేశాడా లేదా అని విచారణ చేయకుండా జైల్లో పెట్టేసి, ఇక వారి సం గతి మరచిపోతారు. అరెస్టు ఎందుకు చేశారో అత నికి తెలియదు. తనపై ఉన్న అభియోగం ఏమిటో తెలియదు! తనపై నేరారోపణ ఎవరు చేశారో తెలి యదు! విచారణ ఎప్పుడు మొదలవుతుందో తెలి యదు! తనపై మోసిన అభియోగానికి విచారణ అంటూ జరిపితే ఎంత శిక్ష పడుతుందో తెలియదు! అటువంటి వారికి 5, అక్టోబర్ 2014 నాడు సుప్రీం కోర్టు గొప్ప ఊరట కల్పించింది. వీరి విచారణ ఒక వేళ పూర్తయి, శిక్ష అంటూ పడితే, ఎంత శిక్ష పడుతుందో, దానిలో సగ కాలం విచారణ లేకుండా జైళ్లలో గడిపి ఉంటే, వెంటనే విడుదల చేయవలసిందిగా సుప్రీంకోర్టు తీర్పునిస్తూ దానికి సంబంధించిన అంశాలపై అవసరమైన ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి ఈ రకమైన తీర్పు సుప్రీం కోర్టు ఇవ్వనవసరం లేదు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 436ఏలోనే ఇటువంటి ఉత్తర్వులు ఇవ్వాలని ఆజ్ఞ ఉన్నది. అయితే దానిని పట్టించుకొనే వారెవరు? డబ్బున్న వాళ్లకు, అధికారం ఉన్న వాళ్లకు ఈ బాధలు ఉండవు! ముందే అన్నీ చక్కబెట్టుకుంటారు! ఇటువంటి సౌకర్యం 2005లో సీఆర్పీసీకి సవరణ ద్వారా తీసుకువచ్చారు. ఇది 2006 నుంచి అమలులోకి వచ్చినా, దీని ప్రయోజనం జైళ్లలో ఉన్న వారికి అందటం లేదు. చట్టం ఉన్నది, ప్రయోజనం ప్రజలకు అందాలి. ఇది వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు గడిచిపోయాయి. కాని చట్ట ప్రయోజనం అందక కొన్ని వేల మంది అభాగ్యులు ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిపోతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం నుంచి అంద వలసిన ప్రయోజనం అందటం లేదని గ్రహించి, వెంటనే అటువంటి ప్రయోజనానికి అర్హత కలిగిన వాళ్లను ఇప్పుడు సుప్రీంకోర్టు వెంటనే విడుదల చేయమన్నది. ప్రస్తుత అంచనాల ప్రకారం దేశం లోని జైళ్లలో సుమారు 3.18 లక్షల మంది ఉన్నారు. వీరిలో 2.54 లక్షల మంది విచారణ జరగవలసి ఉన్నవారు. ఇందులో వాళ్లపై వచ్చిన అభియోగానికి పడే శిక్షకంటే ఎక్కువ కాలమే వాళ్లు ఏ విచారణా లేకుండా జైళ్లలో ఉన్నారు. ఇది ఎంత అన్యాయం? ఈ విషయం ప్రభుత్వాలకు గాని, జైళ్ల అధికారులకు గాని తెలియనిది కాదు. అయితే వారు పట్టించుకోవటం లేదు. ఎందుకంటే జైళ్లలో ఈ రకంగా మగ్గిపోతున్న వారు పేదవారు కాబట్టి! ఇంతకుముదు ఒక ప్రయత్నం బీహార్ జైళ్ల విషయంలో సుప్రీంకోర్టు చేసింది. అనవసరంగా ఎక్కువ కాలం జైళ్లలో మగ్గిపోతున్న వారిని విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అంతే మళ్లీ అటువంటి వారి సంగతి ఎవరూ పట్టించుకోవటం లేదు. చట్టం వచ్చి ఎనిమిదేళ్లయినా ఇప్పుడూ పట్టించుకోవటం లేదు. సుప్రీంకోర్టు ఇప్పటికైనా చట్ట ప్రయోజ నాన్ని ప్రజలకు అందించవలసిందిగా ఆదేశాలు ఇచ్చింది. ఉత్తర్వులు ఇచ్చి సుప్రీంకోర్టు ఊరుకోలేదు. న్యాయాధి కారులను, అంటే మేజిస్ట్రేట్లను వారానికి ఒకసారి జైలును సందర్శించి, ఈ విధంగా జైళ్లలో ఎంత మంది అనవసరంగా ఉంటున్నారో లెక్కలు తీసి, వారికి పైన చెప్పిన ప్రయోజనం అందవలసి ఉంటే, వారిని వెంటనే విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చెయ్యాలని ఆదేశించింది. ఈ విధంగా మొత్తం రెండు నెలలు ప్రతి వారానికి ఒకసారి మేజిస్ట్రేట్లు జైలుకు వెళ్లి విడుదలకు అర్హులైన వారిని మొత్తంగా విడుదల చేయాలని ఆదేశించింది. ఈ ప్రక్రియలో న్యాయవాదుల ప్రమేయం ఏదీ ఉండకూడదు. దీనికి సహకరించాలని జైలు అధి కార్లను కూడా ఆదేశించింది. ఈ ప్రక్రియను పూర్తి చేసి ఒక నివేదికను హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు సమర్పించాలి. అంటే సుప్రీంకోర్టు కేవలం ఉత్తర్వులు జారీ చేసి కూర్చోలేదు. ఇచ్చిన ఉత్తరువుల అమ లును కూడా పర్యవేక్షిస్తుంది. ఈ ప్రక్రియ మొత్తం రెండు నెలలలో పూర్తయినట్టు తనకు నివేదిక కూడా అందజేయాలని ఆదేశించింది. ఎందుకంటే చట్టం ఉన్నప్పటికీ ఎనిమిది ఏళ్లుగా దాని ప్రయోజనం జైళ్లలో ఉన్న వారికి అందటం లేదు. ఎవరూ పట్టించుకోవటం లేదు. ఏళ్ల తరబడి ముద్దాయిలను పదిహేను రోజులకొకసారి జైలు నుంచి కోర్టుకు తీసుకువెళ్లటం, మళ్లీ వెనక్కి తీసుకురావటంతోటే అయిపోతున్నది. అందుకని చట్ట ప్రయోజనం ప్రజలకు అందుతున్నదా లేదా అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షించే పని పెట్టుకున్నది. అధికార్లు తమ విధి నిర్వహణలో విఫలమవుతున్నారు కాబట్టి సుప్రీం కోర్టు నేరుగా ఆ బాధ్యతను కూడా స్వీకరించింది. అందుకు అవసరమైన ఉత్తర్వులను సంబంధిత మేజిస్ట్రేట్లకు, జైలు అధికార్లకు, తన తీర్పు ద్వారా జారీచేసింది. ఈ ఉత్తర్వులు పేద ప్రజలకు ఎంతో గొప్ప మేలు చేశాయి. చెయ్యని నేరానికి జైలుకు వెళ్లేది వారే! విచారణ లేకుండా జైళ్లలో మగ్గిపోయేది వారే! ఒక అంచనా ప్రకారం నూటికి అరవై మందికి పైగా ఈ ప్రయోజనం అందుతుంది. అయితే మరణశిక్ష పడే కేసుల్లో ఉన్న వారికి ఈ ప్రయోజనం అందదు! ఈ ఒక్కటీ చాలదు! జైళ్ల వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళనం కావా లి. నేర విభాగానికి సంబంధించిన ప్రక్రియలో కూడా మార్పు రావాలి. జైళ్ల పరిస్థితులలో కూడా మార్పు తేవాలి. నేరాలు, శిక్షలు, జైళ్లకు సంబంధించిన సీఆర్పీసీని 1860లో బ్రిటిష్ ప్రభుత్వం తీసుకువచ్చింది. భారతదేశ ప్రజలపై అజమాయిషీ చేయటానికి, వారిని అదుపులో ఉంచడానికి శిక్షలు వేసి, జైళ్లలో పెట్టి వీరిని భయభ్రాంతులను చేయటానికి తీసుకువచ్చిన చట్టం ఇది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కొన్ని చిన్న చిన్న సవ రణలు తీసుకువచ్చారు గాని, సమగ్రమైన మార్పులు తేలేదు. ఇప్పుడు తీసుకువచ్చిన ప్రక్రియ పాతదే! అయితే అమలుకు నోచుకోలేదు. సుప్రీంకోర్టు పుణ్యమా అని ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుతుంది. స్వతంత్ర భారతదేశంలో దాదాపు 250 ఏళ్ల క్రితం చేసిన చట్టాలను ఈ నాటికీ పట్టుకు వేలాడటం సిగ్గుచేటు. జైళ్ల విధానం, నిర్వహ ణలో చాలా దేశాలలో చెప్పుకోదగ్గ మార్పులు వస్తున్నాయి. మార్పు అంటే భయపడేది మన దేశమే! ఈ సందర్భాన్ని తీసు కొని కనీసం జైళ్ల వ్యవస్థను ప్రజాస్వామ్యీకరించడానికి ముం దుకు రావాలి! బొజ్జా తారకం సీనియర్ న్యాయవాది -
‘జడ్జిలను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంది’
విశాఖపట్నం: నిజాయితీగా తీర్పులివ్వకపోతే జడ్జిలను ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉంటుందని చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం అన్నారు. చుండూరు నరమేధంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ‘జడ్జీల నియూమకం-వారి జవాబుదారితనం’పై విశాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు జరిగింది. ముందుగా అంబేద్కర్ భవన్ నుంచి రామాటాకీస్, ఆశీల్‌మెట్ట మీదుగా జీవీఎంసీ గాంధీ పార్కు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సదస్సులో తారకం మాట్లాడారు. చుండూరు కేసులో నిందితులు ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారనే కారణాన్ని చూపుతూ హైకోర్టు జడ్జి వారిని విడుదల చేస్తూ తీర్పు చెప్పడాన్ని తప్పుబట్టారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన నేపథ్యంలో నిందితులకు తిరిగి శిక్ష అమలు పడేలా చూస్తామన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ కో-ఆర్డినేటర్ కంచర్ల శేషు, విప్లవ రచయితల సంఘం (విరసం) అధ్యక్షుడు చలసాని ప్రసాద్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు అరుణోదయ రామారావు, ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.అంజయ్య, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ సభ్యుడు జె.వి.ప్రభాకర్, రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.ఝాన్సీ, జనచైతన్యమండలి ప్రతినిధి ఎల్.కృష్ణ, అధిక సంఖ్యలో దళితులు పాల్గొన్నారు. -
చుండూరు తీర్పు రాజ్యాంగ విరుద్ధం: తారకం
సాక్షి, హైదరాబాద్: చుండూరు తీర్పు రాజ్యాంగానికి, చట్టాలకు వ్యతిరేకమని చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం అన్నారు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ న్యాయస్థానాలు.. ప్రజలకు జవాబుదారీతనం వహించాలని కోరుతూ హైకోర్టు న్యాయమూర్తులకు సోమవారం విజ్ఞాపన పత్రాలిచ్చేందుకు వెళ్తే ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు ప్రాంగణంలోకి కూడా రానివ్వకుండా గేట్లు మూయించారన్నారు. ప్రజలంటే నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తూ, అహంకార పూరితంగా వ్యవహరించిన న్యాయువుూర్తుల తీరును పోరాట కమిటీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చుండూరు ఘటనలో హైకోర్టు ఇచ్చిన తీర్పు ఎంత న్యాయ విరుద్ధంగా ఉందో బయట పడుతుందనే న్యాయమూర్తులు విజ్ఞాపన పత్రాన్ని తీసుకోలేదన్నారు. -
చుండూరు’పై 30న ధర్నా: బొజ్జా తారకం
హైదరాబాద్, చుండూరు తీర్పును ఎండగడుతూ ఈనెల 30న ఇందిరా పార్కు వద్ద వివిధ ప్రజా సంఘాలతో కలసి ధర్నా నిర్వహిస్తామని చుండూరు దళితుల న్యాయ పోరాట కమిటీ కన్వీనర్, సీనియర్ అడ్వొకేట్ బొజ్జా తారకం బుధవారం పేర్కొన్నారు. 23 ఏళ్ల క్రితం జరిగిన చుండూరు దళితుల ఊచకోత కేసును తమ అవసరాల కోసం కేవలం ఏడు రోజుల్లో విచారణ ముగించారని ఆయన మండిపడ్డారు. జిల్లా స్పెషల్ కోర్టు విధించిన శిక్షలను రద్దు చే స్తూ 8 మంది దళితులను హత్య చేసిన ఒక సామాజిక వర్గానికి చెందిన హంతకులందరూ నిర్దోషులే అంటూ తీర్పు చెప్పడం అనుమానాలకు దారితీస్తుందన్నారు. ఈ తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని ఆయన పేర్కొన్నారు. -
న్యాయమే బోనులో నిలబడితే!
సాక్ష్యాలలో ఒక సాక్షికి మరొక సాక్షికి కొంత తేడా ఉంటుంది. సాక్ష్యం చెప్పడంలో సాక్షికి సాక్షికి తేడా వస్తుంది. అలా వస్తాయని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అంతమాత్రాన కేసు కొట్టివేయటానికి వీల్లేదు. ఆగస్టు 6, 1991న చుండూరు (గుంటూరు జిల్లా) దళితవాడపై నాలుగు వం దల మందికిపైగా రెడ్లు, తెలగలు మారణాయుధాలతో దాడిచేసి, ఎనిమిది మందిని చంపివేశారు. ఇద్దరిని ముక్కలుగా నరికి గోనెసంచుల్లో కుక్కి తుంగ భద్ర మురుగుకాల్వలోకి తోసివేశారు. ఇంకొందరిని గాయపరిచారు. ఇప్పుడు 2014 ఏప్రిల్ 22వ తేదీన హైకోర్టు, చుండూరు కేసులో యావ జ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఇరవై మందిని, ఇతర శిక్షలు అనుభవించిన మరో 36 మందిపై మొత్తం శిక్షలు రద్దు చేస్తూ తీర్చునిచ్చింది. తీర్పు పూర్తి పాఠం వెలువరించకుండానే యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్నవారిని ఆగమేఘాల మీద విడుదల చేయించింది. వారిని విడిచిపెట్టిన అయిదో రోజున తీర్పు పూర్తిపాఠం ప్రకటించింది. అక్కడితో ఆగకుండా హైకోర్టు ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని, ఒకరి పట్ల మరొకరు గౌరవభావం పెంపొందించుకోవాలని సలహా ఇచ్చింది. పులులకు, మేకలకు ఒకే ఉద్బోధ చేసిన ఘనత హైకోర్టుదే. ఇది ‘పెద్ద మనుషుల తీర్పు’ ఆ మారణకాండపై 1991లో దేశమంతా వెల్లువెత్తిన ఆగ్రహావేశాలను మించి ఈ తీర్పుపై నిరసనలు పెల్లుబికాయి. ప్రాథమిక న్యాయ సూత్రాలకు, సుప్రీంకోర్టు పదేపదే చెబుతున్న తీర్పులకు పూర్తి భిన్నంగా వచ్చిన ఈ తీర్పు సత్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇది గ్రామాలతో అగ్రకుల పెత్తందార్లు ఇచ్చిన ‘పెద్దమనుషుల తీర్పు’లా ఉన్నది. ముందు నుంచీ ఈ కేసులో అగ్రకుల భూస్వామ్య అహంకారం కనిపిస్తున్నది. పోలీసుపాత్ర కూడా ఆది నుంచీ అగ్రకులాలకు వత్తాసు పలికే తీరులోనే ఉంది. హత్యలు జరిగిన రోజు చుండూరులో పోలీసు బలగం ఉన్నది. అంతకుముందు నుంచే చెదురుమదురు సంఘటనలు జరుగుతుంటే క్యాంపు పెట్టారు. సంఘటన రోజు ఉదయం పోలీసులు మాలపల్లెపై దాడిచేశారు. అంతకుముందు జరిగిన కేసులో మాలమాదిగలను అరెస్టు చెయ్యడానికి వచ్చారు. వారిని చూసి మాలమాదిగలు పారిపోయారు. దీనితో పోలీసులు తిరిగి ఊరిలోకి వచ్చారు. అప్పటికే రెడ్లు మారణాయుధాలతో పోలీస్‌స్టేషన్ ముందు జమగూడారు. నిజానికి మాలమాదిగలను తరుముతుంటూ పోలీసులు, వెనకాల రెడ్లు వెళ్లారు. వారిని పోలీసులు ఏమీ అనలేదు. దీనితో రెడ్లు మరీ రెచ్చిపోగా, వారికి తెలగలు తోడయ్యారు. రెండో రోజున, మూడో రోజున కాల్వలో ఎనిమిది శవాలు తేలాయి. అంతా పోలీసుల కళ్ల ముందే ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగింది. తమ కళ్లముందు జరిగిన ఘోరానికి ఎవరో రిపోర్టు చేయనవసరం లేదు. శవాలను భార్యలు, అన్నదమ్ములు, ఇతర బంధువులు గుర్తించగలిగారు. వారిని చంపటం చూసినవారు పంచనామా జరుగుతున్నప్పుడు సాక్ష్యం చెప్పారు. డాక్టర్లు గాయాలను గుర్తించారు. ఏ పోలీ సుల కళ్ల ముందు ఈ మారణకాండ జరిగిందో వారే కేసు దర్యాప్తు చేశా రు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి ఆలపాటి ధర్మారావు ఆ ఊరువాడే. అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి తప్పనిసరై 219 మం దిపై చార్జిషీటు వేయటం జరిగింది. 134 మంది సాక్షులను పెట్టారు. అప్పటికే ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం వచ్చింది. ఆ చట్టం ప్రకారం చుండూరులో ప్రత్యేక కోర్టు పెట్టారు. అది ఇష్టం లేని రెడ్లు ఏదో ఒక వంకపై విచారణ జరగటానికి వీల్లేదని పిటిషన్లు పెట్టడం, వాటిని కోర్టు కొట్టి వేస్తే హైకోర్టుకు అపీలుకు వెళ్లటం, హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టుకు వెళ్లటం, అక్కడా పప్పులు ఉడకకపోతే మళ్లీ విచారణ ప్రారంభం కావడం జరుగుతుండేది. దాదాపు పది సంవత్సరాలు కేసు నడవకుండా చేశారు. తప్పనిసరైనాక విచారణ మొదల యింది. కేసు 219 ముద్దాయిలపై నడిచి 134 సాక్షుల జాబితా ఉన్నది. వారిలో 33 మంది ముద్దాయిలు మధ్యలో చనిపోయారు. మొత్తం 70 మంది సాక్షులను విచారించారు. సాక్ష్యాలు లేవని కొందరిని విడిచిపెట్టారు. ఒక్క సాక్షే చెప్పాడు కాబట్టి, ఆ సాక్ష్యాన్ని సమర్థించే వారు లేరని ఇంకొందరిని విడిచిపెట్టారు. మిగిలిన వారిపై తగిన ఆధారాలున్నాయని, ఒక సాక్షికి మరొక సాక్షికి పొంతన కుదిరిందని సెషన్స్ కోర్టు కొందరికి యావజ్జీవ కారాగార శిక్ష, మరికొందరికి రెండేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించింది. సోదిలోకి రాని సుప్రీం ఆదేశాలు ఈ తీర్పును ఇప్పుడు హైకోర్టు కొట్టి వేసింది. సాక్ష్యాలు నమ్మదగినవిగా ఉన్నాయని ఒక కోర్టు అభిప్రాయపడితే, వాటిని కొట్టిపారేయటానికి హైకోర్టు బలమైన ఆధారాలు చూపాలి. సాక్ష్యాలలో ఒక సాక్షికి మరొక సాక్షికి కొంత తేడా ఉంటుంది. సాక్ష్యం చెప్పడంలో సాక్షికి సాక్షికి తేడా వస్తుంది. అలా వస్తాయని సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది. అంతమాత్రాన కేసు కొట్టివే యటానికి వీల్లేదు. ఈ కేసును కొట్టివేయటానికి హైకోర్టు కొన్ని ప్రధానమైన కారణాలు చూపింది. అందులో ఒకటి- ఒక సాక్షి ‘నేను ఈదుకుంటూ కాలవ దాటాను’ అని చెప్పాడు. అతనే నాకు ఈత రాదని చెప్పాడు. ఈతరాని వాడు కాలవ ఎలా దాటగలిగాడు? అని హైకోర్టు అనుమానం. వేటగాళ్ల మాదిరిగా ఆయుధాలు ధరించి తరుముకు వస్తున్న వారిబారి నుంచి రక్షించుకోవడానికి కాలవ దాటేశాడు. అది హైకోర్టుకు అర్థంకాలేదు. ఎనిమిది హత్యలు జరిగితే ఒక్కడు కూడా పోలీసు రిపోర్టు ఇవ్వలేదు. కాబట్టి వారి సాక్ష్యాలను నమ్మలేమంటుంది. రెండు రోజుల వరకూ ఆ వార్త ఎవరికీ చెప్పకుండా ఎలా ఉంటారు? అని ప్రశ్నిస్తుంది. తమ బంధువులను తమ కళ్లముందు నరికి చంపితే, దాని మీద రిపోర్టు ఇవ్వలేదన్న కారణంతో వాళ్ల సాక్ష్యాలు నమ్మరా? ఒక అవిటి ముద్దాయి దాడిలో పాల్గొని, మాలమాదిగలను పట్టుకొని, ఒకరి శరీరం నుంచి సిరంజితో రక్తం తీశాడని చాలామంది సాక్షులు చెపితే, అవిటి వ్యక్తి ఎలా చేస్తాడని నమ్మలేదు. చట్ట విరుద్ధం, అనైతికం సాక్ష్యాన్ని నమ్మటానికి కొన్ని కొలబద్దలుంటాయి. వాటి ప్రాతిపదికగానే సెషన్స్ కోర్టు కొన్ని సాక్ష్యాలను తిరస్కరించింది, కొన్నింటిని స్వీకరించింది. హైకోర్టుకు అవేం కనబడలేదు. ఏ కోర్టు పరిగణనలోకి తీసుకొని చిన్నచిన్న తేడాల ఆధారంగా కేసు కొట్టేసింది. ఇంకా ఘోరం ఏమంటే ప్రాసిక్యూషన్ తరపున ఉటంకించిన సుప్రీంకోర్టు తీర్పులలో ఏ ఒక్కటీ పరిగణనలోకి తీసుకోలేదు. ఇది చట్ట విరుద్ధం. అనైతికం. మొదటి నుంచి ఈ కేసులో శిక్ష అనుభవిస్తున్న వారిని విడుదల చెయ్యా లనే ఆత్రంతో కోర్టు ఉన్నది. ప్రతిసారీ ఎంతకాలం వాళ్లు జైల్లో మగ్గాలి అని ప్రశ్నించింది. ఆ తీరును చూసిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కోర్టుపై మాకు నమ్మకం లేదని ప్రకటించారు. మా మీద కోర్టు ధిక్కారం కేసు పెడ తానని కోర్టు భయపెట్టింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ కొన్ని అప్పీళ్లు వేసి, వాటిని కూడా కలిపి వినండి అవి కోరితే, అవన్నీ ఎప్పుడు పూర్తి కావాలి? ముందు వీరిని విడిచి పెట్టేద్దాం అన్న ధోరణితో సాగింది. కోర్టుకు తనకు నచ్చిన తీర్పు ఇచ్చే అధికారం ఉన్నది. అయితే సరైన న్యాయసూత్రాల ప్రాతి పదిక ఉండాలి. అది హైకోర్టు తీర్పులో లేదు. సుప్రీంకోర్టు తీర్పులు పరిగణ నలోకి తీసుకుంటే ముద్దాయిలందరికీ శిక్ష ఖాయం అవుతుంది. అది హైకో ర్టుకు ఇష్టం లేదు. అందుకని వాటిని దాటవేసింది. కేవలం కుల అహంకా రంతో మాలమాదిగలను చంపేస్తే, చంపిన వారికి సెషన్స్ కోర్టు శిక్ష విధించిం ది. దానిని హైకోర్టు కొట్టివేసింది. మరి న్యాయవ్యవస్థపై మాలమాదిగలు నమ్మకం కోల్పోరా? దెబ్బ, చావుదెబ్బ ఈ కేసులో మరొక ఘోరం జరిగింది. మాలమాదిగలను తరిమేటప్పుడు, పొడిచేటప్పుడు, నరికేటప్పుడు కులం పేరుతో దూషించారు. అందుకని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు దాఖలయింది. ప్రతిసాక్షి ప్రత్యేక కోర్టులో ఇదే చెప్పారు. ఈ సాక్ష్యాన్ని కోర్టు అంగీకరించింది. కానీ శిక్ష మాత్రం ఎస్సీ, ఎస్టీ చట్టం కింద వెయ్యలేదు. సెషన్స్ కోర్టు ఒక దెబ్బ కొడితే, హైకోర్టు చావు దెబ్బకొట్టింది. అగ్రకులాలు ముద్దాయిలుగా ఉంటే చట్టాలు, కోర్టులు ముఖం తిప్పుకుంటాయి. లేదా కళ్లు చెవులు మూసుకుంటాయి. (వ్యాసకర్త హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఈ కేసులో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్) బొజ్జా తారకం -
‘చుండూరు’పై సుప్రీంకు వెళతాం: బొజ్జా తారకం
హైదరాబాద్, న్యూస్‌లైన్: చుండూరు ఘటనపై సుప్రీం కోర్టుకు వెళ్తామని ఆర్పీఐ నాయకుడు, చుండూరు దళితుల న్యాయపోరాట కమిటీ చైర్మన్ బొజ్జా తారకం చెప్పారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కోర్టు ఇచ్చిన తీర్పు తమను కలచివేసిందని అన్నారు. చుండూరు తీర్పును దేశవ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 50 ప్రజా సంఘాలు కలసి చుండూరు దళితుల న్యాయపోరాట కమిటీని ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపారు. చుండూరు ఘటన జరిగి 25 ఏళ్లు కావస్తోందని, కొన్ని సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు 8 మంది దళితులను అతి దారుణంగా హత్య చేశారని తెలిపారు. రెండు శవాలను ముక్కలు చేసి, గోనెసంచిలో మూటకట్టి తుంగభద్ర కాలువలో పారేశారని, మొత్తం 53 మంది గాయపడ్డారని వివరించారు. ఈ మారణకాండ కళ్లెదుటే జరిగినా, పోలీసులు కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. 15 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అనంతరం ఈ ఘటనలో 21 మందికి యావజ్జీవ, 53 మందికి రెండేళ్లకు పైగా జైలు శిక్ష విధించారని, కొంతమందిని అయితే సాక్ష్యాలు లేవని వదిలేశారన్నారు. శిక్షపడిన వారిని ఇటీవలే హైకోర్టు ఏకపక్షంగా అన్ని సెక్షన్లను కొట్టివేసి వదిలివేయడం బాధాకరమన్నారు. దుండగులు దళితులను తరుముతుంటే వారి నుంచి తప్పించుకునేందుకు కాలువలో దూకిన వ్యక్తికి ఈత రాదన్న ఒక్క కారణం చూపుతూ మొత్తం కేసునే కొట్టివేయడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమల మాట్లాడుతూ ఈ తీర్పు న్యాయవ్యవస్థపై ఎవరికీ నమ్మకం కలిగించేలా లేదన్నారు. పీఓడబ్ల్యూ సంధ్య మాట్లాడుతూ హంతకులు నిర్దోషులైతే అసలు హంతకులెవరో కోర్టే చెప్పాలన్నారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఝాన్సీ, బత్తుల రాంప్రసాద్, కరుణ, శ్యామల, అనురాధ, డప్పు రమేష్, కంచర్ల మోహన్‌రావు, శేషు, నాగేశ్వరరావు, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
‘కోటా’కు సరికొత్త పోటు
విశ్లేషణ బొజ్జా తారకం మనిషి విలువను కులాన్నిబట్టి చూస్తున్న ఈ దేశంలో కులానికి ఆర్థిక పరిస్థితితో ఉన్న సంబంధాన్ని చూడని ఈ దేశంలో, ఆర్థిక స్థోమతను బట్టి రిజర్వేషన్లు కల్పించాలనటం రిజర్వేషన్ల సూత్రాన్ని దెబ్బకొట్టటమే. రిజర్వేషన్ల అవసరం రాని పరిస్థితిని కల్పించాల్సిన ఆవశ్యకతను విస్మరించి, ఆర్థిక పరిస్థితినిబట్టి రిజర్వేషన్లు కల్పించాలనడం అర్థరహితం. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచీ రిజర్వేషన్ల సమస్యపై మాటిమాటికీ వివాదం రేగుతూనే ఉంది. రేగటం కాదు, రిజర్వేషన్లను వ్యతిరేకించే అగ్ర కులాలు వివాదం రేపుతూ వస్తున్నాయి. రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటున్నదని, ప్రతిభావంతులకు అవకాశాలు లభ్యం కావటం లేదని, రిజర్వేషన్లను వెంటనే రద్దు చేస్తే తప్ప దేశానికి మోక్షం లేదని, ప్రపంచ దేశాలలో భారతదేశం వెనకబడిపోవటానికి రిజర్వేషన్లే ప్రధాన కారణమనే పాత పాట మళ్లీ మళ్లీ వినిపిస్తూనే ఉంది. మళ్లీ ఈ పాత పాటను అందుకున్నది మరెవరో కారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు అత్యంత సన్నిహితుడైన జనార్దన్ ద్వివేది. ఈ ద్వివేదులు, త్రివేదులు, చతుర్వేదులు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఇదే పాట పాడుతుంటారు. కాకపోతే కొందరు బయటకు, మరికొందరు లోలోపలే. అయితే అందరికీ ఒకటే భయం. గట్టిగా ఈ పాట పాడితే ఓట్లు కోల్పోతామని! అగ్రకులాల ఓట్లు పడతాయిగానీ అవి చాలవు! అధికార పీఠం దక్కాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల ఓట్లు తప్పనిసరి. చిత్రమేమిటంటే, ఈ సారి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అంతటి వాడే ఎన్నికల సందర్భమని సైతం మరచి మనసులోని మాటను అనుకోకుండా బయటపెట్టేశారు. కులం ఆధారంగా ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయాలని, వాటికి బదులుగా ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లను ప్రవేశపెట్టాలని ప్రకటించారు. ఆయన నోట ఆ మాట వచ్చిందంటే, అది సోనియా గాంధీ మాటేనని, అందుకు రాహుల్ గాంధీ వత్తాసు ఉండే ఉంటుందని అందరూ నమ్ముతున్నారు. ఖంగుతిన్న అధినేత్రి నష్ట నివారణకు చేయాల్సిన ప్రకటన చేశారు. అంతమాత్రాన ద్వివేది వంటి వారి మనస్సుల్లో ఉన్న మాట చెరిగిపోయేది కాదు. అంతరాలు ఆర్థికపరమైనవే కావు ద్వివేది చెప్పింది కొత్తగా ఇప్పుడు చెబుతున్న మాట కాదు. రిజర్వేషన్లు అమలులోకి వచ్చిన మొదటి సంవత్సరం నుంచే ఈ దాడి మొదలైంది. రిజర్వేషన్ల సూత్రాన్ని, రాజ్యాంగంలో దానిని పొందుపరచవలసిన అవసరాన్ని విన్నవించినా సుప్రీంకోర్టు రాజ్యాంగ ప్రాతిపదికను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. రిజర్వేషన్లను కొట్టివేసింది. వెంటనే 1951లో రిజర్వేషన్ సూత్రానికి అనుగుణంగా రాజ్యాంగంలోని అధికరణకు సవరణను తీసుకొచ్చారు. అప్పటి నుంచి రిజర్వేషన్ల వల్ల ప్రతిభ దెబ్బతింటున్నదని, అసలు ప్రయోజనం పొందవలసిన వారికి అవి అందటం లేదనే వాదనలు వినవస్తూనే ఉన్నాయి. ఏదో ఒక వంకతో రిజర్వేషన్లు రాజ్యాంగపరంగా చెల్లవంటూ పదే పదే సుప్రీంకోర్టు తలుపులు కొడుతూనే ఉన్నారు. సుప్రీం కోర్టు వారి వాదనను అంగీకరించకుండానే, రిజర్వేషన్ల ప్రక్రియను మెల్ల మెల్లగా బలహీనపరుస్తూ వచ్చింది. కులానినీ రిజర్వేషన్లకు, కులానికీ పేదరికానికి, కులానికీ వెనుకబాటుతనానికి మధ్య ఉన్న సంబంధాలను రిజర్వేషన్ల వ్యతిరేక శక్తులు గ్రహించటం లేదు. ఈ దేశంలో వెనుకబాటుతనం, పేదరికం, అంటరానితనం, కులవివక్ష, కులపరమైన అత్యాచారాలకు కులమే ప్రధాన కారణమని అర్థం చేసుకోవడం లేదు. పేద వాళ్లంతా ఒకటే కాదని రిజర్వేషన్ల వ్యతిరేకులు గుర్తించటం లేదు. ‘‘కూటికి పేదవాడిని గాని కులానికి కాదు’’ అనే సామెత ఎందుకు వచ్చిందో, దాని అర్థం ఏమిటో గమనిస్తే కులానికి, పేదరికానికి మధ్య ఉన్న సంబంధం బయటపడుతుంది. ఒక పేద బ్రాహ్మణుడికి ఈ దేశంలో దొరికే మర్యాద, గౌరవం, ఆదరణ, ఒక ధనవంతుడైన ఒక మాల లేదా మాదిగ వ్యక్తికి దొరకదనే విషయాన్ని విస్మరించినంత కాలం, ఈ దేశంలో కులానికి, పేదరికానికి మధ్య ఉన్న సంబంధం అర్థం కాదు. ‘‘కులం ఆధారంగా ఉన్న రిజర్వేషన్లు రద్దుచేసి, ఆర్థిక స్థోమత ఆధారంగా రిజర్వేషన్లు కల్పించవలసిన సమయం ఆసన్నమైంది’’ అనే జనార్దన్ ద్వివేదికి అసలు రిజర్వేషన్లు ఎందుకు వచ్చాయో తెలియదు. ఏ రాజకీయ పరిజ్ఞానంతో, ఏ రాజకీయ క్రియాశీలతతో, త్యాగ ఫలంతో ఆయన కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కాగలిగాడు? అంతకన్నా సమర్థులు, పార్టీకి ఎన్నో ఏళ్లుగా సేవ చేస్తున్న నాయకులు ఎంత మంది లేరు? బ్రాహ్మణుడు కాకపోతే ఆయనకు ఆ స్థానం దొరికేదా? ఆ పార్టీ అధికార ప్రతినిధి కాగలిగే వాడా? సోనియా, రాహుల్ గాంధీలకు అంత సన్నిహితుడు కాగలిగే వాడా? నిన్నటి వరకూ ఉత్తరప్రదేశ్‌తో సహా ఉత్తర భారతాన్ని ఏలింది ఈ ద్వివేదులు, చతుర్వేదులు, త్రిపాఠీలే కాదా! ఎస్సీ, బీసీ కులాలు కలసి బ్రాహ్మణులను రాజకీయంగా ఓడించే వరకూ వారి ప్రాబల్యాన్ని ఎవరు ఆపగలిగారు? ప్రజల మధ్య వ్యత్యాసాలకు ఆర్థిక పరిస్థితి ఒకటే కారణమనుకుంటే ఆర్థిక పరిస్థితి ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏర్పరచవచ్చు. కానీ అలాంటి పరిస్థితి లేదుగదా! రిజర్వేషన్ వల్ల ఆశించిన ప్రయోజనం అరవై ఏళ్లలో ఎంత వరకు నెరవేరింది? రిజర్వేషన్ పద్ధతి ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విద్య, ఉద్యోగ రంగాలలో సముచితమైన ప్రాతినిధ్యం కల్పించటం రిజర్వేషన్ల ఉద్దేశం. ‘‘అవకాశాలు లభించిన వాళ్లకే అవకాశాలు దొరుకుతున్నాయి. అట్టడుగున ఉండిపోయిన వారు అక్కడే ఉండిపోతున్నారు’’ అనేది రిజర్వేషన్లపై అగ్రకులాలు లేవనెత్తే అభ్యంతరం. అది నిజమేనా? తెల్లోడి బాటలోనే ఉద్యోగ వివక్ష రిజర్వేషన్ వల్ల వారికి విద్య, ఉద్యోగరంగాలలో పూర్తి అవకాశాలు దొరుకుతున్నాయా? ఇప్పటికీ నాలుగో తరగతి ఉద్యోగాలలోనే ఎక్కువగా వారికి రిజర్వేషన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఒకటి, రెండు, మూడు తరగతి ఉద్యోగాలలో పావు వంతు రిజర్వేషన్ కోటా కూడా నిండటం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఇక రిజర్వేషన్ల అవసరం లేదని ఎలా అంటారు? రిజర్వేషన్లు అంటే నాలుగు, మూడు త రగతి ఉద్యోగాలను దులపరించడం కాదు. ఇద్దరికో ముగ్గురికో ఉన్నత విద్యావకాశాలను కల్పించటం కాదు. విద్యా ఉద్యోగ రంగాలలో ప్రాతినిధ్యానికి నోచుకోని వర్గాలకు అవకాశం కల్పించటం, అభివృద్ధి చెందిన వర్గాలతో పోటీ పడి తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగే పరిస్థితిని కల్పించటం రిజర్వేషన్ల లక్ష్యం. అధికారంలో ఉన్న వర్గం నెరవేర్చవలసిన కర్తవ్యమది. అది చేయకుండా అక్కడక్కడా కొన్ని రిజర్వేషన్లు కల్పించి, వాటిని కూడా సరిగ్గా అమలు చేయకుండా, ‘‘ఇంకా ఎంత కాలం ఈ రిజర్వేషన్ పద్ధతి కొనసాగించాలి?’’ అని ఈసడించుకోవటం చేస్తున్నారు. ఈ సందర్భంగా రిజర్వేషన్లను వ్యతిరేకించే వారికి ఒక విషయం గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ ప్రభుత్వ పరిపాలన మొదట్లో బంట్రోతు వంటి ఉద్యోగాలు తప్ప మిగిలిన ఉద్యోగాలన్నీ ఆంగ్లేయులకే ఇచ్చేవారు. చదువుకున్న భారతీయులు ఉద్యోగావకాశాల కోసం బ్రిటిష్ ప్రభుత్వంతో పెద్ద పోరాటమే చేయవలసి వచ్చింది. చాలా కాలం తర్వాత ఒకటీ, ఒకటీ భారతీయులకు ఇస్తుండేవారు. చాలా కాలం వరకూ ఐసీఎస్ మేజిస్ట్రేట్, జడ్జీ ఉద్యోగాలు భారతీయులకు ఇచ్చేవారు కాదు. భారతీయులకు న్యాయదృక్పథం ఉండదనే కుంటిసాకు చెప్పేవారు. ఎంతో పోరాటం తర్వాతనే ఆ ఉద్యోగాలు భారతీయులకు దక్కాయి. ఒకప్పుడు బ్రిటిష్ వారు భారతీయుల్ని ఎలా చూశారో, అలాగే భారతీయ పాలకులు ఎస్సీ, ఎస్టీ, బీసీలను చూస్తున్నారు. ఇప్పటికీ కొన్ని ఉద్యోగాలు ఈ మూడు వర్గాల వారికి ఇవ్వరు. ఉన్నత న్యాయస్థానాలలోని న్యాయమూర్తి పదవులకు రిజర్వేషన్ వర్తింపజేయటం లేదు. ఎందుకంటే ఆ పదవుల్లో ఉండే అర్హత ఎస్సీ, ఎస్టీ, బీసీలకు లేదంటారు. ఇలాంటి వివక్ష చూపుతూ కూడా ఇంకా రిజర్వేషన్లు ఎంత కాలం అంటే ఎలా? మనిషి విలువను కులాన్ని బట్టి చూస్తున్న ఈ దేశంలో కులానికి ఆర్థిక పరిస్థితితో ఉన్న సంబంధాన్ని చూడని ఈ దేశంలో, ఆర్థిక స్థోమతను బట్టి రిజర్వేషన్లు కల్పించాలనటం రిజర్వేషన్ పద్ధతి ప్రవేశపెట్టిన సూత్రాన్ని దెబ్బ కొట్టటమే అవుతుంది. రిజర్వేషన్ల అవసరం రాని పరిస్థితిని కల్పించాల్సిన ఆవశ్యకతను విస్మరించి, ఆర్థిక పరిస్థితిని బట్టి రిజర్వేషన్లు కల్పించమని అడగటం అర్థరహితం. ఆ సాకుతో అభివృద్ధి చెందవలసిన వర్గాలను దెబ్బతీయడం మంచిది కాదు. అయితే అది ద్వివేదికి మంచిదే కావచ్చు! (వ్యాసకర్త రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయవాది) -
ధర్మాసనంపై నమ్మకం కోల్పోయారు !
చుండూరు బాధితుల తరఫున హైకోర్టులో స్పెషల్ పీపీ అఫిడవిట్ 10న హాజరై స్పష్టత ఇవ్వాలని అటార్నీ జనరల్‌కు ధర్మాసనం ఆదేశం ఈ ఊచకోత కేసులో ప్రభుత్వ వైఖరి తెలపాలని సీఎస్‌కు స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: చుండూరు దళితుల ఊచకోత కేసు మంగళవారం హైకోర్టులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారిస్తున్న ధర్మాసనం పట్ల కొందరు బాధితులు నమ్మకం కోల్పోయారంటూ స్పెషల్ పీపీ బొజ్జా తారకం దాఖలు చేసిన అఫిడవిట్ సంచలనం రేపింది. దీనిపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన ధర్మాసనం... స్పెషల్ పీపీ బాధితుల తరఫున పనిచేయాలా? లేక ప్రభుత్వ సలహా ఆధారంగా పనిచేయాలా? అని సందేహం వ్యక్తం చేసింది. దీనిపై స్పష్టతనిచ్చి కోర్టుకు సహాయం చేసేందుకు అటార్నీ జనరల్ లేదా ఆయన ద్వారా అధీకృత వ్యక్తిగా నియమితులైన సీనియర్ న్యాయవాది గానీ 10న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.కె.జైశ్వాల్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1991, ఆగస్టు 6న గుంటూరు జిల్లా చుండూరులో చోటుచేసుకున్న 8 మంది దళితుల ఊచకోత ఘటనపై సుదీర్ఘ విచారణ తరువాత ప్రత్యేక న్యాయమూర్తి అనీస్ 2007, ఆగస్టు 1న తీర్పు వెలువరించారు. నిందితులకు ఉరిశిక్ష విధించే అరుదైన కేసు కాదని పేర్కొంటూ మొత్తం 179 నిందితుల్లో 123 మందిని నిర్దోషులుగా ప్రకటించారు. 21 మందికి యావజ్జీవం, 35 మందికి ఏడాది జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పులోని కొన్ని అంశాలపై సందేహాలు లేవనెత్తుతూ బాధిత కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించాయి. శిక్ష పడినవారు తమ శిక్షను రద్దు చేయాలంటూ పిటిషన్ వేశారు. మరోవైపు నిర్దోషులుగా విడుదలైన వారికి వ్యతిరేకంగా ప్రభుత్వం పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కేసుల్లో వాదనలు వినిపించేందుకు న్యాయవాది బొజ్జా తారకం, రఘునాథ్‌లను స్పెషల్ పీపీలుగా ప్రభుత్వం నియమించింది. ఈ వ్యాజ్యాలన్నింటిపై జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం కొద్ది రోజులుగా విచారణ సాగిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం విచారణ సమయంలో బాధితుల తరఫున బొజ్జా తారకం ధర్మాసనం పట్ల అవిశ్వాసం వ్యక్తం చేశారు. కేసు విచారణ తీరు చూస్తుంటే తమకు న్యాయం జరిగేలా కనిపించట్లేదని బాధితుల్లో కొందరు నమ్మకం కోల్పోయారంటూ అఫిడవిట్‌ను ధర్మాసనం ముందుంచారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాదనల ప్రారంభంలో అభ్యంతరం లేదని చెప్పి... ఇప్పుడిలా అభ్యంతరాలు ఉన్నాయనడం ఎంత వరకు సబబని ప్రశ్నించింది. ‘‘కోర్టుపై నమ్మకం లేనిది మీకా (స్పెషల్ పీపీ)? లేక బాధితులకా?’’ అంటూ తారకాన్ని అడిగింది. బాధితులకంటూ తారకం సమాధానం చెప్పగా... వారి పేర్లు చెప్పాలని ధర్మాసనం కోరింది. పేర్లు తెలుసుకోవాల్సి ఉందని ఆయన చెప్పడంతో... పేర్లు తెలుసుకోకుండానే ప్రమాణపత్రం(అఫిడవిట్)దాఖలు చేశారా? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చట్ట ప్రకారం బాధితుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడానికి వీల్లేదని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి తెలియచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశిస్తూ విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. -
‘గ్రీన్‌హంట్’ పేరుతో గిరిజనులపై యుద్ధం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం గ్రీన్‌హంట్ పేరుతో గిరిజనులపై యుద్ధం చేస్తోందని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బొజ్జా తారకం ధ్వజమెత్తారు. అడవుల్లోని సైనిక బలగాలను తక్షణమే నియంత్రించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాట కమిటీ నేత చిలకా చంద్రశేఖర్ అధ్యక్షతన నిర్వహించిన సభలో తారకం ముఖ్యవక్తగా ప్రసంగించారు. బీసీ మహాజన సమితి అధ్యక్షుడు ఉ.సాంబశివరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లోని సైనిక శిబిరాలను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. కులనిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు దుడ్డు ప్రభాకర్, ప్రగతిశీల మహిళాసంఘం నాయకురాలు సంధ్య, టీఎస్ జాక్ నేత కోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.