అలీగఢ్ ముస్లిం వర్సిటీపై సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం స్పష్టీకరణ
4–3 మెజార్టీతో తీర్పు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ)కి మైనార్టీ విద్యాసంస్థ హోదా ఉందో లేదో తేల్చే అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారాన్ని నూతన ధర్మాసనానికి(బెంచ్)కు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం 4–3 మెజార్టీతో శుక్రవారం 118 పేజీల తీర్పు ఇచ్చింది.
విద్యా సంస్థ నియంత్రణ, పరిపాలన విషయంలో పార్లమెంట్‌లో చట్టం చేసినప్పటికీ ఆ సంస్థకు ఉన్న మైనార్టీ హోదాను రద్దు చేయరని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వ చట్ట ప్రకారం అలీగఢ్ ముస్లిం వర్సిటీని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చింది. పరిపాలనా విభాగంలో మైనార్టీలు లేనంత మాత్రాన మైనార్టీ విద్యాసంస్థ కాకుండాపోదని తేల్చిచెప్పింది.
మతపరంగా లేదా భాషపరంగా మైనార్టీలైన వ్యక్తులు విద్యాసంస్థలు స్థాపించడం లేదా నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ, వివక్ష చూపుతూ తీసుకొచ్చిన చట్టం లేదా కార్యనిర్వాహక చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 30(1)కు విరుద్ధమని తేల్చిచెప్పింది. ఈ ఆర్టికల్ ప్రకారం విద్యాసంస్థలను స్థాపించే, నిర్వహించే హక్కు మత, భాషాపరమైన మైనార్టీలకు ఉంది.
‘‘ఏఎంయూను మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేం.. అది సెంట్రల్ యూనివర్సిటీ అంటూ ఎస్.అజీజ్ బాషా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1967లోఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతున్నాం. తాము స్థాపించిన విద్యా సంస్థ మైనార్టీల ప్రయోజనాల కోసమేనని దానిని ఏర్పాటు చేసినవారు నిరూపించుకోవాలి. రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఏర్పాటైన యూనివర్సిటీలకు సైతం ఆర్టికల్ 30(1) కింద ఇచ్చిన హక్కు వర్తిస్తుంది’’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. అయితే, ఇదే ధర్మాసనంలోని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ మూడు వేర్వేరు భిన్నమైన తీర్పులు ఇచ్చారు. ఏఎంయూ మైనార్టీ విద్యాసంస్థ కాదని జస్టిస్ దీపాంకర్ దత్తా తన తీర్పులో స్పష్టంచేశారు.
ఏమిటీ కేసు?
స్వాతంత్య్రానికి పూర్వమే 1875లో మహ్మదన్ ఆంగ్లో ఓరియంటల్‌గా కాలేజీగా ప్రారంభమైన ఈ విద్యాసంస్థను 1920లో యూనివర్సిటీగా మార్చారు. ఏఎంయూ అనేది కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ అని, దాన్ని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమని 1967లో సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో 1981లో పార్లమెంట్‌లో ఏఎంయూ(సవరణ) చట్టాన్ని తీసుకురావడంతో ఏఎంయూకు మళ్లీ మైనార్టీ విద్యాసంస్థ హోదా లభించింది. ఈ చట్ట సవరణను సవాలు చేస్తూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
దాంతో ఏఎంయూ(సవరణ) చట్టం–1981ను కొట్టివేస్తూ హైకోర్టు 2006లో తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేసింది. మరికొందరు సైతం పిటిషన్లు దాఖలుచేశారు. యూపీఏ ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు 2016లో ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. మిగిలిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ ప్రారంభించింది. ఈ అంశాన్ని 2019 ఫిబ్రవరి 12న ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. పిటిషన్లపై ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. ఏఎంయూకు మైనార్టీ సంస్థ హోదా ఉందో లేదో నూతన బెంచ్ నిర్ణయిస్తుందని తేల్చిచెప్పింది.
Comments
Please login to add a commentAdd a comment