పోక్సో చట్టం కిందకే వస్తుంది
సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
మద్రాస్ హైకోర్టు తీర్పు కొట్టివేత
ప్రపంచవ్యాప్త జాఢ్యమని వ్యాఖ్య
చైల్డ్ పోర్నోగ్రఫీ పదం వాడొద్దు
కోర్టులన్నింటికీ ఆదేశాలు
పోక్సో చట్ట సవరణకు సూచన
లైంగిక అవగాహనపై ప్రజల్లో
విస్తృత ప్రచారం నిర్వహించండి
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సూచన
న్యూఢిల్లీ: చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. లైంగిక వేధింపుల బారి నుంచి బాలలకు భద్రత కలి్పంచే పోక్సో చట్టం ప్రకారం ఆ వీడియోలను వ్యాప్తి చేయడం మాత్రమే నేరమన్న వాదన సరికాదని స్పష్టం చేసింది. ‘‘ఆ వీడియోలను కలిగి ఉండటం, డౌన్‌లోడ్ చేయడంతో పాటు ఆన్‌లైన్‌లో గానీ ఇతరత్రా గానీ వాటిని చూడటం కూడా పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం కచ్చితంగా నేరమే.
ఇవి ‘ఆరంభ నేరం’ కిందకే వస్తాయి’’ అని పోక్సో చట్టం సెక్షన్ 15లోని 1, 2, 3 సబ్ సెక్షన్లను, ఐటీ చట్టంలోని సెక్షన్ 67బిని ఉటంకిస్తూ పేర్కొంది. చైల్డ్ పోర్నోగ్రఫీని చూడటం, డౌన్‌లోడ్ చేయడం నేరం కాదన్న మద్రాస్ హైకోర్టు తీర్పును ఘోర తప్పిదంగా సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ జె.బి.పార్డీవాలా ధర్మాసనం అభివరి్ణంచింది.
తన మొబైల్‌లో చైల్డ్ పోర్నో వీడియోలున్న ఓ 28 ఏళ్ల వ్యక్తిని నిర్దోíÙగా పేర్కొంటూ జనవరి 11న హైకోర్టు ఇచి్చన తీర్పును కొట్టేస్తున్నట్టు పేర్కొంది. అతనిపై నేరాభియోగాలను పునరుద్ధరించాల్సిందిగా తిరువళ్లువర్ జిల్లా ఫాస్ట్ ట్రాక్ సెషన్స్ కోర్టును ఆదేశించింది. ‘‘బాలలపై లైంగిక వేధింపులు అత్యంత ఆందోళనకరమైన అంశం. సమాజంలో లోతుల దాకా వేళ్లూనుకుపోయిన ఈ పెను జాఢ్యం ఏ ఒక్క ప్రాంతానికో, దేశానికో పరిమితం కాదు.
ప్రపంచవ్యాప్త సమస్య’’ అంటూ ఆవేదన వెలిబుచి్చంది. దీని నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధర్మాసనం పలు సూచనలు చేసింది. ‘‘న్యాయపరమైన ఉత్తర్వులు, తీర్పుల్లో ఇకపై చైల్డ్ పోర్నోగ్రఫీ అనే పదాన్ని వాడొద్దు. దానికి బదులు సదరు నేరాలను మరింత నిర్దుష్టంగా పేర్కొనేలా ‘చైల్డ్ సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజ్ మెటీరియల్ (సీఎస్‌ఈఏఎం)’ అని మాత్రమే వాడాలి’’ అని అన్ని కోర్టులనూ ఆదేశించింది. పోక్సో చట్టానికి ఈ మేరకు సవరణ చేసే అంశాన్ని పరిశీలించాలని పార్లమెంటుకు సూచించింది. ఆలోపుగా కేంద్రం ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేయాలని పేర్కొంది. బాలలపై లైంగిక వేధింపుల సమస్యను రూపుమాపడంలో ప్రపంచ దేశాలన్నింటికీ ఈ తీర్పు మార్గదర్శకం కాగలదంటూ న్యాయ వర్గాలు హర్షం వెలిబుచ్చాయి.
తీర్పులో ముఖ్యాంశాలు
→ చైల్డ్ పోర్నో మెటీరియల్ బాలల భద్రతకు పెను ముప్పు. బాలలను లైంగిక అవసరాలు తీర్చుకునే బొమ్మలుగా అది చిత్రిస్తుంది. ఫలితంగా జరగరానిది జరిగితే బాధితుల లేత మనసులపై అది ఎన్నటికీ చెరిగిపోని గాయం చేస్తుంది.
→ విద్యార్థులకు సమగ్ర లైంగిక విద్యా బోధన కార్యక్రమాలను అమలు చేయాలి. ఆరోగ్యకరమైన సంబంధాలు, సరైన ప్రవర్తన వంటివాటిలపై అవగాహన కలిగించాలి.
→ విద్యార్థులు మొదలుకుని సాధారణ ప్రజల దాకా అన్ని స్థాయిల్లోనూ లైంగిక విద్య, అవగాహన కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలి.
→ చట్టపరమైన పర్యవసానాలను విస్తృతంగా ప్రచారం చేయాలి. తద్వారా వాటి వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చు. ఆ నేరాలకు పాల్పడేందుకు వెనకాడేలా చేయవచ్చు.
→ నేరానికి సంబంధించి బాలల నుంచి సాక్ష్యాల సేకరణ, దర్యాప్తు, విచారణ తదితర ప్రక్రియ వీలైనంత సున్నితంగా జరిగేలా చూడాలి. తద్వారా వారి మనసులు మరింత గాయపడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
లైంగిక విద్య అత్యవసరం
బాలలపై లైంగిక నేరాలు తగ్గాలంటే లైంగిక విద్య, లైంగిక ఆరోగ్యం గురించి ప్రజల్లో విస్తృత అవగాహన అవసరమని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. దురదృష్టవశాత్తూ దీనిపై భారత సమాజంలో తీవ్ర అపోహలు నెలకొని ఉన్నాయంటూ జస్టిస్ పార్డీవాలా ఆవేదన వెలిబుచ్చారు. ధర్మాసనం తరఫున 200 పేజీల తీర్పును ఆయనే రాశారు.
‘‘లైంగిక విద్యను పాశ్చాత్య భావనగా, మన సంప్రదాయ విలువలను దిగజార్చేదిగా భారత సమాజం భావిస్తుంది. దాంతో స్కూళ్లలో లైంగిక విద్యపై వ్యతిరేకత నెలకొని ఉంది. దానిపై పలు రాష్ట్రాల్లో నిషేధమే ఉంది!’’ అని పేర్కొన్నారు. ‘‘సెక్స్, సంబంధిత విషయాలను పిల్లలతో చర్చించడాన్ని ఇబ్బందికరంగా మాత్రమే గాక ఘోర అపరాధంగా, అనైతికంగా మనవాళ్లు చూస్తారు. వాటివల్ల ఎదిగే వయసులో విచ్చలవిడి లైంగిక ధోరణులు తలెత్తుతాయన్న అపోహ వ్యాప్తిలో ఉంది.
తల్లిదండ్రులు, పెద్దల్లోనే గాక విద్యావేత్తల్లో కూడా ఈ తిరోగమన ధోరణి నెలకొని ఉండటం దారుణం. దీంతో ఎదిగే పిల్లల్లో లైంగికపరమైన అవగాహన లోపిస్తోంది. అందుకే టీనేజర్లు ఇంటర్నెట్‌లో సులువుగా అందుబాటులో ఉన్న సెక్సువల్ కంటెంట్‌కు ఇట్టే ఆకర్షితులవుతున్నారు.
ఎలాంటి నియంత్రణా, వడపోతా లేని ఆ విచ్చలవిడి కంటెంట్ వారిని తప్పుదోవ పట్టించడమే గాక అనారోగ్యకరమైన లైంగిక ప్రవర్తనకు, లైంగిక నేరా లకు పురిగొల్పుతోంది’’ అంటూ ధర్మాసనం ఆందోళన వెలిబుచ్చింది.
‘‘కను క ఈ విషయమై ముందు పెద్దలను చైతన్యవంతులను చేయడం చాలా ముఖ్యం. సమగ్ర లైంగిక విద్య, అవగాహన బాల లకు ఎంత ముఖ్యమో వారికి అర్థమయ్యేలా చేయాలి. చైల్డ్ పోర్నోగ్రఫీ వీక్షణ, వ్యాప్తి, లైంగిక హింస వంటివాటి చట్టపరమైన పరిణామాలను కూడా అర్థం చేసుకుంటారు. కనుక వాటికి దూరంగా ఉంటారు. పరిశోధనల్లో రుజువైన వాస్తవాలివి. మన దేశంలో సమగ్ర లైంగిక విద్య అవసరం చాలా ఉందని అవి తేల్చాయి’’ అని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment