న్యూఢిల్లీ: స్వేచ్ఛ, స్వాతంత్య్రం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే స్వేచ్ఛ, స్వాతంత్య్రం విలువ ఏమిటో అర్థం చేసుకోవచ్చని అన్నారు. గురువారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జస్టిస్ చంద్రచూడ్ జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.
గత చరిత్రను పరికిస్తే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఎంత విలువైనవో అవగతమవుతుందని పేర్కొన్నారు. ఇవి సులువుగా లభిస్తాయని అనుకోవద్దని సూచించారు. దేశంలో సాటి పౌరుల పట్ల మన బాధ్యతలను స్వాతంత్య్ర దినోత్సవం గుర్తుచేస్తుందని తెలిపారు. రాజ్యాంగ విలువలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవం దోహదపడుతుందని అన్నారు. మన దేశంలో న్యాయవాదులు ఎన్నో త్యాగాలు చేశారని, వృత్తిని తృణప్రాయంగా వదిలేసి దేశ సేవ కోసం అంకితమయ్యారని కొనియాడారు. పౌరులుగా దేశం పట్ల, సాటి మనుషుల పట్ల నిర్వర్తించాల్సిన బాధ్యతలను అందరూ చక్కగా నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment