అస్తమయం | tribute to famous lawyer and activist bojja tarakam | Sakshi
Sakshi News home page

అస్తమయం

Published Mon, Sep 19 2016 12:56 AM | Last Updated on Wed, Apr 3 2019 6:20 PM

అస్తమయం - Sakshi

అస్తమయం

గుడి, జైలు... బంధించడానికే రెండూ!
ఇద్దరు డిటెన్యూలు చాలా గొప్ప విషయాలు చెప్పారు. వారి దగ్గర రోజూ కూర్చుని నోట్స్ వ్రాసుకున్నాను. ఇంతవరకూ తెలుగు సాహిత్యంలోకి రాని విషయాలు సేకరించాను. రెండు నవలలుగా వ్రాయాలనుకున్నాను. ఆ నోట్స్ జైల్లో ఉండే పోలీస్ అధికారి కంటబడింది. తీసుకున్నాడు. నా ఎదుటనే కాల్చివేశాడు.
 
1975 జూన్ ఇరవై ఆరో తారీఖున అత్యవసర పరిస్థితి ప్రకటించారు. కొన్ని వేల మందిని జైళ్ళలో నింపారు. దేశం అంతా భయం ఆవరించింది. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అరెస్టయ్యారు. ‘ఇందిరాగాంధీ విధానాలు వ్యతిరేకిస్తున్నారు’ అనుకున్నవాళ్ళను అరెస్టు చేశారు. రాజకీయ కార్యకర్తలకు ఎలానూ తప్పదు; రచయితలను కూడా అరెస్ట్ చేశారు. ‘‘ప్రజలతో ఇప్పటికే చాలా సంబంధాలు పెట్టుకున్నాడు, అంతేకాదు ఇతను రచయిత కూడా’’ అని పోలీసులు నా గురించి రిపోర్టులు పంపిస్తున్నారు ఎప్పటినుంచో.
 
జూలై నాలుగో తారీఖు... సాయంత్రం కొంచెం ఆలస్యంగా వచ్చాను కోర్టు నుంచి. చీకటి పడింది. కొద్దిగా చినుకులు పడుతున్నాయి. పోలీస్ ఇన్‌స్పెక్టర్ వచ్చాడు. ‘మిమ్మల్ని ఎస్.పి. గారు రమ్మంటున్నారు’ అన్నాడు. నాకు అర్థమయింది. భారతితో(బి.విజయభారతి) చెప్పాను ‘అరెస్టు చేస్తారు’ అని. పోలీస్ జీప్‌లో వెళ్ళాను. ఎస్.పి. గారింటివద్ద పోలీసు వ్యాన్‌లు... జీప్‌లు... హడావుడిగా ఉంది. ఆయన చెప్పారు ‘‘మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’’ అని. ‘మరి ఇంట్లో చెప్పి వస్తాను’ అన్నాను. అదే జీప్‌లో పంపించారు. అప్పటికే జీప్ నిండా తుపాకీ పట్టుకున్న పోలీసులు. ఇంటికి వెళ్ళేసరికి చుట్టూ పోలీసు కాపలా. లోపలికి వెళ్తుంటే నా కూడా తుపాకీతో పోలీసు...
 
నిజామాబాద్‌లో మొదటి అరెస్ట్...
పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్ళారు. ఆ తర్వాత ఒకర్నీ ఒకర్నీ పట్టుకొచ్చారు. దాదాపు పదిహేను మంది. ఆ రాత్రంతా మెలకువతోనే ఉన్నాను. చూడడానికి వచ్చిన జనాన్ని చెదరగొట్టేశారు. పోలీసు స్టేషన్‌లో రెండు రోజులుంచారు. ఆ తర్వాత కోర్ట్‌లో హాజరు పరిచి జైలుకు తీసుకువెళ్ళారు.
 
నిజామాబాద్ జైలు చాలా ఎత్తై కొండమీద ఉంది. పెద్ద పెద్ద మెట్లు ఎక్కి వెళ్ళాలి. దేవాలయాన్ని నిజాం ప్రభుత్వం జైలుగా మార్చిందంటారు. ఎవరో ఒకర్ని బంధించడానికే రెండూను. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కవిత్వం వ్రాసినందుకు దాశరథిని ఇదే జైల్లో ఉంచారు. రచయితగా నేను రెండోవాడిని.
 
జైల్లో ఒక రాత్రి బాగా జ్వరం వచ్చింది. హాస్పిటల్‌కి తీసుకు వెళ్తామన్నారు. బేడీలు వేస్తామన్నారు. నేను రానన్నాను. తప్పదన్నారు. జ్వరం తీవ్రంగా ఉంది. హాస్పిటలుకు వెళ్ళక తప్పలేదు. నాకు బేడీలు వేసినందుకు డిటెన్యూలంతా బాధపడ్డారు.
భారత రక్షణ చట్టం క్రింద మమ్మల్ని అరెస్టు చేశారు; కాబట్టి బెయిలు కోసం దరఖాస్తు పెట్టాము. కోర్టు బెయిలు ఇచ్చింది. బెయిలు ఆర్డరు కంటే ముందుగానే పోలీసు వ్యాన్‌లు వచ్చాయి జైలుకు. జైలంతా తెలిసిపోయింది మళ్ళీ అరెస్టు చేస్తారని.
నాతో మరో ఇద్దర్ని విడుదల చేయమని కోర్టు ఆర్డర్. ముగ్గురమూ కిందికి దిగి వచ్చాం. పోలీసు ఇన్‌స్పెక్టర్ సరిగ్గా మెట్ల దగ్గర ఉన్నాడు... చుట్టూ సాయుధులైన పోలీసులు... వాళ్ళిద్దర్నీ ఏమీ అనలేదు. నన్నొకణ్ణే అరెస్టు చేశారు... ఈసారి ఆంతరంగిక భద్రతా చట్టం క్రింద. పోలీసుస్టేషన్‌కు తీసుకువెళ్ళారు... కందికుప్ప నుంచి నాన్న వచ్చారు.
 
ఆ రాత్రే తీసుకువచ్చారు చెంచల్‌గూడా సెంట్రల్ జైలుకు. జ్వరంలోనే తీసుకు వచ్చారు. రాత్రి ఒంటిగంటకు బస్‌లో ప్రయాణం. నాకు రెండు వైపులా తుపాకీలతో పోలీసులు. అరెస్టు అయిన వ్యక్తి కంటే చూసేవాళ్ళు హడలిపోవాలి... అక్కడ దాదాపు సంవత్సరం ఉన్నాను. డిటెన్యూలు రెండు వందల మందిపైగా. వారందరితో జైలు జీవితం చాలా గొప్ప అనుభవం. జైలులో డైరీ వ్రాస్తూ ఉండేవాడిని.
 
మొదటి మూడు నెలలు ఎవర్నీ కలవనివ్వలేదు. ఎవర్నీ చూడడానికి రానివ్వలేదు. ఉత్తరాలు కూడా లేవు. మేమంతా హైకోర్టుకు వెళ్తే ‘నెలకొక వ్యక్తి చూడొచ్చు’ అన్నారు. అదయినా చాలా దగ్గర బంధువు. దానిని కొన్నాళ్ళకు పదిహేను రోజుల కొకసారి చేశారు. ఆ నిర్బంధ వాతావరణంలో వ్యక్తుల మనస్తత్వాలు చాలా చిత్రంగా ఉండేవి. నిర్బంధం, ఒత్తిడి మనస్సుపై ఎంత ప్రభావం చూపుతాయో జైల్లో ప్రత్యక్షంగా చూశాను.
 
ఇద్దరు డిటెన్యూలు చాలా గొప్ప విషయాలు చెప్పారు నాకు. వారి దగ్గర రోజూ కొంతసేపు కూర్చుని నోట్స్ వ్రాసుకున్నాను. ఇంతవరకూ తెలుగు సాహిత్యంలోకి రాని విషయాలు సేకరించాను. గత ఏభై ఏళ్ళ చరిత్ర అది. రెండు ప్రాంతాల గాథలవి. రెండు పోరాట కథలు... చాలా గొప్ప కథలు... ఇద్దరివీ గొప్ప అనుభవాలే... రెండు నవలలుగా వ్రాయాలనుకున్నాను. ఆ నోట్స్ జైల్లో ఉండే స్పెషల్ బ్రాంచ్ పోలీస్ అధికారి కంటబడింది. తీసుకున్నాడు. నా ఎదుటనే కాల్చివేశాడు. ఎంత బాధపడ్డానో చెప్పలేను.
 
మూడు నెలలయిన తర్వాత కొందరం హైకోర్టులో రిట్ వేశాం. కోర్టుకు మమ్మల్ని తీసుకు వెళ్ళేవారు.. బయట ప్రపంచాన్ని చూడటం అదే... చాలా రోజులు విచారణ చేసి విడిచి పెట్టేశారు... కోర్టు బయటికి వస్తుంటేనే పోలీసులు అంటున్నారు... ‘మళ్లీ అరెస్ట్ చేస్తామ’ని. కొందరు కోర్టు నుంచే సరాసరి వెళ్ళిపోయారు. మేం జైలుకు వచ్చాం. గబగబ సర్దుకొని బయటపడ్డాం. ఆ రాత్రి హైద్రాబాద్‌లోనే ఉన్నాను. ఉదయం పోలీసులు వచ్చారు. మళ్ళీ అరెస్ట్ చేశారు.
 
జైలుకు వెళ్ళేసరికి చాలామందిని అప్పటికే తీసుకొచ్చేశారు. మళ్ళీ మామూలు కథే... అలా ఆరు నెలలు గడిచిపోయాయి. ఒక రోజు ఎందుకో హఠాత్తుగా ‘నీతో చెప్పనే లేదు’ అన్న వాక్యాలు వచ్చాయి... వ్రాశాను... ఆ తర్వాత... ఏదో ఆలోచన ఉబికి వచ్చేది... వాక్యాలు తొణికి వచ్చేవి... వ్రాసుకుంటూ వెళ్ళిపోయాను. మిత్రులకు చదివి వినిపిస్తుండే వాడిని. మెచ్చుకొనేవారు. శివుని త్రిశూలంలా ఉండేవి పువ్వులు ఒక చెట్టుకి... ఆ చెట్టు కింద కూర్చుని చదువుకొనేవాణ్ణి. అక్కడే కూర్చుని వ్రాసుకుంటూ ఉండేవాడిని.
 
 (సెప్టెంబర్ 16న మరణించిన దళిత, వామపక్ష, పౌరహక్కుల ఉద్యమనేత, న్యాయవాది, రచయిత బొజ్జా తారకం...
 1983 మార్చిలో తన కవితా సంకలనం ‘నది పుట్టిన గొంతుక’కు రాసుకున్న ముందుమాటలోంచి...)
 బొజ్జా తారకం
 27 జూన్ 1939 - 16 సెప్టెంబర్ 2016

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement