మహిళలు, చిన్నారులపై నేరాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది
మహిళలపై నేరాల కేసుల్లో తీర్పులు త్వరగా రావాలి: ప్రధాని మోదీ
సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ వ్యవస్థపై సదస్సు ప్రారంభం
న్యూఢిల్లీ: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం లభించాల్సిన అవసరం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. వేగంగా న్యాయం చేకూర్చే పరిస్థితి ఉంటే భద్రత పట్ల మహిళలకు గొప్ప భరోసా దక్కుతుందని ఉద్ఘాటించారు. కోల్‌కతాలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య, మహారాష్ట్రలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఢిల్లీలో శనివారం సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జిల్లా న్యాయ వ్యవస్థపై ప్రారంభమైన జాతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగానికి దేశ న్యాయ వ్యవస్థను ఒక సంరక్షకురాలిగా పరిగణిస్తుంటామని చెప్పారు. సుప్రీంకోర్టుతోపాటు మొత్తం న్యాయ వ్యవస్థ ప్రజల అంచనాలకు తగ్గట్టుగా పని చేస్తే సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రధానమంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే...
క్రియాశీలకంగా మానిటరింగ్ కమిటీలు
‘‘దేశంలో మహిళలు, చిన్నారులపై వేధింపులు, నేరాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత కోసం చట్టాల్లో కఠినమైన నిబంధనలు చేరుస్తున్నాం. 2019లో ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక కోర్టుల పథకాన్ని ప్రారంభించాం. అడబిడ్డలపై జరిగే నేరాల విషయంలో తీర్పులు వేగంగా రావాలి. నేరగాళ్లకు శిక్షలు పడాలి. బాధితులకు సత్వర న్యాయం దక్కాలి. అలా జరిగితేనే జనాభాలో సగం మందికి వారి భద్రతపై ఒక భరోసా, నమ్మకం లభిస్తాయి. మహిళలపై నేరాలు అరికట్టే విషయంలో జిల్లా జడ్జి, మేజి్రస్టేట్, ఎస్పీతో కూడిన జిల్లా మానిటరింగ్ కమిటీల పాత్ర చాలా కీలకం.
కింది కోర్టులే మొదటి మెట్టు
దేశంలో రాజ్యాంగాన్ని, చట్టాల స్ఫూర్తిని న్యాయ వ్యవస్థ చక్కగా పరిరక్షిస్తోంది. సుప్రీంకోర్టు పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల దేశ ప్రజలు ఏనాడూ అపనమ్మకం వ్యక్తం చేయలేదు. న్యాయ వ్యవస్థపై వారికి ఎంతో విశ్వాసం ఉంది. దేశ న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ ఒక బలమైన పునాది అనడంలో సందేహం లేదు. బాధితులకు న్యాయం చేకూర్చడంలో కింది కోర్టులే మొదటి మెట్టు.
కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నాం. కోర్టులను ఆధునీకరిస్తున్నాం. పెండింగ్ కేసులను విశ్లేíÙంచడానికి, భవిష్యత్తులో రాబోయే కేసులను అంచనా వేయడానికి కృత్రిమ మేధ(ఏఐ), ఆప్టికల్ క్యారెక్టర్ రికగి్నషన్ వంటి నూతన సాంకేతికతలను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం’’ అని ప్రధానమంత్రి మోదీ ఉద్ఘాటించారు. భారత సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్మారక పోస్టల్ స్టాంప్, నాణేన్ని ఆవిష్కరించారు.
బెయిల్ ఇవ్వడానికి అభ్యంతరమెందుకు: కపిల్ సిబల్
ఎలాంటి సంకోచాలు, పక్షపాతానికి తావులేకుండా తీర్పులు ఇచ్చేలా ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు, సెషన్స్ కోర్టులు బలోపేతం కావాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ చెప్పారు. క్షేత్రస్థాయిలోని కింది కోర్టులు ఒత్తిళ్లను తట్టుకొని స్థిరంగా నిలవకపోతే మొత్తం న్యాయ, రాజకీయ వ్యవస్థ సమగ్రత ప్రమా దంలో పడుతుందని అన్నారు.
జిల్లా కోర్టులపై సదస్సులో ఆయన మాట్లాడుతూ... బెయిల్ ఒక నియమం, జైలు ఒక మినహాయింపు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచి్చన తీర్పును ప్రస్తావించారు. కీలకమైన కేసుల్లో నిందితులకు బెయిల్ ఇవ్వడానికి ట్రయల్ కోర్టులు, జిల్లా కోర్టులు నిరాకరిస్తున్నాయని ఆక్షేపించారు. తన వృత్తి జీవితంలో కింది కోర్టులు బెయిల్ ఇవ్వగా చూసిన సందర్భాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలిపారు. ఇది కేవలం తన ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదని చెప్పారు.
బెయిల్‌ను కింది కోర్టులు ఒక మినహాయింపుగా భావిస్తుండడంతో పై కోర్టులపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవల చెప్పారని గుర్తుచేశారు. కింది కోర్టుల్లో బెయిల్ రాకపోవడంతో నిందితులు హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్లాల్సి వస్తోందన్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని సూచించారు. జిల్లా కోర్టుల్లో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయాలని, న్యాయమూర్తుల వేతనా లు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.
జిల్లా కోర్టులే వెన్నెముక: జస్టిస్ చంద్రచూడ్
దేశంలో మొత్తం న్యాయ వ్యవస్థకు జిల్లా న్యాయ వ్యవస్థ వెన్నుముక అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభివరి్ణంచారు. చట్టబద్ధ పాలనకు జిల్లా జ్యుడీíÙయరీ అత్యంత కీలకమని చెప్పారు. జిల్లా కోర్టులను కింది కోర్టులు అని పిలవడం ఆపేయాలని సూచించారు. జిల్లా కోర్టులపై జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. జిల్లా న్యాయ వ్యవస్థలో కొన్నేళ్లుగా మహిళల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతోందని అన్నారు.
న్యాయాన్ని పొందడానికి ప్రజలకు మొదటి వేదిక జిల్లా కోర్టులేనని తెలిపారు. న్యాయ వ్యవస్థలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. 2023–24లో 46.48 కోట్ల పేజీల కోర్టు రికార్డులను డిజిటల్ రూపంలోకి మార్చామని వెల్లడించారు. 3,500 కోర్టు కాంప్లెక్స్‌లను, 22,000 కోర్టు రూమ్‌లను కంప్యూటరీకరించడానికి ఈ–కోర్టుల ప్రాజెక్టును ప్రారంభించినట్లు చెప్పారు. న్యాయమూర్తులపై ఒత్తిడి అధికంగా ఉంటుందని, వారు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జస్టిస్ చంద్రచూడ్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment