Chief Justice of Supreme Court
-
హక్కుల రక్షణలో ‘సుప్రీం’
అరవింద్‌రెడ్డి గండ్రాతిసామాజిక న్యాయానికి విఘాతం కలిగినా.. రాజ్యాంగానికి భంగం వాటిల్లినా.. ప్రజాప్రయోజనాలు హరించినా.. రాజకీయాలు హద్దు దాటినా.. దేశ సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది. రాజ్యాంగ పరిరక్షణకు ఉపక్రమిస్తుంది. పౌర హక్కులను, సమానత్వాన్ని, ప్రజా స్వేచ్ఛను కంటికి రెప్పలా కాపాడుతుంది. సామాన్యుడి నుంచి దేశాధినేత వరకు అందరినీ సమానంగా పరిగణిస్తుంది.ప్రజా ప్రయోజనాలు కాపాడటంలో ‘సుప్రీం’ కమాండర్‌గా, రాజ్యాంగం, సమానత్వ పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తున్న సుప్రీంకోర్టు(Supreme Court) ఏర్పాటై జనవరి 28తో 75 ఏళ్లు పూర్తయింది. 1950, జనవరి 28న 8 మంది (సీజేతో కలిపి)తో ప్రారంభమైంది.. నేడు 34కి చేరింది. ఇప్పటివరకు ఇద్దరు తెలుగు వారు జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ ఎన్వీ రమణ ప్రధాన న్యాయమూర్తి పీఠాన్ని అధిష్టించారు.రాజ్యాంగ పరిరక్షణకర్త..సుప్రీంకోర్టు(Supreme Court) దేశంలో సర్వోన్నత న్యాయస్థానం. సమాఖ్య కోర్టుగా, రాజ్యాంగ పరిరక్షణకర్తగా, అత్యున్నత ధర్మాసనంగా విధులు నిర్వర్తిస్తోంది. రాజ్యాంగంలోని 5వ భాగంలో అధికరణలు 124 నుంచి 147 వరకు సర్వోన్నత న్యాయస్థానం కూర్పు, అధికార పరిధిని తెలియజేస్తాయి. ముఖ్యంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని హైకోర్టులు ఇచ్చే తీర్పులపై అప్పీళ్లను స్వీకరిస్తుంది. అందుకే దీన్ని పునర్విచారణ ధర్మాసనం అని కూడా అంటారు.తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనల కేసుల్లో ఒరిజినల్ పిటిషన్లను, తక్షణ పరిష్కారం అవసరమైన తీవ్రమైన వివాదాల కేసులపైనా నేరుగా విచారణ జరుపుతుంది. తొలుత భారత సమాఖ్య న్యాయస్థానంగా పార్లమెంట్ భవనంలోని ప్రిన్సెస్ చాంబర్లో ప్రారంభించారు. ప్రిన్సెస్ చాంబర్లో 1937 నుంచి 1950 వరకు నడిపారు. భారతదేశం సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించిన రెండు రోజుల తరువాత సర్వోన్నత న్యాయస్థానం 1950, జనవరి 28న ఏర్పాటైంది. సుప్రీంకోర్టుగా రూపాంతరం చెందిన తర్వాత 1958 వరకు పాత పార్లమెంట్ భవనంలోని ఓ భాగంలో నడిపారు.ఇండో–బ్రిటిష్ వాస్తు శైలిలో..⇒ సుప్రీంకోర్టు భవన ప్రధాన భాగం 17 ఎకరాల స్థలంలో ఇండో–బ్రిటిష్ వాస్తు శైలిలో నిర్మించారు. ప్రముఖ వాస్తుశిల్పి గణేశ్ భైకాజీ డియోలాలీకర్ దీని నమూనా రూపొందించారు. శ్రీధర్ కృష్ణ జోగ్లేకర్ భవన నిర్మాణానికి నేతృత్వం వహించారు. ప్రస్తుత భవనంలోకి 1958లో న్యాయస్థానం మారింది. త్రాసు ఆకారాన్ని ప్రతిబింబించేలా భవన నమూనా రూపొందించారు. భవన మధ్య భాగం త్రాసుకోలను ప్రతిబింబిస్తుంది. 1979లో తూర్పు, పశ్చిమ భాగాలను ఈ సముదాయానికి జోడించారు. మొత్తం 19 కోర్టు గదులున్నాయి. ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం పెద్దగా, మధ్య భాగంలో ఉంటుంది.న్యాయమూర్తుల సంఖ్య పెరిగిందిలా..సుప్రీంకోర్టును ఓ ప్రధాన న్యాయమూర్తి, ఏడుగురు న్యాయమూర్తులతో ఏర్పాటు చేసేందుకు 1950లో రాజ్యాంగం వీలు కల్పించింది. తదుపరి పరిస్థితుల మేరకు న్యాయమూర్తుల సంఖ్యను పెంచే అవకాశాన్ని పార్లమెంట్‌కు దఖలుపరిచింది. న్యాయమూర్తుల సంఖ్య (చీఫ్ జస్టిస్‌తో కలిపి) 1956లో 11కు, 1960లో 14కు, 1978లో 18కి, 1986లో 26కు, 2008లో 31కి, 2019లో 34 మందికి పెరిగింది. తొలుత సింగిల్ బెంచ్ విచారణలు ఉండగా. ఆ తర్వాత ఇద్దరు, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనాల విచారణలు ప్రారంభమయ్యాయి.అత్యంత కీలకమైన వివాదాల సమయంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం (రాజ్యాంగ ధర్మాసనం) కొలువుదీరుతుంది. అవసరం మేరకు ఏ చిన్న ధర్మాసనమైనా పెద్ద ధర్మాసనానికి కేసును బదిలీ చేయొచ్చు. న్యాయమూర్తులను నియమించేందుకు సర్వోన్నత న్యాయస్థానంతో రాష్ట్రపతి తప్పనిసరిగా సంప్రదింపులు జరపాలి. ఇవి ఎటువంటి రాజకీయ ప్రయోజనం లేకుండా జరుగుతాయి. న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లు. భారతీయుడై ఉండి ఐదేళ్ల పాటు హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవం ఉండాలి.అవీ ఇవీ...⇒ హైకోర్టు న్యాయమూర్తినిగాని, సుప్రీంకోర్టు లేదా హైకోర్టుల్లో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని గానీ సుప్రీంకోర్టులో తాత్కాలిక (ప్రత్యేక) న్యాయమూర్తిగా నియమించేందుకు అవకాశం ఉంది.⇒ అత్యున్నత న్యాయస్థానంలో అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తారు.⇒మతం, కులంతో సంబంధం లేకుండా న్యాయమూర్తుల నియామకం జరుగుతుంది.⇒ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం ముగియడానికి నెల రోజుల ముందే తర్వాతి సీజేను ప్రకటించాలి.⇒ప్రసుత్తం 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.⇒మాస్టర్ ఆఫ్ ది రోస్టర్‌గా ప్రధాన న్యాయమూర్తి వ్యవహరిస్తారు. అంటే.. ఏ బెంచ్ ఏ కేసు విచారణ చేపట్టాలనేది నిర్ణయించే అధికారం సీజేకు ఉంటుంది.⇒ ప్రస్తుతం 33 మంది న్యాయమూర్తులున్న సుప్రీంకోర్టులో మహిళా న్యాయమూర్తులు ఇద్దరు మాత్రమే. సుప్రీంకోర్టు ఏర్పాటు నుంచి దాదాపు 277 మంది న్యాయమూర్తులు నియమితులు కాగా, వీరిలో 11 మంది (దాదాపు 4 శాతం) మాత్రమే మహిళలు.⇒ కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (1973) కేసును ఎక్కువ మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం విచారించింది.సుప్రీం కోర్టులో తొలిసారి..⇒తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ జె. కానియా (1947, ఆగస్టు 14 – 1951, నవంబర్ 5)⇒ తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవీ (1989)⇒ తొలి దళిత న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ (2000)⇒ తొలి దళిత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ (2007)⇒ బార్ నుంచి తొలిసారి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన వ్యక్తి జస్టిస్ ఎస్ఎం సిక్రి (1971)⇒ బార్ నుంచి న్యాయమూర్తిగా పదోన్నతి పొంది సీజే అయిన వ్యక్తి జస్టిస్ యూయూ లలిత్ (2022, ఆగస్టు 27)అత్యధిక కాలం పనిచేసిన టాప్–5 సీజేలు1. జస్టిస్ వైవీ చంద్రచూడ్ఏడేళ్ల 139 రోజులు (1978, ఫిబ్రవరి 22 నుంచి 1985, జూలై 11 వరకు)2. జస్టిస్ భువనేశ్వర్ ప్రసాద్ సిన్హా నాలుగేళ్ల 122 రోజులు (1959, అక్టోబర్ 1 నుంచి 1964, జనవరి 31 వరకు)3. జస్టిస్ అజిత్ నాథ్ రేమూడేళ్ల 276 రోజులు (1973, ఏప్రిల్ 26 నుంచి 1977, జనవరి 28 వరకు)4. జస్టిస్ సుధీ రంజన్ దాస్మూడేళ్ల 241 రోజులు (1956, ఫిబ్రవరి 1 నుంచి 1959, సెప్టెంబర్ 30 వరకు) 5. జస్టిస్ కేజీ బాలకృష్ణన్మూడేళ్ల 117 రోజులు (2007, జనవరి 14 నుంచి 2010, మే 11 వరకు)ప్రధాన న్యాయమూర్తులుగా తెలుగువారు1) జస్టిస్ కోకా సుబ్బారావు తొమ్మిదో చీఫ్ జస్టిస్ (1966, జూన్ 30 నుంచి 1967, ఏప్రిల్ 11 వరకు (285 రోజులు) 2). జస్టిస్ ఎన్వీ రమణ48వ చీఫ్ జస్టిస్ (2021, ఏప్రిల్ 24 నుంచి 2022, ఆగస్టు 26 వరకు (సంవత్సరం 124 రోజులు)ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగు న్యాయమూర్తులుజస్టిస్ పమిడిఘంటం శ్రీ నరసింహహైదరాబాద్కు చెందిన ఈయన 1988లో న్యాయవిద్య పూర్తి చేసి న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2021, ఆగస్టు 31న నేరుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.జస్టిస్ సంజయ్‌కుమార్ హైదరాబాద్‌కు చెందిన ఈయన 1988లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2008లో ఏపీ హైకోర్టు అడిషనల్ న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. 2010లో శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019లో తెలంగాణ హైకోర్టుకు కేటాయించబడిన ఈయన 2019లో పంజాబ్– హరియాణా హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2021లో మణిపూర్ చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023, ఫిబ్రవరిలో సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వెళ్లారు.జస్టిస్ సరసి వెంకటనారాయణ భట్టిఆంధ్రప్రదేశ్కు చెందిన ఈయన 1987లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 2013లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టారు. విభజనలో భాగంగా ఏపీ హైకోర్టుకు వెళ్లారు. 2019లో కేరళకు బదిలీపై వెళ్లి 2023 జూన్‌లో చీఫ్‌గా పదోన్నతి పొందారు. 2023, జూలైలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.నేరుగా బార్ నుంచి సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతి పొందిన వారు..జస్టిస్ ఎస్ఎం సిక్రి (1971లో– 9.1 ఏళ్లు), జస్టిస్ ఎస్సీ రాయ్ (1971లో–3 నెలలు), జస్టిస్ కుల్దీప్సింగ్ (1988లో–8.1 ఏళ్లు), జస్టిస్ సంతోష్ హెగ్డే (1999లో–6.4 ఏళ్లు), జస్టిస్ రోహింటన్ నారిమన్ (2014లో–7.1ఏళ్లు), జస్టిస్ యూయూ లలిత్ (2014లో–8.2 ఏళ్లు), జస్టిస్ నాగేశ్వర్రావు (2016లో–6.1ఏళ్లు), జస్టిస్ ఇందు మల్హోత్రా (2018లో –2.8 ఏళ్లు), జస్టిస్ కేవీ విశ్వనాథన్ (2023లో–8 ఏళ్లు), జస్టిస్ పీఎస్ నరసింహ (2021లో–6.6 ఏళ్లు) (జస్టిస్ విశ్వనాథన్, జస్టిస్ నరసింహ ప్రస్తుతం న్యాయమూర్తులుగా కొనసాగుతున్నారు)తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కీలక తీర్పులు కొన్ని..1993 ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ప్రాథమిక హక్కుల్లో విద్యాహక్కు లేకపోతే జీవించే హక్కుకు, వ్యక్తి గౌరవానికి అర్థం లేదని.. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. లాభాపేక్ష లేకుండా, సమాజానికి ఉప యోగకరంగా విద్యాసంస్థల నిర్వహణ ఉండాలి. ఆర్టికల్ 19(1) ప్రకారం ప్రైవేట్ విద్యాసంస్థలను నెలకొల్పే హక్కు ఉన్నా..19(6) ప్రకారం నియంత్రించే హక్కు సర్కార్‌కు ఉంది.1997 సమతా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్దేశంలోని షెడ్యూల్డ్ ప్రాంతాల్లో నివసించే గిరిజన, ఆదివాసీల జీవనో పాధి హక్కులను రక్షిస్తూనే స్థిరమైన అభివృద్ధికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. అటవీ భూములకు భంగం కలగకుండా, పర్యావరణం దెబ్బతిన కుండా గిరిజనులు వ్యక్తిగతంగా లేదా సంఘంగా షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఖనిజాలను వెలికితీయొచ్చని పేర్కొంది. గిరిజనేతరులకు హక్కులు ఉండవని స్పష్టం చేసింది. సమతా అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్ వేసి పోరాటం చేయడంతో ఆ పేరుతో ఈ కేసు ప్రసిద్ధికెక్కింది.ఆ రెండు సందర్భాల్లోఅమలవుతున్న సంప్రదాయం ప్రకారం.. పదవీ విరమణ చేయబోయే ప్రధాన న్యాయమూర్తి సిఫారసు చేసిన న్యాయ మూర్తే తదుపరి ప్రధాన న్యాయ మూర్తి అవుతారు. దాదాపుగా సుప్రీం కోర్టులో రెండవ స్థానంలో ఉండే అత్యంత సీనియర్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తి పదవికి సూచిస్తారు. అయితే ఈ సంప్రదాయం రెండు సందర్భాల్లో అమలు కాలేదు. 1973లో జస్టిస్ ఎ.ఎన్.రే ముగ్గురు సీనియర్ న్యాయమూర్తులను అధిగమిస్తూ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అలాగే 1977లో జస్టిస్ హన్స్‌రాజ్ ఖన్నా కాకుండా ఆయనకు జూనియర్ అయిన జస్టిస్ మీర్జా హమీదుల్లా బేగ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.హైదరాబాద్‌లో బెంచ్ ఎప్పుడో..సుప్రీంకోర్టు ప్రారంభించినప్పుడు దేశ జనాభా 36 కోట్లు మాత్రమే. ఇప్పుడది 140 కోట్లు దాటింది. ఇన్ని కోట్ల మందికి న్యాయం జరగాలంటే పలు రాష్ట్రాల్లో సుప్రీంబెంచ్ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. సుప్రీంకోర్టును కాలాను గుణంగా విస్తరించవచ్చని అధికరణం 130లో బీఆర్ అంబేడ్కర్ క్లుప్తంగా పేర్కొ న్నారు. దక్షిణాన హైదరాబాద్, తూర్పున కోల్‌కతా, పశ్చిమాన ముంబైలో ప్రాంతీయ బెంచ్‌ల ఆవశ్యకత ఉందని 18వ లా కమిషన్ 2009లోనే కేంద్రానికి తెలిపింది. దీనిపై పార్లమెంట్లో 2023లో నాటి ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి ప్రైవేట్ బిల్లు పెట్టారు. ప్రాంతీయ బెంచ్‌ల ఏర్పాటుకు పార్లమెంట్లో సాధారణ మెజారిటీ సరిపోతుంది. సుప్రీంకోర్టు సీజే ప్రతిపా దిస్తే.. రాష్ట్రపతి ఆమోదించినా ఏర్పాటు చేయొచ్చు. తెలంగాణ సరిహద్దుగా ఏపీ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలు న్నాయి. ఏపీ సరిహద్దుగా తమిళనాడు, ఒడిశా ఉన్నాయి. హైదరాబాద్ బెంచ్ తో ఈ రాష్ట్రాలకు ‘న్యాయం’ అందుతుందనే అభిప్రాయం ఉంది.ధిక్కారాన్ని శిక్షించే అధికారం..ఏ న్యాయస్థానాన్నైనా ధిక్కరించిన వారిని శిక్షించే అధికారం రాజ్యాంగంలోని 129, 142 అధికరణల ద్వారా సుప్రీంకోర్టుకు ఉంది. మహారాష్ట్ర మాజీ మంత్రి స్వరూప్ సింగ్ నాయక్‌పై సుప్రీంకోర్టు ఈ అధికారంతో ఒక అసాధారణ చర్య తీసుకుంది. 2006, మే 12న కోర్టు ధిక్కార నేరంపై ఆయనకు నెలరోజులపాటు జైలు శిక్ష విధించింది. మంత్రి పదవిలో ఉన్న వ్యక్తిని జైలుకు పంపడం దేశంలో ఇదే తొలిసారి.స్వతంత్ర పటిష్టతతోనే విశ్వాసం..⇒ శాసన, కార్యనిర్వాహక విభాగాలకు సుప్రీంకోర్టు అంతరం పాటించాలి. ఈ వైఖరిని కొనసాగించపోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. దేశం పురోగతి సాధించదు. ప్రజల ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛను పరిరక్షించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటైంది. రాజ్యాంగాన్ని దృఢమైన శరీరంగా కాకుండా.. స్వపరిపాలన, శక్తి కలిగిన జీవిగా వ్యాఖ్యానించే ప్రయత్నం చేద్దాం. అత్యున్నత న్యాయస్థానానికి విస్తృతాధికారాలు కల్పించడంలో రాజ్యాంగం కీలకప్రాత పోషించింది. హైకోర్టులు బలంగా ఉంటేనే సుప్రీంకోర్టు భారం తగ్గుతుంది. మెరిట్‌పై మాత్రమే న్యాయమూర్తుల నియామకాలు జరగాలి. రాజకీయాలు దీన్ని ప్రభావితం చేయలేవని భావిస్తున్నా. స్వతంత్ర పటిష్టతే న్యాయవ్యవస్థకు ప్రజల్లో విశ్వాసాన్ని పొందేలా చేస్తుంది. న్యాయస్థానాలు ఎవరి సొత్తూ కాదు. సద్భావన, సానుభూతిని ఆచరిస్తాయి. – జస్టిస్ హరిలాల్ జె. కానియా (సుప్రీంకోర్టు ఏర్పాటు సందర్భంగా..)లిల్లీ థామస్ గీ యూనియన్ ఆఫ్ ఇండియా (2013)పిటిషన్: రెండేళ్లు.. అంతకంటే ఎక్కువ కఠిన కారాగార శిక్ష పడిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీకి అనర్హులని ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణ, సిట్టింగ్ చట్టసభల సభ్యులకు వర్తించదని పేర్కొనడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు.బెంచ్: జస్టిస్ ఆర్పీ సేథి, జస్టిస్ ఎస్.సగీర్ అహ్మ తీర్పు: ‘సిట్టింగ్ చట్టసభల సభ్యులకు ఇస్తున్న మినహాయింపు చెల్లదు’ఎస్ఆర్ బొమ్మై గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1994)పిటిషన్: కర్ణాటక (1988–89)లో తన మద్దతుకు సంబంధించి జనతాదళ్ శాసనసభాపక్షం ఆమోదించిన తీర్మాన కాపీని నాటి సీఎం బొమ్మై అప్పటి గవర్నర్ పి.వెంకటసుబ్బయ్యకు సమర్పించినా అసెంబ్లీలో బలనిరూపణకు అవకాశం ఇవ్వలేదు. తీర్మాన కాపీని తిరస్కరిస్తూ రాష్ట్రపతి పాలన విధించాలన్న గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బొమ్మై పిటిషన్ వేశారు. బెంచ్: జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ పీబీ సావంత్, జస్టిస్ కే రామస్వామి, జస్టిస్ ఎస్సీ అగర్వాల్, జస్టిస్ యోగేశ్వర్ దయాల్, జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ఆర్ పాండియన్, జస్టిస్ ఏఎం అహ్మదీతీర్పు: ‘సమాఖ్య వ్యవస్థ అనేది భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం. రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసే ముందు అసెంబ్లీలో బల నిరూపణకు గవర్నర్ అవకాశం కల్పించాలి. రాజ్యాంగంలోని 356 అధికరణం కింద గవర్నర్ సర్కార్‌ను డిస్మిస్ చేయడం నిరంకుశత్వం. ప్రభుత్వం తన మెజారిటీని నిరూపించుకునేందుకు అసలైన వేదిక శాసనసభే. గవర్నర్ సొంత అభిప్రాయానికి తావు లేదు’దేశవ్యాప్త సంచలన తీర్పులు..శంకరీ ప్రసాద్ సింగ్ గీ యూనియన్ ఆఫ్ ఇండియా గీ బిహార్ (1951)పిటిషన్: పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ శంకరీ ప్రసాద్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. బెంచ్: జస్టిస్ హీరాలాల్ జె. కనియా, జస్టిస్ బీకే ముఖర్జీ, జస్టిస్ చంద్రశేఖర అయ్యర్ తీర్పు: ‘ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉంది’. తొలిసారిగా న్యాయ సమీక్షాధికారం వినియోగం.స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ గీ బేలా బెనర్జీ (1953)పిటిషన్: భూ సేకరణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బెంగాల్ ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. బెంచ్: జస్టిస్ పతంజలి శాస్త్రి, జస్టిస్ మెహర్ చంద్ మహా జన్, జస్టిస్ గులాం హసన్, జస్టిస్ బి.జగన్నాథ దాస్తీర్పు: ‘ప్రజల ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు మార్కెట్ విలువతో కూడిన నష్టపరిహారాన్ని చెల్లించాల్సిందే’గోలక్‌నాథ్ గీ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1967)పిటిషన్: పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన భూ సంస్కరణలను సవాల్ చేస్తూ గోలక్‌నాథ్ పిటిషన్ వేశారు.బెంచ్: జస్టిస్ కె.సుబ్బారావు, జస్టిస్ కెఎన్ వాంచూ, జస్టిస్ ఎం. హిదాయతుల్లా, జస్టిస్ జేసీ షా, జస్టిస్ ఎస్ఎం సిక్రి, జస్టిస్ ఆర్ ఎస్ బచావత్, జస్టిస్ వి.రామస్వామి, జస్టిస్ జేఎం షెలత్, జస్టి స్ విశిష్ఠ భార్గవ, జస్టిస్ జీకే మిట్టర్, జస్టిస్ సీఏ వైద్యలింగం. తీర్పు: ‘‘ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంట్‌కు లేదు. రాజ్యాంగ సవరణలపైనా ఆర్టికల్ 13 ప్రకారం న్యాయసమీక్ష జరుగుతుంది. ఈ తీర్పు గత తీర్పులకు వర్తించదు. రాబోయే వాటికి వర్తిస్తుంది (దీన్ని ‘ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్’ అంటారు). రాజ్యాంగంలోని 1వ, 4వ, 17వ సవరణలు చెల్లుబాటు అవుతాయి. ప్రాథమిక హక్కులను పార్లమెంట్ సవరించాలంటే ‘ప్రత్యేక రాజ్యాంగ పరిషత్’ను ఏర్పాటు చేయాలి’’.కేశవానంద భారతి గీ స్టేట్ ఆఫ్ కేరళ (1973)పిటిషన్: ఐదు దశాబ్దాల క్రితం మఠం ఆస్తుల విషయంలో కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఎడనీర్ మఠాధిపతి కేశవానంద స్వామి పిటిషన్ వేశారు. బెంచ్: జస్టిస్ ఎస్ఎం సిక్రి అధ్యక్షతన జస్టిస్ ఏఎన్ గ్రోవర్, జస్టిస్ ఏఎన్ రే, జస్టిస్ డీజీ పాలేకర్, జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా, జస్టిస్ జేఎం షెలత్, జస్టిస్ కేకే మాథ్యూ, జస్టిస్ కేఎస్ హెగ్డే, జస్టిస్ ఎంహెచ్ బేగ్, జస్టిస్ పి.జగన్మోహన్రెడ్డి, జస్టిస్ ఎస్ఎన్ ద్వివేది, జస్టిస్ వైవీ చంద్రచూడ్ తీర్పు: ‘రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, మౌలిక స్వరూ పాన్ని మార్చలేం. సుప్రీంకోర్టు వాటి రక్షణ బాధ్యతను నిర్వర్తిస్తుంది. రాజ్యాంగ సవరణలు చేసే అధికారం పార్లమెంటుకు ఉందిగానీ, మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం లేదు. రాజ్యాంగ ఆత్మను మార్చడం సాధ్యంకాదు.’మేనకాగాంధీ గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1978) పిటిషన్: తన పాస్‌పోర్టును అధికారులు స్వాధీనం చేసుకోవడాన్ని సవాల్ చేస్తూ మేనకాగాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.బెంచ్: జస్టిస్ ఎం.హమీదుల్లా బేగ్, జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ ఎన్ఎల్ ఉంత్వాలియా, జస్టిస్ సయ్యద్ ముర్తజా ఫజలాలి, జస్టిస్ పీఎస్ కైలాసంతీర్పు: ‘ప్రజాప్రయోజనం అనేది బహుళ విస్తృతమైనది. పాస్‌పోర్టు చట్టం 1967 పేరుతో అధికారులు 14, 19, 21 అధికరణాలను ఉల్లంఘించారు. వ్యక్తుల ప్రాథమిక హక్కులను భంగపర్చలేరు. జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛను చట్టబద్ధమైన ప్రక్రియతో ఆటంకపర్చలేరు’మినర్వా మిల్స్ గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1980)పిటిషన్: ఇందిరాగాంధీ సర్కార్ చేసిన 42వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని మినర్వా మిల్స్ లిమిటెడ్ సవాల్ చేసింది.బెంచ్: జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ పీఎన్ భగవతి, జస్టిస్ ఏసీ గుప్తా, జస్టిస్ ఎన్ఎల్ ఉంట్వాలియా, జస్టిస్ పీఎస్ కైలాసంతీర్పు: రాజ్యాంగ సవరణ చట్టాలను న్యాయస్థానాల్లో సవాల్ చేయకూడదంటూ అధికరణం 368(4), రాజ్యాంగ సవరణ అధికారంపై పార్లమెంట్‌కు ఎలాంటి పరిమితులు ఉండొద్దంటూ అధికరణం 368(5)కు చేసిన సవరణ రద్దు చేస్తున్నాం. ఈ క్లాజ్లు రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధం.మహమ్మద్ అహ్మద్ ఖాన్ గీ షా బానో బేగం (1985)పిటిషన్: మహమ్మద్ అహ్మద్ ఖాన్ నుంచి భరణం కోరుతూ ట్రయల్ కోర్టును ఆశ్రయించిన 65 ఏళ్ల షాబానో బేగం. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973లోని సెక్షన్ 123 ప్రకారం తనకు, తన ఐదుగురు పిల్లలకు భరణం ఇవ్వాలని కోరారు. అహ్మద్ ఖాన్ అప్పీల్‌పై విచారణ. బెంచ్: జస్టిస్ వైవీ చంద్రచూడ్, జస్టిస్ మిశ్రా రంగానాథ్, జస్టిస్ డీఏ దేశాయ్, జస్టిస్ ఓ.చిన్నపరెడ్డి, జస్టిస్ ఈఎస్ వెంకటరామయ్యతీర్పు: ‘ముస్లిం మహిళలకు కూడా భరణం చెల్లించాల్సిందే. ఇద్దత్ గడువు (విడాకుల తర్వాత 3 నెలలు) ముగిసిన తర్వాత కూడా ముస్లిం భర్త.. భరణం చెల్లించాల్సిందే. భరణం చారిటీ కాదు.. హక్కు’ఇందిరా సహాని గీ యూనియన్ ఆఫ్ ఇండియా (1992)పిటిషన్: మండల కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్ కల్పించడాన్ని సవాల్ చేశారు.బెంచ్: జస్టిస్ ఎంహెచ్ కనియా, జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య, జస్టిస్ ఎస్.రణవేల్ పాండియన్, జస్టిస్ టీకే తొమ్మెన్, జస్టిస్ ఏఎం అహ్మదీ, జస్టిస్ కుల్దీప్ సింగ్, జస్టిస్ పీబీ సావంత్, జస్టిస్ ఆర్ఎం సహాయ్, జస్టిస్ బీపీ జీవన్రెడ్డితీర్పు: ‘ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాలకు (ఓబీసీ) 27 శాతం రిజర్వేషన్లు సమర్థనీయం’ -
నూతన సీజేఐ జస్టిస్ ఖన్నా ప్రమాణ స్వీకారం నేడు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నా రు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జస్టిస్ ఖన్నా ఆరు నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలం వచ్చే ఏడాది మే 13వ తేదీన ముగియనుంది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆదివారం పదవీ విరమణ చేశారు. ఆయన సిఫార్సు మేరకు నూతన సీజేఐగా జస్టిస్ ఖన్నాను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 24న నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న జస్టిస్ సంజీవ్ ఖన్నాకు న్యాయ వ్యవస్థతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన 1960 మే 14న జని్మంచారు. ఆయన తండ్రి జస్టిస్ దేవ్‌రాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ ఖన్నా ఢిల్లీలోని మోడ్రన్ స్కూల్లో చదువుకున్నారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ అనంతరం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన క్యాంపస్ లా సెంటర్లో న్యాయ విద్య అభ్యసించారు. 1983లో బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో అడ్వొకేట్‌గా చేరారు. తొలుత తీస్‌హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా కోర్టుల్లో, తర్వాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆదాయపు పన్ను విభాగంలో సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా పని చేశారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, అమికస్ క్యూరీగా ఎన్నో క్రిమినల్ కేసుల్లో సమర్థంగా వాదించి పేరు తెచ్చుకున్నారు. 2005 జూన్ 24న ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఏడాది తిరగకుండానే శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. హైకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన కంటే 32 మంది సీనియర్లున్నా వారిని కాదని జస్టిస్ ఖన్నాకు పదోన్నతి దక్కడం వివాదాస్పదంగా మారింది. అయినా ఆయన నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పలు కీలక తీర్పులు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా సభ్యుడిగా ఉన్నారు. మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని రద్దు చేసిన ధర్మాసనంలో ఆయన సభ్యుడు. ఆరి్టకల్ 370 రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేశారు. ఎల్రక్టానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వాడకాన్ని సమర్థించారు. బ్యాలెట్ పేపర్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేశారు. పెండింగ్ కేసుల పరిష్కారంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రత్యేక శ్రద్ధ చూపుతారని పేరుంది. అనవసరమైన వాయిదాలకు తావు లేకుండా వేగంగా న్యాయం చేకూర్చడంలో ఆయన దిట్ట అని న్యాయవాద వర్గాలు చెబుతాయి. ఇక ఇంట్లోనే మార్నింగ్ వాక్ తెల్లవారుజామునే ట్రాక్ ప్యాంట్, ఆఫ్ హ్యాండ్స్ టీ షర్ట్‌తో ఢిల్లీ వీధుల్లో వాకింగ్ చేయడం జస్టిస్ ఖన్నాకు చాలా ఇష్టం. అనేక సందర్భాల్లో ఆయన మార్నింగ్ వాక్ గురించి ప్రస్తావించారు. ‘‘ఉదయాన్నే వాకింగ్ చేస్తే రోజంతా మనసు ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఆలోచనలు వస్తాయి’’ అంటారాయన. సీజేఐగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఇకపై మార్నింగ్ వాక్కు ఆయన స్వస్తి పలకనున్నట్లు తెలిసింది. వాకింగ్‌తో పాటు జిమ్ వంటి కసరత్తులన్నీ ఇంట్లోనే చేయనున్నారు. -
దయాగుణం కలిగి ఉండండి
బెంగళూరు: గొప్ప తెలివితేటలే కాదు, తోటివారి పట్ల దయాగుణం కలిగి ఉండటం ఎంతో అవసరమని యువ పట్టభద్రులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆదివారం ఆయన బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో జరిగిన 32వ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. అకడెమిక్ బ్లాక్ విస్తరణ పనులకు అనంతరం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. ‘నిజమైన నాయకత్వ ప్రతిభ గలవారు తమ బలాలతోపాటు బలహీనతలను కూడా గుర్తించగలరు. తమకున్న బలంతో ఇతరులకు తోడ్పాటునిస్తూ, తమ బలహీనతలను అధిగమించేందుకు ఇతరుల సాయం తీసుకుంటారు’అని సీజేఐ వివరించారు. అడ్డంకులను అధిగమించే క్రమంలో కుటుంబంతోపాటు స్నేహితుల మద్దతు ఎంతో అవసరమని చెప్పారు. తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో సహనంతో మెలగాలన్నారు. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియ అనిశి్చతితో కూడి ఉంటుంది, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అనిశ్చితి కొనసాగేది కొంతకాలమే. మీరు ఎంచుకునే మార్గం ఏదైనప్పటికీ, భవిష్యత్తులో మీ సొంత నిర్ణయాలు సానుకూల పరిణామాలను కలిగిస్తాయి. ఈ క్రమంలో సహనం, వినయం అనే సద్గుణాలను ఎన్నడూ వీడరాదని కోరుతున్నాను’అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. ‘వేగంగా మారుతున్న ప్రపంచం, అవసరాలు, వాతావరణ మార్పులు, సోషల్ మీడియా వంటి కొత్త వినోద సాధనాలు, సామాజిక దురాచారాలను మార్చాలనే ఆత్రుత సంక్లిష్ట సమస్యలకు స్వల్పకాలిక ఫలితాలను కోరేలా చేస్తున్నాయి’అంటూ ఆయన ఇలాంటి సమయంలో సహనంతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉందని నొక్కిచెప్పారు. ‘హడావుడిగా తీసుకునే నిర్ణయాలకు ఎక్కువ శక్తిని వెచి్చంచాల్సి ఉంటుంది. ఇలాంటివి దీర్ఘకాలంలో మీ మానసిక ఆరోగ్యానికి చేటు కల్గిస్తాయి. దీర్ఘకాలంలో సానుకూల లక్ష్యాలను సాధించడం కూడా కష్టమవుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది’అని ఆయన యువ న్యాయవాదులను హెచ్చరించారు. న్యాయమూర్తిగా 24 ఏళ్లపాటు పనిచేశాక నాకో విషయం అర్థమయింది. మనదేశంలోని కోర్టుల్లో మనం మూడో వ్యక్తిగా కాకుండా మొదటి వ్యక్తిగా వాదిస్తాం ఎందుకంటే.. కోర్టుల్లో మనం క్లయింట్ల కోసం వాదించం. మనమే క్లయింట్లుగా వాదనలు సాగిస్తాం. వారికి ప్రతినిధులుగా మాత్రమే కాదు, వారి గొంతుక, వారి లాయర్‌గా, విజేతలుగా ఉంటాం’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. -
President Droupadi Murmu: మహిళా సాధికారతే దేశానికి బలం
న్యూఢిల్లీ: దేశంలో మహిళల సాధికారతే ఆ దేశానికి నిజమైన బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి సమయంలోనైనా మహిళలు అభద్రతకు లోనవకుండా, వారి పట్ల గౌరవం చూపేలా ప్రజలకు అవగాహన కలి్పంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మన దేశంలో మహిళల గౌరవాన్ని, గౌరవాన్ని కాపాడతామని, వారి పురోభివృద్ధికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఓ వార్తా సంస్థ సోమవారం నిర్వహించిన షిశక్తి సమ్మిట్–2024లో రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో మహిళల భద్రతకోసం కఠినమైన చట్టాలను తీసుకొచ్చామన్నారు. అయినప్పటికీ అభద్రతా భావం కొనసాగుతుండటం దురదృష్టకరమని, మహిళలను బలహీనులుగా భావించే సామాజిక సంకుచిత మనస్తత్వం, ఛాందసవాదానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరముందని ఆమె నొక్కి చెప్పారు. సమాజంలో ఎన్ని మార్పులొచి్చనా కొన్ని సామాజిక దురభిప్రాయాలు లోతుగా పాతుకుపోయాయని, ఇవి మహిళా సమానత్వానికి అవరోధాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘‘ఎక్కడ తప్పు చేశాం? మెరుగుపడటానికి మనం ఏమి చేయాలి?’’అని మహిళలు నిరంతరం ప్రశ్నించుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా శక్తి, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారని మహిళలను కొనియాడారు. పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలి: సీజేఐ చట్టం మాత్రమే న్యాయమైన వ్యవస్థను తయారు చేయలేదని, సమాజం మహిళల పట్ల తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం నొక్కి చెప్పారు. ప్రతిఒక్కరూ పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలని సూచించారు. మహిళల ప్రయోజనాలను పరిరక్షించడానికి విధానపరమైన, చట్టపరమైన నిబంధనలు అనేకం ఉన్నాయని, కానీ కఠినమైన చట్టాలే సమ సమాజాన్ని నిర్మించలేవన్నారు. మహిళలకు రాయితీలు ఇవ్వడం నుంచి స్వేచ్ఛగా, సమానంగా జీవించే హక్కు వారికుందనే విషయాన్ని గుర్తించే దిశగా మన మనస్తత్వాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల గురించి మాట్లాడటమంటే మొత్తం సమాజం మార్పు గురించి మాట్లాడినట్లని వ్యాఖ్యానించారు. తన జీవితంలోని కొన్ని గొప్ప పాఠాలను మహిళా సహోద్యోగుల నుంచే నేర్చుకున్నానని, మెరుగైన సమాజానికి మహిళల సమాన భాగస్వామ్యం ముఖ్యమని తాను నమ్ముతానని చెప్పారు. దేశం రాజ్యాంగాన్ని ఆమోదించక ముందే ఇండియన్ ఉమెన్స్ చార్టర్ ఆఫ్ లైఫ్‌ను స్త్రీవాది అయిన హంసా మెహతా రూపొందించారని సీజే గుర్తు చేశారు. -
సుమోటోగా స్వీకరించిన సుప్రీం
న్యూఢిల్లీ: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనను సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ నెల 20న ఈ కేసు విచారణ చేపట్టనుంది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం వెబ్సైట్లో వివరాలు పొందుపర్చారు. దేశాన్ని కుదిపేస్తున్న వైద్యురాలి హత్య కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఘటనపై 14న సీబీఐ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టు సీజేఐకు లేఖ రాశారు. డాక్టర్ హత్య ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. ప్రత్యేక చట్టం తీసుకురావాలి కోల్‌కతాలో వైద్యురాలి హత్యపై 70 మందికిపైగా పద్మ అవార్డుల గ్రహీతలైన డాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిపై హింసను అరికట్టడానికి, వారి తగిన భద్రత కల్పించడానికి, ఆసుపత్రుల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వైద్యులపై, సిబ్బందిపై దాడులకు పాల్పడేవారిని, మానసికంగా వేధించేవారిని శిక్షించడానికి ఆర్డినెన్స్ తేవాలని సూచించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వైద్యుల్లో భయాందోళనలు పెరిగిపోతున్నాయని, ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. బాధితురాలి కుటుంబానికి సంఘీభావం ప్రకటించారు. ఆ కుటుంబానికి న్యాయం చేకూర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోదీకి లేఖ రాసినవారిలో ఐసీఎంఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్, ఎయిమ్స్ రెసిడెంట్స్ డాక్టర్లు తదితరులు ఉన్నారు. -
స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎంతో విలువైనవి: సీజేఐ
న్యూఢిల్లీ: స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే స్వేచ్ఛ, స్వాతంత్య్రం విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. గురువారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జస్టిస్ చంద్రచూడ్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత చరిత్రను పరికిస్తే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంత విలువైనవో అవగతమవుతుందని పేర్కొన్నారు. ఇవి సులువుగా లభిస్తాయని అనుకోవద్దని సూచించారు. దేశంలో సాటి పౌరుల పట్ల మన బాధ్యతలను స్వాతంత్య్ర దినోత్సవం గుర్తుచేస్తుందని తెలిపారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం దోహదపడుతుందని అన్నారు. మన దేశంలో న్యాయవాదులు ఎన్నో త్యాగాలు చేశారని, వృత్తిని తృణప్రాయంగా వదిలేసి దేశ సేవ కోసం అంకితమయ్యారని కొనియాడారు. పౌరులుగా దేశం పట్ల, సాటి మనుషుల పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను అందరూ చక్కగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. -
Bangladesh Political Crisis: చీఫ్ జస్టిస్‌నూ సాగనంపారు
ఢాకా: బంగ్లాదేశ్‌లో విద్యార్థి సంఘాల హల్ చల్ కొనసాగుతూనే ఉంది. బలవంతపు రాజీనామాల పర్వానికి ఇంకా తెర పడలేదు. షేక్ హసీనా హయాంలో ఉన్నత స్థాయి పదవుల్లో నియమితులైన వారంతా తప్పుకోవాల్సిందేనని సంఘాలు అలి్టమేటం జారీ చేశాయి. దాంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఒబైదుల్ హసన్ (65), సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుర్ తౌఫ్ తాలుక్దార్ శనివారం రాజీనామా చేశారు. సుప్రీం న్యాయమూర్తులందరితో కూడిన సీజే అత్యవసరంగా ఫుల్ కోర్టును సమావేశపరుస్తున్నారన్న వార్తలతో ఉదయం నుంచే కలకలం రేగింది. మహమ్మద్ యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించి దేశ వ్యతిరేక శక్తులకు దన్నుగా నిలవడమే ఈ భేటీ ఆంతర్యమని విద్యార్థి సంఘాల నేతలతో పాటు పలువురు ప్రభుత్వ సలహాదారులు కూడా ఆరోపించారు. సీజే, ఇతర సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మాజీ ప్రధాని షేక్ హసీనా తాబేదార్లంటూ దుయ్యబట్టారు. దాంతో దేశవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు, నిరసనలు తీవ్రతరమయ్యాయి. సీజే, ఇతర న్యాయమూర్తులు గంటలోపు తప్పుకోవాలని విద్యార్థి సంఘాలు అలి్టమేటమిచ్చాయి. విద్యార్థులు, యువత సుప్రీంకోర్టును భారీ సంఖ్యలో ముట్టడించారు. దాంతో ఫుల్ కోర్టు భేటీని సీజే రద్దు చేశారు. మధ్యాహ్నం మీడియా ముందుకొచ్చారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో పాటు దేశవ్యాప్తంగా జడ్జిలందరి క్షేమం దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన రాజీనామా లేఖను వెంటనే అధ్యక్షునికి పంపినట్టు న్యాయ సలహాదారు వెల్లడించారు. ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా రాజీనామా చేశారు. జస్టిస్ మహ్మద్ అష్ఫకుల్ ఇస్లాంను తాత్కాలిక సీజేగా నియమించారు. తాలుక్దార్ రాజీనామాను ఇంకా ఆమోదించలేదని సర్కారు పేర్కొంది. ఢాకా వర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ మక్సూద్ కమాల్ తదితర ఉన్నతాధికారులెందరో రాజీనామా బాట పట్టారు. యువత, విద్యార్థుల ఆందోళనలతో హసీనా సోమవారం ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడటం తెలిసిందే. మైనారిటీలపై అవే దాడులు... బంగ్లావ్యాప్తంగా హిందువులు, ఇతర మైనారిటీలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. హసీనా తప్పుకున్న నాటినుంచి గత ఆరు రోజుల్లో కనీసం 205కు పైగా మతపరమైన దాడుల ఉదంతాలు చోటుచేసుకున్నట్టు హిందూ సంఘాలు వెల్లడించాయి. దాంతో మైనారిటీలంతా భయాందోళనల నడుమ గడుపుతున్నట్టు వివరించాయి. ఇందుకు సంబంధించిన వివరాలతో మధ్యంతర ప్రభుత్వాధినేత యూనుస్‌కు బహిరంగ లేఖ రాశాయి. తమకు భద్రత కలి్పంచాలని కోరాయి. గత ఐదారు రోజుల్లో దేశవ్యాప్తంగా 230 మంది హింసాకాండకు బలయ్యారు. దాంతో గత జూలై నుంచి చనిపోయిన వారి సంఖ్య 560 దాటింది. తమపై, తమ కుటుంబాలపై దా డులకు నిరసనగా వేలాది మంది హిందువులు శనివారం వరుసగా రెండో రోజు కూడా ఢాకాలో నిరసనలకు దిగారు. ‘హిందువుల ను కాపాడండి’ అంటూ నినాదాలు చేశారు.మైనారిటీలను కాపాడుకుందాం: యూనుస్ మైనారిటీలపై జరుగుతున్న దాడులను యూనుస్ తీవ్రంగా ఖండించారు. ‘‘మైనారిటీలు మన దేశ పౌరులు కారా? ఇది చాలా నీచమైన చర్య’’ అంటూ ఆగ్రహం వెలిబుచ్చారు. దేశంలోని హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులకు ఎలాంటి హానీ కలగకుండా కాపాడాల్సిందిగా యువతకు పిలుపునిచ్చారు. హసీ నా ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ముందుండి నడిపిన పాతికేళ్ల విద్యార్థి అబూ సయీద్‌ను దేశ ప్రజలంతా ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. జూలైలో తలెత్తిన ఈ ఆందోళనలకు తొలుత బలైన విద్యార్థుల్లో అబూ కూడా ఉన్నాడు. -
CJI D Y Chandrachud: బెయిల్ అర్జీలపై ‘సేఫ్ గేమ్’ వద్దు
బెంగళూరు: బెయిల్ అర్జీల విషయంలో ట్రయల్ కోర్టుల జడ్జీలు ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అనుమానాస్పదం అనే పేరు చెప్పి ప్రతి కేసులోనూ బెయిల్ తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో బెర్క్లే సెంటర్ 11వ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రయల్ కోర్టులు ప్రతి బెయిల్ పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ అనుమానాస్పదం పేరిట అర్జీలను ట్రయల్ కోర్టుల జడ్జీలు కొట్టేస్తున్నారు. ఇలాంటి సేఫ్‌గేమ్ పనికిరాదు. బెయిల్ అర్జీలపై ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. కేసు ప్రాముఖ్యతను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ పై కోర్టుకు వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్లంతా హైకోర్టు గడపతొక్కుతున్నారు. అక్కడా బెయిల్ దొరక్కపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అనవసరంగా అరెస్ట్ అయిన వాళ్లు కూడా సుప్రీంకోర్టు దాకా రావాల్సిన పరిస్థితి! ఇలాంటి కేసులన్నీ అంత దూరం రావడం సరికాదు’’ అన్నారు. వాతావరణ మార్పులు మహిళలు, చిన్నారులు, దివ్యాంగులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సీజేఐ అన్నారు. ‘‘వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన జీవితం కరువవుతోంది. ఆహార కొరతతో చిన్నారులు, ఇతర సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు. ఇబ్బందుల కొలిమిలో కాలిపోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. -
న్యాయవ్యవస్థను తక్కువ చేసేందుకు ప్రయత్నాలు
న్యూఢిల్లీ: పథకం ప్రకారం ఒత్తిళ్లు తేవడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం, బహిరంగ విమర్శల ద్వారా న్యాయ వ్యవస్థను చులకన చేసేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని రిటైర్డు జడ్జీల బృందం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు రాసిన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది. వ్యక్తిగత లబ్ధి, రాజకీయ స్వార్థం కోసం జరిగే ఇటువంటి ప్రయత్నాల కారణంగా న్యాయ వ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయే ప్రమాదముందని వారు పేర్కొన్నారు. అయితే, ఏ పరిణామాలు తమను ఈ లేఖ రాసేందుకు ప్రేరేపించాయనే విషయాన్ని అందులో వారు ప్రస్తావించలేదు. అవినీతి కేసుల్లో కొందరు ప్రతిపక్ష నేతల అరెస్టుపై అధికార బీజేపీ, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో ఈ లేఖ రాయడం గమనార్హం. ఆరోపణలెదుర్కొంటున్న నేతలు, వారి పార్టీలు కోర్టులను ఆశ్రయించడం, న్యాయవ్యవస్థ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను చూపుతూ బీజేపీ వారిపై ప్రత్యారోపణలు చేస్తుండటాన్ని లేఖలో వారు ప్రస్తావించారు. ‘ఇటువంటి చర్యలతో న్యాయవ్యవస్థ పవిత్రత దెబ్బతింటోంది. జడ్జీల నిష్పాక్షికత, సచ్ఛీలత అనే సూత్రాలకు ఇవి సవాల్‌గా మారాయి. ఇటువంటి అవాంఛిత ఒత్తిడుల నుంచి న్యాయవ్యవస్థను కాపాడు కోవాల్సిన అవసరం ఉంది’అని లేఖలో పేర్కొన్నారు. నిరాధార సిద్ధాంతాలను ప్రచారం చేయడం వంటి చర్యల ద్వారా న్యాయపరమైన ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొన్ని సమూహాలు అనుసరిస్తున్న వ్యూహం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. సుప్రీంకోర్టు నేతృత్వంలోని న్యాయవ్యవస్థను ఇటువంటి ఒత్తిళ్లకు వ్యతిరేకంగా బలోపేతం చేయాలని, న్యాయ వ్యవస్థ పవిత్రతను, స్వయంప్రతిపత్తిని పరిరక్షించాలని వారు కోరారు. న్యాయవ్యవస్థ ప్రజాస్వామ్యానికి మూలస్తంభంగా, అస్థిర రాజకీయ ప్రయోజనాలకు అతీతంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేఖ రాసిన వారిలో సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జీలు జస్టిస్ దీపక్ వర్మ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ దినేశ్ మహేశ్వరి, జస్టిస్ ఎంఆర్ షా సహా వివిధ హైకోర్టులకు చెందిన 21 మంది న్యాయమూర్తులు ఉన్నారు. -
గ్రామాలకూ న్యాయవిద్య: సీజేఐ
న్యూఢిల్లీ: న్యాయ విద్య కోర్సులను మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోనూ అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ఇంగ్లిష్ మాట్లాడని విద్యార్థులను సైతం న్యాయవిద్యలో భాగస్వాములను చేయాలన్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నేషనల్ లా యూనివర్సిటీలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సాంకేతికత మనకు సుదూరప్రాంత విద్యార్థులకు సైతం చేరువయ్యే సామర్థ్యాన్ని అందించింది. న్యాయ విద్య ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ, ఆంగ్లం మాట్లాడే పట్టణ ప్రాంత పిల్లలకు మాత్రమే ప్రస్తుతం ఇది అనుకూలంగా ఉంది’అని అన్నారు. ‘ఇటీవల అయిదు లా యూనివర్సిటీల్లో ఓ సర్వే చేపట్టాం. విభిన్న భాషా నేపథ్యాల నుంచి వచ్చే విద్యార్థులు కేవలం ఇంగ్లిష్‌లో మాట్లాడ లేకపోవడమే కారణంతో ఈ యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందలేకపోతున్నట్లు సర్వేలో తేలింది’అని సీజేఐ వెల్లడించారు. భాషా పరమైన అవరోధాలను అధిగమించేందుకు భాషిణి సాఫ్ట్వేర్ అందుబాటులో ఉందన్నారు. ఇందులో సుప్రీంకోర్టు 1950–2024 మధ్య వెలువరించిన 36 వేల పైచిలుకు తీర్పులను తర్జుమా చేసి ఇందులో పొందుపరిచి ఉన్నాయన్నారు. జిల్లా స్థాయి కోర్టుల్లో ఇంగ్లిష్ మాట్లాడలేని న్యాయవాదులకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని చెప్పారు. న్యాయవిద్యను హిందీలో బోధిస్తే ఉత్తమ విద్యార్థులు తయారవుతారని వర్సిటీ యంత్రాంగానికి ఆయన సూచించారు. -
CJI Chandrachud: నేటి యువత సామర్థ్యం అద్భుతం
వడోదర: అవకాశాలను అందిపుచ్చుకుంటూ, ఎన్నో సవాళ్లను పరిష్కరిస్తున్న నేటి యువత సామర్థ్యం చూసి తనకు ఆశ్చర్యం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని, ఓటమిని అభివృద్ధికి బాటగా మలుచుకోవాలని యువతకు ఆయన పిలుపునిచ్చారు. జీవితమంటే మారథాన్(సుదీర్ఘ 42 కిలోమీటర్ల పరుగు పందెం) వంటిదే తప్ప 100 మీటర్ల స్ప్రింట్(స్వల్ప దూరం పరుగు పందెం) కాదని ఆయన పేర్కొన్నారు. బరోడా లోని మహారాజా శాయాజీరావ్ యూనివర్సిటీ 72వ వార్షిక స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి ఆదివారం జస్టిస్ డీవై చంద్రచూడ్ వర్చువల్‌గా ప్రసంగించారు. ఈ ఏడాది యూనివర్సిటీ ప్రదానం చేసిన మొత్తం 346 బంగారు పతకాల్లో అత్యధికంగా 336 పతకాలు మహిళలు అందుకోవడాన్ని మన దేశం మారుతోందనడానికి నిజమైన గుర్తుగా ఆయన అభివరి్ణంచారు. ‘చరిత్రలో ఇది ఒక ప్రత్యేకమైన సమయం. మునుపెన్నడూ లేనంతగా టెక్నాలజీ నేడు ప్రజలను అనుసంధానం చేస్తోంది. అదే సమయంలో వారిలో భయాలు, ఆందోళనలకు సైతం కారణమవుతోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వృత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇవి సంప్రదాయ వృత్తులతో సంబంధం లేనివి. వీటిల్లో ఎవరికి వారు తమ ప్రయాణం సాగిస్తున్నారు. ఈ సమయంలో పట్టభద్రులుగా బయటికి వస్తున్న మీ అందరికీ ఇది ఉత్తేజకర సమ యం. అదే సమయంలో అనిశి్చతిని, గందరగోళాన్నీ సృష్టిస్తాయి’అని హెచ్చరించారు. -
సుప్రీంకోర్టులో రెండు మద్యం సీసాలు
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. ఓ కేసు విచారణ సందర్భంగా రెండు మద్యం సీసాలు కోర్టు గదిలో ప్రత్యక్షమయ్యాయి. ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనపై రెండు మద్యం కంపెనీల మధ్య నెలకొన్న వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. పిటిషనర్ల వాదించిన సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ ఈ మద్యం సీసాలను కోర్టులోకి తీసుకొచ్చారు. ధర్మాసనం ఎదుట ప్రదర్శించారు. వాటిని చూసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. బిగ్గరగా నవ్వారు. అసలు ఏం జరిగిందంటే.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన జేకే ఎంటర్ప్రైజెస్ అనే లిక్కర్ కంపెనీ ‘లండన్ ప్రైడ్’ పేరుతో మద్యం తయారు చేస్తోంది. ఈ పేరు తాము తయారుచేస్తున్న ‘బ్లెండర్స్ ప్రైడ్’ మద్యం పేరును పోలి ఉందని పెర్నాడ్ రికార్డ్స్ అనే మరో లిక్కర్ కంపెనీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా లండన్ ప్రైడ్ లిక్కర్ బాటిల్ ‘ఇంపీరియల్ బ్లూ’ లిక్కర్ బాటిల్ మాదిరిగానే ఉందని ఆరోపించింది. లండన్ ప్రైడ్ పేరుతో లిక్కర్ తయారు చేయకుండా దాన్ని నిషేధించాలంటూ పెట్టుకున్న పిటిషన్‌ను మధ్యప్రదేశ్ హైకోర్టు గతేడాది తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ పెర్నాడ్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున రోహత్గీ వాదనలు వినిపించారు. ధర్మాసనం అనుమతితో లండన్ ప్రైడ్, ఇంపీరియల్ బ్లూ లిక్కర్ సీసాలను తీసుకొచ్చి తన టేబుల్‌పై ఉంచారు. వాటిని చూసి సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ నవ్వు ఆపుకోలేకపోయారు. ‘వాటిని మీతోపాటే తీసుకొచ్చారా?’ అని రోహత్గీని ప్రశ్నించారు. రెండు సీసాల మధ్య సారూప్యతను స్వయంగా చూపించడానికే తీసుకొచ్చానని ఆయన బదులిచ్చారు. ఈ కేసులో ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన జరిగిందని చెప్పారు. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. గతంలో బాంబే హైకోర్టులో ఇలాంటి కేసులో తాను తీర్పు ఇచ్చానని గుర్తుచేసుకున్నారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వుపై స్టే విధిస్తున్నట్లు చెప్పారు. జేకే ఎంటర్‌ప్రైజెస్‌కు నోటీసు జారీ చేశారు. -
మహిళా జడ్జీకి లైంగిక వేధింపులు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా జడ్జి తనను జిల్లా జడ్జి లైంగికంగా వేధిస్తున్నారని, అనుమతిస్తే గౌరవప్రదంగా చనిపోతానంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాయడం కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని సీజేఐ సీరియస్‌గా తీసుకున్నారు. ఆయన ఉత్తర్వుల మేరకు..సత్వరమే నివేదిక ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు. జిల్లాలోని బారాబంకీలో నియామకం అయిన ఏడాదిన్నర నుంచి తనపై కొనసాగుతున్న వేధింపులను బాధిత జడ్జి రెండు పేజీల లేఖలో ప్రస్తావించారు. ‘నాకు ఏమాత్రం జీవించాలని లేదు. ఏడాదిన్నర కాలంలో నన్ను జీవచ్ఛవంలా మార్చారు. నిర్జీవమైన ఈ శరీరాన్ని ఇంకా మోయడం వల్ల ప్రయోజనం లేదు. నా జీవితంలో ఎలాంటి లక్ష్యం లేదు. దయచేసి నా జీవితాన్ని గౌరవప్రదంగా ముగించుకునేందుకు అనుమతించండి’అని అందులో తెలిపారు. ఈ లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బాధిత జడ్జి గతంలో పెట్టుకున్న పిటిషన్‌పై జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే, బాధితురాలిపై వేధింపుల అంశం అంతర్గత ఫిర్యాదుల కమిటీ పరిశీలనలో ఉన్నదని, కమిటీ తీర్మానం అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నదంటూ ఆ ఫిర్యాదును ధర్మాసనం కొట్టివేసింది. తాజాగా, బాధితురాలి లేఖపై సీజేఐ ఆదేశాల మేరకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అలహాబాద్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ నుంచి నివేదిక కోరారు. అంతర్గత ఫిర్యాదుల కమిటీ నివేదికపై ఏమేరకు చర్యలు తీసుకున్నారో తెలపాలంటూ ఆదేశించినట్లు సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
నేపథ్యం ఆధారంగా జడ్జీలపై ఆ ముద్రలు వేయొద్దు
న్యూఢిల్లీ: అడ్వొకేట్ లక్ష్మణచంద్ర విక్టోరియా గౌరీని మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సమరి్థంచారు. విక్టోరియా గౌరీ గతంలో మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్‌లో కేంద్ర ప్రభుత్వం తరపున వాదించారు. ఆమె బీజేపీ అభిమాని అనే పేరుంది. ఆమెను మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదముద్ర వేయడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఆమె మద్రాస్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నియామకం వివాదానికి దారితీసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టు బార్ సభ్యులు కొందరు జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు. కొలీజియం సిఫార్సును రద్దు చేయాలని కోరారు. విక్టోరియా గౌరీ గతంలో పలు సందర్భాల్లో క్రైస్తవులకు, ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇటీవల హార్వర్డ్ లా కాలేజీ సెంటర్ కార్యక్రమంలో మాట్లాడారు. మద్రాస్ హైకోర్టు బార్ సభ్యుల లేఖపై స్పందించారు. కొలీజియం అన్ని అంశాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాతే న్యాయమూర్తుల పేర్లను సిఫార్సు చేస్తుందని గుర్తుచేశారు. లాయర్లుగా ఉన్నప్పుడు వారి నేపథ్యాన్ని, వెలిబుచి్చన సొంత అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకొని జడ్జిలపై ఒక వర్గం వ్యతిరేకులుగా ముద్ర వేయడం సరైంది కాదని అన్నారు. గొప్ప తీర్పులు వెలువరించిన జస్టిస్ కృష్ణ అయ్యర్‌కు కూడా రాజకీయ నేపథ్యం ఉండేదని అన్నారు. -
విరాళాల వివరాలివ్వండి
న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలు విరాళాలు అందుకునేందుకు తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం చట్టబద్ధతను సవాల్‌చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పలు పిటిషన్లపై వాదనలు గురువారం ముగిశాయి. అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ‘ ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలు అందుకున్న విరాళాల సమగ్ర డేటాను సీల్డ్ కవర్లో మాకు రెండు వారాల్లోగా అందజేయండి’ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)ను ధర్మాసనం ఆదేశించింది. ధర్మాసనంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా సభ్యులుగా ఉన్నారు. బాండ్ల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ నాయకురాలు జయా ఠాకూర్, సీపీఐ(ఎం) నేత, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్)లు విడివిడిగా పిటిషన్ల వేయడం తెల్సిందే. బాండ్లను విక్రయించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను విరాళాల దాతల వివరాలు అడగబోము. కానీ ఎన్ని బాండ్లు విక్రయించారు, ఎంత మొత్తం పార్టీల ఖాతాల్లో జమ అయిందనే వివరాలు ఇవ్వండి’ అని ఈసీకి కోర్టు సూచించింది. ‘పరస్పర సహకార’ ధోరణికి ఈ బాండ్ పనిముట్టుగా మారొద్దు: అధికార పార్టీ నుంచి ప్రయోజనం పొందే వారు.. అధికార పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారీగా విరాళాల ద్వారా లబ్ది చేకూర్చడం, ఆతర్వాత అధికార పార్టీ నుంచి వారు అదే స్థాయిలో లబ్ధిపొందటం వంటి ధోరణి ఉండొద్దు. లబ్దిదారులు, అధికారి పార్టీ మధ్య నీకిది నాకది(క్విడ్ ప్రో కో) తరహా విధానానికి ఎలక్టోరల్ బాండ్ అనేది పనిముట్టుగా మారకూడదు’ అని వాదోపవాదనల సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘ దాత వివరాలు గ్రహీత పార్టీకి తెలుసు. తాను ఎవరికి విరాళమిచ్చేది ఇంకో పార్టీకి తెలియకూడదని దాత కోరుకుంటున్నాడు. విరాళాల బదిలీ వ్యవహారం దాతకు, ఆ రాజకీయ పార్టీకి ముందే తెలిసినప్పుడు ఈ వివరాలు సాధారణ పౌరుడికి మాత్రం తెలియాల్సిన పని లేదని కేంద్రం వాదించడంలో ఆంతర్యమేంటి?’ అని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. -
సోషల్ మీడియా దుర్వినియోగంపై... జర జాగ్రత్త: సీజేఐ
సాక్షి, చెన్నై: వేగంగా జనబాహుళ్యంలోకి చేరేందుకు అవకాశమున్న సామాజిక మాధ్యమాలు, అన్ని రంగాల్లోకి విస్తరించిన కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగాన్ని అరికట్టే సాంకేతికత అందరికీ అందుబాటులోకి రావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ పిలుపునిచ్చారు. ఆయన శనివారం ఐఐటీ మద్రాస్ 60వ స్నాతకోత్సవంలో పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. మానవీయ విలువలు, వ్యక్తిగత గోప్యతలకు అత్యున్నత ప్రాధాన్యత కలి్పంచాలని సీజేఐ తెలిపారు. ఆధునిక సాంకేతికతను సానుకూలంగా వాడుకునేందుకు వీలుగా రక్షణలు ఏర్పాటు చేసి నిరుపాయకరమైందిగా మార్చా లన్నారు. సాంకేతికతతో వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లుతుందని ప్రజలు భయపడక ముందే నమ్మకమైన వినియోగాన్ని సులభతరం చేయాలని తెలిపారు. సామాజిక మాధ్యమాల రాకతో సరిహద్దులు, వయస్సు, జాతీయత వంటి అవరోధాలు తొలగినప్పటికీ ఆన్లైన్లో వేధింపులు, ట్రోలింగ్ వంటివి కొత్తగా పుట్టుకొచ్చా యని సీజేఐ పేర్కొన్నారు. -
రిటైర్ అవ్వాల్సిన వ్యక్తిని కాను... కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతా
న్యూఢిల్లీ: ఇప్పుడే పదవీవిరమణ చేయాల్సిన వ్యక్తిని కాదని, మరో కొత్త ఇన్నింగ్స్ మొదలెడతా అని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ముఖేశ్‌కుమార్ రసిక్‌భాయ్(ఎంఆర్) షా సోమవారం వ్యాఖ్యానించారు. భారత సర్వోన్నత న్యాయస్థానంలో నాలుగో అత్యంత సీనియర్ న్యాయమూర్తి అయిన ఎంఆర్ షా సోమవారం పదవీవిరమణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అధ్యక్షతన సుప్రీంకోర్టు బార్ ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంఆర్ షా ప్రసంగించారు. ‘ రిటైర్ అవ్వాల్సిన వ్యక్తినికాదు. జీవితంలో కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడతా. కొత్త ఇన్నింగ్స్ ఆడేందుకు సరిపడ ధైర్య, స్థైర్య, ఆయుఃఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. రాజ్‌కపూర్ సినిమాలో పాటలోని పదాలు నాకు గుర్తొస్తున్నాయి. రేపు నేను ఆటలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ వినీలాకాశంలో సదా తారనై ఉంటా. పుట్టుక ఇక్కడే. మరణమూ ఇక్కడే’ అంటూ ఉద్వేగంతో మాట్లాడారు. ‘లాయర్లకు నాదో విన్నపం. అస్తమానం కేసులపై వాయిదాలు కోరకండి. వాదనలకు సిద్ధమై రండి. యువ లాయర్లకు నాదో సలహా బార్ రూమ్‌లోనో, క్యాంటీన్లో కాలక్షేపాలొద్దు. కోర్టు హాల్లో వాదనలు విని అనుభవం గడించండి’ అని అన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడారు. ‘ ధైర్యం, పోరాట స్ఫూర్తి చూస్తే ఆయనను టైగర్ షా అనాల్సిందే. తర్కంతో ఆలోచించే జ్ఞాని. టెక్నాలజీని త్వరగా ఆకళింపుచేసుకుంటారు. కొలీజియం నిర్ణయాలు తీసకునేటపుడు అద్భుతమైన సలహాలిచ్చారు. నేను అదనపు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఉన్నప్పుడు మొదలైన స్నేహం ఆనాటి నుంచీ కొనసాగింది. ఎవరి ఇళ్లల్లో వాళ్లం ఉన్నాసరే ఫోన్‌చేస్తే చాలు ఆయన ఎప్పుడూ కీలకమైన అంశాలపై చర్చిస్తుండేవారు. కోవిడ్ సంక్షోభకాలంలోనూ విధులు నిర్వర్తించాం’ అని అన్నారు. 2018 నవంబర్ రెండో తేదీన సుప్రీంకోర్టు జడ్జిగా షా నియమితులయ్యారు. సోమవారం ఆయన రిటైర్‌అవడంతో సుప్రీంకోర్టులో సీజేతో కలిపి మొత్తం జడ్జీల సంఖ్య 32కు పడిపోయింది. ఆదివారం మరో జడ్జి జస్టిస్ దినేశ్ మహేశ్వరి రిటైర్‌కావడం తెల్సిందే. రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టులో జడ్జీల గరిష్ట సంఖ్య 34. జస్టిస్ ఎంఆర్ షా న్యాయ ప్రస్థానం 1982లో గుజరాత్ హైకోర్టులో న్యాయవాదిగా మొదలైంది. 2004 మార్చిలో గుజరాత్ హైకోర్టులో అదనపు న్యాయవాదిగా నియమితులయ్యారు. ఆ తర్వాతి ఏడాది శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. 2018 ఆగస్ట్‌లో పట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. అదే ఏడాది నవంబర్‌లో పదోన్నతితో సుప్రీంకోర్టుకు న్యాయమూర్తిగా వచ్చారు. -
తెలంగాణ గవర్నర్ పెండింగ్ బిల్లుల కేసుపై సుప్రీంలో పూర్తయిన విచారణ
-
చావును ముందే ఊహించిన అతీక్ అహ్మద్? రెండు వారాల క్రితమే రహస్య లేఖ!
ప్రయాగ్‌రాజ్/న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్ తన చావును ముందే ఊహించినట్లున్నాడు. అందుకే రెండు వారాల ముందే ఓ లేఖ రాసి సీల్డ్ కవర్లో భద్రంగా దాచిపెట్టాడు. తాను చనిపోతే దాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి(సీజేఐ), యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు అందజేయాలని కోరాడు. ఈ విషయాన్ని అతీక్ న్యాయవాది విజయ్ మిశ్రా మంగళవారం వెల్లడించారు. ‘‘అందులో ఏముందో నాకు తెలియదు. అతీక్ కోరిక మేరకు సీల్డ్ కవర్లో సీజేఐకి, సీఎంకు పంపుతా’’ అని చెప్పారు. హత్యపై సుప్రీంకోర్టులో 24న విచారణ అతీక్ సోదరుల హత్యోదంతంపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ‘‘దీన్ని అత్యవసరంగా విచారణకు స్వీకరించండి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సారథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సాగేలా చూడండి. 2017 నుంచి యూపీలో జరిగిన 183 పోలీస్ ఎన్కౌంటర్లపై ఎంక్వైరీకి ఆదేశించండి’’ అని న్యాయవాది విశాల్ తివారీ మంగళవారం సుప్రీంకోర్టును కోరారు. దీనిపై ఏప్రిల్ 24న విచారణ జరుపుతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. యోగి పాలనలో ఆరేళ్లలో ఎన్కౌంటర్లలో 183 మంది నేరగాళ్లు హతమయ్యారని యూపీ స్పెషల్ డీజీపీ (శాంతిభద్రతలు) ప్రకటించడం తెల్సిందే. మరోవైపు, ప్రయాగ్‌రాజ్‌లో అతీక్ లాయర్నని చెప్పుకుంటున్న దయాశంకర్ మిశ్రా నివాసం వద్ద గుర్తుతెలియని వ్యక్తులు బాంబు విసిరారు. ఎవరికీ హాని జరగలేదు. ఇక ఏ మాఫియా బెదిరించలేదు: యోగి లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇకపై ఎలాంటి మాఫియా కూడా బెదిరింపులకు పాల్పడబోదని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అతీక్ సోదరుల హత్య నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం లక్నో, హర్దోయీ జిల్లాల్లో టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుపై కేంద్రంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా యోగి మాట్లాడారు. ‘‘గతంలో రాష్ట్రాన్ని మాఫియా, నేరగాళ్లు కష్టాలపాలు జేశారు. ఇప్పుడు వాళ్లే కష్టాలు పడుతున్నారు’’ అన్నారు. ‘సమాజ్‌వాదీ పార్టీ హయాంలో 2012–2017 మధ్య రాష్ట్రంలో 700 అల్లర్ల ఘటనలు చోటుచేసుకున్నాయి. అంతకుముందు బీఎస్పీ హయాంలో 364కు పైగా జరిగాయి. మా ప్రభుత్వం వచ్చాక 2017 నుంచి ఒక్క అల్లర్ల ఘటన లేదు. కర్ఫ్యూ లేదు. పరిశ్రమలు, వ్యాపారాలకు అనువైన వాతావరణం నెలకొంది. పెట్టుబడిదారుల భద్రత మా బాధ్యత’’ అని చెప్పారు. -
న్యాయ వృత్తిలో మహిళలు పెరగాలి: సీజేఐ
మదురై: న్యాయ వృత్తిని చేపడుతున్న పురుషులతో పోలిస్తే మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉందంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ మరోసారి తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. ‘‘నైపుణ్యమున్న మహిళా లాయర్లకు మన దేశం కొదవేమీ లేదు. అయినా పురుషులతో పోలిస్తే వారి సంఖ్య ఎప్పుడూ చాలా తక్కువే. మహిళలు ఇంటిపని తదితరాల కారణంగా వృత్తికి న్యాయం చేయలేరేమోనని లా చాంబర్లు భావిస్తుండటం వంటివి ఇందుకు కారణాలు’’ అన్నారు. ‘‘పిల్లల్ని కనడం, వారి సంరక్షణ తదితరాల వల్ల మహిళలకు వృత్తిపరంగా శిక్ష పడకూడదు. రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడానికి వారికి వ్యక్తిగతంగానే గాక వ్యవస్థాగతంగా కూడా చేయూతనివ్వాలి. కోర్టు సముదాయాల్లో క్రెష్ సదుపాయం దిశగా సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు తీసుకున్న చర్యల వంటివి దేశవ్యాప్తం కావాలి’’ అని అభిప్రాయపడ్డారు. శనివారం మదురైలో జిల్లా కోర్టుల సముదాయం తదితరాలకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయ వృత్తి మహిళలకు సమానావకాశాలు కల్పించడం లేదన్నారు. తమిళనాడులో న్యాయవాదులుగా నమోదు చేసుకుంటున్న పురుషుల సంఖ్య 50 వేల దాకా ఉంటే మహిళలు ఐదు వేలకు మించడం లేదంటూ ఉదాహరించారు. ‘‘ఇటీవల పరిస్థితి మారుతుండటం శుభసూచకం. జిల్లా స్థాయి న్యాయ నియామకాల్లో 50 శాతానికి పైగా మహిళలే చోటుచేసుకున్నారు. ఈ ధోరణి మరింత పెరగాలి’’ అని సీజేఐ ఆకాంక్షించారు. జూనియర్ లాయర్లకు నెలకు కేవలం రూ.5,000–12,000 వేతనం సరికాదన్నారు. ఘర్షణ లేదు: రిజిజు ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య ఉన్నది అభిప్రాయ భేదాలేనని తప్ప ఘర్షణ కాదని కేంద్ర న్యాయ మంత్రి కిరెణ్ రిజిజు చెప్పారు. ‘‘మా మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు గొడవలేమీ కాదు. అవి సంక్షోభం కాదు. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సూచిక. న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించేందుకు కేంద్రం ఎప్పుడూ సహకరిస్తుంది’’ అని చెప్పారు. చెన్నై, ముంబై, కోల్‌కతా నగరాల్లో సుప్రీంకోర్టు బెంచిలు ఏర్పాటు చేయాలని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ సీజేఐని కోరారు. -
భారతీయ భాషల్లోకి తీర్పుల కాపీలు: సీజేఐ
ముంబై: కోర్టు తీర్పులను అన్ని భారతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు కృత్రిమ మేథ(ఏఐ)ను వినియోగించుకుంటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమాచార అంతరాలను తొలగించడంలో సాంకేతికత చాలా కీలకమైందని ఆయన అన్నారు. ఇంగ్లిష్‌లో ఉండే కొన్ని చక్కని అంశాలు గ్రామీణ ప్రాంతాల లాయర్లు ఆకళింపు చేసుకోలేరు. లాయర్లందరికీ ఉచితంగా సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నదే నా ఉద్దేశం. ఇందుకోసం తీర్పుల ప్రతులను ఏఐను వినియోగించుకుని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయిస్తాం’అని చెప్పారు. శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. విచారణల లైవ్ స్ట్రీమింగ్ ద్వారా లా విద్యార్థులు, టీచర్లు కోర్టుల కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. తద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను గుర్తించగలుగుతారని చెప్పారు. -
Constitution Day: ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం కాదు
న్యూఢిల్లీ: రాజ్యాంగ ప్రజాస్వామ్య వ్యవస్థలో కొలీజియంతో సహా ఏ రాజ్యాంగమూ పరిపూర్ణం, లోపరహితం కాదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రస్తుత ఉన్న వ్యవస్థ నుంచే కనిపెట్టాలని తెలిపారు. రాజ్యాంగానికి లోబడి పని చేయాలన్నారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రాజ్యాంగ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. రాజ్యాంగాన్ని అమలుపర్చే న్యాయమూర్తులను విశ్వసనీయమైన సైనికులుగా అభివర్ణించారు. ప్రజాసేవ పట్ల అంకితభావం, అనురక్తి ఉన్నవాళ్లు న్యాయ వ్యవస్థలో చేరాలని సీజేఐ సూచించారు. న్యాయవాద వృత్తిలో వలస పాలన కాలం నాటి ఆచారాలను వదిలించుకోవాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడ్డారు. లాయర్లకు కఠినంగా అమల్లో ఉన్న డ్రెస్ కోడ్‌ను పునఃపరిశీలించాలన్నారు. మన జీవన విధానం, మన వాతావరణానికి తగ్గట్టుగా డ్రెస్ కోడ్ ఉండాలని సూచించారు. -
వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం: సీజేఐ
సాక్షి, న్యూఢిల్లీ: వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన పిటిషన్లకు ప్రాధాన్యం ఇస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వెల్లడించారు. పెండింగ్ కేసులను తగ్గించే క్రమంలో వివాహ వివాదాలకు చెందిన బదిలీ, బెయిలు పిటిషన్లు చెరో పది చొప్పున అన్ని కోర్టులు విచారించాలని ఫుల్ కోర్టు సమావేశంలో నిర్ణయించామని సీజేఐ తెలిపారు. ‘‘ఫుల్ కోర్టు సమావేశంలో ప్రతి బెంచ్ రోజూ కుటుంబ వ్యవహారాలకు చెందిన పది బదిలీ పిటిషన్లు చేపట్టాలని నిర్ణయించాం. ఆ తర్వాత రోజూ పది బెయిలు సంబంధిత కేసులు.. శీతాకాల సెలవులకు ముందు పరిష్కరించాలని నిర్ణయించాం. వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. వివాహ వివాదాలకు సంబంధించి ప్రస్తుతం 3 వేల కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. 13 కోర్టులు రోజూ పది బదిలీ కేసులు తీసుకుంటే రోజుకు 130 కేసులు చొప్పున వారానికి సుమారు 650 కేసులు పరిష్కరించొచ్చని సీజేఐ ఉదాహరించారు. శీతాకాల సెలవులకు ముందుగా ఈ బదిలీ కేసులు కొలిక్కి వస్తాయని తెలిపారు. అన్ని కోర్టులూ బెయిలు, బదిలీ పిటిషన్లు విచారించిన తర్వాత సాధారణ కేసులు విచారిస్తాయన్నారు. న్యాయమూర్తులు అర్ధరాత్రి వరకూ దస్త్రాలు చూడాల్సి వస్తుండడంతో వారిపై భారం తగ్గించాలని, అనుబంధ జాబితా తగ్గించాలని నిర్ణయించామని చెప్పారు. -
న్యాయవ్యవస్థలో పురుషాధిక్యత
న్యూఢిల్లీ: భారతీయ న్యాయవ్యవస్థలో తొలినుంచీ పురుషాధిక్యత వేళ్లూనుకొని ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో న్యాయ వృత్తి ఫ్యూడల్, పితృస్వామ్య తరహాతో, మహిళలను సముచిత వాటా కల్పించని స్వభావంతో కూడుకున్నదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. మహిళలు, సమాజంలోని అణగారిన వర్గాల వారు న్యాయపాలికలోకి మరింత పెద్ద సంఖ్యలో ప్రవేశించాలని అభిప్రాయపడ్డారు. అందుకు వీలుగా మొత్తం న్యాయ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిభాధారితంగా మార్చాల్సిన అవసరం చాలా ఉందంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థకు మానవ వనరులను అందించేందుకు మనకు ఒక నిర్ధారిత వ్యవస్థ ఉంది. దాని నిర్మాణం ఇప్పటికీ ఫ్యూడల్, పితృస్వామ్య పోకడలతోనే నిండి ఉందన్నది వాస్తవం. పురుషాధిక్యత మన న్యాయవ్యవస్థ స్వరూపంలోనే గూడుకట్టుకుపోయింది. సీనియర్ లాయర్లున్న ఏ చాంబర్లోకి వెళ్లినా అక్కడ మొత్తం పురుషులే కనిపిస్తారు. మార్పు అక్కడి నుంచే రావాలి. మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు ఆ చాంబర్లలో చోటు దక్కాలి. అప్పుడు గానీ న్యాయపాలికలో వారి సంఖ్య పెరగదు! మహిళా న్యాయవాదులు, న్యాయమూర్తుల ద్వారానే భవిష్యత్తులో మెరుగైన న్యాయవ్యవస్థను నిర్మించుకోగలం’’ అన్నారు. ‘‘నేడు న్యాయవ్యవస్థ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిలో మొట్టమొదటిది, అతి ముఖ్యమైనది సుప్రీంకోర్టుపై ప్రజలు పెట్టుకున్న ఆశలు. ఎందుకంటే ప్రతి సామాజిక, న్యాయపరమైన అంశమూ, రాజకీయ అంశమూ సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోకి వచ్చేవే’’ అని చెప్పారు. న్యాయమూర్తులకు ఆ నేర్పుండాలి చట్టం అణచివేతకు సాధనంగా కాక న్యాయమందించే సాధనంగా ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత పాలకులదే తప్ప న్యాయమూర్తులది కాదని స్పష్టం చేశారు. ‘‘మాపై ప్రజలకు ఎన్నో ఆశలు, అంచనాలున్నాయి. కానీ కోర్టుల పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ‘‘చట్టాలు, న్యాయం కొన్నిసార్లు ఒకే సరళరేఖపై వెళ్లకపోవచ్చు. కానీ చట్టాలున్నది అంతిమంగా న్యాయ వితరణకే. వాటిని అణచివేతకు దుర్వినియోగం చేయొద్దు’ అని సీజేఐ అన్నారు. ‘‘దీర్ఘకాలంలో న్యాయవ్యవస్థను నిలబెట్టేది దయా భావన, సహానుభూతితో ప్రజల వేదనను పోగొట్టగలిగిన సామర్థ్యం మాత్రమే. ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క’’ అన్నారు అమెరికాతో పోలికేల...? మన సుప్రీంకోర్టును అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల అత్యున్నత న్యాయస్థానాలతో పోల్చడం సరికాదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికా సుప్రీంకోర్టు ఏడాదంతా కలిపి మహా అయితే 180 పై చిలుకు కేసులు పరిష్కరిస్తుంది. బ్రిటన్‌లోనైతే 85 కేసులు దాటవు! కానీ మన సుప్రీంకోర్టులో ప్రతి న్యాయమూర్తీ సోమ, శుక్రవారాల్లో 75 నుంచి 80 కేసుల దాకా ఆలకిస్తారు. మంగళ, బుధ, గురువారాల్లో 30 నుంచి 40 దాకా కేసులు చూస్తారు. మన సుప్రీంకోర్టు విస్తృతి అంత సువిశాలమైనది! మేం పరిష్కరించే చాలా ముఖ్యమైన కేసుల్లో కొన్ని వార్తాపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో కన్పించకపోవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా పెన్షన్, భరణం వంటి చిన్నాచితకా కేసులనూ విచారించాల్సిందేనా అంటే, అవునన్నదే నా సమాధానం. ఎందుకంటే ప్రజలకు నిజమైన భరోసా కల్పించగలిగినప్పుడే న్యాయ వ్యవస్థ పరిఢవిల్లుతుంది’’ అన్నారు. మేము మానసికంగా పక్కా యూత్! న్యాయమూర్తులు నల్లకోటుతో పాత, రాచరిక కాలపు వస్త్రధారణలో కన్పించి బోరు కొట్టిస్తుంటారని సీజేఐ అన్నారు. ‘‘మా లుక్స్ జనాలకు బాగా విసుగు పుట్టిస్తాయన్నది నిజమే కావచ్చు. కానీ నిజానికి మానసికంగా మాత్రం మేమంతా నవ యవ్వనంతో ఉరకలేస్తుంటాం’’ అంటూ చమత్కరించారు! ..అందుకే ప్రత్యక్ష ప్రసారాలు రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాల్లో ఒక్కోసారి పారదర్శకత లేమి పెద్ద ప్రమాదంగా మారుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి అడ్డుకట్ట వేసేందుకే సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారానికి తెర తీసినట్టు చెప్పారు. తద్వారా న్యాయపాలికలో ఏం జరుగుతోందనే పౌరులు తెలుసుకునే అవకాశం దక్కడమే గాక న్యాయవ్యవస్థ మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ‘‘కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలు మేం చేపట్టిన ఓ నూతన ప్రయోగం. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో టెక్నాలజీ ఎంత పాత్ర పోషించగలదో దీని ద్వారా అర్థమైంది. న్యాయం కోసం సామాన్యుడు తొలుత ఆశ్రయించే జిల్లా కోర్టుల విచారణలనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలి’’ అన్నారు. ‘సోషల్’ సవాలుకు తగ్గట్టు అప్డేట్ కావాలి ‘‘కోర్టు గదిలో న్యాయమూర్తులు మాట్లాడే ప్రతి చిన్న మాటనూ రియల్ టైంలో రిపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా పెను సవాలుగా విసురుతోంది. న్యాయమూర్తుల పనితీరు నిత్యం మదింపుకు గురవుతోంది’’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘మనమిప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. కనుక న్యాయమూర్తులుగా మనల్ని మనం నిత్యం కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఈ కొత్త తరపు సవాళ్లను ఎదుర్కోవడంలో మన పాత్రపై పునరాలోచించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి’’ అని పిలుపునిచ్చారు. -
వాగ్దానాలు కొంతవరకు నెరవేర్చా
న్యూఢిల్లీ: ఇచ్చిన వాగ్దానాలను కొంత వరకు నెరవేర్చగలిగానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ చెప్పారు. ఎల్లవేళలా పనిచేసే ఒక రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయడం, కేసుల జాబితాను క్రమబద్ధం చేసే వ్యవస్థను నెలకొల్పడం, పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించడం వంటి విషయాల్లో తన వంతు కృషి చేశానని తెలిపారు. జస్టిస్ యు.యు.లలిత్ పదవీ కాలం మంగళవారం ముగియనుంది. ఆరోజు సెలవు దినం కాబట్టి సోమవారమే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే పెండింగ్ కేసులపై దృష్టి పెట్టానని, వేలాది కేసులు పరిష్కరించానని వివరించారు. ఈ వీడ్కోలు సభకు కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. నా ప్రయాణం సంతృప్తికరం సుప్రీంకోర్టులో 37 ఏళ్ల వృత్తి జీవితంలో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా ప్రతి దశను ఆనందించానని జస్టిస్ లలిత్ పేర్కొన్నారు. తన ప్రయాణం సంతృప్తికరంగా సాగిందన్నారు. జస్టిస్ డీవై చంద్రచూడ్ తండ్రి, 16వ సీజేఐ జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ముందు న్యాయవాదిగా పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఇదే కోర్టులో మొదలైన తన ప్రయాణం, ఇక్కడే ముగుస్తోందంటూ భావోద్వేగానికి గురయ్యారు. పలు రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేయడం తనకు మర్చిపోలేని జ్ఞాపకమని అన్నారు. కోర్టులో ఉన్న న్యాయమూర్తులందరినీ రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యులుగా చేశానని తెలిపారు. జస్టిస్ లలిత్ ఆగస్టు 27న సీజేఐగా బాధ్యతలు స్వీకరించారు. కేవలం 74 రోజులు పదవిలో కొనసాగారు. -
న్యాయవ్యవస్థను బలోపేతం చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో న్యాయవ్యవస్థ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలుపునిచ్చారు. సమ వాటాదారులైన కేంద్ర ప్రభుత్వం, బార్, బెంచ్‌లు ఈ మేరకు చొరవ తీసుకోవాలని సూచించారు. జీవితంలో ఎన్నో పోరాటాల తర్వాతే ఈ స్థాయికి చేరుకున్నానని, ఆ క్రమంలో అనేక కుట్రపూరిత పరిశీలనలకు గురయ్యాయని చెప్పారు. తన పదవీ విరమణ సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ శుక్రవారం ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడారు. బాల్యం నుంచి సీజేఐ వరకూ సుదీర్ఘ ప్రయాణంలో తనకు ఎదురైన అనుభవాలను వివరించారు. తల్లిదండ్రులను, విద్యనేర్పిన గురువులను స్మరించుకున్నారు. తన అనుభవాల్లో తీపి కంటే చేదు ఎక్కువగా ఉందన్నారు. అనేక ఆందోళనలు, పోరాటాల్లో భాగస్వామి అయిన తాను ఎమర్జెన్సీ సమయంలో బాధలు పడ్డానని తెలిపారు. ఆయా అనుభవాలే ప్రజలకు సేవ చేయాలన్న అభిరుచిని తనలో పెంపొందించాయని వ్యాఖ్యానించారు. మొదటి తరం న్యాయవాదిగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నానని, విజయాలకు షార్ట్‌కట్ ఉండదని తెలుసుకున్నానని వెల్లడించారు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని ఉద్ఘాటించారు. న్యాయ వ్యవస్థ ఉద్దేశం అదే.. గొప్ప న్యాయమూర్తినని తాను ఎప్పుడూ చెప్పుకోలేదని జస్టిస్ ఎన్వీ రమణ తెలిపారు. సామాన్యులకు న్యాయం చేయడమే న్యాయ వ్యవస్థ అంతిమ ఉద్దేశమని నమ్ముతానన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి బార్ కృషి చేయాలని కోరారు. న్యాయ వ్యవస్థపై సాధారణ ప్రజల్లో అవగాహన, విశ్వాసం పెంపొందించాలని అన్నారు. న్యాయవ్యవస్థను భారతీయీకరణ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. 16 నెలల తన పదవీ కాలంలో 11 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, 15 మంది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, 224 మంది హైకోర్టు న్యాయమూర్తుల నియామకం జరిగిందని గుర్తుచేశారు. న్యాయ వ్యవస్థ సమస్యలు ఎదుర్కొంటున్న విషయం వాస్తమేనని వివరించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్‌ను భీష్మ పితామహుడిగా జస్టిస్ ఎన్వీ రమణ అభివర్ణించారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఛైర్మన్ వికాస్ సింగ్‌లకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీజేఐ (నియమిత ) జస్టిస్ యు.యు.లలిత్ మాట్లాడారు. హైకోర్టుల్లో నియామకాలు, మౌలిక సదుపాయాల కోసం జస్టిస్ ఎన్వీ రమణ సాగించిన కృషిని అభినందించారు. నూతన సీజేఐగా తన పదవీ కాలంలో కేసుల జాబితా, అత్యవసర విషయాల ప్రస్తావన, రాజ్యాంగ ధర్మాసనాలపై దృష్టి సారిస్తానన్నారు. పెండింగ్ కేసులే అతిపెద్ద సవాల్ విచారించాల్సిన కేసుల జాబితా సమస్యలను పరిష్కరించడంపై తగిన శ్రద్ధ చూపలేకపోయినందుకు జస్టిస్ ఎన్వీ రమణ క్షమాపణలు కోరారు. దేశంలోని కోర్టులు పెండింగ్ కేసుల రూపంలో అతిపెద్ద సవాలును ఎదుర్కొంటున్నాయని చెప్పారు. న్యాయ వ్యవస్థను ఒక ఉత్తర్వు, ఒక తీర్పుతో నిర్వచించలేమని, అదేవిధంగా ఒక తీర్పుతో మార్చలేమని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కోర్టుల పనితీరును సంస్కరించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని చెప్పారు. శాశ్వత పరిష్కారాలకు ఆధునిక సాంకేతికతను, కృత్రిమ మే«ధను వాడుకోవాలన్నారు. జస్టిస్ ఎన్వీ రమణ వీడ్కోలు సందర్భంగా సీనియర్ లాయర్ దుష్యంత్ దవే భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. జస్టిస్ ఎన్వీ రమణను ప్రజాన్యాయమూర్తి అంటూ కొనియాడారు.. జస్టిస్ రమణ సేవలను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ప్రశంసించారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో 34 మంది జడ్జీలతో సాయంతో పూర్తిస్థాయిలో పనిచేశారని జస్టిస్ రమణను అభినందించారు. కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం సుప్రీంకోర్టు శుక్రవారం చరిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టిన విచారణలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. సుప్రీంకోర్టును ప్రజలకు చేరువ చేసే దిశగా జస్టిస్ ఎన్వీ రమణ తీసుకున్న చొరవను పలువురు అభినందించారు. అన్ని కోర్టుల నుంచి ప్రత్యక్ష ప్రసారాలు జరగాలని సీజేఐ ఆకాంక్షించారు. సుప్రీంకోర్టులో విచారణలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ఇదే మొదటిసారి. నేడు జస్టిస్ యు.యు.లలిత్ ప్రమాణం సుప్రీంకోర్టు 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవన్లో జస్టిస్ లలిత్‌తో ప్రమాణం చేయించనున్నారు. వీడ్కోలు సమావేశంలో అభివాదం చేస్తున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యు.యు. లలిత్ -
‘ఉచితాల’తో ఆర్థిక వ్యవస్థకు చేటు..అఖిలపక్షాన్ని పిలవలేదేం?
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల్లో నెగ్గడానికి రాజకీయ పార్టీలు ప్రజలకు ‘ఉచిత’ హామీలు ఇస్తుండడం తీవ్రమైన అంశమేనని, దీనిపై కచ్చితంగా చర్చ జరగాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. చర్చించడానికి అఖిలపక్ష సమావేశానికి ఎందుకు పిలుపునివ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆర్థిక వ్యవస్థకు చేటు కలిగించే ఉచితాల వ్యవహారాన్ని తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. ఉచితాలపై పార్టీలు ఏకాభిప్రాయానికి రాకపోతే ఇవి ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ఉచిత హామీలు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది అశ్వినీకుమార్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్æ రవికుమార్‌ల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున‡ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపించారు. ఉచితాలపై అధ్యయనం చేయడానికి నియమించే కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లోధాను చైర్మన్‌గా నియమించాలని కోరారు. ‘‘పదవీ విరమణ చేసిన, చేయబోతున్న వ్యక్తికి ఈ దేశంలో విలువ లేదు’’ అంటూ జస్టిస్ ఎన్వీ రమణ ప్రతిస్పందించారు. కమిటీకి ఒక రాజ్యాంగ సంస్థ నేతృత్వం వహించాలని భావిస్తున్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెప్పారు. ఈ సమస్యను అధ్యయనం చేయడానికి కేంద్రమే కమిటీని ఎందుకు నియమించకూడదని సీజేఐ ప్రశ్నించారు. ఎఫ్ఆర్బీఎం చట్టంతో మేలు ఎన్నికలకు ఆరు నెలల ముందు ఉచితాలు ప్రకటించడమే ప్రధానమైన సమస్య అని సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ అభిప్రాయపడ్డారు. ఆయన ‘సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్’ తరఫున వాదనలు వినిపించారు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం, పబ్లిక్ పాలసీని అపహాస్యం చేస్తూ ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారులైన కార్పొరేషన్లకు రుణాలు ఇవ్వడం, ఎన్నికలకు ముందు ఉచిత వాగ్దానాలు చేయడం.. ఈ మూడూ అక్రమమేనని చెప్పారు. పార్టీలు తమ మేనిఫెస్టోలో ఇచ్చే హామీలకు నిధుల మూలాలను సైతం వెల్లడించాలనే ప్రతిపాదనను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వ్యతిరేకించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులకు సంబంధించిన రికార్డులు ఎన్నికల ముందు రాజకీయ పార్టీలకు అందుబాటులో ఉండవని గుర్తుచేశారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ, బడ్జెట్ మేనేజ్మెంట్(ఎఫ్ఆర్బీఎం) చట్టాన్ని అమలు చేస్తే పరిష్కారం లభిస్తుందని, ఆర్థిక లోటు మూడు శాతానికి మించితే తదుపరి సంవత్సరం నుంచి కేటాయింపులు తగ్గించే అధికారం ఆర్థిక కమిషన్‌కు ఉందని తెలిపారు. పార్టీలు ప్రాథమిక హక్కుగా భావిస్తున్నాయి ఓటర్లను ప్రభావితం చేసేలా అధికారంలో లేని పార్టీలు హామీలు ఇస్తున్నాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వ్యాఖ్యానించారు. ‘‘అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు ఉండవని ఒకరు ప్రజల్ని మభ్యపెట్టొచ్చు. కానీ, అధికారంలోకి వస్తే చంద్రుడిని తీసుకొస్తానని హామీ ఇవ్వగలమా?’’ అని ప్రశ్నించారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ఉచితాల అంశంపై చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకని అఖిలపక్ష సమావేశానికి పిలుపునివ్వలేదని అన్నారు. ఉచితాలపై నియంత్రణను వ్యతిరేకిస్తూ రాజకీయ పార్టీలు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అఖిలపక్ష సమావేశంతో ఫలితం ఉండదని మెహతా బదులిచ్చారు. ఉచితాలు అందించడం తమ ప్రాథమిక హక్కుగా కొన్ని పార్టీలు భావిస్తున్నాయని, కేవలం ఉచితాల హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీలూ ఉన్నాయని ఉద్ఘాటించారు. నేను పోటీ చేస్తే.. ‘‘కమిటీకి ఎవరు నేతృత్వం వహిస్తారనేది పెద్ద సమస్య. రాజకీయ పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తూ ప్రజలకు హామీలు ఇస్తాయి. వ్యక్తులు కాదు. ఒకవేళ నేను పోటీ చేస్తే 10 ఓట్లు కూడా రావు. ఎందుకంటే వ్యక్తులకు అంత ప్రాధాన్యం ఉండదు. ఇదే మన ప్రజాస్వామ్యం. ఇప్పుడు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నారో వారు తర్వాత అధికారంలోకి రావచ్చు’ అని జస్టిస్ రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మనూ సింఘ్వీ వాదనలు వినిపిస్తూ... తుషార్ మెహతా వ్యాఖ్యలను వ్యతిరేకించారు. కేవలం ఉచితాల ద్వారా ఓటర్లను ఆకర్శిస్తారనడం సరైంది కాదన్నారు. బంగారు చైన్లు ఇస్తామంటూ హామీలు ఇవ్వడాన్ని సంక్షేమంగా ఎలా పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం తరఫు సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ ప్రశ్నించారు. ఉచితాల వల్ల తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని అంచనా వేయడానికి తగిన సమాచారం అందుబాటులో ఉందని వివరించారు. జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. ఉచిత హామీల విషయంలో దాఖలైన వ్యాజ్యాలపై ఇకపై జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తుందని తెలిపారు. సుబ్రహ్మణ్యం వర్సెస్ తమిళనాడు కేసును పునఃపరిశీలించడానికి ధర్మాసనం ఏర్పాటు చేయొచ్చని పేర్కొన్నారు. -
పార్లమెంటులో లాయర్లు తగ్గుతున్నారు
న్యూఢిల్లీ: ‘‘పార్లమెంటులో గతంలో న్యాయ కోవిదులు ఎక్కువగా ఉండేవారు. రాజ్యాంగ పరిషత్తులోనూ, స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కొలువుదీరిన పలు పార్లమెంటుల్లోనూ చాలామంది వాళ్లే. ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజ్యంగాన్ని, తిరుగులేని చట్టాలను మనకందించారు. కానీ కొంతకాలంగా పార్లమెంటులో న్యాయ కోవిదుల సంఖ్య బాగా తగ్గుతోంది. ఆ స్థానాన్ని ఇతరులు భర్తీ చేస్తున్నారు. ఇంతకు మించి మాట్లాడబోను’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ఉపరాష్ట్రపతిగా ఇటీవలే పదవీ బాధ్యతలు స్వీకరించిన జగ్దీప్ ధన్‌ఖడ్ గౌరవార్థం సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయవాదిగా అపార అనుభవం ధన్‌ఖడ్ సొంతమన్నారు. ‘‘గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన ఆయన ఎలాంటి రాజకీయ గాడ్‌ఫాదర్లూ లేకుండానే దేశ రెండో అత్యున్నత రాజ్యాంగ పదవిలో కొలువుదీరే స్థాయికి ఎదిగారు. ఇది మన ప్రజాస్వామ్య గొప్పదనానికి, ఉన్నత రాజ్యాంగ విలువలకు తార్కాణం’’ అన్నారు. ‘‘ప్రతి సభ్యుడినీ సంతృప్తి పరచడం తేలిక కాదు. కానీ ధన్‌ఖడ్ తన అపార అనుభవం సాయంతో రాజ్యసభ చైర్మన్‌గా రాణిస్తారని, అందరినీ కలుపుకునిపోతారని నాకు నమ్మకముంది. న్యాయవాదిగా అపార అనుభవం, గతంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖను నిర్వహించి ఉండటం ఆయనకెంతో ఉపయోగపడతాయి. అతి త్వరలో రిటైరవుతున్న నేను ధన్‌ఖడ్ పర్యవేక్షణలో రాజ్యసభలో జరిగే నాణ్యమైన చర్చలను టీవీలో చూస్తానని ఆశిస్తున్నా’’ అన్నారు. ధన్‌ఖడ్‌ను ఆయన సన్మానించారు. న్యాయ మంత్రి కిరెన్ రిజిజు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సుప్రీంబార్ అసోసియేసన్ అధ్యక్షుడు వికాస్‌సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతకాలంగా పార్లమెంటులో చర్చల కంటే అంతరాయాలే ఎక్కువయ్యాయని రిజిజు ఆవేదన వెలిబుచ్చారు. ‘‘చర్చల నాణ్యత బాగా పడిపోయింది. ఇటీవలి దాకా లోక్‌సభతో పోలిస్తే రాజ్యసభ కాస్త ప్రశాంతంగా ఉండేది. ఈ మధ్య అక్కడా గలాభా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో సభను అదుపు చేసేందుకు ధన్‌ఖడ్ అనుభవం పనికొస్తుంది’’ అని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేసిన ఓ లాయర్ ఉపరాష్ట్రపతి కావడం ఇదే తొలిసారని తుషార్ మెహతా అన్నారు. ధన్‌ఖడ్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ -
మీ వారసున్ని సిఫార్సు చేయండి.. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పదవీకాలం పూర్తవనున్న నేపథ్యంలో తదుపరి సీజేఐని సిఫార్సు చేయాల్సిందిగా కేంద్రం ఆయన్ను కోరింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించాలని కోరుతూ కేంద్ర న్యాయ శాఖ బుధవారం జస్టిస్ రమణకు లేఖ రాసింది. ఆయన పదవీకాలం ఆగస్టు 26తో ముగియనుంది. పదవీ విరమణ చేసే సీజేఐ తన వారసునిగా సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి పేరును సూచించడం సంప్రదాయంగా వస్తోంది. సుప్రీంకోర్టు సీనియారిటీ లిస్టులో జస్టిస్ రమణ తర్వాత న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేశ్ లలిత్ ఉన్నారు. అయితే ఆయన పదవీకాలం నవంబర్ 8 వరకే ఉంది. సీజేఐగా ఎంపికైతే రెండున్నర నెలలే పదవిలో కొనసాగుతారు. -
రాజకీయాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు
-
NV Ramana: చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు
రాంచీ: భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాంచీలో(జార్ఖండ్) శనివారం జరిగిన ఒక ఉపన్యాస కార్యక్రమంలో ఆయన మీడియాలో డిబేట్ల పేరిట జరుగుతున్న ‘అతి’ విచారణలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే.. న్యాయవ్యవస్థ పాత్ర, న్యాయమూర్తుల ముందున్న సవాళ్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా తమ టీవీ డిబెట్లతో కంగారు కోర్టులుగా(సరైన ఆధారాలు.. వాదప్రతివాదనలు లేని అనధికార న్యాయస్థానాలు) వ్యవహరిస్తున్నాయని, సోషల్ మీడియా కూడా అదే రీతిలో వ్యవహరిస్తూ దేశాన్ని వెనక్కి తీసుకెళ్తున్నాయని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వాళ్ల ప్రవర్తన పక్షపాతం, అవగాహనలేమితో కూడిన సమాచారం, ప్రత్యేకించి ఒక ఎజెండా-ఆధారితంగా ఉంటోంది ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా.. ► సోషల్ మీడియాలో జడ్జిలకు వ్యతిరేకంగా క్యాంపెయిన్లు చేస్తున్నారు. జడ్జిలు వాటికి అత్యవసరంగా స్పందించాల్సిన అవసరం లేదు. దయచేసి దీనిని బలహీనతనో లేదంటే నిస్సహాయత అని పొరబడకండి అని న్యాయమూర్తులకు జస్టిస్ రమణ సూచించారు. ► ఈరోజుల్లో మీడియా టూల్స్ అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటున్నాయి. కానీ, వాస్తవం ఏదో, ఏది మంచో, ఏది సరైందో నిర్ధారించలేకపోతున్నాయి. మీడియా విచారణలు.. కేసుల్లో మార్గనిర్దేశం చేయలేవు. అలాగే మీడియా ఛానెళ్లు ‘కంగారు కోర్టు’లను నడిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో.. కొన్నిసార్లు అనుభవజ్ఞులైన న్యాయమూర్తులు కూడా సమస్యలపై నిర్ణయం తీసుకోవడం కష్టంగా ఉంటోంది. ► న్యాయం పంపిణీకి సంబంధించిన సమస్యలపై.. అవగాహన లేని, అజెండాతో కూడిన నడిచే చర్చలు ప్రజాస్వామ్య ఆరోగ్యానికి హానికరం. ► మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న పక్షపాత అభిప్రాయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్నాయి. వ్యవస్థకు హాని కలిగిస్తున్నాయి. ఈ ప్రక్రియలో.. న్యాయ పంపిణీ ప్రతికూలంగా ప్రభావితమవుతుంది. ► మీ బాధ్యతను(మీడియాను ఉద్దేశించి..) అతిక్రమించడం ద్వారా మీరు మన ప్రజాస్వామ్యాన్ని రెండడుగులు వెనక్కి తీసుకెళ్తున్నారు ► ప్రింట్ మీడియాకు ఇప్పటికీ కొంత స్థాయిలో జవాబుదారీతనం పని చేస్తోంది. ► ఎలక్ట్రానిక్ మీడియాకు మాత్రం జవాబుదారీతనం శూన్యంగా ఉంటోంది. ఇక సోషల్ మీడియా చాలా అధ్వాన్నంగా ఉంటోంది. ► దీనికి పరిష్కారం.. మీడియా స్వీయ నియంత్రణ పాటించడమే. ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని నేను కోరుతున్నా. ప్రజలకు అవగాహన కల్పించడానికి, దేశాన్ని ఉత్తేజపరిచేందుకు ఎలక్ట్రానిక్ మీడియా తమ గొంతుకను ఉపయోగించాలి ► జడ్జిల మీద దాడులు పెరిగిపోతున్నాయి. ప్రజాప్రతి నిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, పోలీసు అధికారులు.. ఇలా రిటైర్మెంట్ తర్వాత సున్నిత అంశాలతో ముడిపడిన వ్యక్తులకు రక్షణ ఇస్తోంది మన దేశం. కానీ, న్యాయమూర్తుల విషయంలోనే అది జరగడం లేదు. ► కొన్ని దశాబ్దాల క్రితం వరకు.. న్యాయమూర్తి అంటే కోర్టుల ముందు పార్టీల మధ్య వివాదాల పరిష్కారానికి మాత్రమే పరిమితం అనే అంచనాలు జనాలకు ఉండేవి. ఇప్పుడు, సమాజంలో ఆలోచించదగిన ప్రతి సమస్య న్యాయవ్యవస్థ ద్వారా పరిష్కరించబడుతుందని భావిస్తున్నారు. ► న్యాయం అమలు చేయడానికి, న్యాయమూర్తులు సామాజిక వాస్తవాల గురించి తెలుసుకోవాలి. సామాజిక ఏకాంతంగా పరిమితం కాకూడదు. నిష్పాక్షికత మరియు స్వతంత్రత అనేది మానసిక స్థితి అని మనం అర్థం చేసుకోవాలి. ► న్యాయమూర్తులంటే.. పది గంటలకు వచ్చి సాయంత్రం నాలుగు గంటలకు వెళ్లిపోతారు. సెలవుల్ని ఆస్వాదిస్తారు.. వాళ్లు వాళ్ల వాళ్ల జీవితాల్లో కంఫర్ట్‌గా ఉన్నారు అనేది ఒక దురభిప్రాయం మాత్రమే. అదంతా వాస్తవం కాదు. ► ఈరోజుల్లో.. న్యాయం అందించడం అంత తేలికైన బాధ్యత కాదు. ఇది రోజురోజుకూ సవాలుగా మారుతోంది. కొన్నిసార్లు, మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో న్యాయమూర్తులకు వ్యతిరేకంగా ఏకీకృత ప్రచారాలు కూడా జరుగుతాయి ► సామాజిక వాస్తవాల విషయంలో న్యాయమూర్తులు.. చూసిచూడనట్లుగా, గుడ్డిగా వ్యవహరించకూడదు. వ్యవస్థను కాపాడటానికి నొక్కి చెప్పడానికి సిద్ధంగా ఉండాలి. ► ఈ క్రమంలో.. రాజకీయాలపైనా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో చేరాలనుకున్నా. విధి వేరే దారి చూపించింది. న్యాయమూర్తి అయినందుకు బాధపడడం లేదని సీజే ఎన్వీ రమణ పేర్కొన్నారు. -
జైళ్లలోని 80% మంది విచారణ ఖైదీలే
జైపూర్: దేశంలోని జైళ్లలో పెద్ద సంఖ్యలో విచారణ ఖైదీలు ఉండటం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్న ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చర్యలు అవసరమని పిలుపునిచ్చారు. ఎలాంటి విచారణ లేకుండా దీర్ఘకాలంపాటు వ్యక్తుల నిర్బంధానికి దారితీస్తున్న విధానాలను ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని 6.10 లక్షల మంది ఖైదీల్లో సుమారు 80% మంది అండర్ ట్రయల్ ఖైదీలేనన్నారు. శనివారం సీజేఐ జైపూర్‌లో ఆల్ ఇండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ 18వ వార్షిక సదస్సులో పసంగించారు. న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ పాల్గొన్నారు. కారాగారాలను బ్లాక్ బాక్సులుగా పేర్కొన్న సీజేఐ.. ముఖ్యంగా అణగారిన వర్గాలకు చెందిన ఖైదీల్లో జైలు జీవితం ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పారు. విచారణ ఖైదీలను ముందుగా విడుదల చేయడమనే లక్ష్యానికి పరిమితం కారాదని పేర్కొన్నారు. ‘‘నేర న్యాయ వ్యవస్థలో, ప్రక్రియే ఒక శిక్షగా మారింది. అడ్డుగోలు అరెస్టులు మొదలు బెయిల్ పొందడం వరకు ఎదురయ్యే అవరోధాలు, విచారణ ఖైదీలను దీర్ఘకాలం పాటు నిర్బంధించే ప్రక్రియపై తక్షణం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ పరిపాలనా సామర్థ్యాన్ని పెంచడానికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అవసరం’’అని ఆయన అన్నారు. దీంతోపాటు పోలీసు వ్యవస్థ ఆధునీకరణ, పోలీసులకు శిక్షణ, సున్నితత్వం పెంచడం వంటి వాటి ద్వారా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను మెరుగుపరచవచ్చని అన్నారు. రాజకీయ వైరుధ్యం శత్రుత్వంగా మారడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి సంకేతం కాదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘వివరణాత్మక చర్చలు, పరిశీలనలు లేకుండా చట్టాలు ఆమోదం పొందుతున్నాయి’’అని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ లాయర్లకే ఎక్కువ గౌరవం: రిజిజు హైకోర్టులు, దిగువ కోర్టుల్లో కార్యకలాపాలు ప్రాంతీయ భాషల్లోనే జరిపేలా ప్రోత్సహించాలని కిరణ్ రిజిజు చెప్పారు. ఏ ప్రాంతీయ భాష కంటే ఇంగ్లిష్ ఎక్కువ కాదన్నారు. ఇంగ్లిష్ ధారాళంగా మాట్లాడగలిగినంత మాత్రాన లాయర్లు ఎక్కువ గౌరవం, ఎక్కువ ఫీజు పొందాలన్న విధానం సరికాదని చెప్పారు. కొందరు లాయర్లు ఒక్కో కేసుకు రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేస్తున్నారని, ఇంత ఫీజును సామాన్యులు భరించలేరని చెప్పారు. సామాన్యుడిని కోర్టుల నుంచి దూరం చేసే కారణం ఎలాంటిదైనా ఆందోళన కలిగించే అంశమేనన్నారు. -
‘పిల్’లతో కాలహరణం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజన వ్యాజ్యా (పిల్)ల వల్ల వాస్తవ కేసుల నుంచి కోర్టు దృష్టి మళ్లుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సోమవారం కర్ణాటకలోని కర్వార్ పోర్టు విస్తరణకు పర్యావరణ అనుమతులపై పెండింగ్‌లో ఉన్న కేసులో జస్టిస్ ఎన్వీ రమణ ఈ మేరకు వ్యాఖ్యానించారు. పిల్స్ కోర్టు సమయం తీసుకోకుంటే వాస్తవ కేసులకు సమయం కేటాయించొచ్చని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్లు ఈ ఏడాది నిర్వహించే 10, 12 తరగతుల పరీక్షలను భౌతికంగా నిర్వహించరాదంటూ హక్కుల కార్యకర్త శ్రీవాస్తవ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. జస్టిస్ ఏఎం ఖని్వల్కర్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. -
సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీ రమణ
-
సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంటక రమణ నేడు(శనివారం) బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్ బాబ్డే పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 1957 ఆగష్టు 27 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించిన ఎన్వీ రమణ.. 2000 సంవత్సరంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17 వ తేదీన ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చారు. జూన్ 27, 2000లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ అత్యున్నత న్యాయ పీఠం అధిష్టించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు. గతంలో 1966- 67లో జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐ పనిచేశారు. 54 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వ్యక్తి అత్యున్నత న్యాయం పీఠం ఎక్కారు. వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు అంటే 16 నెలల పాటు జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్‌గా కొనసాగనున్నారు. ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపడుతున్నారు. కరోనా నియంత్రణ అంశంపై సుమోటో కేసును సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ విచారణ జరుపబోతున్నారు. చదవండి: 48వ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ -
భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళను చూడగలమా?
న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తిగా ఒక మహిళ నియామకమయ్యే రోజు ఎంతో దూరం లేదంటూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే చేసిన వ్యాఖ్యలతో కోర్టుల్లో మహిళా న్యాయమూర్తుల ప్రాతినిధ్యంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో 29 మంది న్యాయమూర్తులుంటే వారిలో కేవలం ఒక్కరంటే ఒక్కరే మహిళా న్యాయమూర్తి. ఆమే జస్టిస్ ఇందిరా బెనర్జీ. మూడేళ్ల క్రితం 2018లో జస్టిస్ ఇందిరా బెనర్జీ సుప్రీంలో అడుగు పెట్టినప్పుడు ఒకే సమయంలో ముగ్గురు మహిళా న్యాయమూర్తుల్ని అత్యున్నత న్యాయస్థానంలో చూడగలిగాము. అప్పటికే జస్టిస్ ఆర్.భానుమతి, జస్టిస్ ఇందూ మల్హోత్రాలు న్యాయమూర్తులుగా ఉన్నారు. దీంతో వీరి ముగ్గురిని త్రిమూర్తులుగా అభివర్ణించేవారు. అప్పట్లో న్యాయవ్యవస్థలో మహిళా వివక్ష నశిస్తుందనే ఆశలు చిగురించాయి.. ఆ తర్వాత భానుమతి, ఇందూ మల్హోత్రాలు పదవీ విరమణ చేయడంతో మళ్లీ జస్టిస్ ఇందిర ఒక్కరే మిగిలారు. జస్టిస్ ఇందిరకు సీజేఐగా ఛాన్స్ వస్తుందా భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) ఈ నెల 24 ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ ఎన్వీ రమణ పదవీ కాలం 26, ఆగస్టు, 2022తో ముగియనుంది. సీనియార్టీ ప్రకారం చూస్తే రమణ తర్వాత పదో స్థానంలో ఇందిర ఉన్నారు. ఆమె సెప్టెంబర్ 23, 2022న పదవీ విరమణ చేస్తారు. ఎన్వీ రమణ తర్వాత జస్టిస్ ఆర్.ఎఫ్ నారిమన్ సీనియార్టీ జాబితాలో ఉన్నారు. అయితే నారిమన్ ఈ ఏడాది ఆగస్టులోనే పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాత స్థానంలో ఉన్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌కు 2022 సంవత్సరం నవంబర్ 8 వరకు పదవీ కాలం ఉంది. అందువల్ల రమణ తర్వాత భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం జస్టిస్ లలిత్‌కు వస్తుంది. అందుకే ఇందిరకు భారత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశం ఉండదు. ఇకమీదట ఎవరైనా మహిళా న్యాయమూర్తి సుప్రీంకోర్టులో నియమితులైతే... ఆమె అందరికంటే జూనియర్‌గా ప్రస్థానం (పురుషులకైనా అంతే) మొదలుపెడతారు. రిటైర్మెంట్ వయసుకు ముందే సీనియారిటీ జాబితాలో రెండోస్థానానికి చేరినపుడు మాత్రమే తదుపరి సీజేగా అవకాశం వస్తుంది. ఇది ఎప్పటికి జరిగేనో? ఇక సుప్రీంకోర్టుకు న్యాయమూర్తుల పదవుల ఖాళీలను భర్తీ చేయడంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ఎనిమిది మందే.. స్వతంత్ర భారతావనిలో అత్యున్నత న్యాయస్థానం ఏర్పడిన తర్వాత ఒక మహిళ తీర్పులు వెలువరించడానికి దాదాపుగా 40 ఏళ్ల కాలం పట్టింది. 1950, జనవరి 26న సుప్రీంకోర్టు ఏర్పాటైతే ఆ తర్వాత 1989లో భారత దేశ మొట్టమొదటి సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ ఫాతిమా బీవి నియమితులయ్యారు. ఇప్పటివరకు సుప్రీం కోర్టులో 247 మందిని జడ్జీలుగా నియమిస్తే వారిలో ఎనిమిది మాత్రమే మహిళలు. జస్టిస్ ఫాతిమా బీవీ తర్వాత . జస్టిస్ సుజాత మనోహర్, జస్టిస్ రుమాపాల్, జస్టిస్ జ్ఞాన్ సుధా మిశ్రా, జస్టిస్ రంజన ప్రకాశ్ దేశాయ్, జస్టిస్ భానుమతి, జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీలకు మాత్రమే అత్యున్నత న్యాయస్థానంలో తీర్పులు చెప్పే అవకాశం వచ్చింది. హైకోర్టుల్లో న్యాయమూర్తుల్ని నియమించే అత్యున్నత అధికారాలు కలిగిన కొలీజియమ్‌లో సభ్యులుగా జస్టిస్ రుమాపాల్, జస్టిస్ ఆర్ భానుమతిలకు మాత్రమే భాగస్వామ్యులయ్యారు. ఏమిటి పరిష్కారం న్యాయవ్యవస్థలో వివక్ష రూపు మాపాలంటే అన్ని స్థాయిల్లో మహిళల నియామకం పెద్ద సంఖ్యలో జరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అడ్వకేట్లగా ఉన్న మహిళలు న్యాయమూర్తులుగా పదవీ బాధ్యతలు స్వీకరించడానికి ముందుకు రావాలనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ తాము తీర్పుల్ని వెల్లడించే అతి పెద్ద న్యాయమూర్తి బాధ్యతను చేపట్టలేమని ఆ అవకాశాన్ని మహిళా అడ్వకేట్లు తిరస్కరిస్తున్నారని సాక్షాత్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తులే చెబుతున్నారు. మహిళా సాధికారత కోసం ఎన్నో చట్టాలు ఉన్నట్టుగానే మహిళా న్యాయమూర్తుల నియామకం అంశంలో కొన్ని విధివిధానాలను రూపొందిస్తూ చట్టాలు చెయ్యాలని బోంబే హైకోర్టు అడ్వకేట్ ప్రాస్పర్ డీ సౌజా సూచించారు. న్యాయమూర్తుల్ని నియమించే విశేష అధికారాలు కలిగిన సుప్రీం కోర్టు, హైకోర్టు కొలీజియంలలో మహిళా భాగస్వామ్యం పెరగడం వల్ల కూడా మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణకు తొలి మహిళా సీజే తెలంగాణకు 2021 కొత్త సంవత్సరం కానుకగా ఒక మహిళ ప్రధాన న్యాయమూర్తిగా వచ్చారు. జనవరి 1న ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమా కొహ్లీ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇక గువాహటి, హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, జార్ఖండ్, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో ఒక్కో మహిళా న్యాయమూర్తి ఉన్నారు. మణిపూర్, మేఘాలయా, పాట్నా, త్రిపుర, ఉత్తరాఖండ్ హైకోర్లుల్లో మహిళా న్యాయమూర్తులెవరూ లేరు. -
సుప్రీంకోర్టు కొత్త సీజేగా దత్తు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి జస్టిస్ హెచ్ ఎల్ దత్తును నియమించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎం లోధా ఈ నెల 27న పదవీ విరమణ చేయనున్నారు. జస్టిస్ దత్తు నియామకానికి సంబంధించిన ఫైలును కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆమోదించి, ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి పంపించినట్టు తెలిసింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం లభించిన వెంటనే దత్తు నియామకానికి సంబంధించిన ఉత్తర్వు జారీ అవుతుందని అధికారవర్గాలు తెలిపాయి. దత్తు వచ్చే ఏడాది డిసెంబర్ 2వరకు సీజేఐగా కొనసాగుతారు.