హక్కుల యోధుడికి అశ్రు నివాళి
⇒ కడసారి వీడ్కోలు పలికిన అభిమానులు, ప్రముఖులు
⇒ నివాళులర్పించిన డిప్యూటీ సీఎంలు కడియం, మహమూద్, పలువురు మంత్రులు, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్
సాక్షి, హైదరాబాద్: హక్కుల యోధుడు, ప్రముఖ న్యాయవాది, సాహితీవేత్త బొజ్జా తార కం అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. శనివారం సాయంత్రం 4.30 గంటలకు రాయదుర్గంలోని వైకుంఠ మహాప్రస్థానం శ్మశానవాటికలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. దళిత, పౌరహక్కుల కార్యకర్త లు, అభిమానులు, వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు భారీగా తరలివచ్చి హక్కుల సూరీ డుకి అంతిమ వీడ్కోలు పలికారు.
‘నీల్ సలామ్.. నీల్ సలామ్’...‘కోనసీమ ముద్దుబిడ్డ..నీల్ సలామ్..’ ‘బొజ్జా తారకం అమర్ రహే’..‘దళిత ముద్దుబిడ్డ అమర్ రహే..’ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. మహప్రస్థానం శక్తిస్థల్‌లోని విద్యుత్ దహనవాటికలో ఆయన కుమారుడు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, కుటుంబ సభ్యులు అంత్యక్రియలు ముగించారు. అంతకుముందు మధ్యాహ్నం 2.30 గంటలకు బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించా రు. అక్కడ్నుంచి తారకం భౌతికకాయాన్ని మహాప్రస్థానం శ్మశానవాటికకు తరలిం చారు. సీనియర్ ఐఏఎస్ అధికారి సురేంద్రమోహన్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, మెదక్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.
తరలివచ్చిన ప్రముఖులు
బొజ్జా తారకం భౌతికకాయానికి నివాళి అర్పించేందుకు వివిధ రంగాల ప్రముఖులు, అభిమానులు, రాజకీయ పార్టీలు, ప్రజా సం ఘాల నేతలు, మేధావులు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తరలివచ్చారు. అశోక్‌నగర్‌లోని ఆయన నివాసం నుంచి పార్థివ దేహాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తీసుకువచ్చి ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఉంచారు. వివిధ జిల్లాల నుంచి కూడా పెద్దఎత్తున అభిమానులు రావడంతో సుందరయ్య విజ్ఞాన కేంద్రం పరిసరాలు కిక్కిరిసిపోయాయి.
వైఎస్ జగన్ , ప్రముఖుల నివాళి
బొజ్జా తారకం భౌతికకాయానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన వెంట పార్టీ నేతలు పార్థసారథి, పినిపె విశ్వరూప్ తదితరులున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎంలు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నారుుని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి నివాళులు అర్పించారు.
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఆ పార్టీ శాసన సభాపక్ష నేత జి.కిషన్ రెడ్డి, టీడీపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ నేత కె.నారాయణ, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, విరసం నేత వరవరరావు, ప్రజా గాయకుడు గద్దర్, ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ రామచంద్రమూర్తి తదితరులు తారకం పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. బొజ్జా తారకం మృతిపట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు.