బూచిలా మిగిలిన ‘బ్యూరో’
1963లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ (సీబీఐ)ను ఏర్పాటు చేస్తూ కేంద్ర హోం మంత్రిత్వశాఖ జారీచేసిన తీర్మా నం (రిజల్యూషన్) చెల్లదంటూ గౌహతి హైకోర్టు సంచలనాత్మక మైన తీర్పు ఇచ్చింది. సీబీఐ అనేది ఒక శాఖ కాదనీ, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెం ట్‌కు చెందిన ఒక విభాగం కూడా కాదనీ గౌహతి కోర్టు తీర్పులో పేర్కొన్నది. అందువల్ల అది ‘పోలీస్ బలగం’ నిర్వచనం కిందకి రాదని కూడా స్పష్టపరిచింది. అంతేకా కుండా సీబీఐని ఏర్పాటు చేసిన 1963లోని తీర్మానం చెల్లదంటూ కొట్టిపారేసింది. దీని ఫలితమేమంటే అసలు సీబీఐ అనేది లేనట్టే అనీ, అది ఇంత వరకూ చేస్తూ వచ్చిన పరిశోధనలు, దాఖలు చేసిన ఛార్జిషీట్లు, నడిపించిన విచారణలు, వేయించిన శిక్షలు ఏవీ చెల్లవనీ తేలుతుంది.
కంగుతిన్న సీబీఐ
ఈ తీర్పుతో ఒక్కసారి సీబీఐ అదిరిపోయింది. హుటాహు టిన సుప్రీంకోర్టుకు పరుగెత్తి అప్పీలు చేసింది. శనివారం కోర్టు పనిచేయదు. అయినా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి, మరొక న్యాయమూర్తితో కలిసి ఒక బెంచ్‌గా ఏర్పడి గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును ‘స్టే’ చేశారు. ఈ తీర్పు ఎంత తీవ్రమైనదో దీనితో అర్థమవుతున్నది. ఈ తీర్పును సుప్రీంకోర్టు ఆమోదిస్తే మాత్రం దేశంలో చాలా తీవ్రపరిణామాలు వస్తాయి. అయినా సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలనే పరిగణనలోనికి తీసుకుంటుంది గాని, పరిణా మాలు పట్టించుకోదు. ఎంతో పెద్ద పెద్ద రాజకీయ నాయ కులను, మంత్రులను, మాజీ ముఖ్యమంత్రులను, అధి కారులను, పార్లమెంటు సభ్యులను జైలుకు సీబీఐ కోర్టు జైలుకు పంపింది. ఇంకా చాలామంది ముఖ్యులను జైలు కు పంపేందుకు సన్నాహాలు చేస్తున్నది. అలాంటిది, అసలు సీబీఐ వ్యవ స్థే చెల్లదని తీర్పువస్తే? రాజకీయం అల్లకల్లోలం కాక ఏమవుతుంది!
ఎలా చట్ట విరుద్ధం?
సీబీఐ పుట్టుక చట్ట విరుద్ధమంటూ గౌహతి హైకోర్టు ఏ ప్రాతిపదికన తీర్పు ఇచ్చిందో ఒకసారి చూద్దాం. సీబీఐని ఏర్పాటు చేసిన రిజల్యూషన్, దాని ఏర్పాటుకు సంబంధిం చిన అసలు రికార్డు లభ్యం కాలేదు. ఈ రిజల్యూషన్‌ను రాష్ట్రపతికి పంపనే లేదని, ఆయన తన అనుమతి మం జూరు చేయలేదని కూడా హైకోర్టు చెప్పింది. అంతేకాదు, ఈ తీర్మానం అనేది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం అని కూడా అనలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సీబీఐ అనేది కొత్త విభాగమని అది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ వం టిది కాదని కూడా చెప్పింది. అంటే సీబీఐ పుట్టుక ప్రశ్నార్థ కమే అయింది.
పరిపాలనకు సంబంధించిన చట్టాలను రాష్ట్ర శాసనసభలు కాని, పార్లమెంటు కాని చేయడం పరిపాటి. వాటిని రాష్ట్రపతి ఆమోదిస్తారు. రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లే ముందు శాసనసభల్లో, ఆయా సందర్భాన్ని బట్టి లోక్ సభలో బిల్లుపై చర్చ జరుపుతారు. సభ ఆమోదించి, అవసరమైన సవరణలు చేసి రాష్ట్రపతికి పంపుతుంది. దానిపై ఆయన ఆమోదముద్ర వేస్తారు. అప్పుడది చట్టం అవుతుంది. ఈ ప్రక్రియ పూర్తికాకపోతే అది చట్టం కానే రదు, అమలులోకే రాదు.
సీబీఐ ఎలా ఏర్పడింది?
1946లో ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్‌ని ఏర్పరి చారు. దీనికి ముందు 1943లో భారత ప్రభుత్వం స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ (యుద్ధ శాఖ)ను ఏర్పరచింది. కేంద్ర ప్రభుత్వంలో పెరుగుతున్న లంచగొండి తనం అవి నీతికి సంబంధించిన ఫిర్యాదులను దర్యాప్తు చేయటమే దీని ఉద్దేశం. ఆ తరువాత ఇది 1946లో డీఎస్‌పీఈ చట్టంగా రూపొందింది. ఈ చట్టం ఉద్దేశమేమంటే ఒక ప్రత్యేక పోలీసు బలగాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయటం. అక్కడ జరిగే నేరాలను దర్యాప్తు చేసి అవసరమైన చర్యలు చేపట్టడం. ఆ తర్వాత దీని పరిధిని ఇతర ప్రాంతాలకు విస్తరింపచేయటం. ఏదైనా రాష్ట్రాలలో దర్యాప్తు చేయాల నుకుంటే ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. అను మతిలేకుండా దర్యాప్తు చేయటానికి వీల్లేదు.
పరిస్థితి ఇలా ఉంటే సీబీఐ తన అధికారాలను, పరి ధిని విస్తరించుకుంటూ పోతున్నది. కేంద్ర ప్రభుత్వం కూడా విచారణకు సంబంధించి సీబీఐకి విస్తృతమైన అధి కారాలను కట్టబెడుతూ పోతున్నది. విచారణకు సంబం ధించి అది చాలా ప్రధానమైన సంస్థగా ఎదిగింది. ప్రభు త్వోద్యోగులపై విచారణ జరిపించటానికి ఒక మాన్యు వల్‌ని కేంద్ర ప్రభుత్వం తయారు చేసింది. 1963లో ఉదహరించిన విషయాలకంటే ఇంకా ఎక్కువ అంశాలను తన పరిధిలోకి తెచ్చుకున్నది. స్కాంల మీద స్కాంలు పెరి గిపోతుంటే అన్నింటినీ విచారణ చేయటానికి సిద్ధపడింది. ఈ దశలలో జరిగిన వ్యవహారాలు దేనికీ చట్టబద్ధత లేదు.
విమర్శల జడి
కేంద్రం ఏది తలచుకుంటే అది సీబీఐ చేస్తున్నది. అందు కనే దానిని కేంద్ర ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు దుర్వినియో గపరుస్తున్నదనే ఫిర్యాదులు చాలా వస్తున్నాయి. తనకు ఇష్టమైన వాళ్ల మీదికి వెళ్లకుండా, ఇష్టం లేని వారిపై చర్య లకు ఉపక్రమిస్తున్నదనే అభియోగాలు కూడా సీబీఐ మీద ఎక్కువగా వస్తున్నాయి. ఇటీవల 2-జీ స్కాం దగ్గర నుం చి, బొగ్గు కుంభకోణం నుంచి ఇటువంటి ఫిర్యాదులు, విమర్శలు మరీ వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా కొంత మందికి సీబీఐ ‘క్లీన్ చిట్’లు ఇస్తున్న సంగతిని, వీటి మీద రేగుతున్న దుమారాన్ని కూడా గమనించడం అవసరం. ఇవన్నీ ఎలా సాధ్యమవుతున్నాయంటే సీబీఐకి ఒక శాసనపరమైన ప్రాతిపదిక లేకపోవడం. ఎన్నోసార్లు నేరవిచారణకు సంబంధించి ఒక ప్రత్యేకమైన చట్టం తీసు కురావాలని ఆందోళన చేస్తున్నారు. చట్టం తీసుకువచ్చి సీబీఐ స్వతంత్ర ప్రతిపత్తిగల ఒక సంస్థగా చేయాలనీ అడు గుతున్నారు. వాస్తవానికి అనేకసార్లు దీనికి సంబంధించి ఒక బిల్లును కూడా సీబీఐ తయారు చేసి కేంద్రానికి పం పటం జరిగింది. అయితే కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పు కోవటం లేదు.
సుప్రీం జోక్యం
ఈ లొసుగులు ఉండటం వల్లనే చాలాసార్లు సుప్రీంకోర్టు దర్యాప్తులను తనే స్వయంగా పర్యవేక్షించటానికి దిగింది. దర్యాప్తులు ఎలా జరుగుతున్నాయో ఎప్పటికప్పుడు తనకు తెలియజేస్తూ ఉండాలని నియంత్రించింది. ఇది సుప్రీంకోర్టు చేయవలసిన పనికాదు. కానీ చేస్తున్నది. ఎవరి స్వేచ్ఛనుగాని, ప్రాణాన్ని గాని చట్టంలో రూపొం దించిన పద్ధతి ప్రకారం వేరే విధంగా హరించకూడదని రాజ్యాంగం చాలా స్పష్టంగా చెబుతున్నది. ఎందుకంటే స్వేచ్ఛకు, ప్రాణానికి రాజ్యాంగం ఎంతో విలువ ఇచ్చింది. శాసన బద్ధమైన పాలన అంటే చట్ట ప్రకారంగా పరిపాలన జరగాలని అర్థం. చట్టం అంటే అది పార్లమెంటుగాని రాష్ట్ర శాసనసభలు గాని తయారు చేసినవి అయి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మీద చట్టాలు నడిచి పోకూడదు. అలా జరిగితే అది రాజ్యాంగ సూత్రాల ఉల్లం ఘనే అవుతుంది.
అంతిమ నిర్ణయం ఏది?
అందుకనే గౌహతి హైకోర్టు సీబీఐకి చట్టబద్ధతలేదని, అదే విధంగా ఢిల్లా స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం 1946కి కూడా రాజ్యాంగ బద్ధతలేదని చెప్పింది. సుప్రీం కోర్టు ఈ తీర్పుపై ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్ప టికైనా మించిపోయింది లేదు. ఒక సమగ్రమైన చట్టాన్ని తీసుకువచ్చి నేర దర్యాప్తులపై ఒక స్పష్టమైన పద్ధతి ప్రవేశ పెట్టి, దర్యాప్తులు జరిపించి దోషులను న్యాయస్థానాల ముందు ప్రవేశపెట్టాలి. ఎందుకంటే ఈ ప్రక్రియ ప్రజల జీవితాలకు, స్వేచ్ఛకు సంబంధించినది. ఈ రెండింటినీ కాపాడవలసిన బాధ్యత ప్రజలందరిదీ! వీటిని పోలీసుల చేతుల్లో పెట్టకూడదు!
- బొజ్జా తారకం,
సీనియర్ న్యాయవాది