సొంతూరిలో రాష్ట్రపతి ఉద్వేగం
ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు
చిన్ననాటి గురువులకు వందనం
రాయ్‌రంగ్‌పూర్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఉద్వేగభరితమయ్యారు. తను పుట్టిన ఒడిశా రాష్ట్రం మయూర్‌భంజ్ జిల్లా ఉపర్‌బేడ గ్రామాన్ని శుక్రవారం ఆమె సందర్శించి, అక్కడి గిరిజన మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. ఉపర్‌బేడ గ్రామాన్ని కేవలం ఒక ప్రదేశంగా తానెన్నడూ భావించలేదని, అదొక కుటుంబమని తన మూలాలను గుర్తు చేసుకుంటూ ఉద్వేగంతో అన్నారు. బమన్‌ఘటి సబ్ డివిజన్‌లోని ఉపర్‌బేడలోని సంతాలి కుటుంబంలో ముర్ము 1958 జూన్ 20న జన్మించారు.
2022 జూలై భారత ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించాక ఈ గ్రామానికి రావడం ఇదే మొదటిసారి. గ్రామానికి చేరుకున్న వెంటనే ఆమె తను చదువుకున్న ఉపర్‌బేడ అప్పర్ ప్రైమరీ స్కూలుకు వెళ్లారు. రాష్ట్రపతి రాకను పురస్కరించుకుని ఆ పాఠశాలతోపాటు యావత్తు గ్రామాన్ని అందంగా మార్చారు. గ్రామస్తులు, స్కూలు టీచర్లు, విద్యార్థులు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. తను పుట్టిన ఇంటికి వెళ్లే దారిలో సంతాలి మహిళలు ఆమెకు గిరిజన సంప్రదాయ వస్త్రధారణతో జానపద నృత్యం చేస్తూ పాటలు పాడుతూ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ముర్ము కూడా వారితో కాలు కదిపారు. గ్రామ దేవతకు పూజలు చేశారు.
నేనిప్పటికీ ఇక్కడి విద్యార్థినే...
స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో ముర్ము విద్యార్థులతో ముచ్చటించారు. ‘‘నాకిప్పుడు 66 ఏళ్లు. అయినా మా స్కూల్‌లో చిన్న విద్యార్థిననే అనుకుంటున్నా. అప్పట్లో మట్టిగోడలుండేవి. మా ఏడో తరగతిలో ఉండగా స్కాలర్‌షిప్ పరీక్ష కోసం మదన్ మోహన్ సార్ వాళ్లింటికి తీసుకెళ్లారు. తన సొంత పిల్లలతోపాటు నన్ను కూడా పరీక్షకు ప్రిపేర్ చేశారు. ఈ గ్రామం, ఈ స్కూలు నాకు అందించిన అభిమానం మరువలేనిది’’ అంటూ ఉప్పొంగిపోయారు. తోటి వాళ్లు, ఉపాధ్యాయులు కూడా బయటి వ్యక్తిగా కాక, తనను సొంత కుటుంబసభ్యురాలిగా చూసుకునేవారన్నారు. ‘ఆ రోజుల్లో లాంతరు వెలుగులో చదువుకునేదాన్ని. ఆ లాంతరు గ్లాస్ పగిలిపోయి ఉండేది. చదువుకోవడానికి ఇబ్బందయ్యేది. సిరా పెన్నుతో రాయడం కష్టంగా ఉండేది. ఇంకుతో బట్టలు పాడయ్యేవి’’ అని గుర్తు చేసుకున్నారు.
గురువులకు వందనం
తనకు విద్య నేర్పిన గురువులను రాష్ట్రపతి ఘనంగా సన్మానించారు. స్కూల్ హెడ్‌మాస్టర్ బిశేశ్వర్ మహంత, క్లాస్ టీచర్ బాసుదేశ్ బెహెరె, 4, 5 తరగతుల్లో ఉండగా క్లాస్‌టీచర్ బసంత కుమార్ గిరిలను సన్మానించారు. ఉపర్‌బేడ అప్పర్ ప్రైమరీ స్కూల్‌లోని సుమారు 200 మందికి స్కూల్ బ్యాగులు, చాకెట్లు, టిఫిన్ బాక్సులు అందజేశారు. కష్టపడి చదువుకుని, ఉన్నతస్థానాలకు ఎదగాలని వారిని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment