తదుపరి సీజేఐ జస్టిస్‌ ఖన్నా | CJI DY Chandrachud proposes Justice Sanjiv Khanna as next cji of sc | Sakshi
Sakshi News home page

కేంద్రానికి చంద్రచూడ్‌ లేఖ.. తదుపరి సీజేఐగా సంజీవ్‌ ఖన్నా

Published Thu, Oct 17 2024 8:58 AM | Last Updated on Fri, Oct 18 2024 4:25 AM

CJI DY Chandrachud proposes Justice Sanjiv Khanna as next cji of sc

కేంద్రానికి సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ సిఫార్సు 

దేశ 51వ సీజేఐగా నవంబర్‌ 11న బాధ్యతలు 

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి నియామక ప్రక్రియ మొదలైంది. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ బుధవారం ఇందుకు శ్రీకారం చుట్టారు. తన వారసునిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా పేరును సిఫార్సు చేస్తూ కేంద్ర న్యాయ శాఖకు లేఖ రాశారు. కేంద్రం లాంఛనంగా ఆమోదం తెలిపిన అనంతరం జస్టిస్‌ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి అవుతారు.

 నవంబర్‌ 10న జస్టిస్‌ చంద్రచూడ్‌ రిటైరవనున్నారు. అనంతరం 11న జస్టిస్‌ ఖన్నా సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆరు నెలలకు పైగా సేవలందించి 2025 మే 13న రిటైరవుతారు. జస్టిస్‌ చంద్రచూడ్‌ తర్వాత సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్‌ న్యాయమూర్తి ఖన్నాయే. సుప్రీంకోర్టులో సీనియర్‌ మోస్ట్‌ న్యాయమూర్తిగా ఉన్నవారే తదుపరి సీజేఐ కావడం పరిపాటి. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల రిటైర్మెంట్‌ వయసు 65 ఏళ్లు. జస్టిస్‌ చంద్రచూడ్‌ దాదాపు రెండేళ్లుగా సీజేఐగా సేవలందిస్తుండటం తెలిసిందే. తదుపరి సీజేఐ పేరును సూచించాల్సిందిగా కేంద్ర న్యాయ శాఖ గత శుక్రవారం ఆయన్ను అభ్యరి్థంచింది. 

చరిత్రాత్మక తీర్పులు 
జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా న్యాయ కోవిదునిగా పేరొందారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించారు. ఈవీఎంలు సురక్షితమైనవని, బూత్‌ల ఆక్రమణ, బోగస్‌ ఓటింగ్‌లకు చెక్‌ పెడతాయని స్పష్టం చేయడమే గాక ఎన్నికల్లో వాడకాన్ని సమరి్థస్తూ తీర్పు ఇచ్చారు. వీవీప్యాట్ల ద్వారా ఈవీఎం ఓట్లను నూరు శాతం వెరిఫై చేయాలంటూ దాఖలైన కేసును కొట్టేసిన ఆ ధర్మాసనానికి ఆయనే సారథి. 

ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమైనదంటూ తీర్పు వెలువరించిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ ఖన్నా సభ్యులు. జమ్మూ కశీ్మర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కలి్పస్తున్న ఆరి్టకల్‌ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సమరి్థంచిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో కూడా ఆయన ఉన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో జైలుపాలైన ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిమిత్తం మధ్యంతర బెయిల్‌ మంజూరు చేశారు. ప్రస్తుతం నేషనల్‌ లీగల్‌ సర్వీస్‌అథారిటీ (ఎన్‌ఏఎల్‌ఎస్‌ఏ) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా కూడా సేవలందిస్తున్నారు.

హైకోర్టు సీజే కాకుండానే... 
జస్టిస్‌ ఖన్నా 1960 మే 14న జని్మంచారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్‌ లా సెంటర్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌ సభ్యునిగా నమోదు చేసుకున్నారు. తీస్‌హజారీ జిల్లా కోర్టుల్లో న్యాయవాదిగా కెరీర్‌ మొదలు పెట్టారు. అనంతరం ఢిల్లీ హైకోర్టుతోపాటు పలు ట్రిబ్యునళ్లలో న్యాయవాదిగా పలు ప్రతిష్టాత్మక కేసులను వాదించి సమర్థునిగా పేరు తెచ్చుకున్నారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, ఏడాది అనంతరం శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 

ఏ హైకోర్టుకూ ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే నేరుగా ఈ ఘనత సాధించిన అతి కొద్దిమందిలో ఒకరిగా నిలిచారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నాకు ఆయన మేనల్లుడు. 1973లో కేశవానంద భారతి కేసులో మౌలిక నిర్మాణ సిద్ధాంతానికి సంబంధించి చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్‌ హెచ్‌ఆర్‌ ఖన్నా సభ్యుడు. ఎమర్జెన్సీ వేళ పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు వంటి ప్రాథమిక హక్కులను కూడా సస్పెండ్‌ చేయవచ్చంటూ 1976లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పుతో విభేదించిన ఏకైక సభ్యునిగా ఆయన సుప్రసిద్ధులు. ఈ కారణంగా తనను కాదని జూనియర్‌ను సీజేఐగా నియమించడంతో న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు.  

చదవండి: పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కన్నెర్ర

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement