కోల్‌కతా డాక్టర్ హత్యోదంతంపై రేపు విచారణ
విచారణ చేపట్టనున్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 20న ఈ కేసు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం వెబ్‌సైట్‌లో వివరాలు పొందుపర్చారు.
దేశాన్ని కుదిపేస్తున్న వైద్యురాలి హత్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఘటనపై 14న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టు సీజేఐకు లేఖ రాశారు. డాక్టర్ హత్య ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.
ప్రత్యేక చట్టం తీసుకురావాలి
కోల్‌కతాలో వైద్యురాలి హత్యపై 70 మందికిపైగా పద్మ అవార్డుల గ్రహీతలైన డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై హింసను అరికట్టడానికి, వారి తగిన భద్రత కల్పించడానికి, ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
వైద్యులపై, సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిని, మానసికంగా వేధించేవారిని శిక్షించడానికి ఆర్డినెన్స్ తేవాలని సూచించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వైద్యుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయని, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. బాధితురాలి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోదీకి లేఖ రాసినవారిలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్, ఎయిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్లు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment