షిశక్తి సమ్మిట్–2024లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: దేశంలో మహిళల సాధికారతే ఆ దేశానికి నిజమైన బలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏ ప్రాంతంలో అయినా, ఎలాంటి సమయంలోనైనా మహిళలు అభద్రతకు లోనవకుండా, వారి పట్ల గౌరవం చూపేలా ప్రజలకు అవగాహన కలి్పంచాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మన దేశంలో మహిళల గౌరవాన్ని, గౌరవాన్ని కాపాడతామని, వారి పురోభివృద్ధికి కృషి చేస్తామని ప్రతి ఒక్కరు ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఓ వార్తా సంస్థ సోమవారం నిర్వహించిన షిశక్తి సమ్మిట్–2024లో రాష్ట్రపతి మాట్లాడుతూ దేశంలో మహిళల భద్రతకోసం కఠినమైన చట్టాలను తీసుకొచ్చామన్నారు. అయినప్పటికీ అభద్రతా భావం కొనసాగుతుండటం దురదృష్టకరమని, మహిళలను బలహీనులుగా భావించే సామాజిక సంకుచిత మనస్తత్వం, ఛాందసవాదానికి వ్యతిరేకంగా నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరముందని ఆమె నొక్కి చెప్పారు.
సమాజంలో ఎన్ని మార్పులొచి్చనా కొన్ని సామాజిక దురభిప్రాయాలు లోతుగా పాతుకుపోయాయని, ఇవి మహిళా సమానత్వానికి అవరోధాలను సృష్టిస్తున్నాయని తెలిపారు. ‘‘ఎక్కడ తప్పు చేశాం? మెరుగుపడటానికి మనం ఏమి చేయాలి?’’అని మహిళలు నిరంతరం ప్రశ్నించుకోవాలని సూచించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా శక్తి, ధైర్యసాహసాలు ప్రదర్శిస్తున్నారని మహిళలను కొనియాడారు.
పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలి: సీజేఐ
చట్టం మాత్రమే న్యాయమైన వ్యవస్థను తయారు చేయలేదని, సమాజం మహిళల పట్ల తన మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సోమవారం నొక్కి చెప్పారు. ప్రతిఒక్కరూ పితృస్వామిక దృక్పథాన్ని విడనాడాలని సూచించారు. మహిళల ప్రయోజనాలను పరిరక్షించడానికి విధానపరమైన, చట్టపరమైన నిబంధనలు అనేకం ఉన్నాయని, కానీ కఠినమైన చట్టాలే సమ సమాజాన్ని నిర్మించలేవన్నారు.
మహిళలకు రాయితీలు ఇవ్వడం నుంచి స్వేచ్ఛగా, సమానంగా జీవించే హక్కు వారికుందనే విషయాన్ని గుర్తించే దిశగా మన మనస్తత్వాలు మార్చుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల హక్కుల గురించి మాట్లాడటమంటే మొత్తం సమాజం మార్పు గురించి మాట్లాడినట్లని వ్యాఖ్యానించారు.
తన జీవితంలోని కొన్ని గొప్ప పాఠాలను మహిళా సహోద్యోగుల నుంచే నేర్చుకున్నానని, మెరుగైన సమాజానికి మహిళల సమాన భాగస్వామ్యం ముఖ్యమని తాను నమ్ముతానని చెప్పారు. దేశం రాజ్యాంగాన్ని ఆమోదించక ముందే ఇండియన్ ఉమెన్స్ చార్టర్ ఆఫ్ లైఫ్‌ను స్త్రీవాది అయిన హంసా మెహతా రూపొందించారని సీజే గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment