DY Chandrachud
-
‘స్వలింగ వివాహాల’పై తీర్పు సరైనదే: సుప్రీం
న్యూఢిల్లీ: దేశంలో స్వలింగ వివాహాల విషయంలో సుప్రీంకోర్టు తన వైఖరిని మరోసారి కుండబద్ధలు కొట్టినట్లు తేల్చేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేమంటూ గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించేందుకు నిరాకరించింది. ఈ తీర్పును మళ్లీ క్షుణ్నంగా పరిశీలిచాలంటూ దాఖలైన పిటిషన్లను విచారణకు స్వీకరించలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. స్వలింగ వివాహాలకు చట్టపరంగా గుర్తింపు ఇవ్వడానికి రాజ్యాంగబద్ధంగా ఎలాంటి ఆధారం లేదని 2023 అక్టోబర్‌లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు సామాజిక కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేశారు. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్‌జెండర్, ఇంటర్‌సెక్స్ తదితర వర్గాలు ఆందోళనకు దిగాయి. స్వలింగ వివాహాలపై అప్పట్లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ బి.వి.నాగరత్న, జస్టిస్ పి.ఎస్.నరసింహ, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం ఆయా పిటిషన్లను పరిశీలించింది. 2023 నాటి తీర్పులో ఎలాంటి పొరపాటు లేదని తేల్చిచెప్పింది. అప్పటి తీర్పులో వెల్లడించిన అభిప్రాయాలు చట్టానికి అనుగుణంగానే ఉన్నాయని వివరించింది. ఆ తీర్పులో కలుగజేసుకోవాల్సిన అవసరం లేదని ఉద్ఘాటించింది. రివ్యూ పిటిషన్లను డిస్మిస్ చేస్తున్నట్లు ధర్మాసనం స్పష్టంచేసింది. -
మాజీ సీజేఐపై ఆరోపణలు.. పిటిషన్‌ను కొట్టేసిన లోక్‌పాల్
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయ మూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసును లోక్‌పాల్ కొట్టివేసింది. తన న్యాయ పరిధికి మించిన అంశమని ఒక ఉత్తర్వులో పేర్కొంది. ఓ రాజకీయ పార్టీని, ఓ రాజకీయ నేతను కాపాడేందుకు తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ గతేడాది అక్టోబర్ 18వ తేదీన అప్పటి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్‌పై ఫిర్యాదు అందింది. గతేడాది నవంబర్ 10వ తేదీన పదవి నుంచి ఆయన రిటైరయ్యారు. లోక్‌పాల్, లోకాయుక్త చట్టంలోని సెక్షన్–14 ప్రకారం సిట్టింగ్ సీజేఐ, సుప్రీంకోర్టు జడ్జీలు తమ న్యాయపరిధిలోకి రారని, ఈ అంశాన్ని పరిశీలించరాదని నిర్ణయించుకున్నామని లోకా యుక్త ఈ నెల 3న జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. చట్ట ప్రకారం ఇతర మార్గాలను అనుసరించే స్వేచ్ఛ పిటిషనర్‌కు ఉందని తెలిపింది. -
జస్టిస్ చంద్రచూడ్‌పై మొయిత్రా విమర్శలు
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్‌ను లక్ష్యంగా చేసుకుని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా శుక్రవారం లోక్‌సభలో చేసిన విమర్శలు తీవ్ర కలకలం రేపాయి. అంతేగాక విమర్శించే గొంతుకలన్నింటినీ నొక్కేయడమే లక్ష్యంగా దేశంలో సర్వ వ్యవస్థలనూ మోదీ సర్కారు చెరబడుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసే క్రమంలో ప్రత్యేక కోర్టు జడ్జి బి.హెచ్.లోయా మృతి అంశాన్ని ఆమె ప్రస్తావించడంతో సభలో దుమారం రేగింది. లోయాది అత్యంత అకాల మరణమన్న మొయిత్రా వ్యాఖ్యలపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు తీవ్ర అభ్యంతరం వెలిబుచ్చారు. ‘‘అత్యంత తీవ్ర ఆరోపణలివి. దీనిపై కచ్చితంగా తగిన రీతిలో పార్లమెంటరీ చర్యలుంటాయి. మొయిత్రా తప్పించుకోలేరు’’ అన్నారు. మొయిత్రా ప్రసంగ రికార్డులను స్పీకర్ ఓం బిర్లా పరిశీలిస్తున్నట్టు చెబుతున్నారు. ఆమెపై మరోసారి అనర్హత వేటు తప్పదంటున్నారు. నోటుకు ప్రశ్నల ఆరోపణలపై గత లోక్‌సభలో మొయిత్రా సభ్యత్వం రద్దవడం తెలిసిందే. లోయా 2014లో రాజకీయంగా సొహ్రాబుద్దీన్ షేక్ హత్య కేసును విచారిస్తుండగా వివాదాస్పద రీతిలో మృతి చెందారు. దాని వెనక బీజేపీ హస్తముందనేలా విపక్షాలు ఆరోపించాయి. ఆయనది సహజ మరణమేనని సుప్రీంకోర్టు నిర్ధారించింది.సీజేఐలపై తీవ్ర వ్యాఖ్యలు రాజ్యాంగాన్ని హత్య చేసేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయతి్నస్తోందంటూ మొయిత్రా తన ప్రసంగంలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు చేతిలో వెయ్యి కత్తి పోట్లతో రాజ్యాంగం నిలువెల్లా రక్తమోడుతోందన్నారు. ఈడీ, సీబీఐ వంటివాటిని చివరికి వసూళ్ల సంస్థలుగా, ఈసీ వంటివాటిని జేబు సంస్థలుగా మార్చుకుందని ఆక్షేపించారు. ఆ క్రమంలో జస్టిస్ చంద్రచూడ్ పేరు ప్రస్తావించకుండానే ఆయనపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘న్యాయ వ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానాల సమగ్రతను, స్వతంత్ర ప్రతిపత్తిని పణంగా పెట్టేందుకు ప్రయతి్నంచారు! తాజా మాజీ సీజేఐ హయాంలో కొందరికే బెయిళ్లు మంజూరయ్యాయి. ఒక వర్గం వారికి మొండిచెయ్యి చూపారు. వారికి ఆయన అక్షరమాలలో స్థానమే లేకుండా పోయింది. ఆ మాజీ సీజేఐ ప్రవర్తన చివరికి సుప్రీంకోర్టు రాజకీయ ప్రతిపక్షంలా వ్యవహరించరాదనే వ్యాఖ్యలకూ కారణమైంది. విపక్ష పాత్ర పోషించేందుకు మేమున్నాం. అందుకు సుప్రీంకోర్టు అవసరమేమీ లేదు’’ అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ తన నివాసంలో గణేశ్ చతుర్థి వేడుకలకు ప్రధాని మోదీని ఆహా్వనించడాన్ని మొయిత్రా తీవ్రంగా తప్పుబట్టారు. మోదీని దేవునితో పోలుస్తూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ‘‘న్యాయమూర్తులు తీర్పులు రాసేందుకు తర్కం, చట్టం, రాజ్యాంగానికి బదులు ఇలా దేవునితో ప్రైవేట్ సంభాషణలపై ఆధారపడే పరిస్థితిని బహుశా మన రాజ్యాంగ నిర్మాతలు ఎన్నడూ ఊహించి కూడా ఉండరు. మాజీ, ప్రస్తుత సీజేఐలందరికీ నాదో సలహా. ఇలా దేవుడి నుంచి సూచనలు అందుకోవడం మానేయండి. వ్యక్తిగత వేడుకలకు రాజకీయ పెద్దలను అతిథులుగా పిలిచి వాటిని టీవీ సర్కస్లుగా మార్చకండి. మీ ఏకైక అతిథి రాజ్యాంగమే. అది మాత్రమే మీ ఇంట్లో కొలువుదీరే దేవుడు కావాలి. మీరు మిగల్చబోయే వ్యక్తిగత వారసత్వం గురించి ఆందోళన పడటం ఆపేయండి. ఎందుకంటే అలా వ్యక్తిగత గుర్తింపు కోరుకునే వాళ్లు ఎలాంటి వారసత్వమూ మిగల్చలేరు. మౌలిక హక్కులను పరిరక్షించేవారు మాత్రమే గుర్తుండిపోతారు’’ అన్నారు. -
న్యాయవ్యవస్థ ప్రతిపక్ష పాత్రేం పోషించదు: డీవై చంద్రచూడ్
న్యూఢిల్లీ: న్యాయవ్యవస్థ ఉన్నది ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. న్యాయవ్యవస్థ పార్లమెంట్లో, రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్షాల పాత్రను పోషించాలని ప్రజలు భావించకూడదని అన్నారు. చట్టాలను సమీక్షించడానికి, పరిరక్షించడానికే న్యాయవ్యవస్థ ఉందని అన్నారాయన. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయవ్యవస్థల పాత్ర కూడా తామే పోషించాల్సి వస్తోందని ఇటీవల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ వ్యాఖ్యానించారు. తాజాగా ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. రాహుల్ వ్యాఖ్యల నేపథ్యంలో ఈ విధంగా స్పందించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షానికి ప్రత్యేక స్థానం ఉందని నొక్కి చెప్పారు.ప్రతిపక్ష నేత వ్యాఖ్యలపై మాట్లాడటం తనకు ఇష్టం లేదని చెప్పిన జస్టిస్ చంద్రచూడ్.. తాను ఇక్కడికి వచ్చింది ఆ విషయంపై మాట్లాడడానికి కాదన్నారు. ‘ఈ వివాదంలో ప్రతిపక్ష నేతలతో నేను స్వరం కలపాలనుకోవడం లేదు. ఎందుకంటే ఆ విషయం మాట్లాడేందుకు నేను ఇక్కడికి రాలేదు. కానీ ఒక్క విషయం చెప్పదల్చుకొన్నాను. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్షాల పాత్రను న్యాయవ్యవస్థ పోషించాలని ప్రజలు అనుకోకూడదు. న్యాయవ్యవస్థ చట్టసభలలో ప్రతిపక్షంలా ఉండాలనేదే తప్పుడు భావన. అది నిజం కాదు. .. మేమున్నది చట్టాలను పరిశీలించడానికి. కార్యనిర్వాహక వర్గం చర్యలు చట్టాలకు లోబడి ఉన్నాయో, లేదో సమీక్షించే బాధ్యత మాపై ఉంది. రాజకీయ ప్రతిపక్షాలకు ప్రజాస్వామ్యంలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కానీ ప్రజలు న్యాయ వ్యవస్థలను వాడుకొంటున్నారు. దాని భుజాల మీద నుంచి తుపాకీ కాలుస్తున్నారు. కోర్టులను రాజకీయ ప్రతిపక్షాల కేంద్రంగా మారుస్తున్నారు’ అని చంద్రచూడ్ వ్యాఖ్యానించారు.ఇటీవల ఓ సందర్భంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. మీడియా, దర్యాప్తు సంస్థలు, న్యాయ వ్యవస్థల తరపున కూడా తాము ఒంటరిగానే పనిచేస్తున్నామని, భారతదేశ వాస్తవికత ఇదేనని విమర్శించారు. -
సోషల్ మీడియా దన్నుతో... తీర్పులను ప్రభావితం చేసే యత్నాలు
న్యూఢిల్లీ: కోర్టుల తీర్పులను ప్రభావితం చేయడానికి కొన్ని ఒత్తిడి గ్రూప్‌లు ప్రయత్నిస్తున్నాయని, అందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. తీర్పులను ప్రభావితం చేయడం ద్వారా సొంత ప్రయోజనాలు సాధించుకోవాలని ఆశిస్తున్న ఇలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని న్యాయమూర్తులకు సూచించారు. ‘‘యూట్యూబ్‌లో 20 సెకండ్ల వీడియో చూసి ప్రజలు అభిప్రాయం ఏర్పర్చుకుంటున్న పరిస్థితి! వారిపై సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపుతోంది. అభిప్రాయాలను నిర్దేశిస్తోంది. ఇది ప్రమాదకర పరిణామం’’ అన్నారు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులు, తీసుకున్న నిర్ణయాలకు ఆధారం ఏమిటన్నది తెలుసుకొనే అవకాశం, దానిపై అభిప్రాయం వ్యక్తం చేసే హక్కు ప్రజలకు ఉన్నప్పటికీ అది జడ్జిలను టార్గెట్ చేసేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ప్రత్యేకంగా కొందరు జడ్జిలను లక్ష్యంగా చేసుకొని ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు నిజంగా భావవ్యవస్థీకరణ స్వేచ్ఛ అంటే ఇదేనా? అనే ప్రశ్న తలెత్తుతుందని పేర్కొన్నారు. ఆదివారం ఎన్డీటీవీ ఆధ్వర్యంలో జరిగిన సంవిధాన్–75 సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. ఎలాంటి ఆంక్షలు, నిరోధకాలు, బాధ్యతలు లేకుండా ఇలా ప్రైవేట్ పౌరుడిగా ఉండడం చాలా అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఈ నెల 10న పదవీ విరమణ చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం కోసం అమల్లో ఉన్న కొలీజియం వ్యవస్థను జస్టిస్ చంద్రచూడ్ సమరి్థంచారు. న్యాయమూర్తులు సైతం నిరభ్యంతరంగా రాజకీయాల్లో చేరవచ్చని, రాజ్యాంగం అందుకు ఎలాంటి అడ్డుకట్టలు వేయడం లేదని పేర్కొన్నారు. క్రికెట్ తనకు చాలా ఇష్టమైన క్రీడ అని చెప్పారు. జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ తన అభిమాన క్రికెటర్లు అని వ్యాఖ్యానించారు. ఒకప్పటి క్రికెటర్లలో రాహుల్ ద్రవిడ్‌ను అభిమానిస్తానని తెలిపారు. -
నూతన సీజేఐ జస్టిస్ ఖన్నా ప్రమాణ స్వీకారం నేడు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ ఖన్నా ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13వ తేదీన ముగియనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన సిఫార్సు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 1960 మే 14న జని్మంచారు. ఆయన తండ్రి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్లో చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా చేరారు. తొలుత తీస్‌హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టుల్లో, తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా ఎన్నో క్రిమినల్ కేసుల్లో సమర్థంగా వాదించి పేరు తెచ్చుకున్నారు. 2005 జూన్ 24న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏడాది తిరగకుండానే శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన కంటే 32 మంది సీనియర్లున్నా వారిని కాదని జస్టిస్ ఖన్నాకు పదోన్నతి దక్కడం వివాదాస్పదంగా మారింది. అయినా ఆయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పలు కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో ఆయన సభ్యుడు. ఆరి్టకల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని సమర్థించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక శ్రద్ధ చూపుతారని పేరుంది. అనవసరమైన వాయిదాలకు తావు లేకుండా వేగంగా న్యాయం చేకూర్చడంలో ఆయన దిట్ట అని న్యాయవాద వర్గాలు చెబుతాయి. ఇక ఇంట్లోనే మార్నింగ్ వాక్ తెల్లవారుజామునే ట్రాక్ ప్యాంట్, ఆఫ్ హ్యాండ్స్ టీ షర్ట్‌తో ఢిల్లీ వీధుల్లో వాకింగ్ చేయడం జస్టిస్ ఖన్నాకు చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో ఆయన మార్నింగ్ వాక్ గురించి ప్రస్తావించారు. ‘‘ఉదయాన్నే వాకింగ్ చేస్తే రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి’’ అంటారాయన. సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై మార్నింగ్ వాక్కు ఆయన స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. వాకింగ్‌తో పాటు జిమ్ వంటి కసరత్తులన్నీ ఇంట్లోనే చేయనున్నారు. -
రేపు సీజేఐగా సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం
ఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం ఇవాళ్టి(ఆదివారం)తో ముగిసింది. దీంతో సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ సంజీవ్ ఖన్నా.. 51వ భారత ప్రధాన న్యాయమూర్తిగా రేపు(సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక.. ఆయన వచ్చే ఏడాది మే 13 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగనున్నారు. ఇవాళ.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీ విరమణ చేశారు.జస్టిస్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీలో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో న్యాయవాద వృత్తిలో అడుగుపెట్టారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా నమోదయ్యారు. వేర్వేరు కోర్టుల్లో పనిచేశారు. తీస్ హజారీ జిల్లా కోర్టు, ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా వ్యవహరించారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2006లో అదే కోర్టులో శాశ్వత జడ్జిగా చేరారు. ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ చైర్మన్‌గా సేవలందించారు. వృత్తిలో అంచెలంచెలుగా ఎదుగుతూ 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా, భోపాల్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడమీ గవరి్నంగ్ కౌన్సిల్ సభ్యుడిగానూ పనిచేస్తున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఖన్నా పలు కీలక తీర్పులు వెలువరించారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాలకు(ఈవీఎంలు) సంబంధించి వీవీప్యాట్లలోని 100 శాతం ఓట్లను లెక్కించాలని కోరుతూ అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను 2024లో కొట్టివేసిన డివిజన్ బెంచ్‌కు ఆయన నేతృత్వం వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని 2024లో చరిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఆరి్టకల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తూ 2023లో తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. వివాహ బంధం పూర్తిగా విఫలమైన సందర్భాల్లో దంపతులకు నేరుగా విడాకులు మంజూరు చేసే అధికారం ఆరి్టకల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు ఉందని 2023లో స్పష్టంచేశారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి సుప్రీంకోర్టు కార్యాలయం వస్తుందంటూ 2019లో మరో కీలక తీర్పు వెలువరించారు. -
‘మైనార్టీ హోదా’పై కొత్త బెంచ్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)కి మైనార్టీ విద్యాసంస్థ హోదా ఉందో లేదో తేల్చే అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారాన్ని నూతన ధర్మాసనానికి(బెంచ్)కు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 4–3 మెజార్టీతో శుక్రవారం 118 పేజీల తీర్పు ఇచ్చింది. విద్యా సంస్థ నియంత్రణ, పరిపాలన విషయంలో పార్లమెంట్లో చట్టం చేసినప్పటికీ ఆ సంస్థకు ఉన్న మైనార్టీ హోదాను రద్దు చేయరని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రకారం అలీగఢ్ ముస్లిం వర్సిటీని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. పరిపాలనా విభాగంలో మైనార్టీలు లేనంత మాత్రాన మైనార్టీ విద్యాసంస్థ కాకుండాపోదని తేల్చిచెప్పింది. మతపరంగా లేదా భాషపరంగా మైనార్టీలైన వ్యక్తులు విద్యాసంస్థలు స్థాపించడం లేదా నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ, వివక్ష చూపుతూ తీసుకొచ్చిన చట్టం లేదా కార్యనిర్వాహక చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 30(1)కు విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ ఆర్టికల్ ప్రకారం విద్యాసంస్థలను స్థాపించే, నిర్వహించే హక్కు మత, భాషాపరమైన మైనార్టీలకు ఉంది. ‘‘ఏఎంయూను మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేం.. అది సెంట్రల్ యూనివర్సిటీ అంటూ ఎస్.అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1967లోఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతున్నాం. తాము స్థాపించిన విద్యా సంస్థ మైనార్టీల ప్రయోజనాల కోసమేనని దానిని ఏర్పాటు చేసినవారు నిరూపించుకోవాలి. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏర్పాటైన యూనివర్సిటీలకు సైతం ఆర్టికల్ 30(1) కింద ఇచ్చిన హక్కు వర్తిస్తుంది’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే, ఇదే ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ మూడు వేర్వేరు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. ఏఎంయూ మైనార్టీ విద్యాసంస్థ కాదని జస్టిస్ దీపాంకర్ దత్తా తన తీర్పులో స్పష్టంచేశారు. ఏమిటీ కేసు? స్వాతంత్య్రానికి పూర్వమే 1875లో మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్గా కాలేజీగా ప్రారంభమైన ఈ విద్యాసంస్థను 1920లో యూనివర్సిటీగా మార్చారు. ఏఎంయూ అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ అని, దాన్ని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమని 1967లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో 1981లో పార్లమెంట్లో ఏఎంయూ(సవరణ) చట్టాన్ని తీసుకురావడంతో ఏఎంయూకు మళ్లీ మైనార్టీ విద్యాసంస్థ హోదా లభించింది. ఈ చట్ట సవరణను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దాంతో ఏఎంయూ(సవరణ) చట్టం–1981ను కొట్టివేస్తూ హైకోర్టు 2006లో తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. మరికొందరు సైతం పిటిషన్లు దాఖలుచేశారు. యూపీఏ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు 2016లో ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మిగిలిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ అంశాన్ని 2019 ఫిబ్రవరి 12న ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. పిటిషన్లపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఏఎంయూకు మైనార్టీ సంస్థ హోదా ఉందో లేదో నూతన బెంచ్ నిర్ణయిస్తుందని తేల్చిచెప్పింది. -
సుదీర్ఘ తగువుకు పాక్షిక ఊరట!
షష్టిపూర్తికి చేరువలో ఉన్న ఒక వివాదాస్పద కేసుకు సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం పాక్షికంగా ముగింపు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవి నుంచి వైదొలగుతున్న చివరి రోజున ఆయన ఆధ్వర్యంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన మెజారిటీ తీర్పు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ)కు మైనారిటీ ప్రతిపత్తి అర్హతలేదన్న 1967 నాటి నిర్ణయాన్ని కొట్టేస్తూనే వేరే ధర్మాసనం దాన్ని నిర్ధారించాలని తెలిపింది. గత తీర్పుకు అనుసరించిన విధానం సరికాదని తేల్చింది. బెంచ్‌లోని ముగ్గురు సభ్యులు అసమ్మతి తీర్పునిచ్చారు. ఒక వివాదాన్ని ఏళ్ల తరబడి అనిశ్చితిలో పడేస్తే నష్టపోయే వర్గాలుంటాయి. ఏళ్లు గడిచేకొద్దీ సమస్య జటిలమవుతుంది కూడా. జేఎన్‌యూ మాదిరే ఏఎంయూ కూడా వివాదాల్లో నానుతూ ఉంటుంది. 2014లో ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఇవి మరింత పెరిగాయి. చిత్రమేమంటే ఈ రెండు యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైనవారిలో చాలామంది సివిల్ సర్వీసులకూ, ఇతర ఉన్నత స్థాయి ఉద్యోగాలకూ ఎంపికవుతుంటారు. పార్టీల్లో, ప్రభుత్వాల్లో, బహుళజాతి సంస్థల్లో ప్రముఖ పాత్ర పోషిస్తుంటారు. ఏఎంయూది ఒక విషాద చరిత్ర. సమస్యలు కూడా భిన్నమైనవి. సర్ సయ్యద్ మహ్మద్ ఖాన్ అనే విద్యావంతుడు మదర్సాల్లో కేవలం ఇస్లామిక్ విలువల విద్య మాత్రమే లభించటంవల్ల ఆ మతస్తులు అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారని భావించి వాటితోపాటు ఆధునిక విద్యాబోధన ఉండేలా 1877లో స్థాపించిన ఓరియంటల్ కళాశాల ఆరంభంలో ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కాదు. మౌల్వీలనుంచీ, మదర్సాలనుంచీ సర్ సయ్యద్‌కు ప్రతిఘటన తప్పలేదు. ఆధునిక విద్యనందిస్తే పిల్లల మనసులు కలుషితమవుతాయన్న హెచ్చరిక లొచ్చాయి. అన్నిటినీ దృఢచిత్తంతో ఎదుర్కొని ఆధునిక దృక్పథంతో ఏర్పాటు చేసిన ఈ ఉన్నత విద్యాసంస్థపై 147 ఏళ్లు గడిచాక మత ముద్ర పడటం, దాన్నొక సాధారణ వర్సిటీగా పరిగణించా లన్న డిమాండు రావటం ఒక వైచిత్రి. చరిత్ర ఎప్పుడూ వర్తమాన అవసరాలకు అనుగుణంగా కొత్త రూపు తీసుకుంటుంది. అందు వల్లే కావొచ్చు... ఏఎంయూ చుట్టూ ఇన్ని వివాదాలు! 1920లో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఓరియంటల్ కళాశాలనూ, ఆ ప్రాంతంలోనే ఉన్న ముస్లిం యూనివర్సిటీ అసోసియేషన్ సంస్థనూ విలీనం చేసి 1920లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఏర్పాటుచేసింది. ఆ చట్టంలోని 23వ నిబంధన యూనివర్సిటీ పాలకమండలిలో కేవలం ముస్లింలకు మాత్రమే చోటీయాలని నిర్దేశిస్తోంది. అయితే ముస్లిం విద్యార్థులను మాత్రమే చేర్చుకోవాలన్న నిబంధన లేదు. స్వాతంత్య్రానంతరం 1951లో ఆ చట్టానికి తెచ్చిన రెండు సవరణలు మతపరమైన బోధననూ, పాలకమండలిలో ముస్లింలు మాత్రమే ఉండాలన్న నిబంధననూ రద్దుచేశాయి. ఈ చర్య రాజ్యాంగంలోని 30వ అధికరణతోపాటు మత, సాంస్కృతిక, ఆస్తి అంశాల్లో పూచీపడుతున్న ప్రాథమిక హక్కులను ఉల్లంఘించటమేనంటూ పిటి షన్ దాఖలైంది. అయితే ఆ సవరణలు చెల్లుతాయని 1967లో సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల బెంచ్ వెలువరించిన తీర్పే ప్రస్తుత వివాదానికి మూలం. వర్సిటీ స్థాపించిందీ, దాన్ని నిర్వహిస్తు న్నదీ ముస్లింలు కాదని ఆ తీర్పు అభిప్రాయపడింది. అయితే అలా మారటం వెనక ముస్లిం పెద్దల కృషి ఉన్నదని అంగీకరించింది. ప్రభుత్వం స్థాపించిన వర్సిటీకి మైనారిటీ ప్రతిపత్తి ఎలా వస్తుందని ప్రశ్నించింది. ఈ తీర్పును వమ్ముచేస్తూ 1981లో ప్రభుత్వం ఏఎంయూ చట్టానికి సవరణలు తెచ్చింది. తిరిగి మైనారిటీ ప్రతిపత్తినిచ్చింది. దాంతో మెడికల్ పీజీలో 50 శాతం సీట్లను ముస్లింలకు కేటాయించాలని పాలకమండలి 2005లో నిర్ణయించింది. దాన్ని అలహాబాద్ హైకోర్టు కొట్టేసింది. నాటి యూపీఏ సర్కారు, పాలకమండలి 2006లో దాఖలు చేసిన అప్పీళ్లను సుప్రీంకోర్టు స్వీకరించినా రిజర్వేషన్ల విధానంపై స్టే విధించింది. ఆనాటినుంచీ అనాథగా పడివున్న ఆ కేసు నిరుడు అక్టో బర్లో జస్టిస్ చంద్రచూడ్ రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయటంతో ముందుకు కదిలింది. అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 30వ అధికరణను పరిమితార్థంలో చూసిందనీ, యాంత్రికంగా అన్వయించిందనీ తాజా మెజారిటీ తీర్పు అభిప్రాయపడింది. ఏఎంయూ స్థాపన నేపథ్యం, పరిస్థితులు పరిగణనలోకి తీసుకోవాలి తప్ప తర్వాతకాలంలో వచ్చిన చట్టాన్ని కాదని తెలిపింది. ఈ తీర్పుతో విభేదించిన ముగ్గురు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు కూడా ప్రాధాన్యత గలవే. ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై మరో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు ఎలా సిఫార్సు చేస్తుందని వారి ప్రశ్న. కేశవానంద భారతి కేసులో 1973 నాటి ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ తీర్పుపై 15 మందితో ధర్మాసనం ఏర్పాటు చేయమని రేపన్నరోజు మరో బెంచ్ ఆదేశిస్తే పరిస్థితేమిటని నిలదీశారు. ఏదేమైనా ఆలస్యమైనకొద్దీ సమస్య ఎంత జటిలమవుతుందో చెప్పటానికి ఏఎంయూ కేసే ఉదాహరణ. ఈ వర్సిటీ స్థలదాత జాట్ రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ అని హిందూ సంస్థలూ... ఆయన నెలకు రూ. 2కు 1929లో లీజుకు మాత్రమే ఇచ్చారని ముస్లింలూ రోడ్డుకెక్కారు. హిందువు ఇచ్చిన స్థలమై నప్పుడు దానికి మైనారిటీ ప్రతిపత్తేమిటన్న ప్రశ్న తలెత్తింది. మైనారిటీ సంస్థలో చదువుకుని ఎదిగి నందుకు కృతజ్ఞతగా లీజుకిచ్చారని, అలా ఇచ్చిన వందమందిలో ఆయనొకరని అవతలి పక్షం వాదించింది. మొత్తానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వల్ల మహేంద్ర పేరిట అక్కడే మరో వర్సిటీ ఏర్పాటైంది. రాజ్యాంగ ధర్మాసనం సూచించిన విధంగా ఏఎంయూ ప్రతిపత్తిపై మరో బెంచ్ ఏర్పాటై తీర్పు వస్తే ప్రస్తుత అనిశ్చితికి తెరపడుతుంది. -
సీజేఐగా తండ్రి తీర్పులనే తిప్పికొట్టి.. డీవై చంద్రచూడ్ వెల్లడించిన టాప్ 10 తీర్పులివే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధనుంజయ యశ్వంత్(డీవై) చంద్రచూడ్‌కు శుక్రవారం లాస్ట్ వర్కింగ్ డే. ఆదివారం( నవంబర్ 10) ఆయన సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. వృత్తిపరంగా తాను చాలా సంతృప్తి చెందానని, తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని కోరారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నో కేసుల పరిష్కారాల్లో డీవై చంద్రచూడ్ తనదైన ముద్ర వేశారు. అనేక మైలురాయి తీర్పులు వెల్లడించారు. అంతేగాక చంద్రచూడ్..భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం సీజేఐగా పనిచేసిన యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ తనయుడు కూడా. తండ్రికి తగ్గ తనయుడిగానే కాదు.. చీఫ్ జస్టిస్‌గా తండ్రి ఇచ్చిన తీర్పులనే తిరగరాశారు డీవై చంద్రచూడ్. వైవీ చంద్రచూడ్ 2017-18లో తీసుకున్న అడల్టరీ చట్టం, శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసుల్లో తీసుకున్న నిర్ణయాలను కుమారుడు డీవై చంద్రచూడ్ తోసిపుచ్చారు. 👉1985లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ ధర్మాసనం.. సౌమిత్ర విష్ణు కేసులో ఐపీసీ సెక్షన్ 497ను సమర్థించింది. సంబంధం కలిగి ఉండటానికి ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తి పురుషుడే కానీ, స్త్రీ కాదని సాధారణంగా అంగీకరించబడింది అని ధర్మాసనం తన తీర్పులో రాసింది. ఈ నిర్ణయాన్ని 2018 లో జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. ‘వ్యభిచార చట్టం అనేది పితృస్వామ్య నియమం. లైంగిక స్వయంప్రతిపత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. 👉 1976 లో శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసులో, గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పరిగణించలేమని పేర్కొన్నది. ఈ బెంచ్‌లో అప్పటి సీజేఐ వైవీ చంద్రచూడ్ ఉన్నారు. కాగా, 2017 లో గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ బెంచ్‌లో డీవై చంద్రచూడ్ ఉన్నారు. ‘ఏడీఎం జబల్పూర్ కేసులో మెజారిటీ నిర్ణయంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని అంగీకరించడం ద్వారా భారతదేశ ప్రజలు తమ జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వానికి అప్పగించలేదు’ అని డీవై చంద్రచూడ్ తన నిర్ణయాన్ని రాశారు. కాగా 2022 నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రచూడ్.. ఆయన పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులు వెల్లడించారు. ఆర్టికల్ 370, స్వలింగ సంపర్కుల వివాహం, రామ మందిరం, డ్రైవింగ్ లైసెన్స్, బుల్డోజర్ చర్య, ఉమర్ ఖలీద్, స్టాన్ స్వామి, జీఎన్ సాయిబాబా బెయిల్‌కు సంబంధించి తన తీర్పును ఇచ్చారు. నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కేసు, కేరళకు చెందిన హదియా కేసు, అవివాహితల అబార్షన్ హక్కు కేసుల్లో.. తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో పరిణతి చెందిన తీర్పులను వెలువరించారు. వాటిని ఓసారి పరిశీలిస్తే.. ఎలక్టోరల్ బాండ్స్ కేసురాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2018 నుంచి అమలులో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్షమని వాదించింది. రాజకీయ పార్టీలు, దాతల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాటుకు దారితీయవచ్చని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, సంజీవ్ ఖన్నా, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను ప్రచురించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.ప్రైవేట్ ఆస్తి వివాదం..ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొనే విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కావని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయలేవని స్పష్టం చేసింది. అయితే, కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7:2 మెజారిటీతో వెలువడిన తీర్పులో పేర్కొంది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు భిన్నాభిప్రాయంతో కూడిన తీర్పును వెలువరించింది.ఆర్టికల్ 3702023 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది.జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.స్వలింగ వివాహం2023 అక్టోబర్‌లో స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది, స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపింది స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని సీజేఐ పేర్కొన్నారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని, ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.సెక్షన్ 6Aగత నెల అక్టోబర్‌లో అస్సాం వలసలకు సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించించింది. భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 6(ఎ)కు రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. 1996-71 మధ్య అస్సాంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) శరణార్థులను భారత పౌరసత్వం పొందేందుకు 1985లో తీసుకొచ్చిన రాజ్యంగ సవరణ రాజ్యాంగ బద్దమేనని 4:1 తీర్పులో వెల్లడించింది. ఇది కేవలం అస్సాం రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా చేసిన ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వ భావనకు వ్యతిరేకమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తిరస్కరించింది.జైళ్లలో కుల ఆధారిత వివక్షకుల ఆధారంగా జైల్లోని ఖైదీలపై వివక్ష చూపడడం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. జైలు మాన్యువల్స్‌లో క్యాస్ట్ కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్) దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.యూపీ మదరసా చట్టంఉత్తరప్రదేశ్ బోర్డు ఆఫ్ మదర్సా- 2004 ఎడ్యుకేషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, బోర్డు లౌకిక న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందంటూ దానిని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఈ చట్టం లౌకిక వాద సూత్రాన్ని ఉల్లంఘించిందని హైకోర్టు తప్పుగా అభిప్రాయపడిందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.నీట్ వివాదందేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నీట్ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రం లీకైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పాట్నా, హజారీబాగ్‌లలో మాత్రమే పేపర్ లీక్ అయిందని పేర్కొన్నది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తే, గతంలో పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్ట సభల్లో లంచం తీసుకుంటే రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా ? లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడమనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు.బాల్య వివాహంబాల్య వివాహాల నిషేద చట్టం-2006ను సమర్థవంతంగా అమలు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బాల్యవివాహాల నిరోధం, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టిసారించాలని, చివరి ప్రయత్నంగా నిందితులకు జరిమానా విధించాలని తెలిపింది.తన పదవీకాలం చివరి రోజు సైతం. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాపై కీలక తీర్పును వెలువరించింది. దీనిని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని బెంచ్ నిర్ణయించింది. అయితే, దీనికి మైనార్టీ హోదా ఉండాలా? వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు 4:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది. -
ఇక నుంచి నేను ఇలా న్యాయం చేయలేను: సీజేఐ చంద్రచూడ్ భావోద్వేగం
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్ పదవీ కాలం ముగిసింది. శుక్రవారమే చివరిరోజు. ఆనవాయితీ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన హాల్లో నలుగురు సభ్యులతో కూడిన సెర్మోనియల్ బెంచ్ ఆయనకు వీడ్కోలు పలికింది. జస్టిస్ చంద్రచూడ్‌తోపాటు కాబోయే సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ఈ బెంచ్‌లో ఉన్నారు. తన వీడ్కోలు కార్యక్రమంలో జస్టిస్ చంద్రచూడ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కొద్దిసేపు అందరినీ నవి్వంచారు. జైన పదం ‘మీచా మి దుఖఃదాం’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘‘రేపటి నుంచి నేను ఇలా న్యాయం చేయలేను, కోర్టులో ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి’’ అని కోరారు. ఇతరులను నొప్పించాలన్న ఉద్దేశం తనకు ఏనాడూ లేదన్నారు. న్యాయవాద వృత్తితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ప్రస్తావించారు. రూపురేఖలను బట్టి తనను చాలామంది యువకుడిగానే భావించేవారని చెప్పారు. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు కొందరు తన వద్దకు వచ్చి ‘మీ వయసు ఎంత’ అని అడిగారని గుర్తుచేశారు. న్యాయవాద వృత్తి తనకు ఎన్నో గొప్ప విషయాలు నేరి్పంచిందని అన్నారు. యువ లాయర్‌గా కోర్టుల్లో ఎన్నో వాదనలు విన్నానని, న్యాయవాదుల్లో నైపుణ్యాలు గమనించానని, విలువైన కోర్టురూమ్ టెక్నిక్‌లు నేర్చుకున్నానని తెలిపారు. కోర్టుల్లో పనిచేసే మనమంతా వచ్చి వెళ్లిపోయే యాత్రికులమేనని ఉద్ఘాటించారు. సుప్రీంకోర్టులో ఎంతోమంది గొప్ప న్యాయమూర్తులుగా రాణించారని, వారసత్వాన్ని మరొకరికి అప్పగించి వెళ్లారని పేర్కొన్నారు. తాను వెళ్లిపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదని, తన తర్వాత మరొకరు ఈ పదవిలోకి వస్తారని చెప్పారు. సమర్థుడైన జస్టిస్ సంజీవ్ ఖన్నా నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టబోతున్నారని, సుప్రీంకోర్టు ప్రతిష్టను ఆయన మరింత ఇనుమడింపజేస్తారన్న విశ్వాసం తనకు ఉందని వివరించారు. న్యాయమూర్తి అనే పదవి తనను ఇన్నాళ్లూ ఉత్సాహంగా ముందుకు నడిపించిందని పేర్కొన్నారు. చట్టం, న్యాయం, జీవితం గురించి సుప్రీంకోర్టులోని ప్రతి ఒక్కరూ తనకు ఎన్నో విషయాలు నేర్పించారని, వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. సీజేఐగా తాను విచారించిన 45 కేసులు సైతం తనకు జీవితం గురించి ఎన్నో కొత్త సంగతులు నేరి్పంచాయని చెప్పారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ.. అణగారిన యువత, నిరుపేదల బాగు కోసం జస్టిస్ చంద్రచూడ్ ఎంతగానో శ్రమించారని ప్రశంసించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నో కేసుల్లో విజయం సాధించిందని, కొన్ని ఓడిపోయిందని, తమ అభిప్రాయాలను జస్టిస్ చంద్రచూడ్ ఓపిగ్గా విన్నారన్న సంతృప్తి తమకు ఉందని చెప్పారు. అనంతరం సుప్రీంకోర్టు బార్ అసోసియేసన్ ఆధ్వర్యంలో జస్టిస్ చంద్రచూడ్‌ను న్యాయమూర్తులు, న్యాయవాదులు, అసోసియేషన్ సభ్యులు, ఉద్యోగులు సత్కరించారు. ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆయన ఏం చెప్పారంటే... అంతకంటే గొప్ప అనుభూతి ఉండదు ‘‘అవసరాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయగల శక్తి కలిగి ఉండడం కంటే గొప్ప అనుభూతి మరొకటి ఉండదు. మనకు తెలియని, మనం ఎప్పుడూ కలవని వ్యక్తులకు సేవ చేయడం, వారి జీవితాలను ప్రభావితం చేయడం అదృష్టమే. వృత్తిలో విజయాలు సాధించడంతోపాటు దేశానికి సేవ చేసే అవకాశం లభించినందుకు పూర్తిగా సంతృప్తిగా ఉన్నాను. సుప్రీంకోర్టులో ఉన్నంతకాలం కొత్త విషయాలు నేర్చుకోలేదు అని భావించిన రోజు ఒక్కటి కూడా లేదు. న్యాయ విద్యారి్థగా కోర్టులో చివరి వరుసలో కూర్చున్న రోజుల నుంచి సుప్రీంకోర్టు కారిడార్ల దాకా నా ప్రస్థానం సాగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా దేశానికి నా వంతు సేవ చేసే అవకాశం రావడం గర్వకారణంగా భావిస్తున్నా. దాదాపు రెండేళ్లపాటు సీజేఐగా న్యాయ వ్యవస్థలో సంస్కరణలు, పారదర్శకత తీసుకొచ్చేందుకు కృషి చేశా. ఈ విషయంలో తరుచుగా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేకంగా ఎన్నో పోస్టులు పెట్టారు. దూషించారు. నన్ను తప్పుపట్టారు. వాటిని మర్చిపోలేను. నేను ఇక పదవీ విరమణ చేస్తున్నా. ట్రోలర్స్‌కు, విమర్శకులకు సోమవారం నుంచి పని ఉండదు. వారంతా నిరుద్యోగులైపోతారు. ప్రతి రోజూ ప్రతి అన్యాయాన్నీ ఎదిరించలేం మా తండ్రి పుణేలో ఒక ఫ్లాట్ కొన్నారు. న్యాయమూర్తిగా చివరి రోజు దాకా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని నాకు చెప్పారు. నిజాయతీ, సమగ్రత విషయంలో రాజీ పడొద్దని సూచించారు. ఆయన చెప్పిందే ఆచరించాను. న్యాయమూర్తిగా మారిన తర్వాత మొదట ఎదుర్కోవాల్సింది మనలోని భయాన్నే. మన పరిమితులు మనం తెలుసుకోవాలి. న్యాయవాద వృత్తి గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థ అధికార పరిధిని కూడా గుర్తుంచుకోవాలి. న్యాయమూర్తిగా ప్రతి రోజూ ప్రతి అన్యాయాన్నీ ఎదిరించలేమని కోర్టులో ఉన్నప్పుడు మీరు గ్రహిస్తారు. కొన్నిసార్లు చట్టబద్ధమైన పాలనలోనే అన్యాయాలు జరుగుతూ ఉండొచ్చు. చట్టబద్ధ పాలనకు అవతల జరిగే అన్యాయాలను మనం సరిదిద్దవచ్చు. బాధితులకు ఉపశమనం కలిగించడం అనేది ఓదార్పు ఇచ్చే మన సామర్థ్యంపై ఆధారపడి ఉండదు. వారి కష్టాలను, సమస్యలను ఓపికతో వినగలిగే సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. ఎన్నో ఇన్ఫెక్షన్లు తొలగించే శక్తి సూర్యకాంతికి ఉంది. నా జీవితం తెరిచిన పుస్తకం. నా వ్యక్తిగత జీవితం ప్రజలకు తెలుసు. సోషల్ మీడియాలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నా. నా బాహువులు విశాలమైనవి కాబట్టి అన్ని రకాల విమర్శలను వినమ్రంగా స్వీకరించా. బార్ అసోసియేషన్ సభ్యులు, నా సహచరులు నాకు మద్దతుగా నిలిచారు. సుప్రీంకోర్టు అంటే ప్రధాన న్యాయమూర్తి కేంద్రీకృత కోర్టు. అందులో ఎలాంటి మార్పు ఉండదు. పెండింగ్ కేసులు పరిష్కరించా న్యాయ వ్యవస్థను ప్రజలకు సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి, పారదర్శకత పెంచడానికి కృషి చేశా. పెండింగ్ కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చా. నేను సీజేఐగా బాధ్యతలు తీసుకున్నప్పుడు 1,500 ద్రస్తాలు రిజి్రస్టార్ కప్‌బోర్డులో పడి ఉన్నాయి. అవి పరిష్కారానికి నోచుకోకపోవడం బాధ కలిగించింది. ఈ పరిస్థితి మార్చాలని సంకల్పించా. సుప్రీంకోర్టులో నమోదయ్యే ప్రతి కేసుకు ఒక నెంబర్ కేటాయించి, వరుసగా పరిష్కరించే విధానం ప్రారంభించా. దీనివల్ల వేలాది కేసులు పరిష్కారమయ్యాయి. బ్యాక్లాగ్ కేసుల సంఖ్య చాలావరకు తగ్గిపోయింది. కేసుల పెండింగ్ విషయంలో మాపై ఎన్నోవిమర్శలు వస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న 82,000 కేసుల్లో రిజిస్టర్ కాని కేసులు చాలా ఉండేవి. ఆ విషయం చాలామందికి తెలియదు. గత రెండేళ్లలో పెండింగ్ కేసుల సంఖ్య 11,000కు తగ్గిపోయింది’’ అని జస్టిస్ చంద్రచూడ్ ఉద్ఘాటించారు. మానవత్వంతో కూడిన తీర్పులిచ్చారు సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను పలువురు న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు కొనియాడారు. భారత న్యాయ వ్యవస్థపై ఆయన బలమైన ముద్ర వేశారని ప్రశంసించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ హృషికేశ్‌రాయ్, జస్టిస్ పి.ఎస్.నరసింహ తదితరులు మాట్లాడారు. జస్టిస్ చంద్రచూడ్ వృత్తి నైపుణ్యాలు ప్రదర్శించడంతోపాటు మానవత్వంతో కూడిన తీర్పులు ఇచ్చారని చెప్పారు. ఆయనకు అంతులేని సహనం ఉందని తెలిపారు. ఆరోగ్యకరమైన, చురుకైన జీవన శైలి ఆయన సొంతమని అన్నారు. క్లిష్టమైన తీర్పులు ఇచ్చే సమయంలోనూ ప్రశాంతంగా ఉండేవారని, న్యాయవ్యవస్థలో ఆధునిక సాంకేతిక విధానాలు ప్రవేశపెట్టారని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ నిత్యం యువకుడిలా కనిపిస్తారని, ఆయనను చూసి తాము వృద్ధులమైపోయినట్లు భావిస్తామని అన్నారు. ‘‘జస్టిస్ చంద్రచూడ్ పూర్తిగా శాకాహారి. ఉదయం 4 గంటలకే నిద్రలేస్తారు. ఆయనది క్రమశిక్షణతో కూడిన జీవితం. సమోసాలంటే ఆయనకు ఇష్టం. కానీ, సమావేశాల్లో ఏమీ తీసుకోరు. ఆరోగ్యానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. కోర్టుల్లో టెక్నాలజీ విషయంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. నా పనిని మరింత సులభతరం చేశారు’’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా తెలిపారు. ఇదిలా ఉండగా, నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ నెల 11న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ చివరి తీర్పు సుప్రీంకోర్టులో తన చివరి రోజు ప్రధాన న్యాయమూర్తి హోదాలో జస్టిస్ చంద్రచూడ్ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మైనారిటీ విద్యాసంస్థ హోదా విషయంలో కీలక తీర్పు వెలువరించారు. -
CJI DY Chandrachud: అర్హతా ప్రమాణాలను మధ్యలో మార్చలేరు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మొదలైన తర్వాత మధ్యలో అర్హతా ప్రమాణాలు మార్చడానికి వీల్లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నియామక ప్రక్రియ మధ్యలో అవసరాన్నిబట్టి నిబంధనల్లో మార్పులు చేస్తామని ముందుగా సమాచారం ఇవ్వకుండా నిబంధనలను మార్చకూడదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. గురువారం తేజ్ ప్రకాష్ పాఠక్ వర్సెస్ రాజస్థాన్ హైకోర్టు కేసును జడ్జీలు సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హృషీకేశ్‌రాయ్, జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ మనోజ్ మిశ్రాల రాజ్యాంగ ధర్మాసనం విచారించింది. రాజస్థాన్ హైకోర్టు 2007 సెప్టెంబర్ 17వ తేదీన 13 అనువాదకుల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీచేసింది. తొలుత ముందుగా రాత పరీక్ష నిర్వహి స్తామని, అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి వ్యక్తిగత ఇంటర్వ్యూలు చేపట్టడం ద్వారా నియామక ప్రక్రియ ముగుస్తుందని పేర్కొంది. ఆ పరీక్షకు మొత్తం 21 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అందులో మూడు ఉద్యోగా లకు ముగ్గురిని ఎంపిక చేశారు. కనీసం 75 శాతం మార్కులు సాధించిన అభ్యర్థులనే ఉద్యోగాలకు ఎంపిక చేశామని హైకోర్టు తన ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే నోటిఫికేషన్లో 75 శాతం మార్కులు తప్పనిసరి అనే విషయాన్ని స్పష్టంచేయలేదు. నిబంధనలు సవరించిన తర్వాత ఆ ముగ్గురిని మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేశారని మిగతా అభ్యర్థులు ఆరోపించారు. తమకు అన్యాయం జరిగిందంటూ బాధిత అభ్యర్థులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 2010 మార్చిలో ఆ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. దీంతో అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు గత ఏడాది జూలై 18వ తేదీన తీర్పును రిజర్వ్‌చేసి గురువారం వెలువరిచింది. ‘‘ ఏదైనా నియామక ప్రక్రియ అనేది దరఖాస్తుల స్వీకరణకు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ ప్రకటనతో మొదలవుతుంది. పోస్టుల భర్తీతో ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో నియమాలను మార్చడానికి వీల్లేదు. ఒకవేళ మార్చాల్సి వస్తే నోటిఫికేషన్ వెలువ డటానికి ముందే మార్చాలి. లేదంటే మధ్యలో మార్చాల్సి రావొచ్చేమో అని విషయాన్ని నోటిఫికేషన్లోనే ప్రస్తావించాలి. అలాంటివేవీ చెప్పకుండా హఠాత్తుగా అభ్యర్థులను హుతాశులను చేసేలా ఆట నియమాలను మార్చొద్దు. ఒకవేళ మారిస్తే అవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను, వివాదాలను తట్టుకుని నిలబడగలగాలి’’ అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా 2008లో సుప్రీంకోర్టు ఇచ్చిన పాత ‘‘ కె మంజుశ్రీ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు’ తీర్పును కోర్టు సమర్థించింది. దీంతోపాటు సుభాష్‌చంద్ మార్వా కేసునూ కోర్టు ప్రస్తావించింది. ‘‘ సెలక్ట్ జాబితా నుంచి ఉద్యోగుల ఎంపికను మార్వా కేసు స్పష్టంచేస్తే, సెలక్ట్ జాబితాలోకి ఎలా చేర్చాలనే అంశాలను మంజుశ్రీ కేసు వివరిస్తోంది’’ అని పేర్కొంది. -
సీజేఐ చంద్రచూడ్‌ను ‘సర్ప్రైజ్’ చేసిన A.I. లాయర్
ఢిల్లీ: నేషనల్ జ్యుడీషియల్ మ్యూజియం అండ్ ఆర్కైవ్(ఎన్జేఎంఏ)ను సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీ.వై చంద్రచూడ్ ప్రారంభించారు. గురువారం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) న్యాయవాదితో సీఎం మాట్లాడ్లారు. ఈ సందర్భంగా సీజేఐ చంద్రబూడ్.. ఏఐ లాయర్‌కు ఉన్న న్యాయపరమైన పరిజ్ఞానాన్ని పరీక్షించేందుకు ఓ ఆసక్తిరమైన ప్రశ్నను సంధించారు. అయితే, అంతే అలవోకగా ఏఐ న్యాయవాది.. సమాధానం చెప్పి సీజేసీ ఆశ్చర్యపరిచారు. ‘భారతదేశంలో మరణశిక్ష రాజ్యాంగబద్ధమా?’ అని సీజేఐ.. ఏఐ లాయర్‌ను అడిగారు. అడ్వకేట్ బో టై , కోటు ధరించిన కళ్లద్దాలతో ఉన్న ఏఐ లయర్.. అ సీజేఐ ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘‘అవును.. మరణశిక్ష భారతదేశంలో రాజ్యాంగబద్ధం. నేరం నిరూపించబడిన చాలా అరుదైన కేసుల్లో దోషుకులకు మరణ విధిస్తారు. అయితే.. హేయమైన కేసుల్లో అటువంటి శిక్షకు రాజ్యాంగబద్ధత ఉంది’’ అని చెప్పారు. ఏఐ లాయర్ స్పందనతో.. ప్రధాన న్యాయమూర్తి ముగ్ధులయ్యారు. సీజేఐతో పాటు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.AI भारत सहित दुनिया को बदल रहा है।सुनिए जब AI जज से CJI ने भारत में डेथ पैनालिटी के बारे में पूछा।जवाब सुनकर सीजेआई भी हैरान रह गए pic.twitter.com/7w9aNZYZtO— Sandeep Tevatia (@Adsandeept) November 7, 2024 ఇక.. ప్రారంభోత్సవం అనంతరం.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడారు. ‘‘ కొత్త మ్యూజియం సుప్రీంకోర్టు ధర్మాన్ని, దేశానికి ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ మ్యూజియం యువ తరానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నా. పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులను న్యాయవాదులు, న్యాయమూర్తులు తప్పనిసరిగా ఇక్కడకు తీసుకువచ్చి న్యాయస్థానం, చట్టబద్ధమైన పాలన ప్రాముఖ్యత ప్రత్యక్ష అనుభవాన్ని అందించాలి’’ అని అన్నారు. -
అన్ని ప్రైవేట్ ఆస్తుల స్వాధీనానికి రాష్ట్రాలకు అధికారం లేదు
ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్ కోక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు.– సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ న్యూఢిల్లీ: ప్రైవేట్ ఆస్తులపై ప్రభుత్వాల అధికార పరిధికి సంబంధించిన అతి కీలకమైన అంశంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. అన్ని ప్రైవేట్ ఆస్తులూ సామాజిక వనరుల నిర్వచన పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ‘‘కనుక రాష్ట్ర ప్రభుత్వాలకు అన్ని ప్రైవేట్ ఆస్తుల మీదా హక్కులు ఉండబోవు. సమాజ హితం, ఉమ్మడి ప్రయోజనాలు, సామాజిక పంపకం నిమిత్తం ఏ ప్రైవేట్ ఆస్తినైనా స్వాదీనం చేసుకునేందుకు వాటికి అధికారం లేదు’’ అని తేల్చి చెప్పింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సారథ్యంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు 7–2 మెజారిటీతో చరిత్రాత్మక తీర్పు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(బి) ఆధారంగా ప్రైవేట్ యాజమాన్యంలోని అన్ని వనరులను స్వా«దీనం చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదని పేర్కొంది. వాటికి ఆ అధికారం ఉందంటూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితరులు ఇచ్చిన గత తీర్పులతో విభేదించింది. వాటిలో వెలిబుచ్చిన అభిప్రాయాలను లోపభూయిష్టమైనవిగా, కాలదోషం పట్టినవిగా పేర్కొంది. ఆ తీర్పులను కొట్టేసింది. ఆర్థిక ప్రజాస్వామ్యానికి కూడా రాజ్యాంగం అనుమతిస్తోందంటూ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే, ‘‘కొన్ని ప్రైవేట్ ఆస్తులు మాత్రం ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న ‘సామాజిక వనరులు, సమాజ హితం’ పరిధిలోకి వస్తాయి. ఆ నిర్దిష్ట అవసరాల నిమిత్తం వాటిని ప్రభుత్వాలు స్వాదీనం చేసుకోవచ్చు’’ అని స్పష్టం చేసింది. సీజేఐతో పాటు జస్టిస్ హృషీకేశ్ రాయ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ రాజేశ్ బిందాల్, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీ ఈ మేరకు మెజారిటీ తీర్పు వెలువరించారు. వారి తరఫున సీజేఐ 193 పేజీల తీర్పును రాశారు. ఈ తీర్పుతో జస్టిస్ బి.వి.నాగరత్న పాక్షికంగా, జస్టిస్ సుధాన్షు ధూలియా పూర్తిగా విభేదించారు. కాలానుగుణంగా మారాలి: సీజేఐ ఆర్టికల్ 39(బి) కింద కేవలం ప్రైవేట్ ఆస్తులను కూడా సామాజిక వనరులుగా భావించవచ్చా అన్న అంశం 1992 నుంచి న్యాయస్థానాల్లో నలుగుతోంది. దీనికి సంబంధించి 16 పిటిషన్లు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి. దీన్ని 2002లో తొమ్మిది మంది సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. 2024లో సీజేఐ చంద్రచూడ్ ధర్మాసనం దీన్ని విచారణకు చేపట్టింది. ప్రైవేట్ ఆస్తులన్నింటినీ సామాజిక వనరులుగా భావించడానికి వీల్లేదని సీజేఐ తన తీర్పులో స్పష్టం చేశారు. అలా భావించవచ్చని, వాటిని సమాజ హితం కోసం స్వాదీనం చేసుకోవచ్చని పేర్కొన్న గత తీర్పులు సామ్యవాద ధోరణితో కూడినవని అభిప్రాయపడ్డారు. ‘‘ఆర్టికల్ 39(బి)లో పేర్కొన్న సామాజిక వనరులు అన్న పదబంధం ప్రైవేటు యాజమాన్యంలోని అన్ని ఆస్తులు, వనరులకు వర్తిస్తుందా అన్నది మా ముందున్న ప్రశ్న. సైద్ధాంతికంగా చూస్తే అవుననే సమాధానమే వస్తుంది. కానీ ఆ మేరకు జస్టిస్ కృష్ణయ్యర్ ఇచ్చిన తీర్పు, దాని ఆధారంగా సంజీవ్ కోక్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏకీభవించలేకపోతున్నాం. కేవలం భౌతిక అవసరాల నిర్వచన పరిధిలోకి వచ్చినంత మాత్రాన ప్రతి ప్రైవేట్ ఆస్తినీ సామాజిక వనరుగా పరిగణించడం కుదరదు. సదరు ఆస్తి తాలూకు స్వభావం, సమాజ శ్రేయస్సుపై దాని ప్రభావం, వనరుల అలభ్యత, అది ప్రైవేటు చేతుల్లో ఉంటే తలెత్తే పరిణామాలు తదితరాలన్నింటినీ బేరీజు వేసిన మీదట మాత్రమే అది సామాజిక వనరో, కాదో తేల్చాలి. ప్రజా విశ్వాస సిద్ధాంతాన్ని కూడా దీనికి వర్తింపజేయాల్సి ఉంటుంది. అడవులు, చెరువులు, చిత్తడి నేలలు, సహజ వనరులతో కూడిన భూముల వంటివి ప్రైవేట్ స్వాదీనంలో ఉంటే ఆర్టికల్ 39(బి) కింద వాటిని సమాజ అవసరాల నిమిత్తం ప్రభుత్వాలు సేకరించవచ్చు. అదే సమయంలో స్పెక్ట్రం, ఎయిర్‌వేవ్స్, సహజ వాయువు, గనులు, ఖనిజాల వంటి కొరతతో కూడిన పరిమిత వనరులు కొన్నిసార్లు ప్రైవేట్ అజమాయిషీలో ఉండేందుకు ఆస్కారముంది. కనుక పంపకం అనే మాటకున్న అర్థం విస్తృతమైనది’’ అని సీజేఐ పేర్కొన్నారు. ‘‘గత తీర్పుల్లో జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి నిర్దిష్ట ఆర్థిక సిద్ధాంతాల ప్రాతిపదికన అభిప్రాయాలు వెలిబుచ్చారు. కానీ స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో సంక్షేమ ఆధారిత విధానాలున్నాయి. తర్వాత మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, జాతీయీకరణ వంటివాటి కాలం నడిచింది. ఇది పెట్టుబడుల ఉపసంహరణల యుగం. ప్రైవేట్ పెట్టుబడులు భారీగా పెరుగుతున్నాయి. కనుక గత పరిస్థితులను ఇప్పుడు ప్రాతిపదికగా తీసుకోరాదు. ప్రస్తుత, భావి అవసరాలను తగ్గట్టుగా తీర్పులుండాలి’’ అని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగం కూడా ఫలానా ఆర్థిక విధానాన్నే పాటించాలని సూచించలేదన్నారు. ఇద్దరు న్యాయమూర్తులు ఏమన్నారంటే... ఏ ప్రైవేట్ ఆస్తులనైనా సమాజ హితానికి స్వా«దీనం చేసుకునే అధికారం ప్రభుత్వాలకు ఉందన్న జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తదితర తీర్పులకు నేటికీ కాలదోషం పట్టలేదని జస్టిస్ ధూలియా అభిప్రాయపడ్డారు. ఈ విషయమై ఆర్టికల్ 38, 39ల్లో పేర్కొన్న సూత్రాలను పక్కన పెట్టడం సబబు కాదన్నారు. అలా చేయడం ప్రభుత్వాల చేతులను కట్టేయడమే అవుతుందని 97 పేజీల తీర్పులో స్పష్టం చేశారు. ‘‘ఎందుకంటే అంబేడ్కర్ హెచ్చరించిన సామాజిక, ఆర్థిక అసమానతలు మన దేశంలో ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పేద, సంపన్న వర్గాల మధ్య ఆదాయ, సంపదపరమైన భారీ అసమానతలు నానాటికీ మరింతగా పెరుగుతున్నాయి’’ అన్నారు. జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ చిన్నపరెడ్డి తీర్పులకు పూర్తిగా కాలదోషం పట్టలేదని జస్టిస్ నాగరత్న కూడా అభిప్రాయపడ్డారు. అయితే, ‘‘భౌతిక వనరులను ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యంలోవిగా విభజించవచ్చు. పూర్తిగా వ్యక్తిగత అవసరాలను తీర్చేవాటిని మినహాయించి ఇతర ప్రైవేటు ఆస్తులను సమాజ హితం కోసం ప్రభుత్వం సేకరించవచ్చు. ఆ మీదట సమాజ హితం కోసం అర్హులకు వాటిని చట్టపరమైన మార్గాల్లో తాత్కాలిక/శాశ్వత ప్రాతిపదికన బేషరతుగానో, షరతులతోనో పంపకం చేయవచ్చు’’ అని ఆమె పేర్కొన్నారు. అయితే జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పుపై సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యలను ‘పరుషమైనవి, అనవసరమైనవి’గా జస్టిస్ ధూలియా, జస్టిస్ నాగరత్న అభివర్ణించడం విశేషం. వాటితో తాము గట్టిగా విభేదిస్తున్నట్టు వారు పేర్కొన్నారు. కృష్ణయ్యర్, చిన్నపురెడ్డి తీర్పులు... సమాజహితం కోసం ప్రైవేట్ ఆస్తులను సేకరించే అధికారం ప్రభుత్వాలకు ఉంటుందని 1977లో కర్నాటక ప్రభుత్వం వర్సెస్ రంగనాథరెడ్డి కేసులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ పేర్కొన్నారు. ప్రైవేట్ యాజమాన్యంలోని ఆస్తులు సామాజిక వనరుల నిర్వచనంలోకి రావంటూ ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన మెజారిటీతో తీర్పును వ్యతిరేకించారు. ప్రైవేట్ ఆస్తులు కూడా ఆ నిర్వచనం పరిధిలోకి వస్తాయంటూ ఆయన మైనారిటీ తీర్పు వెలువరించారు. ఆస్తులపై భూస్వాములు, పెట్టుబడిదారుల ఆస్తుల కోటలను బద్దలు కొట్టడానికి ఆర్టికల్ 39(బి)ని రాజ్యాంగంలో ఉద్దేశపూర్వకంగానే చేర్చారని అభిప్రాయపడ్డారు. 1983లో సంజీవ్ చోక్ కేసులో సీజేఐ చిన్నపరెడ్డి కూడా జస్టిస్ కృష్ణయ్యర్ మైనారిటీ తీర్పును పూర్తిగా సమర్థించారు. సామ్యవాద సిద్ధాంతకర్తల ఆదర్శాలే ఆర్టికల్ 39(బి)లో ప్రతిఫలించాయని ఆయన పేర్కొన్నారు. ఆర్టికల్ 39(బి) ఏం చెబుతోందంటే... ‘‘సామాజిక వనరులు సమాజ విశాల హితం కోసం పంపిణీ అయేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. ఇందుకు వీలుగా సదరు వనరులపై యాజమాన్యం, నియంత్రణకు అవసరమైన విధానాలను రూపొందించాలి’’. -
ప్రధాని మా ఇంటికి వస్తే తప్పేముంది: సీజేఐ చంద్రచూడ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గణపతి పూజ కోసం తన నివాసానికి రావడంలో తప్పేముందని భారత ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్ ప్రశ్నించారు. ప్రధాని రాకలో తప్పేమీ లేదన్నారు. ఇలాంటి అంశాల్లో రాజకీయవర్గాలు పరిణితిని కనబర్చాలని పేర్కొన్నారు. సీజేఐ నివాసానికి ప్రధాని వెళ్లడం తప్పుడు సంకేతాలు వెళ్లడానికి ఆస్కారం కలిగిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఆక్షేపించిన విషయం తెలిసిందే. ‘గణపతి పూజ నిమిత్తం ప్రధాని మోదీ నా నివాసానికి వచ్చారు. ఇందులో ఏమాత్రం తప్పు లేదు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థల మధ్య జరిగే సమావేశాల్లో ఇదో భాగమే. రాష్ట్రపతి భవన్‌లోనూ, గణతంత్ర దినోత్సవం.. ఇలా పలు సందర్భాల్లో కలుస్తుంటాం. ప్రధాని, మంత్రులతో మాట్లాడతాం. మా మధ్య సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న కేసుల ప్రస్తావన రాదు. సామాజిక స్థితిగతులు, ప్రజల జీవితాలపై చర్చ జరగుతుంది’అని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూపు నిర్వహించిన సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. రెండు ప్రధాన వ్యవస్థల మధ్య సుహుృద్భావ చర్చలుగా తమ భేటీలను చూడాలని పేర్కొన్నారు. -
సీజేఐ ఇంట్లో గణపతి పూజకు మోదీ హాజరు.. చంద్రచూడ్ రియాక్షన్
న్యూఢిల్లీ: గత నెలలో తన నివాసంలో జరిగిన గణపతి పూజ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకావడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ స్పందించారు. నాడు గణపతి పూజకు మోదీ రావడంపై చెలరేగిన వివాదాన్ని ఆయన ప్రస్తావించారు. అలాంటి సమావేశాలలో న్యాయపరమైన విషయాలేవీ చర్చించలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ముంబైలో లోక్‌సత్తా లెక్చర్ సిరీస్‌లో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం సర్వసాధారణమని తెలిపారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో న్యాయవ్యవస్థకు పాలనాపరమైన సంబంధాలు ఉంటాయని, వీటిపై మాట్లాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో సీజేఐ, హైకోర్టు చీఫ్ జస్టిస్‌లు సమావేశమవుతారని తెలిపారు. ప్రభుత్వ పెద్దలను కలిస్తే.. ఇద్దరి మధ్యా ఏదో డీల్ కుదిరినట్టు భావించరాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పాలనా వ్యవస్థలో మా విధులు మాకు తెలుసు, రాజకీయ నాయకులకు కూడా వారి విధులు తెలుసని తెలిపారు. ఏ న్యాయమూర్తులు కూడా (భారత ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తులు) ఏ ముప్పును కోరి తెచ్చుకోరని మనదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు.‘‘ఈ సమావేశాలు ఎందుకు అని ప్రజలు అనుకుంటున్నారు. రాజకీయ వర్గాల్లో కూడా న్యాయవ్యవస్థ పట్ల ఎంతో గౌరవం ఉండడంలోనే మన రాజకీయ వ్యవస్థ పరిపక్వత దాగి ఉంది.. ఇది తెలిసిందే. న్యాయవ్యవస్థకు కావాల్సిన నిధులను (బడ్జెట్) ప్రభుత్వాలు విడుదల చేస్తాయి. కాబట్టే సీఎంలతో సమావేశాలు తప్పనిసరి. ఈ బడ్జెట్ న్యాయమూర్తుల కోసం కాదు. కొత్త కోర్టు భవనాలు, జిల్లా న్యాయమూర్తులకు కొత్త నివాసాలు అవసరం. దీనికి ప్రధాన న్యాయమూర్తి, ముఖ్యమంత్రి సమావేశాలు అవసరం. ఇలాంటి సమావేశాలు న్యాయ నిర్ణయాలపై కాకుండా న్యాయవ్యవస్థకు సంబంధించిన మౌలిక సదుపాయాల సమస్యలపై మాత్రమే దృష్టి సారిస్తాయి.తాను గతంలో అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశానని ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. ‘ప్రధాన న్యాయమూర్తిని నియమించినప్పుడు వారు ముఖ్యమంత్రి ఇంటికి వెళతారు. అప్పుడు, ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్ ఇంటికి వస్తారు, ఈ సమావేశాలు ఎజెండాను నిర్ణయిస్తాయి. జడ్జిలతో జరిగిన సమావేశంలో ఏ సీఎం కూడా పెండింగ్ కేసుల ప్రస్తావన తేలేదు. జడ్జీలతో జరిగే మీటింగ్స్‌లో రాజకీయ వ్యవస్థ చాలా పరిపక్వతతో వ్యవహరించింది. దీని కోసం మీరు కలవాల్సిన అవసరం లేదా? కేవలం లేఖలు పంపి ఊరుకుంటే పనులు కావు. న్యాయమూర్తులు నేరుగా మాట్లాడాల్సి ఉంటుంది.’ అని తెలిపారు. -
CJI DY Chandrachud: జూనియర్లకు సరైన వేతనాలివ్వండి
న్యూఢిల్లీ: ‘‘న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి, నైపుణ్యాలు పెంచుకోవడానికి మీ వద్ద పనిచేసే యువతకు సరైన వేతనాలు, పారితోషికాలు చెల్లించడం మీరు తప్పనిసరిగా నేర్చుకోవాలి’’ అని న్యాయవాదులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ సూచించారు. న్యాయవాద వృత్తి చాలా సంక్లిష్టమైందని చెప్పారు. ప్రాథమిక స్థాయిలో నేర్చుకున్న నైపుణ్యాలే యువ న్యాయవాదులను ముందుకు నడిపిస్తాయని, అవి వారికి జీవితాంతం తోడ్పడుతాయని తెలిపారు. పునాది బలంగా ఉండాలని పేర్కొన్నారు. తాజాగా ఆలిండియా రేడియో ఇంటర్వ్యూలో జస్టిస్ చంద్రచూడ్ పలు విషయాలు వెల్లడించారు. ఈ వృత్తిలో ఎన్నో ఎత్తుపల్లాలు, ఒడిదుడుకులు ఉంటాయని, ప్రారంభంలో వేతనాలు ఎక్కువగా ఉండకపోవచ్చని వెల్లడించారు. న్యాయవాద వృత్తిలోకి వచ్చేవారు కష్టపడి పనిచేయాలని, నిజాయతీగా ఉండాలని పేర్కొన్నారు. యువ లాయర్లను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని స్పష్టంచేశారు. జూనియర్లకు సీనియర్ లాయర్లు గురువులుగా కొత్త విషయాలు నేరి్పస్తూనే సంతృప్తికరమైన వేతనాలు చెల్లించడం తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. తాను కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఆలిండియా రేడియోలో ప్రయోక్తగా పనిచేశానని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేసుకున్నారు. శాస్త్రీయ సంగీత కళాకారిణి అయిన తన తల్లి తనను ముంబైలోని ఆలిండియా రేడియో స్టూడియోకు తీసుకెళ్తూ ఉండేవారని చెప్పారు. 1975లో ఢిల్లీకి వచ్చాక ఆకాశవాణిలో హిందీ, ఇంగ్లిష్ కార్యక్రమాలు నిర్వహించానని వివరించారు. చిన్నప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి రేడియోలో హిందీ, ఇంగ్లి‹Ù, సంస్కృత కార్యక్రమాలు విన్నానని తెలిపారు. దేవకి నందన్ పాండే, పమేలా సింగ్, లోతికా రత్నం గొంతులకు తాను అభిమానినని చెప్పారు. -
సమాజం పట్ల కరుణతోనే న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నా..
ముంబై: న్యాయస్థానాలు, న్యాయమూర్తులు సైతం సూక్ష్మ పరిశీలనకు గురి కావాల్సిందేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. న్యాయమూర్తుల పనితీరును చుట్టూ ఉన్న సమాజం పరిశీలిస్తూనే ఉంటుందని అన్నారు. అయితే, సమాజం పట్ల ఉన్న దయ, కరుణ, జాలి, అనురాగం వల్లే తాను అన్ని రకాల పరిశీలనలు, పరీక్షలకు నిలిచి, న్యాయమూర్తిగా నిలదొక్కుకున్నానని తెలిపారు. సమాజం పట్ల తమ ప్రేమానురాగాలు తమ తీర్పుల ద్వారా వెల్లడవుతాయని వివరించారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెల 10వ తేదీన పదవీ విరమణ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో బాంబే హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ముంబైలో ఆయనను ఘనంగా సత్కరించారు. జస్టిస్ చంద్రచూడ్ అందించిన సేవలను న్యాయవాదులు ప్రశంసించారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ తాను ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. ‘‘ఐఐటీ–ధన్బాద్లో చేరేందుకు సకాలంలో అడ్మిషన్ ఫీజు రూ.17,500 చెల్లించలేకపోయిన దళిత విద్యార్థికి మా ఆదేశాలతో ప్రవేశం లభించింది. ఇలాంటి తీర్పులు తనకెంతో సంతృప్తిని ఇచ్చాయి’’ అని తెలిపారు. -
సుప్రీంకోర్టు రిపోర్టర్‌కు లా డిగ్రీ అక్కర్లేదు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకొనే రిపోర్టర్లు తప్పనిసరిగా న్యాయవిద్యను అభ్యసించి ఉండాలనే నిబంధనను ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఎత్తివేశారు. ‘సుప్రీంకోర్టు వార్తలను కవర్ చేసే రిపోర్టర్లకు లా డిగ్రీ ఉండాలనే నిబంధన ఎందుకు పెట్టారో తెలియదు. దాన్ని ఎత్తివేస్తూ ఫైల్‌పై సంతకం చేశాను. ఇక మరింత మంది సుప్రీంకోర్టు అక్రిడేషన్ పొందొచ్చు’ అని సీజేఐ చంద్రచూడ్ గురువారం విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. నవంబరు 10వ తేదీన పదవీ విరమణ చేయనున్న జస్టిస్ చంద్రచూడ్ తన హయాంలో పలు సంస్కరణలు తెచ్చారు. ఈ–ఫైలింగ్‌ను ప్రవేశపె ట్టారు. హైబ్రిడ్ విచారణ పద్ధతి (ప్రత్యక్ష విచా రణ, ఆన్లైన్ విచారణలను కలగలిపి) తెచ్చారు. వాయు కాలుష్యానికి మార్నింగ్ వాక్ ఆపేశాదేశ రాజధానిలో పెరిగిపోతున్న వాయు కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని మార్నింగ్ వాక్‌ను ఆపేశానని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. శ్వాసకోస సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే ఇంటికే పరిమితం కావాలని డాక్టర్ తనకు సూచించారని వెల్లడించారు. ‘ఈ రోజు నుంచే మార్నింగ్ వాక్ ఆపేశా. సాధారణంగా ఉదయం 4–4.15కు మార్నింగ్ వాక్కు వెళతా’ అని తెలిపారు. -
వైవాహిక అత్యాచారం కేసుల విచారణ వాయిదా
న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారం ఘటనల్లో భర్తపై నేరం మోపకుండా చట్టం కల్పిస్తున్న రక్షణలపై నమోదైన కేసుల విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం నాలుగు వారాలు వాయిదావేసింది. నవంబర్ పదో తేదీన సీజేఐ చంద్రచూడ్ పదవీవిరమణ నేపథ్యంలో ఇక ఈ కేసులను ఆయన విచారించబోరని తెలుస్తోంది. కోర్టుకు దీపావళి సెలవు దినాలు మొదలుకానున్న నేపథ్యంలో ఈ కేసుల వాదోపవాదనలను ముగించలేకపోతున్నానని ఆయన చెప్పారు. కేసులో తగిన పత్రాల దాఖలుకు సంబంధిత న్యాయవాదులకు తగు గడువు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీజేఐ చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం కాకుండా ఈ కేసుల తదుపరి విచారణను మరో ధర్మాసనం ఆలకించే వీలుంది. మైనర్కాని భార్యతో బలవంతంగా శృంగారం చేసిన భర్తకు భారతీయ శిక్షా స్మృతి, భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) చట్టాలు విచారణ నుంచి రక్షణ కల్పిస్తున్న విషయం తెల్సిందే. ఈ కేసుల విచారణ అక్టోబర్ 17న మొదలైంది. ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం 18ఏళ్లు దాటిన భార్యతో బలవంతగా భర్త సంభోగించినా అది రేప్‌గా పరిగణించబోరు. అలాగే బీఎన్ఎస్లోని సెక్షన్ 63(రేప్)(2) ప్రకారం చూసినా ఈ చర్యను అత్యాచారంగా పరిగణించరు. మారుతున్న సామా జిక పోకలు, ఆధునిక సమాజంలో భర్త సాన్నిహిత్య పరిస్థితుల్లో భార్య సమ్మతి ఉంది లేదు అనే అంశాన్ని నిరూపించడం అసంభవమని కేంద్రం గతంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. చట్టాలను దుర్విని యోగం చేస్తూ ఈ మినహాయింపు రక్షణ నుంచి భర్తను పక్కకు జరిపితే భారతీయ సామాజిక, కుటుంబ వ్యవస్థలో కొత్త సమస్యలు ఉత్పన్నమ య్యే ప్రమాదముందని కేంద్రం పేర్కొంది. -
బైజూస్‌కు మరో ఎదురుదెబ్బ..
న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్ టెక్నాలజీ సంస్థ బైజూస్(థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్)కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్(ఎన్‌క్లాట్) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు బుధవారం తోసిపుచ్చింది. సెటిల్మెంట్ నగదు రూ.158.9 కోట్లను కమిటీ ఆఫ్ క్రెడిటర్(సీఓసీ) వద్ద డిపాజిట్ చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బీసీసీఐని ఆదేశించింది. ఎన్‌క్లాట్ తీర్పును వ్యతిరేకిస్తూ అమెరికా సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. 61 పేజీల తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో బైజూస్‌పై ఆ కంపెనీ వ్యవస్థాపకులైన బైజూ రవీంద్రన్, ఆయన సోదరుడు రిజూ రవీంద్రన్ మరోసారి నియంత్రణ కోల్పోనున్నారు. బీసీసీఐతో రూ.158.9 కోట్ల వ్యవహారాన్ని సెటిల్మెంట్ చేసుకోవడానికి బైజూస్ అంగీకరించడంతో ఆ సంస్థపై దివాలా చర్యలు చేపట్టకుండా ఆగస్టు 2న ఎన్‌క్లాట్ తీర్పు ఇచ్చింది. -
జస్టిస్ పేరు తప్పుగా పలికిన న్యాయవాది.. సీజేఐ ఏమన్నారంటే..
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేసుల విచారణ, జైలు శిక్షలు, బెయిల్ మంజూరు, కస్టడీ పొడగింపులు ఇవే గుర్తొస్తాయి. కానీ సర్వోన్నత న్యాయస్థానంలో కొన్నిసార్లు ఆసక్తికరమైన, ఫన్నీ, సీరియస్ సంభాషణలు కూడా జరుగుతున్నాయి. తాజాగా అలాంటి ఓ సన్నివేశం సీజేఐ, న్యాయవాదికి మధ్య జరిగింది. కేసులో విచారణలో భాగంగా ఓ న్యాయవాది జస్టిస్ హృషికేష్ రాయ్‌ను ‘జస్టిస్ హృషికేశ్ ముఖర్జీ’గా సంబోధించాడు. గతంలో సుప్రీంకోర్టు విచారించిన ఓ పిటిషన్‌ను ప్రస్తావిస్తూ..‘ఈ కేసు జస్టిస్ మృషికేష్ ముఖర్జీ ముందు ఉంది’ అని పేర్కొన్నారు.దీంతో వెంటనే స్పందించిన సీజేఐ డీవీ చంద్రచూడ్... న్యాయవాది వ్యాఖ్యలను సరిచేశారు. హృషికేష్ ముఖర్జీనా లేఖ హృషికేశ్ రాయ్? అని ప్రశ్నించారు. రాయ్‌ను ముఖర్జీగా చేశారని అన్నారు. న్యాయవాదులు తప్పనిసరిగా న్యాయమూర్తుల పేర్లు క్షుణ్ణంగా తెలుసుకొని ఉండాలని సూచించారు. ఇదే చివరి అవకాశమని, వెళ్లి వెబ్‌సైట్‌ను తనిఖీ చేయాలని పేర్కొన్నారు. కాగా జస్టిస్ హృషికేష్ రాయ్ సెప్టెంబరు 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, గౌహతి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు. న్యాయమూర్తి కాకముందు సీనియర్ న్యాయవాదిగా కూడా పనిచేశారు. ఇదిలా ఉండగా హృషికేష్ ముఖర్జీ భారతీయ సినీ దర్శకుడు, ఎడిటర్, రచయిత. -
CJI Chandrachud: అయోధ్య సమస్య పరిష్కారం కోసం దేవుడిని ప్రార్థించా
పుణే: రామ జన్మ భూ మి–బాబ్రీ మసీదు వి వాదం పరిష్కారం కోసం భగవంతుడిని ప్రార్థించానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పారు. భగవంతుడి పట్ల విశ్వాసం ఉంటే ఆయన కచ్చితంగా పరిష్కార మార్గం చూపిస్తాడని అన్నారు. జస్టిస్ చంద్రచూడ్ వచ్చే నెలలో పదవీ విరమణ చేయబోతున్నారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని ఖేడ్ తాలూకా కన్హేర్సార్. ఈ గ్రామ ప్రజలు ఆదివారం ఆయనను సత్కరించారు. కేసుల విచారణ సమయంలో న్యాయమూర్తులకు కొన్నిసార్లు పరిష్కార మార్గాలు కనిపించవని ఈ సందర్భంగా జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. అయోధ్య వ్యవహారంపై విచారణ జరుగుతున్నప్పుడు ఇలాంటి పరిస్థితి తనకు ఎదురైందన్నారు. అప్పుడు భగవంతుడి సన్నిధిలో కూర్చొని ప్రార్థించానని, సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నానని తెలిపారు. తాను తరచుగా దేవుడిని ప్రార్థిస్తుంటానని పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అనుకూలంగా 2019 నవంబర్ 9న అప్పటి సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో జస్టిస్ చంద్రచూడ్ కూడా ఒక సభ్యుడే. -
ప్రజా న్యాయస్థానం సుప్రీంకోర్టు
పనాజీ: పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్రను సుప్రీంకోర్టు పోషించకూడదని అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. ప్రజల కోర్టుగా సుప్రీంకోర్టు పాత్రను ఎప్పటికీ పరిరక్షించాలని చెప్పారు. భవిష్యత్తులోనూ ప్రజల న్యాయస్థానంగానే పని చేయాలని పేర్కొన్నారు. ప్రజల కోర్టు అంటే దాని అర్థం పార్లమెంట్లో ప్రతిపక్షాలు పోషించే పాత్ర కాదని ఉద్ఘాటించారు. గోవాలో శనివారం సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్(ఎస్సీఏఓఆర్ఏ) సదస్సులో జస్టిస్ చంద్రచూడ్ ప్రసంగించారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం పొందే విషయంలో గత 75 ఏళ్లలో ఒక స్పష్టమైన విధానం అభివృద్ధి చేసుకున్నామని, అది దారితప్పకుండా జాగ్రత్తపడాలని చెప్పారు. సమాజంలో సంపద పెరుగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో ధనవంతులకే న్యాయం దక్కుతుందన్న అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొన్నారు. అందులో ఎలాంటి నిజం లేదని, సుప్రీంకోర్టు అంటే ముమ్మాటికీ ప్రజల కోర్టు అని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టును చూసే దృక్కోణం విషయంలో జనం మధ్య విభజన కనిపిస్తోందన్నారు. అనుకూలమైన తీర్పు వస్తే సుప్రీంకోర్టు చాలా గొప్పదని ప్రశంసించడం ప్రతికూలమైన తీర్పు వస్తే దూషించడం పరిపాటిగా మారిందన్నారు. కేవలం తీర్పుల ఆధారంగా సుప్రీంకోర్టు పనితీరు, అది పోషించే పాత్రను నిర్ణయించడం సరికాదన్నారు. కేసులో మెరిట్‌ను బట్టే న్యాయమూర్తులు తీర్పు ఇస్తుంటారని, ఇందులో వారి సొంత అభిప్రాయానికి స్థానం ఉండదని గుర్తుచేశారు. జడ్జిలు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని చెప్పారు. ప్రజల ఇళ్లలోకి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థలోఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు కేసుల ఈ–ఫైలింగ్, కేసు రికార్డుల డిజిటలైజేషన్, కోర్టు వ్యవహారం ప్రత్యక్ష ప్రసారం వంటివి తీసుకొచ్చామని గుర్తుచేశారు. ప్రత్యక్ష ప్రసారం అనేది ఒక విప్లవాత్మకమైన మార్పు అని తెలిపారు. ఇప్పుడు కోర్టురూమ్ అనేది కొందరు లాయర్లు, జడ్జిలకు మాత్రమే పరిమితం కాదని, అది ప్రజలకు ఒక్క క్లిక్‌తో అందుబాటులోకి వచి్చందని హర్షం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు నేరుగా ప్రజల ఇళ్లల్లోకి చేరిందన్నారు. కోర్టుల్లో గౌరవప్రదమైన భాష వాడుదాం మనుషులను కించపర్చే భాషకు కోర్టు ప్రాంగణాల్లో స్థానం లేదని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. ప్రధానంగా మహిళల పట్ల అభ్యంతర వ్యాఖ్యలు, దిగజారుడు భాషను సహించే ప్రసక్తే లేదని అన్నారు. మహిళలతోపాటు సమాజంలోని అణగారిన వర్గాలపై ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం కొందరికి అలవాటని చెప్పారు. అభ్యంతరకర భాష పట్ల మహిళా న్యాయవాదుల నుంచి తమకు ఫిర్యాదులు వస్తుంటాయని తెలిపారు. న్యాయ వ్యవస్థలోనూ ఇలాంటి జాడ్యం ఉందని, ఈ పరిస్థితి మారాలని తేలి్చచెప్పారు. న్యాయస్థానాల్లో ఉపయోగించే భాష పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతవాతావరణ మార్పుల దుష్పరిణామాల పట్ల జస్టిస్ చంద్రచూడ్ ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పుల కారణంగా సమాజంలో అట్టడుగు వర్గాలే ఎక్కువగా నష్టపోతున్నాయని చెప్పారు. రైతులు, మత్స్యకారులు, పేదలకు తీవ్ర నష్టం జరుగుతోందని అన్నారు. గోవా గవర్నర్ పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై రాసిన ‘భారతదేశ సంప్రదాయ వృక్షాలు’ అనే పుస్తకాన్ని జస్టిస్ చంద్రచూడ్ శనివారం ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని స్పష్టంచేశారు. -
కేసుల పరిష్కారానికి గడువు పెట్టలేం
న్యూఢిల్లీ: దేశంలోని అన్ని కోర్టుల్లో కేసులను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ఇది అమెరికా సుప్రీంకోర్టు కాదని వ్యాఖ్యానించింది. అలా గడువు పెట్టలేమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని కోర్టుల్లో దాఖలయ్యే కేసులను 12 నుంచి 36 నెలల్లోగా పరిష్కరించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ కోరారు. విదేశాల్లో కేసుల పరిష్కారానికి నిర్దిష్ట గడువు ఉన్న విషయాన్ని పిటిషనర్ ఎత్తిచూపగా.. ‘మాది అమెరికా సుప్రీంకోర్టు కాదు’ అని సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టులో అన్ని కేసుల్లోనూ 12 నెలల్లో విచారణా పూర్తికావాలని కోరుకుంటున్నారా? అని పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది అత్యంత అభిలషణీయమైనా.. ఆచరణసాధ్యం కాదని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడం, జడ్జిల సంఖ్య పెంచడం.. లాంటివెన్నో అవసరమవుతాయన్నారు. అమెరికా, ఇతర పాశ్చాత్యదేశాల్లో ఒక ఏడాదిలో సుప్రీంకోర్టులు ఎన్ని కేసులు పరిష్కరిస్తాయో మీకు తెలుసా? అని పిటిషనర్‌ను అడిగారు. కొన్ని పాశ్చాత్యదేశాల సుప్రీంకోర్టులు ఏడాది మొత్తం పరిష్కరించే కేసుల కంటే భారత సుప్రీంకోర్టు ఒక్కరోజు వినే కేసులే ఎక్కువన్నారు. భారత్‌లో అందరికీ న్యాయం పొందే అవకాశాన్ని మన వ్యవస్థ కల్పిస్తోందని, ఎవరినీ అడ్డుకోలేమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు.