
న్యూఢిల్లీ: కశ్మీర్‌లో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల మెరుపుదాడి నేపథ్యంలో క్షీణించిన భారత్, పాక్ సత్సంబంధాలు, జమ్మూకశ్మీర్‌లో తాజా పరిస్థితి తదితరాలపై తాజా వివరాలు అందించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌లు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు.
సింధూ నదీజలాల ఒప్పందాన్ని భారత్ పక్కనబెట్టడం, సిమ్లా ఒప్పందం నుంచి పాకిస్తాన్ వైదొలగడంతో మారిన పరిణామాలపై రాష్ట్రపతి ముర్ముతో మంత్రులిద్దరూ మాట్లాడారు. రాష్ట్రపతితో అమిత్ షా, జైశంకర్ భేటీ ఫొటోను రాష్ట్రపతి భవన్ కార్యాలయం తన సామాజిక మాధ్యమ ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది. నేతలిద్దరూ రాష్ట్రపతికి ఉగ్రదాడి సంబంధ అంశాలు, తదనంతర పరిణామాలను వివరించినట్లు తెలుస్తోంది.