Terrorist attacks
-
ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలే
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో ప్రస్తావించిన పాకిస్తాన్‌కు భారత్ గట్టిగా బదులిచ్చింది. భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోస్తే తీవ్ర పరిణామాలను స్వయంగా ఆహ్వానించినట్లే అవుతుందన్న సంగతి తెలుసుకోవాలని హితవు పలికింది. ప్రపంచవ్యాప్తంగా జరిగిన పలు ఉగ్రవాద దాడులపై పాకిస్తాన్ వేలిముద్రలు ఉన్నాయని స్పష్టంచేసింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో శుక్రవారం భారత దౌత్యవేత్త భవిక మంగళానందన్ మాట్లాడారు. ఇదే సభలో తాజాగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. ఆర్టికల్ 370పై మాట్లాడారు. దీనిపై భవిక మంగళానందన్ ఘాటుగా స్పందించారు. సైన్యం పెత్తనం కింద నలుగుతూ ఉగ్రవాదాన్ని ఉత్పత్తి చేసే దేశమైన పాకిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ గురించి మాట్లాడడం ఏమటని నిలదీశారు. ఎన్నికల్లో విచ్చలవిడిగా రిగ్గింగ్‌లు జరిగే దేశం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోందని ఎద్దేవా చేశారు. భారతదేశ భూభాగాన్ని కబళించేందుకు పాక్ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఆటంకాలు సృష్టించడానికి ఉగ్రవాదాన్ని నమ్ముకుంటోందని ధ్వజమెత్తారు. ఉగ్రవాదానికి, మాదక ద్రవ్యాల వ్యాపారానికి, చీకటి నేరాలకు మారుపేరైన పాకిస్తాన్‌కు భారత్ గురించి నోరువిప్పే అర్హత లేదని భవిక మంగళానందన్ పరోక్షంగా హెచ్చరించారు.పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పొరుగు దేశాలపై ఒక ఆయుధంగా ప్రయోగిస్తోందన్న సంగతి ప్రపంచం మొత్తానికి తెలుసని పేర్కొన్నారు. తమ దేశ పార్లమెంట్‌పై, ఆర్థిక రాజధాని ముంబై నగరంపై, మార్కెట్లపై, యాత్రా మార్గాలపై దాడులు చేసిన నీచ చరిత్ర పాకిస్తాన్ ఉందని నిప్పులు చెరిగారు. అలాంటి ధూర్త దేశం హింస గురించి నీతులు చెప్పడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. అల్‌ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం ఇచ్చిన దేశం ఏమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. -
జమ్మూలో దాడుల వెనుక...
కొన్ని వారాలుగా జమ్ము తీవ్రవాదుల దాడులతో దద్దరిల్లుతోంది. కశ్మీర్ లోయ నుండి ఉగ్రదాడులు జమ్మూకి ఎందుకు మారినట్టు? ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించిన ప్రదేశాల్లో కశ్మీర్ ఒకటి. సైన్యానికి తెలియకుండా ఆకు కూడా కదలదు. కశ్మీర్‌తో పోల్చితే జమ్మూ తక్కువ సమస్యాత్మకం. జమ్ము–కశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ఈ దాడులు జరుగుతుండటం గమనార్హం. సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే ఉగ్రవాదుల లక్ష్యం అయి వుండాలి. శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని ఈ దాడులు గుర్తు చేస్తాయని వాళ్లు భావిస్తూవుండొచ్చు.ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ ప్రాంతంలోని రియాసీ నుంచి కాశ్మీర్‌లోని బారాముల్లా వరకు చీనాబ్ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎతై ్తన వంతెన మీదుగా ఈ నెలాఖరులో తొలి రైలు రన్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. కానీ ప్రశ్న ఏమిటంటే, పీర్ పంజాల్‌కు దక్షిణాన ఇటీవల జరిగిన ఉగ్రదాడుల కారణంగా ఈ ప్రాంత వాసుల్లో ఏర్పడుతున్న ఆందోళనకు ప్రధాన మంత్రి సమక్షంలో భరోసా లభిస్తుందా?గత కొన్ని వారాలు రక్తంతో తడిసిన భీకర శబ్దాన్ని గుర్తుచేస్తున్నాయి: జూలై 8న కఠువా జిల్లాలో ఐదుగురు సైనికులు హతమయ్యారు. జూలై 7న కుల్గామ్‌లో ఆరుగురు ఉగ్రవాదులతో సహా ఎనిమిది మంది హతమయ్యారు. జూన్ 26న డోడా జిల్లాలో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జూన్ 9న ఢిల్లీలో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజున రియాసి జిల్లాలో తొమ్మిది మంది యాత్రికులు హత్యకు గురయ్యారు.మరో నెల రోజుల్లో, జమ్ము–కశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి బీజేపీ పాలిత కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో ‘సబ్ చంగా సీ’ (అంతా బాగుంది) పిలుపునకు ఏమైంది? ముడుచుకుపోయిన పెదవులు, పిడచకట్టుకుపోయిన నాలుకలపై కదులుతున్న ప్రశ్న ఏమిటంటే, ముస్లింలు మెజారిటీగా ఉన్న కశ్మీర్ లోయ నుండి ఉగ్రవాద దాడులు హిందూ మెజారిటీ జమ్మూకి ఎందుకు మారాయి?మొదట, వాస్తవాలు చూద్దాం. దాడులు చేస్తున్న ఉగ్రవాదులు విదేశీయులు. అంటే వారు పాకిస్తాన్‌కు చెందినవారు. అఫ్గాన్లు, చెచెన్లు మొదలైన ఇతర విదేశీ ఉగ్రవాదుల్ని ఇక్కడ గుర్తించలేదు. రెండవది, వారు అమెరికా తయారీ ఎమ్4 కార్బైన్ అసాల్ట్ రైఫిల్స్ వంటి అధునాతన ఆయుధాలను కలిగి ఉన్నారు. ఇవి తరచుగా జమ్ము–కశ్మీర్లో కంటే అఫ్గాన్ యుద్ధరంగంలో ఎక్కువగా కనిపిస్తాయి. మూడవది, వారు దాడులను నిర్వహించడానికి అత్యున్నత శిక్షణ పొందారు. నాల్గవది, ఈ ఉగ్రవాదులు అటవీ, అంతర్జాతీయ సరిహద్దు విభాగం నుండి జమ్మూ ప్రాంతంలోకి చొరబడ్డారు. వారు వేగవంతమైన ప్రవాహాల నుండి ఈదుకుంటూ వచ్చారు, అంతే తప్ప నిజంగా నియంత్రణ రేఖను దాటి కాదు.అంతర్జాతీయ సరిహద్దు నుంచి చొరబడవచ్చని చెబితే ఎక్కువగా ఆశ్చర్యపోవద్దు. రియాసీ, డోడా, కఠువా, సాంబాలో నేల మెత్తటిది. గతంలో ఉగ్రవాదులు సొరంగాల ద్వారా చొరబడ్డారు. ఇప్పుడైతే పాకిస్తానీ డ్రోన్లు వారికి సాయపడుతున్నాయి – 2021లో జమ్మూ వైమానిక క్షేత్రంపై దాడితో సహా!మరీ ముఖ్యంగా, పాకిస్తానీ వ్యూహంలో మార్పు – అంటే, లక్ష్య ప్రాంతాన్ని కశ్మీర్ నుండి జమ్మూకి మార్చడం అనేది కశ్మీరీ జనాభాకు ‘ఉపశమనం‘ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో స్పష్టంగా జరిగిన చర్య. కశ్మీర్ లోయ చాలా నిశితంగా పరిశీలించబడుతోంది. అక్కడ చెట్టు నుండి పడే ఆకు వేగం, కోణం, దూరం గురించి కూడా భద్రతా బలగాలకు తెలుసు. వారికి ముందుగా తెలియకుండా చిగురుటాకు కూడా రాలడం కష్టం. కశ్మీర్‌లోని పెద్ద భూభాగాలు ప్రపంచంలోనే అత్యంత సైనికీకరించబడిన వాటిలో ఒకటిగా ఉన్నాయనడంలో సందేహం లేదు. వ్యవస్థ గురించి మాట్లాడితే లేదా వ్యతిరేకంగా మాట్లాడితే దానికి చెల్లించే మూల్యం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజలు తమ పనులు తాము చూసుకుంటారు.జమ్మూ ప్రాంతంలో అలా కాదు. పూంఛ్–రాజౌరీ సెక్టార్లో నిరంతరం దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ భూభాగాల భద్రత చాలావరకు సడలించబడింది. హిందూ మెజారిటీతో కూడిన జమ్మూ మరింత జాతీయవాదంతో, తక్కువ సమస్యాత్మకంగా ఉంటుంది. వాస్తవానికి, 2020 వేసవిలో వాస్తవ నియంత్రణ రేఖ అంతటా చైనీయులు కాలిడినట్లు గుర్తించిన వెంటనే, రాష్ట్రీయ రైఫిల్స్ వారి బ్రిగేడ్‌ను తూర్పు లద్దాఖ్‌కు తరలించారు. భద్రత పలుచబడిపోవడం వల్ల జమ్మూకు భారీ నష్టం వాటిల్లింది. ఇప్పుడు మాత్రమే ఇక్కడి బ్రిగేడ్ కొంతమంది రిజర్వ్ బలగాలతో భర్తీ అయింది.ఇక్కడ మరొకటి కూడా జరుగుతోంది. ఇది భద్రతా పరిస్థితులతో నేరుగా సంబంధం కలిగి ఉండకపోయినా, మారుతున్న పరిస్థితుల గురించి మీకు కొంత ఆలోచన ఇస్తుంది. అదేమిటంటే ఆర్టికల్ 370 రద్దు అనంతరం కూడా బీజేపీ బలహీనపడటం!ఇది ఇలా ఉండకూడదు. ఆర్టికల్ 370ను రద్దు చేయడం వల్ల జమ్మూను దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మరింత అనుసంధానం చేయాలని భావించారు. దానికి బదులుగా, ఇప్పుడు స్థానిక నివాసితులు పెరుగుతున్న నిరుద్యోగం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, బయటి వ్యక్తులకు భూమి అమ్మకం, మద్యం వ్యాపారంలో పెరుగుదలతో పాటుగా, శ్రీనగర్ నుండి ఐదు లక్షల మందితో కూడిన బలమైన సైన్యం తరలింపును గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఇది స్థానిక వ్యాపారానికి ఊతమిచ్చేది.ఇటీవలి లోక్‌సభ ఎన్నికలు ఆ అసంతృప్తిని కొంతమేరకు ప్రదర్శించాయి. ఉధమ్‌పుర్ (40.11 శాతం ఓట్లు సాధించిన చౌధురీ లాల్ సింగ్‌ను 51.28 శాతంతో జితేంద్ర సింగ్ ఓడించారు), జమ్మూ (42.4 శాతం ఓట్లు సాధించిన రామన్ భల్లాను 52.8 శాతంతో జుగల్ కిషోర్ శర్మ ఓడించారు) స్థానాలను బీజేపీ గెలుచుకున్నప్పటికీ, వారి గెలుపు మార్జిన్లు చాలా తక్కువగా ఉన్నాయి. రెండూ 1.5 లక్షల కంటే తక్కువ. ఇలా జరగడం పట్ల అధికార పార్టీ ఒకింత ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. బహుశా, పాకిస్తానీ ఉగ్రవాదులు చేయాలనుకుంటున్నది అదే కావచ్చు. ఆర్టికల్ 370 రద్దు అయిదో వార్షికోత్సవం సందర్భంగా, సాధారణ స్థితికి సంబంధించిన ప్రభుత్వ వాదనలను జమ్మూలో కూడా తోసిపుచ్చడమే. తీవ్రవాద దాడుల స్థాయి ఇంకా కొద్దో గొప్పో నియంత్రణలోనే ఉందనీ, వ్యూహాలు మారినప్పటికీ అది ఎక్కువ ప్రతీకార చర్యలకు పురిగొల్పదనీ కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడులు సైనిక శిబిరాలకు ఎక్కువ నష్టం కలిగించడానికి ఉద్దేశించబడ్డాయి. జమ్మూలో ఇవి సాయుధ గస్తీపై, పౌర వాహనాలపై మెరుపుదాడిగా మారాయి.బహుశా, మరొక కారణం ఉంది. పార్లమెంట్లో ప్రధాని మోదీ బలం తగ్గినప్పటికీ, ఆయన ప్రపంచంలో పర్యటిస్తున్నారనీ, ఆయన గౌరవం పొందుతున్నారనీ పాకిస్తాన్ సర్వశక్తిమంతమైన సైనిక వ్యవస్థ గమనించకుండా ఉండదు. న్యూఢిల్లీని దాని ఆత్మసంతృప్తి దశ నుండి కదిలించి, ఒక పరిష్కారాన్ని, శాశ్వత శాంతిని కనుగొనడంలో ‘పాకిస్తానీ హస్తం’ ఇప్పటికీ తప్పనిసరని గుర్తించేలా ఈ దాడులు చేస్తాయని బహుశా రావల్పిండి భావిస్తూవుండొచ్చు.అయినప్పటికీ, అంతర్గత ఒత్తిడికి మోదీ చాలా ఎక్కువగా స్పందిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. 2019లో కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను బలవంతంగా ప్రారంభించిన పంజాబ్ మాదిరిగానే, మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు కశ్మీర్‌కు అవకాశం వస్తుంది. కశ్మీర్ లేదా జమ్మూ నుండి ఎన్నికైన ప్రతినిధులను ఢిల్లీ గానీ, రావల్పిండి గానీ విస్మరించలేవు. చేతిలో ఒక క్షణం ఉంటుంది. ఇది త్వరలో మళ్లీ రాకపోవచ్చు. భారతదేశం, పాకిస్తాన్ రెండూ ప్రయత్నించాలి, దానికి సిద్ధం కావాలి.జ్యోతీ మల్హోత్రా వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
ఎన్ఐఏ చేతికి ‘బస్సుపై ఉగ్రదాడి’ కేసు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో ఇటీవల బస్సుపై ఉగ్రవాదుల దాడి కేసు దర్యాప్తును కేంద్రం హోంశాఖ... జాతీయ పరిశోధన సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించింది. జమ్మూకశ్మీర్ శాంతిభద్రతలు, అమర్నాథ్ యాత్రకు సంబంధించిన సన్నాహాలపై వరుస సమీక్షా సమావేశాల అనంతరం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ నుంచి మాతా వైష్ణోదేవీ ఆలయానికి వెళ్తున్న యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై రియాసి జిల్లాలో జూన్ 9న ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు. డ్రైవర్‌కు బుల్లెట్ తగలడంతో బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు మహిళలు సహా తొమ్మిది మంది మరణించారు. 41 మంది గాయపడ్డారు. -
ఇక... జమ్మూ వంతు!
జమ్మూలో వరుస తీవ్రవాద దాడులు కలవరం సృష్టించగా, ఎట్టకేలకు సర్కార్ రంగంలోకి దిగింది. కేంద్ర హోమ్ మంత్రి సారథ్యంలో ఆదివారం ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అందులో తొలి అడుగు. పాక్ నుంచి తీవ్రవాదుల చొరబాటు యత్నాలను నిర్వీర్యం చేసేందుకు భద్రతా దళాల సంఖ్యను పెంచడం సరైన దిశలో సరైన చర్యగా చెప్పుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి రాజౌరీ, పూంచ్ , రియాసీ, కఠువా, ఉధమ్‌పూర్, దోడా జిల్లాలు ఆరింటిలో ఆరు ప్రధాన తీవ్రవాద దాడులు జరిగాయి. సైనిక వర్గాల కథనం ప్రకారం విదేశీ తీవ్రవాదులు నలుగురైదుగురు చొప్పున బృందాలుగా ఏర్పడుతున్నారట. అలాంటి బృందాలు కనీసం అయిదు పీర్ పంజల్, చీనాబ్ ప్రాంతాల్లో పని చేస్తున్నాయి. జమ్మూలోని ఈ కొత్త తరహా తీవ్రవాద ధోరణి కశ్మీర్‌కూ వ్యాపించే ప్రమాదం పొంచివుంది. అందుకే, జమ్మూ కశ్మీర్‌పై స్వయంగా ప్రధాని గత వారం సమీక్షా సమావేశం నిర్వహిస్తే, తర్వాత మూడు రోజులకే హోమ్ మంత్రి సైతం సమీక్ష చేశారు. పరిస్థితి తీవ్రతకు ఇది దర్పణం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరుతున్న సమయంలోనే తాజా దాడులు యాదృచ్ఛికం అనుకోలేం. జమ్మూ కశ్మీర్లో పరిస్థితులు సజావుగా లేవనీ, 370వ అధికరణం రద్దు తర్వాత శాంతి నెలకొనలేదనీ వీలైనప్పుడల్లా ప్రపంచానికి చాటడమే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు పని చేస్తూనే ఉన్నారు. తాజా తీవ్రవాద దాడులు అందులో భాగమే. ఇటీవల కొన్నేళ్ళుగా కశ్మీరీ తీవ్రవాదులు ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలను అనుసరిస్తున్నారు. 2022లో నిర్దేశిత వ్యక్తులే లక్ష్యంగా హత్యలు చేసే పద్ధతిని అనుసరిస్తే, గత ఏడాది నుంచి సాంప్రదాయిక విన్యాసాలు సాగిస్తున్నారు. దాదాపు రెండు దశాబ్దాల పైచిలుకుగా ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో అలజడులు సృష్టించసాగారు. గతంలో కశ్మీర్ ప్రాంతంపై పంజా విసిరిన ముష్కర మూకలు ఇప్పుడు ప్రశాంతమైన జమ్ము ప్రాంతంపై గురి పెట్టాయి. దాంతో, భద్రతా దళాలు తమ వ్యూహాలను మార్చుకోక తప్పని పరిస్థితి. గతాన్ని సింహావలోకనం చేసుకుంటే, కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన 370వ అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత దృష్టి అంతా కశ్మీర్‌పై నిలిచింది. అప్పటికి పదిహేనేళ్ళుగా జమ్మూలోని అధిక భాగంలో నిస్సైనికీకరణ సాగింది. ప్రశాంతత నెలకొంది. ఫలితంగా, విదేశీ తీవ్రవాదులు ఈసారి జమ్మూని తమకు వాటంగా చేసుకున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రధానంగా అడవులు ఈ విదేశీ చొరబాటుదారులకు కలిసొచ్చాయి. రాజౌరీ, పూంచ్∙జిల్లాల్లోని దట్టమైన అడవులు, సంక్లిష్టమైన కొండలు తీవ్రవాదుల కొత్త కేంద్రాలయ్యాయి. అక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకొని, గుహల్లో దాక్కొని వారు తమ ఉనికి, బలం పెంచుకున్నారు. తాజాగా నాలుగు రోజుల్లో నాలుగు చోట్ల దాడులు జరగడం, అందులోనూ రియాసీ జిల్లాలో జూన్ 9న యాత్రికుల బస్సుపై అమానుష దాడితో ఒక్కసారిగా దేశమంతా ఉలిక్కిపడింది. ప్రభుత్వం హడావిడిగా క్షేత్రస్థాయి పరిస్థితులపై మళ్ళీ దృష్టి పెట్టింది. 2021 జనవరి నుంచే వాస్తవాధీన రేఖ వెంట జమ్మూలోకి చొరబడడానికి విదేశీ తీవ్రవాద బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అప్పట్లో జమ్మూలోని అఖ్నూర్లో మన సైన్యం ఆ ప్రయత్నాన్ని తిప్పికొట్టి, ముగ్గురిని హతమార్చింది. అదే ఏడాది జూన్‌లో భారత వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి ఘటనల నుంచి జమ్మూ ప్రాంత సరిహద్దు జిల్లాల్లో తీవ్రవాద కార్యకలపాలు పెరిగాయి. 2021 నుంచి ఇప్పటి వరకు ఒక్క జమ్మూ ప్రాంతంలోనే 29 తీవ్రవాద హింసాత్మక ఘటనలు జరిగాయి. జమ్మూ కశ్మీర్లో దాదాపు 100 మందికి పైగా తీవ్రవాదులు క్రియాశీలంగా ఉన్నారట. వారిలో తీవ్రవాద బాట పట్టిన స్థానికుల కన్నా విదేశీ తీవ్రవాదులే ఎక్కువ. ఇది తీవ్రమైన అంశం. ఒకప్పటి భారీ వ్యవస్థీకృత హింసాకాండ నుంచి ఇప్పుడు పొరుగునున్న శత్రువుల అండతో పరోక్ష యుద్ధంగా మారిన ఈ బెడదపై సత్వరమే కార్యాచరణ జరగాలి.నిజం చెప్పాలంటే, జమ్మూ కశ్మీర్, మణిపుర్లు రెండూ ఇప్పటికీ అట్టుడుకుతూనే ఉన్నాయి. మోదీ 3.0 సర్కార్ ముందున్న ప్రధానమైన సవాళ్ళు ఇవి. ప్రభుత్వ పెద్దలు వీటిని అశ్రద్ధ చేయడానికి వీలు లేదు. అందులోనూ ఈ జూన్ 29 నుంచి అమరనాథ్ యాత్ర మొదలు కానున్న వేళ జమ్మూలో భద్రత కీలకం. గతంలో సాంప్రదాయికంగా తీవ్రవాదులకు పెట్టనికోట అయిన కశ్మీర్ లోయలో ఆ పరిస్థితిని మార్చడంలో భద్రతాదళాలు విజయం సాధించాయి. నిరుడు ఏకంగా 2.11 కోట్ల మంది సందర్శకులతో కశ్మీర్లో పర్యాటకం తిరిగి పుంజుకొంది. మొన్న లోక్‌సభ ఎన్నికల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొన్నారు. గత 35 ఏళ్ళలో ఎన్నడూ లేనంతగా మొత్తం కేంద్రపాలిత ప్రాంతంలో 58.46 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. తీవ్రవాదం పీచమణిచి సాధించిన అలాంటి విజయాలు జమ్మూలోనూ పునరావృతం కావాలని హోమ్ మంత్రి ఆదేశిస్తున్నది అందుకే. తీవ్రవాదులు ప్రధానంగా అంతర్జాల ఆధారిత వ్యవస్థల ఆధారంగా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటున్నారు. విదేశీ సిమ్ కార్డులతో, పాకిస్తానీ సర్వీస్ ప్రొవైడర్లతో సాగుతున్న ఈ వ్యవహారానికి సాంకేతికంగా అడ్డుకట్ట వేయాలి. ప్రజలు, పోలీసులు, స్థానిక రక్షణ దళ సభ్యులతో సహా అందరినీ కలుపుకొనిపోతూ దేశంలో చేరిన ఈ కలుపు మొక్కల్ని ఏరిపారేయాలి. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించాలని చూస్తున్న ఈ దుష్టశక్తుల పాచిక పారనివ్వరాదు. ప్రభుత్వం వెనక్కి తగ్గక సెప్టెంబర్‌లో జరగాల్సిన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను నిరాటంకంగా జరిపించాలి. పాక్ పాలకులు పైకి మెత్తగా మాట్లాడుతున్నా, అక్కడి సైన్యాధ్యక్షుడు, సైనిక గూఢచారి వ్యవస్థ ఐఎస్ఐ చేసే కుటిల యత్నాలకు సర్వదా కాచుకొనే ఉండాలి. అప్రమత్తత, సత్వర సన్నద్ధతే దేశానికి శ్రీరామరక్ష. -
Pakistan General Elections 2024: పాక్‌లో నేడే సార్వత్రిక ఎన్నికలు
ఇస్లామాబాద్: పెచ్చరిల్లిన హింస, పెట్రేగిన ఉగ్రదాడులు, ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్తాన్లో గురువారం సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మాజీ ప్రధానిఇమ్రాన్‌ఖాన్ ఊచలు లెక్కపెడుతున్న వేళ ఆరేళ్ల ప్రవాసం నుంచి తిరిగొచ్చిన మరో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సైన్యం దన్నుతో అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే 74 ఏళ్ల షరీఫ్ రికార్డుస్థాయిలో నాలుగోసారి పాక్ ప్రధాని అవుతారు. నవాజ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పారీ్ట అత్యధిక సీట్లు సాధించేలా కన్పిస్తోంది. ఇమ్రాన్ పార్టీ పీటీఐ ఎన్నికల గుర్తు క్రికెట్ బ్యాట్‌పై ఈసీ నిషేధం విధించింది. దాంతో పీటీఐ అభ్యర్థులంతా స్వతంత్రులుగా బరిలో దిగారు. బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పారీ్ట(పీపీపీ) సైతం ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. 12.85 కోట్ల ఓటర్లు ఈసారి ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకోనున్నారు. బుధవారమే బలూచిస్తాన్ ప్రావిన్స్న్స్లో ఉగ్రవాదులు జంట బాంబుదాడులతో పదుల సంఖ్యలో ప్రాణాలు బలి తీసుకున్న నేపథ్యంలో 6.5 లక్షల మంది భద్రతా సిబ్బందితో పోలింగ్స్టేషన్ల వద్ద భద్రతను కట్టుదిట్టంచేశారు. నేషనల్ అసెంబ్లీ(పార్లమెంట్) ఎన్నికల్లో ఈసారి 5,121 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 336 సీట్లకుగాను 266 సీట్లకు బుధవారం పోలింగ్ జరగనుంది. మరో 60 సీట్లు మహిళలకు రిజర్వ్‌చేశారు. మరో 10 సీట్లు మైనారిటీలకు రిజర్వ్‌చేశారు. ఇంకొన్ని సీట్లు పార్టీలు గెలిచిన సీట్లను బట్టి దామాషా పద్ధతిలో కేటాయిస్తారు. కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకూ గురువారమే ఎన్నికలు జరుగుతున్నాయి. -
భారీ ఉగ్రకుట్రను భగ్నం చేసిన NIA
సాక్షి, హైదరాబాద్/చెన్నై: జాతీయ దర్యాప్తు సంస్థ NAI ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసింది. దక్షిణాదిలోని 31 చోట్ల సోదాలు నిర్వహించి.. పలువురిని అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో భారీ ఉగ్రనెట్వర్క్ బయటపడింది. కోయంబత్తూరులో 22 ప్రాంతాల్లో, హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో, మిగతా చోట్ల ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, అరబిక్ భాషలో ఉన్న కొన్ని పేపర్లు, వీటితో పాటు రూ. 60 లక్షలు, 18,200 US డాలర్స్ స్వాధీనం చేసుకుంది ఎన్ఐఏ. అరబిక్ క్లాసుల పేరుతో యువతను ఆకర్షిస్తున్నారు ఉగ్రవాదులు. రీజనల్ స్టడీ సెంటర్ల పేరుతో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అలాగే.. సోషల్ మీడియాలో వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల ద్వారా ప్రత్యేక శిక్షణ తరగతులు. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వ్యాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను రిక్రూట్ చేసుకుంటున్నారు ఉగ్రవాదులు. కిందటి ఏడాది అక్టోబర్ 23 న కోయంబత్తూర్ లో కారు పేలుడు చర్యకు పాల్పడింది ఈ తరహా శిక్షణ పొందిన ఉగ్రవాదులేనని ఎన్ఐఏ గుర్తించింది. -
‘26/11’ కుట్రదారులు ఇంకా బయటే...
ముంబై: ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్రవాద దాడుల కుట్రధారులు, పాత్రధారులు ఇప్పటికీ రక్షణ పొందుతూనే ఉన్నారు. నిక్షేపంగా తిరుగుతున్నారు. వారికి ఏ శిక్షలూ పడడం లేదు’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ ఆక్షేపించారు. ఉగ్రవాదం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు విస్తరించిందని, దానితో నష్టాల గురించి ఇతరుల కంటే భారత్‌కే ఎక్కువగా తెలుసని అన్నారు. ‘ఉగ్రవాద కార్యకలాపాలకు నూతన సాంకేతికను వాడుకోకుండా నిరోధించడం’ అనే అంశంపై 26/11 దాడులకు సాక్షిగా నిలిచిన ముంబైలోని తాజ్ హోటల్లో జరిగిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడారు. దాడుల మృతులకు గబాన్ దేశ విదేశాంగ మంత్రి, యూఎన్ఎస్సీ అధ్యక్షుడు మైఖేల్ మౌసా–అడామో తదితరులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మరో దేశం నుంచి వచ్చిన ముష్కరులు మారణహోమం సృష్టించారని పాకిస్తాన్‌పై ధ్వజమెత్తారు. కరడుగట్టిన ఉగ్రవాదుల విషయంలో రాజకీయ కారణాల వల్ల ఐరాస భద్రతా మండలి చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. పాక్ ఉగ్రవాదులపై ఆంక్షలు విధించకుండా చైనా çఅడ్డుకుంటోందని విమర్శించారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే ఆ సంస్థలకు నిధులందకుండా చేయాలని సూచించారు. అలా చేస్తే వారి వెన్ను విరిచినట్లేనని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ సమాజం ఉమ్మడిగా పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. -
ఉగ్ర దాడులన్నీ కాంగ్రెస్ హయాంలోనే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశం విస్తుపోయే ఉగ్ర దాడులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి, దర్యాప్తును వేగవంతం చేసేందుకు వీలుగా అనుమానితులు, నేరస్తుల కొలతలు, బయోమెట్రిక్ నమూనాలను సేకరించే అధికారం పోలీసులు, జైలు వార్డెన్లకు కల్పించే క్రిమినల్ ప్రొసీజర్ (ఐడెంటిఫికేషన్) బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం అంతకుముందు ఈ బిల్లుపై చేసిన వ్యాఖ్యల్ని ఎంపీ విజయసాయిరెడ్డి తూర్పారబట్టారు. నాడు కాంగ్రెస్ పాల్పడిన దుశ్చర్యల కారణంగానే తాను ఈ బిల్లును సమర్థిస్తున్నట్లు చెప్పారు. 2007లో సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌లో, 2008లో అస్సాంలో, 2010లో పుణెలో బాంబు పేలుళ్లు, 2011లో ముంబైపై కసబ్ ముఠా దాడులు.. ఇలా దేశాన్ని నివ్వెరపరచిన ఈ ఉగ్ర దాడులన్నీ కాంగ్రెస్ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. కానీ నేడు మాజీ హోం మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిదంబరం సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపించాలని కోరుతున్నారుగా.. మరి హోం మంత్రిగా ఉన్న సమయంలో ఎన్ని బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపించారు..’ అని చిదంబరాన్ని ప్రశ్నించారు. చిదంబరం చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు.. చేసేవి తప్పుడు పనులు అని పేర్కొన్నారు. చిదంబరం, గులాంనబీ ఆజాద్ కలసి తనపై, తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారని చెప్పారు. అలాంటి దుష్టచింతన కలిగిన చిదంబరం బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఉదాశీనత కారణంగానే ఉగ్రవాదులు రెచ్చిపోయారని చెప్పారు. దేశ ప్రజలు తీవ్ర భయాందోళనలతో గడపాల్సి వచ్చిందని గుర్తుచేశారు. ప్రపంచం దృష్టిలో నాడు భారత్ బలహీనమైన దేశంగా ముద్రపడిందన్నారు. ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టిన తర్వాత టెర్రరిస్టుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించారని చెప్పారు. ఉగ్రదాడులను ప్రోత్సహిస్తున్న పొరుగు దేశంపై సర్జికల్ దాడులు చేయడానికి కూడా మోదీ వెనుకాడలేదని గుర్తుచేశారు. ప్రధాని మోదీ అనుసరించిన విధానాల వల్ల దేశ భద్రతపై ప్రజల్లో మళ్లీ విశ్వాసం కలిగిందని ప్రశంసించారు. ఈ సమయంలో విజయసాయిరెడ్డి ప్రసంగానికి విపక్షాలు అంతరాయం కలిగించడంతో హోంమంత్రి అమిత్ షా జోక్యం చేసుకున్నారు. కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ సహచర సభ్యుడు మాట్లాడుతుంటే వినే ఓపిక, సహనం లేకపోతే ఎలా అని అమిత్‌షా ప్రశ్నించారు. మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు విజయసాయిరెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పాలని షా సూచించారు. దిశ బిల్లుకు వెంటనే ఆమోదం తెలపండి మహిళలపై జరిగే అత్యాచారం కేసుల్లో నిందితులను త్వరితగతిన శిక్షించేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ బిల్లును తక్షణమే ఆమోదించాలని హోంమంత్రి అమిత్‌షాకు విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. శిక్షలు పడుతున్న కేసులు తక్కువ విజయసాయిరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఎప్పుడో 1920లో చేసిన ఈ చట్టానికి మారిన పరిస్థితులకు అనుగుణంగా సవరణ చేపట్టడం ఎంతైనా అవసరమని చెప్పారు. ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు హోంమంత్రి అమిత్‌షాను అభినందిస్తూ 2020 నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డుల ప్రకారం దేశంలో వివిధ నేరాలకు పడుతున్న శిక్షల శాతాన్ని వివరించారు. మర్డర్ కేసుల్లో 40 శాతం, రేప్ కేసుల్లో 39 శాతం, హత్యాయత్నం కేసుల్లో 24 శాతం నిందితులకు శిక్షలు పడ్డాయని తెలిపారు. శిక్షలు పడిన కేసుల శాతం ఇంత తక్కువగా ఉండటానికి కారణం నేరస్తులను శిక్షించే బలమైన ఆధారాల సేకరణకు పోలీసుల వద్ద తగిన ఉపకరణాలు లేకపోవడమేనని చెప్పారు. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో శిక్షలు పడుతున్న కేసులు చాలా తక్కువగా ఉంటున్నాయన్నారు. యూకేలో 2020–21లో 83.6 శాతం కేసుల్లో నిందితులకు శిక్షలు పడ్డాయని, అమెరికాలో 93 శాతం, జపాన్‌లో 99 శాతం నేరాలకు తగిన శిక్షలు పడ్డాయని చెప్పారు. సమర్థమైన విచారణకు క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్స్, సిస్టమ్స్ ఎంతైనా అవసరమన్నారు. నేరస్తుల వేలి, కాలిముద్రల సేకరణ అనేది కొత్తగా ప్రవేశపెడుతున్నదేమీ కాదని, అనేక క్రిమినల్ కేసుల్లో వాటిని సాక్ష్యాలుగా వినియోగించుకున్న సందర్భాలున్నాయని చెప్పారు. ఉదాహరణకు 2013లో బుద్ధగయలో జరిగిన ఉగ్రదాడి అనంతరం ఘటనాస్థలంలో బౌద్ధభిక్షువు ధరించే వస్త్రం దొరికిందని, వస్త్రంలో దొరికిన వెంట్రుకలు బాంబు దాడికి పాల్పడిన నిందితుడి వెంట్రుకలకు సరితూగాయని గుర్తుచేశారు. ఈ కేసులో నిందితుడికి వ్యతిరేకంగా అవే కీలక సాక్ష్యంగా మారాయన్నారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్లో అందుబాటులోకి వచ్చిన అధునాతన టెక్నాలజీని మనం కచ్చితంగా వినియోగించుకుని తీరాల్సిందేనని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
Russia-Ukraine war: భీకర పోరు
మారియుపోల్/లెవివ్: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. రష్యా సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. రాజధాని కీవ్‌తోపాటు ముఖ్య నగరాలను స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా క్షిపణులతో నిప్పుల వర్షం కురిపిస్తోంది. సైనిక స్థావరాలనే కాదు, సాధారణ నివాస గృహాలను కూడా విడిచిపెట్టడం లేదు. కీవ్, మారియుపోల్‌లో పరిస్థితి భీతావహంగా మారింది. కాల్పుల మోత ఆగకపోవడంతో పౌరుల తరలింపు సాధ్యం కావడంలేదు. నీరు, ఆహారం, అత్యవసర ఔషధాలు అందక జనం హాహాకారాలు చేస్తున్నారు. ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందో తెలియక బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మారియుపోల్‌లో విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా నిలిచిపోయింది. రాజధాని కీవ్ చుట్టూ రష్యా సైన్యం మోహరించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడి సలహాదారు మైఖేలో పొడొల్యాక్ చెప్పారు. కీవ్‌పై రష్యా సైన్యం చాలావరకు పట్టు సాధించిందని తెలిపారు. రాజధానిని ప్రత్యర్థుల కబంధ హస్తాల నుంచి కాపాడుకొనేందుకు జనం సిద్ధమవుతున్నారని వెల్లడించారు. పశ్చిమ ఉక్రెయిన్‌లోని లెవివ్ నగర సమీపంలో ఉన్న యారోవివ్ సైనిక శిక్షణా కేంద్రంపై ఆదివారం ఉదయం రష్యా గగనతల దాడుల్లో 35 మంది మరణించారు. మరో 57 మంది గాయపడ్డారు. పోలండ్ సరిహద్దుకు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న యారోవివ్ మిలటరీ రేంజ్‌పై రష్యా సైన్యం రాకెట్లు ప్రయోగించిందని ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. దీన్ని యారోవివ్ ఇంటర్నేషనల్ పీస్‌కీపింగ్, సెక్యూరిటీ సెంటర్గానూ పిలుస్తారు. అమెరికా సైనికాధికారులు ఇక్కడ ఉక్రెయిన్ సైన్యానికి స్వయంగా శిక్షణ ఇస్తుంటారు. ఈ మిలటరీ రేంజ్లో నాటో దేశాల సైనిక విన్యాసాలు జరుగుతుంటాయి. అయితే, యారోవివ్ శిక్షణా కేంద్రంలో మాటువేసిన 180 మంది విదేశీ కిరాయి సైనికులను హతమార్చామని, విదేశీ ఆయుధాలను ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది. ఆయుధాలు సమకూర్చుకోవడానికి ఉక్రెయిన్‌కు మరో 20 కోట్ల డాలర్లు అందజేస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ప్రకటించారు. ఉక్రెయిన్‌కు ఆయుధ సాయం అందజేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్‌కు ఆయుధాలు తెచ్చే నౌకలను పేల్చేస్తామని వెల్లడించింది. నకిలీ రిపబ్లిక్లను సృష్టిస్తే సహించం తమ దేశాన్ని ముక్కలు చేయడానికి రష్యా తమ భూభాగంలో నకిలీ రిపబ్లిక్లను సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. డొనెట్స్క్, లుహాన్స్క్ తరహా అనుభవాలను పునరావృతం కానివ్వబోమన్నారు. ఖేర్సన్ ప్రాంతాన్ని రిపబ్లిక్‌గా మార్చేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు తెలిసిందన్నారు. మానవతా కారిడార్ల ద్వారా 1,25,000 మందిని దేశం నుంచి క్షేమంగా బయటకు పంపించామని వివరించారు. మరో మేయర్‌ను అపహరించిన రష్యా! దినిప్రొరుడ్నె నగర మేయర్ యెవ్హెన్ మాట్‌వెయెవ్‌ను ఆదివారం రష్యా సైనికులు కిడ్నాప్ చేశారని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిత్రో కులేబా ఆరోపించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇప్పటికే మెలిటోపోల్ సిటీ మేయర్ ఇవాన్ ఫెడోరోవ్‌ను రష్యా సైన్యం అపహరించినట్లు వార్తలు రావడం తెలిసిందే. భారత ఎంబసీ పోలండ్‌కు మార్పు ఉక్రెయిన్‌లో పరిస్థితులు భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లోని తన రాయబార కార్యాలయాన్ని(ఎంబసీ) పొరుగు దేశం పోలండ్‌కు తాత్కాలికంగా మార్చాలని నిర్ణయించింది. రాజధాని కీవ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ సిబ్బంది ఇప్పటికే లెవివ్ నుంచి విధులు నిర్వర్తిస్తున్నారు. రష్యా దాడుల్లో అమెరికా జర్నలిస్టు మృతి ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోని ఇర్పిన్లో రష్యా దాడుల్లో ప్రఖ్యాత ‘ద న్యూయార్క్ టైమ్స్’లో పనిచేసిన బ్రెంట్ రెనాడ్(51) మృతి చెందినట్లు ‘కీవ్ ఇండిపెండెంట్’ పత్రిక ఆదివారం వెల్లడించింది. మరో ఇద్దరు అమెరికా జర్నలిస్టులు గాయపడ్డారని తెలియజేసింది. అమెరికాకు చెందిన బ్రెంట్ రెనాడ్ సినీ దర్శకుడిగానూ పని చేస్తున్నారు. నాటో జోలికొస్తే ప్రతిదాడులే: అమెరికా ఉక్రెయిన్–నాటో దేశాల సరిహద్దుల్లో రష్యా దాడులకు దిగితే ప్రతిదాడులు చేస్తామని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ తేల్చిచెప్పారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, తాజా పరిణామాలపై జేక్ సలీవన్, చైనా విదేశాంగ విధానం సీనియర్ సలహాదారు యాంగ్ జీచీ సోమవారం రోమ్‌లో చర్చలు జరుపనున్నారు. గూగుల్ ఉన్నతాధికారులకు బెదిరింపులు పుతిన్‌కు వ్యతిరేకంగా ఓట్లను నమోదు చేసే ఒక యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించాలని రష్యా అధికారులు గూగుల్ మహిళా ఉన్నతాధికారిని బెదిరించారు. ఈ యాప్‌ను 24 గంటల్లో తొలగించకుంటే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని బెదిరించడంతో కంపెనీ ఆమెను ఒక హోటల్‌కు తరలించింది. కానీ కేజీబీ ఏజెంట్లు అక్కడకు వచ్చి మరోమారు బెదిరించారని తెలిపింది. దీంతో స్మార్ట్ ఓటింగ్ యాప్ గంటల్లో ప్లేస్టోర్ నుంచి మాయమైంది. తనకు ఇలాంటి బెదిరింపులే తమకూ వచ్చాయని యాపిల్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. ఉక్రెయిన్‌తో చర్చల్లో పురోగతి: రష్యా ఇరుదేశాల మధ్య యుద్ధంపై ఉక్రెయిన్‌తో జరుగుతున్న చర్చల్లో గణనీయమైన పురోగతి లభించిందని రష్యా తరపు ప్రతినిధి లియోనిడ్ స్లట్స్కీ ఆదివారం చెప్పారు. చర్చల ప్రారంభం నాటితో పోలిస్తే ఇప్పుడు స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని అన్నారు. ఉక్రెయిన్–రష్యా ప్రతినిధుల మధ్య బెలారస్ సరిహద్దులు ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలు ఇలాగే సానుకూల ధోరణితో కొనసాగితే రెండు దేశాల నడుమ ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని స్లట్స్కీ వివరించారు. ఆశ్రయమిస్తే నెలకు 350 పౌండ్లు ఉక్రెయిన్ శరణార్థులకు ఇళ్లల్లో ఉచితంగా వసతి, భోజన సదుపాయాలు కల్పిస్తే నెలకు 350 పౌండ్లు చొప్పున భత్యం అందజేస్తామని యూకే హౌసింగ్ సెక్రెటరీ మైఖేల్ గోవ్ చెప్పారు. కనీసం 6 నెలలపాటు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందన్నారు. ఉక్రెయిన్ నుంచి ఎంతోమంది ప్రాణభయంతో తరలివస్తున్నారని, ఒక్కొక్కరి అవసరాలను తీర్చడానికి గాను స్థానిక కౌన్సిళ్లకు 10 వేల పౌండ్లుచొప్పున ఇస్తామన్నారు. శరణార్థులకు వైద్య సేవలు, వారి పిల్లల స్కూళ్ల ఫీజులు సైతం ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టం చేశారు. శరణార్థులకు ఆశ్రయం కల్పించేందుకు ఆసక్తి ఉన్నవారు సోమవారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. శరణార్థులు మూడేళ్లపాటు ఉండొచ్చని తెలిపారు. -
విచారణ వేగవంతం చేయాలి
న్యూఢిల్లీ: ముంబైపై 2008 నవంబర్ 26న జరిగిన ఉగ్ర దాడుల గాయాలు ఇంకా దేశాన్ని వెంటాడుతున్నాయని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులపై పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని వీడి విచారణను వేగవంతం చేయాలన్నారు. 26/11 దాడులు జరిగి శుక్రవారానికి 13 ఏళ్లు పూర్తికావడంతో అందులో మరణించిన వారికి ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి భారత్ కొత్త పద్ధతులు, కొత్త విధానాలు అనుసరిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ పాకిస్తాన్ హై కమిషన్ కార్యాలయ దౌత్యవేత్తని పిలిచి గట్టి హెచ్చరికలే జారీ చేసింది. ముంబై దాడులపై విచారణను త్వరితగతిని పూర్తి చేయాలని డిమాండ్ చేసింది. ‘26/11 బాధితులు 13 ఏళ్లుగా న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. పాక్ భూభాగం నుంచే ఈ దాడులకు కుట్ర జరిగింది. అక్కడ్నుంచే దాడులకు తెగబడ్డారు. 15 దేశాలకు చెందిన 166 కుటుంబాలు న్యాయం కోసం ఎదురు చూస్తున్నాయి. పాకిస్తాన్ కాస్తయినా నిజాయితీగా వ్యవహరించి కుట్రదారులను శిక్షించాలి’ అని భారత విదేశాంగ శాఖ డిమాండ్ చేసింది. ముంబై దాడుల బాధితులకు న్యాయం జరిగే వరకు పాక్‌పై ఒత్తిడి తీసుకువస్తూనే ఉంటామని ఒక ప్రకటనలో పేర్కొంది. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ భూ భాగం నుంచే దాడులకు కుట్ర జరిగినట్టు అంగీకరించిన విషయాన్ని విదేశాంగ శాఖ గుర్తు చేసింది. -
బుర్కినా ఫాసోలో ఉగ్రదాడి.. 19 మంది మృతి..
బుర్కినా ఫాసో(ఆఫ్రికా): ఆఫ్రికా దేశమైన బుర్కినాఫాసోలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఈ దాడులలో 19 మంది అమాయకులు మృతి చెందారు. వీరిలో 9 మంది భద్రత దళాలున్నట్లు సమాచారం. సెంటర్ నార్త్ రీజియన్‌లో జరిగిన ఈ దాడిలో ఆసుపత్రిని ముష్కరులు కాలబెట్టారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అల్‌ఖైదా, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థల మధ్య ఘర్షణల కారణంగా బుర్కినాఫాసోలో హింస రోజురోజుకి పెరుగుతుంది. దీంతో వేలాది మంది అమాయకులు మరణిస్తున్నారు. ఇప్పటివరకు 14 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. -
దేశ చరిత్రలో అది చీకటి రోజు: మోదీ
చెన్నై: రెండేళ్ల క్రితం ఉగ్రమూకలు దొంగలాగా దాడిచేసి 40 మంది భారత జవానులను పొట్టన పెట్టుకున్న రోజు దేశ చరిత్రలో చీకటి రోజుగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం 2019 ఫిబ్రవరి 14 న దాదాపు 2500 మంది సీఆర్పీఎఫ్ దళాలు 78 బస్సుల్లో జమ్ముకశ్మీర్ నుంచి శ్రీనగర్‌కు బయలుదేరారు. జైషే మహమ్మద్ కు చెందిన ఆత్మహుతి దళాలు సీఆర్పీఎఫ్ బస్సుపై దాడిచేశారు. ఆ ఘటనలో 40 మంది అసువులు బాశారు. తమిళనాడులో పర్యటనలో భాగంగా మోదీ.. ఆరోజు ఘటనను గుర్తుచేసుకొని వారికి ఘననివాళుర్పించారు. ఈ దేశం వారి త్యాగాలను ఎప్పటికీ మరవదని అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అనేక ప్రభుత్వ పథకాలకు శంకుస్థాపనలు చేశారు మోదీ. ఈ క్రమంలోనే స్వదేశీ పరిజ్జానంతో అభివృద్ధి చెందిన అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంక్ (మార్క్1ఎ)ను చెన్నైఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణేకు అందజేశారు. భారత్ ఉన్న రెండు రక్షణ కారిడర్లలో ఒకటి తమిళనాడులో ఉంది. దీనికి 8,100 కోట్లను ప్రాథమికంగా నిర్ణయించారు.వీటితోపాటు 9 కిలోమీటర్ల పొడవుగల చెన్నై మెట్రోతోపాటు, రెండు రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపను చేశారు. మద్రాస్‌లో ఐఐటీ క్యాంపస్ నిర్మాణానికి వెయ్యికోట్లవుతొందని కూడా అంచనావేశారు. దీనితోపాటు అనైకట్ కెనాల్ పునర్నిర్మాణ పనులకు కూడా ప్రారంభించారు. -
లండన్ వీధుల్లో బిన్ లాడెన్ ప్రతినిధి
సాక్షి, న్యూఢిల్లీ : 1998లో జరిపిన టెర్రరిస్టు దాడుల్లో 224 మంది మరణానికి కారణమై అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న దివంగత అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు అధికార ప్రతినిధి అయిన 60 ఏళ్ల అదెల్ అబ్దెల్ బేరీ ప్రస్తుతం లండన్ వీధుల్లో స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. కెన్యా, టాంజానియాల్లోని అమెరికా ఎంబసీ కార్యాలయాలపై టెర్రరిస్టులు ఆగస్టు నెలలో జరిపిన వరుస బాంబు దాడుల్లో 224 మంది మరణించగా, 72 మంది గాయపడ్డారు. లండన్‌లోని తలదాచుకున్న అబ్దెల్‌ను బ్రిటన్ పోలీసులు 1999లో అరెస్ట్ చేసి, 2012లో అమెరికాకు అప్పగించారు. ఆయన అమెరికా కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష పడింది. (చదవండి: ట్రంప్ రికార్డ్.. 130 ఏళ్లలో తొలిసారి) నాటి నుంచి న్యూజెర్సీలోని డిటెన్షన్ సెంటర్లో ఉన్న అబ్దెల్ బాగా లావు అవడంతోపాటు అస్థమాతో బాధ పడుతున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్ అమెరికా ప్రజలను భయకంపితుల్ని చేస్తోన్న నేటి పరిస్థితుల్లో అయిన్ని సురక్షితంగా ఓ గదిలో నిర్బంధించడం తమ వల్ల కాదని డిటెక్షన్ సెంటర్ అధికారులు చేతులెత్తేయడంతో ఆయనకు ముందుగా క్షమాభిక్ష ప్రసాదించి మంగళవారం నాడు విడుదల చేశారు. ఆయన ఆ మరుసటి రోజు బుధవారం నాడే లండన్‌కు చేరుకున్నారు. మెయిడా వలేలోని తన ఫ్లాట్‌కు చేరుకున్నారు. 9.8 కోట్ల రూపాయల విలువైన ఆ ఫ్లాట్‌లో ఆయన భార్య రగా (59 ఏళ్లు) నివసిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఆయన తన భార్యను కలసుకున్నారు. జన్మతా ఈజిప్షియన్ అయిన అబ్దెల్‌కు 1991 బ్రిటన్ ఆశ్రయం లభించింది. ఇప్పుడు ఆయన్ని వెనక్కి పంపించుదామంటే అమెరికా అధికారులు వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అటు ఈజిప్టుకు పంపిద్దామంటే మానవ హక్కుల సమస్య ఉత్పన్నం అవుతుందని బ్రిటన్ అధికారులు ఆందోళన పడుతున్నారు. మళ్లీ ఆయన టెర్రరిస్టు కార్యాకలాపాలవైపు వెళ్లకుండా ఆయనపై నిఘా కొనసాగించే విషయంలోనూ ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. -
దేశంలో పాగాకు అల్‌కాయిదా కుట్ర
న్యూఢిల్లీ/కోల్‌కతా: భారత్‌లో వేళ్లూనుకునేందుకు నిషేధిత అల్‌కాయిదా ఉగ్ర సంస్థ పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) బట్టబయలు చేసింది. కీలక ప్రాంతాల్లో ఉగ్రదాడులు, కొందరు ముఖ్యులను చంపేందుకు సాగుతున్న యత్నాలను భగ్నం చేసింది. పశ్చిమ బెంగాల్, కేరళలలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిపి ఈ ముఠాలోని 9 మందిని అరెస్ట్‌చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి అందిన సమాచారం మేరకు, రాష్ట్రాలు పోలీసుల సాయంతో 18, 19 తేదీల్లో కేరళ, బెంగాల్‌లలో దాడులు జరిపి 9 మందిని అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. ముర్షీద్ హసన్, ఇయాకుబ్ బిశ్వాస్, మొసారఫ్ హొస్సేన్ అనే వారిని కేరళలోని ఎర్నాకులంలోను, నజ్ముస్ సకిబ్, అబూ సుఫియాన్, మైనుల్ మొండల్, లియు ఈన్ అహ్మద్, అల్ మమూన్ కమల్, అటిటుర్ రహ్మాన్లను ముర్షీదాబాద్‌లో అరెస్ట్‌చేశారు. ఈ ముఠాకు హసన్ నేతృత్వం వహిస్తున్నాడని చెప్పారు. కేరళలో పట్టుబడిన వారూ బెంగాల్ వాసులే. 11న అల్‌కాయిదా మాడ్యూల్‌పై కేసు నమోదు చేసిన ఎన్ఐఏ, ఇతర దర్యాప్తు సంస్థలతో ఉమ్మడిగా ఈ ఆపరేషన్‌ను చేపట్టింది. అరెస్టయిన వారంతా సామాజిక మాధ్యమాల ద్వారా పాకిస్తాన్‌లోని అల్ కాయిదా ఉగ్రవాదుల బోధనల ప్రభావానికి లోనయ్యారు. ఢిల్లీ సహా దేశంలోని కీలకప్రాంతాల్లో ఉగ్ర దాడులు జరిపి భారీగా ప్రాణనష్టం కలిగించేందుకు, ప్రముఖులను చంపేందుకు పథకం వేశారు. ఇందుకు అవసరమైన డబ్బుతోపాటు ఆయుధాలు..ఆటోమేటిక్ రైఫిళ్లు, పిస్టళ్లు, పేలుడు పదార్థాల కోసం కశ్మీర్‌తోపాటు ఢిల్లీ వెళ్లాలని ఈ ముఠా పథకం వేసింది. అంతేకాకుండా, కశ్మీర్ సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో అల్‌కాయిదా నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించింది. టపాసులను ఐఈడీ(ఇంప్రోవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్)గా మార్చేందుకు ఈ ముఠా ప్రయత్నిం చిందని సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న స్విచ్చులు, బ్యాటరీలను బట్టి తేలిందని ఎన్ఐఏ ప్రతినిధి తెలిపారు. దాడుల్లో జిహాదీ సాహిత్యం, కొన్ని ఆయుధాలు, దేశవాళీ తయారీ తుపాకులు, స్థానికంగా రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, పేలుడు పదార్థాల తయారీని తెలిపే సమాచారం, డిజిటల్ పరికరాలు లభించాయి. ఆరుగురికి 24 వరకు రిమాండ్ పశ్చిమబెంగాల్లో అరెస్టు చేసిన అల్‌కాయిదా ముఠాలోని ఆరుగురు సభ్యులకు కోల్‌కతాలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు రిమాండ్ విధించింది. వీరిపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. బాంబుల తయారీ కేంద్రం బెంగాల్: గవర్నర్ ధన్కర్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన అల్‌కాయిదా ఉగ్ర ముఠా సభ్యులను ఎన్ఐఏ అరెస్టు చేయడంపై రాష్ట్ర గవర్నర్ ధన్కర్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్పందించారు. బాంబుల తయారీకి రాష్ట్రం కేంద్రంగా మారిందని ధన్కర్ ఆరోపించారు. శాంతి, భద్రతలు దారుణంగా క్షీణించాయన్నారు. మమతా బెనర్జీ ప్రభుత్వం, డీజీపీ ఇందుకు బాధ్యత వహించకతప్పదని పేర్కొన్నారు. -
అస్సాం రైఫిల్స్‌పై ఉగ్రవాదుల దాడి
దిస్పూర్: మణిపూర్‌లో గురువారం జరిగిన ఉగ్ర దాడిలో అస్సాం రైఫిల్స్‌కు చెందిన ముగ్గురు సైనికులు మరణించగా..మరో ఆరుగురు గాయపడ్డారు. చందేల్ జిల్లాలో స్థానిక పీపుల్స్ లిబరేషన్ పార్టీకి చెందిన ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడినట్టు సమాచారం. ఉగ్రవాదులు తొలుత ఐఈడీతో దాడి చేసి ఆపై అస్సాం రైఫ్సిల్ సైనికులపై కాల్పులు జరిపారు. ఘటన జరిగిన ప్రాంతం మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఘటనా ప్రాంతానికి అదనపు బలగాలను తరలించామని అధికారులు వెల్లడించారు. -
‘అమర్నాథ్ యాత్రకు ఉగ్రముప్పు’
శ్రీనగర్: అమర్నాథ్ యాత్రికులపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారని సమాచారం అందినట్లు జమ్మూ కశ్మీర్ భద్రతా అధికారులు తెలిపారు. కుల్గాంలోని నాగర్-చిమ్మర్ ప్రాంతంలో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల్లో జైషే మహమ్మద్ టాప్ కమాండర్‌తోపాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో నాలుగు రోజుల్లో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉగ్రవాదుల దాడులపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. (24 గంటల్లో ఆరుగురు టెర్రరిస్టుల హతం) ‘అమర్నాథ్ యాత్రను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు ప్రయత్నం చేస్తున్నారు. వారి దాడులను అడ్డుకోవడానికి తగిన సైనిక వ్యవస్థ, వనరులు ఉన్నాయి. యాత్రను శాంతియుతంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాము’ అని బ్రిగేడియర్ వివేక్ సింగ్ ఠాకుర్ తెలిపారు. అమర్నాథ్ యాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా శాంతియుతంగా సాగడానికి భద్రతపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. జాతీయ రహదారి 44ను అమర్నాథ్ యాత్రికులు ఉపయోగించుకుంటారని తెలిపారు. -
కరోనా కాలంలో పాక్ కుట్రలు
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వర్తమానంలో సైతం కశ్మీర్‌కు ఉగ్రవాద బెడద తప్పలేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్ వైపు నుంచి కాల్పుల మోత ఆగలేదు. ఒకపక్క పాకిస్తాన్ కరోనాతో నానా యాతన పడుతోంది. అయినా తన కుటిల ఎత్తుగడల్ని యధావిధిగా కొనసాగిస్తోంది. ఉత్తర కశ్మీర్ లోని హంద్వారా మండలం పరిధిలోని గ్రామం వద్ద 16 గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఎన్ కౌంటర్లో ఉగ్రవాదుల తుపాకి గుళ్లకు ఆదివారం మన సైన్యానికి చెందిన కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనూజ్ సూద్, జవాన్లు నాయక్ రాజేష్, లాన్స్ నాయక్ దినేశ్లతోపాటు ఎస్ఐ సాగిర్ అహ్మద్ క్వాజీ పఠాన్ కన్నుమూశారు. ఆ మర్నాడు అదే హంద్వారా ప్రాంతంలోని మరో గ్రామంలో ఉగ్రవాదులు సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసి మరో ముగ్గురిని పొట్టనబెట్టుకున్నారు. ఈ దాడిలో మరో ఏడుగురు గాయపడ్డారు. ఈ రెండు దాడుల వెనకా పాక్ సైన్యం కుట్రే వుంది. గత నెలలోనే నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద అది పలుమార్లు కాల్పులకు తెగబడింది. కాల్పుల విరమణ ఒప్పం దాన్ని ఉల్లంఘించింది. ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించడమే లక్ష్యంగా తరచు ఈ పని చేస్తోంది. గత నెల 5న ఎల్ఓసీ పొడవునావున్న ఉత్తర కశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలో పాకిస్తాన్ వైపు నుంచి మన దేశంలో ప్రవేశించిన అయిదుగురు ఉగ్రవాదుల్ని మన జవాన్లు గుర్తించి కాల్చిచంపారు. అప్పుడు జరిగిన ఎన్కౌంటర్లో అయిదుగురు సైనిక కమాండోలు కూడా ప్రాణాలు కోల్పోయారు. మన దేశాన్ని చికాకు పరచడానికి పాకిస్తాన్ ఇంకా అనేకానేక ఎత్తుగడలకు పాల్పడుతోంది. సైనిక పరంగా మాత్రమే కాక సాంకేతిక రంగంలోనూ భారత్‌పై అది కత్తి కట్టింది. మన దేశం కరోనా కట్టడి కోసమని రూపొందించిన ఆరోగ్యసేతు యాప్‌కు అది నకిలీని రూపొందించి సైబర్ ప్రపంచంలో వదిలిందని ఇటీవలే వెల్లడైంది. ఇరుగు పొరుగు దేశాల మధ్య ఘర్షణలు ముదిరితే వాటి పర్యవసానంగా రెండు దేశాలూ దెబ్బతింటాయి. పైగా కరోనా మహమ్మారి చుట్టుముట్టిన ఈ తరుణంలో ఘర్షణలకు దిగడం వల్ల ఆ వ్యాధి నియంత్రణ చర్యలపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం సాధ్యం కాదు. పాకిస్తాన్ కూడా కరోనా బాధిత దేశమే అయినా, దాన్నుంచి బయటపడటానికి కొట్టుమిట్టాడుతున్నా అక్కడి సైన్యానికి భారత్‌ను చికాకు పరచడమే ప్రధాన లక్ష్యం కావడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో సైన్యాన్ని కట్టడి చేయడానికి ప్రభుత్వాల నుంచి ఎంతో కొంత ప్రయత్నం జరిగేది. కొన్నిసార్లు అది లొంగకతప్పేది కాదు. ఇప్పుడు పాక్ సైన్యానికి ఆ బాధ లేదు. ప్రస్తుతం ప్రధానిగావున్న ఇమ్రాన్ ఖాన్ వారి చలవతో గద్దెనెక్కిన వ్యక్తే. ఆయన పని తీరు ఎలావుంటున్నదో చెప్పడానికి మార్చి 15న జరిగిన సార్క్ అధినేతల వీడియో కాన్ఫరెన్సే నిదర్శనం. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన ఆ కాన్ఫరెన్స్‌కు ఇమ్రాన్ తప్ప అన్ని దేశాల నేతలూ హాజరయ్యారు. కరోనా కట్టడిలో అనుసరిం చాల్సిన వ్యూహం గురించి, సభ్య దేశాల మధ్య వుండాల్సిన సహకారం గురించి అందులో చర్చిం చారు. మన దేశం తన వంతుగా ఏమేం చేయదల్చుకున్నదో తెలిపింది. పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ తరఫున ఒక అధికారి హాజరయ్యారు. ఆయన కరోనా వ్యాప్తిని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించకుండా కశ్మీర్ సమస్యను లేవనెత్తారు. ఆ తర్వాత గత నెల 10న జరిగిన సమావేశంలో సైతం అది వితండవాదన చేసింది. ఏం చేసినా సార్క్ చట్రం పరిధిలోనే చేయాలి తప్ప ఎవరో ఒకరు చొరవ తీసుకుని చేయడం కుదరదని వాదించింది. ఏకాభిప్రాయం వస్తే తప్ప ఏదీ చేయకూడదన్న నిబంధన విధించాలన్నదే ఈ వ్యూహంలోని ఎత్తుగడ. ఆ తర్వాత భారత్ ప్రతిపాదించే ఏ చర్యకైనా మోకాలడ్డవచ్చని అది భావించింది. ఇతర సభ్య దేశాలన్నీ మన ప్రతిపాదనకు అంగీకారం తెలిపి, సమష్టిగా పనిచేయడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో చేసేది లేక సమావేశం నుంచి పాక్ నిష్క్రమించింది. సంక్షోభ సమయాల్లో సైతం పాకిస్తాన్ పోకడ ఎలా వుంటుందో చెప్పడానికి సార్క్ అధినేతల వీడియో కాన్ఫరెన్స్‌లో అది వ్యవహరించిన తీరు, ఎల్ఓసీ వద్ద అది యధేచ్ఛగా సాగిస్తున్న కాల్పులు నిదర్శనం. ఉగ్రవాదుల దుశ్చర్యకు లక్ష్యంగా మారిన 21 రాష్ట్రీయ రైఫిల్స్(ఆర్ఆర్) అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంలో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. కశ్మీర్లో హంద్వారా సెక్టార్ దేశ భద్రత రీత్యా ఎంతో కీలకమైనది. ఆ ప్రాంతంనుంచే పాకిస్తాన్ సైన్యం ఎల్ఓసీ వద్ద ఉగ్రవాదుల్ని సరి హద్దులు దాటిస్తుంటుంది. కల్నల్ అశుతోష్ శర్మ ఆధ్వర్యంలో మన జవాన్లు అక్కడ ఈమధ్య కాలంలో ఎన్నో విజయాలు సాధించారు. అక్కడ ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించే ప్రత్యేక దళాలు(ఎస్ఎఫ్) నాలుగేళ్లక్రితం పాకిస్తాన్ గడ్డపై వున్న ఉగ్రవాద స్థావరాలను సర్జికల్ దాడుల్లో ధ్వంసం చేశాయి. హఠాత్తుగా దాడి మొదలైనప్పుడు, అప్పటికప్పుడు అంచనా వేసుకుని ఎదురుదాడికి పాల్పడవలసివస్తుంది. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు నష్టాలు సంభవించడానికి ఆస్కారం వుంటుంది. ఈ తరహా ఆపరేషన్లలో కమాండింగ్ ఆఫీసర్(సీవో) ఎక్కడోవుండి ఆదేశాలివ్వడంకాక, ముందుండి తన దళాలను నడిపించవలసివుంటుంది. అక్కడ చావుకీ, బతుక్కీ మధ్య వెంట్రుకవాసి దూరం మాత్రమే వుంటుంది. సీవోగా వున్న కల్నల్ శర్మ హంద్వారా ప్రాంతంలో అలాంటి నాయకత్వ పటిమనే ప్రదర్శించారు. పౌరుల ప్రాణాలకు ముప్పు వాటి ల్లకుండా అక్కడినుంచి ఖాళీ చేయించగలిగారు. కానీ ఆ క్రమంలో ఆయన, ఆయన సహచరులు నేలకొరిగారు. ఇతర కమాండోలు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టగలిగారు. ఉగ్రవాదులద్వారా మన దేశాన్ని చికాకు పరుస్తూ ఎప్పటికైనా పైచేయి సాధించగలనని పాకిస్తాన్ పగటి కలలు కంటోంది. దాని కుట్రలను వమ్ము చేస్తూనే, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా ఏకాకి చేయడమే మన కర్తవ్యం కావాలి. -
ఉగ్రవాదానికీ ఊతమిచ్చిన బాబ్రీ ఘటన!
బాబ్రీ మసీదు కూల్చివేతకు పూర్వమూ కొన్ని మతఘర్షణల దాఖలాలున్నాయి. కానీ బాబ్రీ తరువాత కొన్ని ఉగ్రవాద ఘటనలూ చోటుచేసుకున్నాయి. దాయాది దేశం పాకిస్తాన్ తనదైన ఆజ్యం పోయడం పరిస్థితి విషమించడానికి దారితీసింది. ఈ సంఘటన తరువాత దాన్ని కారణంగా చూపిస్తూ ఉగ్రమూకలు తెగబడిన దాడులు తక్కువేమీ కాదు.. 1993 ముంబై దాడులు.. బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకోవాలన్న లక్ష్యంతో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం కుట్ర పన్ని అమలు చేసిన పేలుళ్లు 1993 మార్చి 12న 257 మందిని బలిగొన్నాయి. మధ్యాహ్నం 1.30 నుంచి 3.40 గంటల మధ్యకాలంలో ముంబైలోని 12 చోట్ల కార్లు, స్కూటర్లలో బాంబులుంచి పేల్చేశారు. బాంబు ధాటికి ఓ డబుల్ డెక్కర్ బస్సు పూర్తిగా ధ్వంసమైపోగా ఈ ఒక్క ఘటనలోనే దాదాపు 90 మంది ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. జస్టిస్ పి.డి.కోడే సుమారు 100 మందిని దోషులుగా నిర్దారించారు. 2006లో ప్రత్యేక టాడా కోర్టు... టైగర్ మెమన్తోపాటు అతడి కుటుంబ సభ్యులు ముగ్గురిని దోషులుగా తేల్చింది. ముంబై, కేరళ, హైదరాబాద్‌లలోనూ... పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా 2006 జూలై 11న ముంబైలోని ఓ రైల్లో బాంబు పేలుళ్లకు తెగబడటంతో 187 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వెనుక స్థానిక ముస్లింలున్నట్లు విచారణలో తేలింది. కేరళలో ఏర్పాటైన అల్ ఉమా అనే ఉగ్రవాద సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో పలు ఉగ్రవాద దాడులకు పాల్పడగా.. సంస్థ నాయకుడు సయ్యద్ అహ్మద్ భాషాకు జీవిత ఖైదు విధిస్తూ 2007లో కోర్టు తీర్పునిచ్చింది. అల్ ఉమాపై నిషేధం విధించారు కూడా. బాబ్రీ కూల్చివేత తరువాత ఉగ్రవాదం వైపు మళ్లిన మరో సంస్థ దీన్దార్ అంజుమన్. యూపీలో ఏర్పాటైన సిమీలో ఒకదశలో దేశవ్యాప్తంగా 400 మంది పూర్తిస్థాయి కార్యకర్తలు, ఇరవై వేల మంది సభ్యులు ఉండేవారని, 30 ఏళ్ల వయసులోపు వారైన వీరు పలు ఉగ్రదాడులకు ప్రణాళికలు రచించి, కొన్నింటిని అమలు చేసినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. సిమీ అధ్యక్షుడైన మెకానికల్ ఇంజనీర్, జర్నలిస్టుగానూ పనిచేసిన సఫ్దర్ నాగోరీ 2008లో అరెస్ట్ కావడంతో సంస్థ కార్యకలాపాలు దాదాపుగా సమసిపోయాయి. 2006 నుంచి దేశంలో అత్యంత చురుకుగా పనిచేసిన ఉగ్రవాద సంస్థల్లో ఇండియన్ ముజాహిదీన్ ఒకటి. యూపీ న్యాయస్థానాల్లో వరుస బాంబు పేలుళ్లకు పాల్పడింది. 2008 నాటి ముంబై దాడుల కోసం లష్కరే తోయిబా తరఫున ఐఎం రెక్కీ కూడా నిర్వహించినట్లు వార్తలున్నాయి. -
కొలంబోలో మళ్లీ బ్లాస్ట్.. సూసైడ్ బాంబర్లలో మహిళ!
కొలంబో: శ్రీలంక చిగురుటాకులా వణుకుతోంది. ఓవైపు భద్రతా బలగాలు జల్లెడ పడుతుండగా.. మరోవైపు బాంబులు పేలుతూనే ఉన్నాయి. తాజాగా కొలంబోలో మరో పేలుడు సంభవించింది. స్థానిక సవోయ్ థియేటర్ వద్ద ఉగ్రవాదులు డియో బైక్‌లో బాంబులు అమర్చి పేల్చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. బైక్ అనుమానాస్పదంగా పార్క్ చేసి ఉన్నప్పటికీ.. ఎవరూ గుర్తించకపోవడం భద్రతా లోపాన్ని స్పష్టంచేస్తోంది. ఐసిస్ ఈసారి బహిరంగ ప్రదేశాల్లో పేలుళ్లకు ప్లాన్ చేసిందని అమెరికా నిఘా వర్గాలు శ్రీలంక ప్రభుత్వానికి సమాచారం అందించాయి. అమెరికన్ ఇంటలిజెన్స్ సమాచారం ఇచ్చినట్టుగానే.. ఉదయం 10.50గంటల సమయంలో సవోయ్ థియేటర్ ఎదుట పేలుడు సంభవించింది. పేలుడు దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చి మసీదుల్లో పేలుళ్లకు ప్రతీకారంగానే శ్రీలంకలో పేలుళ్లు జరిపినట్టు ఐసిస్ ఇప్పటికే ప్రకటించింది. శ్రీలంకలో బాంబు పేలుళ్లకు పాల్పడిన తొమ్మిది మంది ఆత్మాహుతి దళ సభ్యుల్లో ఓ మహిళ కూడా ఉన్నట్లు ఆ దేశ రక్షణశాఖ సహాయమంత్రి రువాన్ విజయవర్దనే తెలిపారు. మరో ఇద్దరిని బడా వ్యాపారవేత్త మహమ్మద్ యూసుఫ్ ఇబ్రహీం కుమారులుగా గుర్తించారు. 33 ఏళ్ల ఇమ్సాత్ కొలంబోలోని సిన్నమన్ గ్రాండ్ హోటల్లో, 31ఏళ్ల ఇల్హామ్.. షాంగ్రిల్లా హోటల్లో పేలుళ్లకు తెగబడినట్టు వెల్లడైంది. ఈస్టర్ సండే రోజు వరుస దాడులతో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన నేపథ్యంలో సోమవారం అర్థరాత్రి నుంచి శ్రీలంకలో ఎమర్జెన్సీ అమల్లోకి వచ్చింది. పోలీసులు, త్రివిధ దళాలు ప్రజా భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. 359కి చేరిన మృతుల సంఖ్య శ్రీలంకలో ఈస్టర్ సండేరోజు జరిగిన వరుస పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 359కి చేరింది. మృతుల్లో 39మంది విదేశీయులున్నారు. ఇందులో 10మంది భారతీయులు ఉండగా.. నలుగురు అమెరికన్లు ఉన్నట్టు తెలిసింది. ఈ ఘాతుకానికి పాల్పడ్డ దుండగుల కోసం జరుపుతున్న గాలింపు చర్యలు ముమ్మరంగా సాగినట్లు పోలీసు అధికార ప్రతినిధి గుణశేఖర తెలిపారు. మంగళవారం రాత్రి మరో 18 మంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. దీంతో ఇప్పవరకు పోలీసులు అరెస్టు చేసిన వారి సంఖ్య 60కి చేరింది. అలాగే మరిన్ని దాడులు జరిపేందుకు ముష్కరులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్న సమాచారం అందడంతో.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని లంక ప్రధాని రనిల్ విక్రమసింఘే పిలుపునిచ్చారు. దాడులకు సంబంధించి భారత ఇంటెలిజెన్స్ వర్గాలు శ్రీలంకను ముందే హెచ్చరించింది. మూడు సార్లు ఆ దేశానికి హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈ విషయాన్ని శ్రీలంక ప్రధాని విక్రమసింఘే కూడా ధ్రువీకరించారు. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించారు. హైదరాబాద్‌కు భౌతికకాయం శ్రీలంకలో జరిగిన వరుస బాంబు పేలుళ్ల ఘటనలో హైదరాబాద్ అమీర్‌పేటకు చెందిన ఒకరు మృతిచెందారు. మణికొండకు చెందిన బిల్డర్ మాకినేని శ్రీనివాస్, ఆయన బంధువు వేమూరి తులసీరామ్ స్నేహితులతో కలిసి ఐదురోజుల క్రితం శ్రీలంక సమ్మర్ ట్రిప్‌కు వెళ్లారు. శ్రీలంక హోటల్లో ఉన్న సమయంలో జరిగిన బాంబు దాడిలో తులసీరామ్ అక్కడికక్కడే మృతిచెందారు. శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. ముష్కరుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన తులసీరాం భౌతికకాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చారు. కొలంబో నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు. -
లంక పర్యాటకంపై పెద్ద దెబ్బే
కొలంబో: పర్యాటకానికి మారుపేరు శ్రీలంక. ప్రముఖ బౌద్ధ, హిందూ పుణ్యక్షేత్రాలకు నెలవైన శ్రీలంకను ప్రతిఏటా లక్షలాది మంది విదేశీయులు సందర్శిస్తుంటారు. వీరిలో భారతీయులే అధికంగా ఉంటారు. తాజాగా జరిగిన ఉగ్రవాద దాడులు పర్యాటకంపై తీవ్ర ప్రభావం చూసే అవకాశం ఉందని ఇక్కడి టూర్లు ఆపరేటర్లు, హోటళ్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లంకలో త్వరలో వేసవి సెలవులు ఆరంభం కానున్నాయి. ఈ సమయంలో విదేశీయులు అధిక సంఖ్యలో వస్తుంటారు. పర్యాటక ప్రాంతాలు జనంతో కిటకిటలాడుతుంటాయి. ఈసారి ఆ పరిస్థితి ఉండకపోవచ్చని శ్రీలంక అధికారులు చెబుతున్నారు. సీజన్ ప్రారంభానికి ముందే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అంటున్నారు. ఉగ్రవాద దాడులు తమ దేశంలో పర్యాటక రంగంపై పెద్ద దెబ్బేనని, పర్యాటక ఆదాయం తగ్గుముఖం పట్టవచ్చని శ్రీలంక ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. నేరుగా హోటళ్లపైనే దాడులు జరగడం దేశంలో ఇదే తొలిసారి అని లంక టూర్ ఆపరేటర్ల సంఘం హరిత్ పెరేరా చెప్పారు. 30 ఏళ్ల ఎల్టీటీఈ యుద్ధంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని గుర్తుచేశారు. తాజాగా జరిగిన దాడులతో విదేశీ యాత్రికులకు తప్పుడు సందేశం పంపినట్లయిందని అభిప్రాయపడ్డారు. పదేళ్ల కిందటి దాకా శ్రీలంక పర్యాటక రంగం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. ఎల్టీటీఈ ఉద్యమంలో లక్ష మంది చనిపోయారు. ఎల్టీటీఈ పతనం అనంతరం లంకలో పర్యాటక రంగం అనూహ్యంగా పుంజుకుంది. ఆసియాలోనే అగ్రశ్రేణని పర్యాటక దేశంగా అవతరించింది. భారతీయులను ఆకర్షించడానికి లంక ప్రభుత్వం రామాయణ సర్క్యూట్‌ను అభివృద్ధి చేసింది. -
‘ఆమె ఇక రాదు.. నువ్వు ఇంటికి వెళ్లు’
క్రైస్ట్‌చర్చ్ : బంగ్లాదేశ్‌కు చెందిన హుస్నా తన 19 ఏట ఫరీద్ అహ్మద్‌ను వివాహం చేసుకుని తొలిసారి న్యూజిలాండ్ గడ్డ మీద అడుగు పెట్టింది. గత పాతికేళ్లుగా వారిద్దరు ఎంతో అన్యోనంగా జీవిస్తూ.. ప్రేమ, సంతోషం అనే పునాదుల మీద ఓ అందమైన పొదరింటిని నిర్మించుకున్నారు. మాతృ దేశాన్ని విడిచి.. న్యూజిలాండ్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి దాన్నే తన సొంత ఇంటిగా భావించి.. ప్రేమించింది హుస్నా. ఆర్నెళ్లు గడిచేలోపే ఇంగ్లీష్ నేర్చుకుంది. కొత్త స్నేహితులను పరిచయం చేసుకుంది. భర్తకు అన్ని వేళలా చేదోడువాదోడుగా నిలుస్తూ.. కుటుంబాన్ని ప్రేమగా చూసుకునేది. ఫరీద్ ఇంట్లోనే హోమియోపతి మందుల దుకాణాన్ని నడుపుతుండేవాడు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా.. వారి అన్యోన్యతను చూసి విధికి సైతం కన్ను కుట్టింది. అందుకే ఉగ్రదాడి రూపంలో వారి పాతికేళ్ల దాంపత్య జీవితాన్ని ముక్కలు చేసింది. ఎప్పటిలానే దైవ ప్రార్థనల నిమిత్తం మసీదుకెళ్లిన హుస్నాను మరణం ఉన్మాది రూపంలో వెంటాడింది. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం పూట న్యూజిలాండ్‌లోని మసీదుల్లో నరమేధం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. గత వారం జరిగిన ఈ దారుణ సంఘటనలో 49 మంది అమాయకులు అసువులు బాశారు. ఇలా మరణించిన వారిలో ఫరీద్ భార్య హుస్నా కూడా ఉన్నారు. ప్రార్థనల నిమిత్తం మసీదుకు వెళ్లినప్పుడు.. జరిగిన నరమేధంలో ఉగ్రవాది హుస్నాను ఫుట్‌పాత్ మీదనే కాల్చేశాడు. గతంలో జరిగిన ఓ ప్రమాదం కారణంగా వీల్ చైర్‌కే పరిమితమైన ఫరీద్ మసీదులో కాకుండా బయట ఉండే చిన్న గదిలో ప్రార్థనలు చేసుకుంటుండటం వల్ల ఈ దారుణం నుంచి తప్పించుకోగలిగాడు. పేలుళ్ల శబ్దం వినిపడగానే సంఘటనా స్థలానికి వచ్చిన ఫరీద్‌కు అతని స్నేహితులు, ఇరుగుపొరుగు వారు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు కనిపించాయి. కొందరు గాయాలతో బాధపడుతుండగా.. మరి కొందరు ఏకంగా ప్రాణాలే కోల్పోయారు. వారిలో హుస్నా కూడా ఉన్నారు. జరిగిన దారుణం అర్థం కావడానికి కాస్త సమయం పట్టింది ఫరీద్‌కు. ఈ లోపు ఒక స్త్రీ వచ్చి.. ‘మీ భార్య ఇక ఎన్నటికి తిరిగి రారు. మీరు రాత్రంతా ఇక్కడే వేచి ఉండటం వల్ల ఎటువంటి లాభం లేదు. ఇంటికి వెళ్లండి’ అని చెప్పింది. ఆ మాట వినగానే మూగ బోయాడు ఫరీద్. తన ప్రపంచమే కుప్పకూలిపోయిందంటూ విలపించాడు. (‘క్షమించండి.. మేము అలాంటి వాళ్లం కాదు’) జరిగిన దారుణం గురించి ఫరీద్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు హుస్నా మాటలు, నవ్వులతో కిలకిలలాడే నా ఇళ్లు ఈ రోజు మూగబోయింది. కానీ ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వారిని నేను క్షమిస్తున్నాను. ఈ దారుణానికి పాల్పడిన వ్యక్తికి, అతనిలానే ఆలోచించే అతని స్నేహితులకు నేనిచ్చే సందేశం ఇదే. ఇప్పటికి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని కౌగిలించుకుని.. మీ ముఖంలోకి చూస్తూ.. నా మనస్పూర్తిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. నేను ఇప్పటికి.. ఎప్పటికి మిమ్మల్ని ద్వేషించను’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ఇక తన భార్య గురించి మాట్లాడుతూ.. ‘ఆమె నాకు తల్లి, తండ్రి, నేస్తం. ఇతరుల మేలు కోరే వ్యక్తి తను. వేరొకరి జీవితాన్ని కాపాడ్డం కోసం ఆమె చనిపోవడానికి కూడా సిద్ధపడుతుంది’ అంటూ భార్యను తల్చుకుని కన్నీటి పర్యంతమయ్యాడు ఫరీద్. ఈ నరమేధానికి పాల్పడిన వారిలో ఒకరిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెటంన్ టారంట్(28)గా గుర్తించారు పోలీసులు. (చదవండి : ‘అతని పేరును ఎవరూ పలకరాదు’) -
‘అతని పేరును ఎవరూ పలకరాదు’
క్రైస్ట్‌చర్చ్ : ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టారంట్(28) అనే ఉగ్రవాది ఇటీవల న్యూజిలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో కాల్పులకు పాల్పడి దాదాపు 50 మంది అమాయకులకు పొట్టన పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ అంశంపై న్యూజిలాండ్ పార్లమెంట్ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ సందర్భంగా దేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి జసిండా ఆర్డెన్ ప్రసంగించారు. ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్‌లో మరణహోమం సృష్టించిన ఉగ్రవాది పేరును తాను ప్రస్తావించబోనని తేల్చి చెప్పారు. ఉగ్రదాడికి పాల్పడిన వ్యక్తి అనైతికంగా ప్రవర్తించి బీభత్సం సృష్టించాడని, అతని పేరును తాను ఎప్పుడూ ప్రస్తావించనని చెప్పారు. దేశ ప్రజలు కూడా అతని పేరును ఉచ్చరించొద్దని కోరారు. కాల్పుల్లో ప్రాణాలను కోల్పోయిన వారి పేర్లను బయటకు చెప్పండి కానీ.. ఆ ఘాతుకానికి పాల్పడిన వ్యక్తి పేరును ఎక్కడ ఉచ్చరించకూడదని చెప్పారు. అతనో ఉగ్రవాది, క్రిమినల్, తీవ్రవాది అని, తాను మాట్లాడుతున్నప్పుడు అతని పేరును ప్రస్తావించబోనన్నారు. దేశంలోని చట్టాల ప్రకారం అతన్ని కఠినంగా శిక్షిస్తామన్నారు. జాత్యహంకారంతో ఆస్ట్రేలియాలో జన్మించిన బ్రెంటన్ టారంట్ అనే వ్యక్తి గత శుక్రవారం న్యూజిలాండ్‌లోని అల్ నూర్, లిన్‌వుడ్ మసీదుల వద్ద ఈ కాల్పులు జరిపి 50 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఈ దురాగతం మొత్తాన్ని వీడియో తీస్తూ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. వీడియో ప్రకారం దుండగుడు మసీదు పక్కన కారు పార్కు చేసి తుపాకీ తీశాడు. కారుడిక్కీలోంచి మరో గన్ తీసుకుని మసీదులోకి నడిచాడు. ద్వారం వద్ద ఉన్న ఓ వ్యక్తిని కాల్చాడు. అక్కడి నుంచి రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మసీదులోపలికి వెళ్లాడు. కాల్పుల్లో మరణించిన వారిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. (న్యూజిలాండ్‌లో నరమేధం) -
న్యూజిలాండ్‌లో నరమేధం
క్రైస్ట్‌చర్చ్: ప్రపంచంలోనే ప్రశాంతతకు మారుపేరైన న్యూజిలాండ్‌లో మారణహోమం. ముస్లింలకు పవిత్రమైన శుక్రవారం న్యూజిలాండ్‌లోని మసీదుల్లో నరమేధం చోటుచేసుకుంది. క్రైస్ట్‌చర్చ్ సిటీలోని రెండు మసీదులపై జరిగిన ఉగ్రవాద దాడిలో 49 మంది అమాయకులు అసువులు బాశారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో 9 మంది భారతీయుల జాడ తెలీడంలేదని న్యూజిలాండ్‌లోని భారత హైకమిషన్ కార్యాలయం తెలిపింది. ఈ దాడి ఉగ్రవాద చర్యేనని న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆర్డెర్న్ ధ్రువీకరించారు. కాల్పులు జరిగిన అల్ నూర్ మసీదు, లిన్‌వుడ్ అవెన్యూ మసీదుల మధ్య దూరం దాదాపు ఐదు కిలోమీటర్లు కాగా, రెండు చోట్లా కాల్పులు వేర్వేరు సమయాల్లో చోటుచేసుకున్నాయి. దీంతో రెండు మసీదుల్లో కాల్పులు జరిపింది ఒక్క ఉగ్రవాదేనా లేక ఇద్దరున్నారా అన్న విషయంపై స్పష్టతరాలేదు. కాగా, కాల్పుల ఘటన నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు త్రుటిలో తప్పించుకుంది. వారంతా అల్నూర్ మసీదుకు బస్సులో వెళ్తుండగా, బస్ మసీదు వద్దకు చేరాక, ఆటగాళ్లు ఇంకా బస్‌లో ఉండగానే కాల్పులు ప్రారంభమైనట్లు సమాచారం. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి: ప్రధాని జసిండా న్యూజిలాండ్‌లో ముస్లింలపై జరిగిన అతిపెద్ద దాడి ఇదేనని తెలుస్తోంది. ప్రధాని జసిండా మాట్లాడుతూ ‘ఇది ఉగ్రవాద దాడేనన్న విషయం స్పష్టమవుతోంది. న్యూజిలాండ్‌కు అత్యంత చీకటిరోజుల్లో ఇదొకటి. ఇది పక్కాగా ప్రణాళిక రచించి జరిపిన దాడి’ అని చెప్పారు. ఎంత మంది ఉగ్రవాదులు కాల్పులు జరిపారన్న దానిపై స్పష్టత లేకపోయినప్పటికీ తాము ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని జసిండా వెల్లడించారు. రెండు భారీ పేలుడు పరికరాలను మిలిటరీ గుర్తించి నిర్వీర్యం చేసిందన్నారు. ఇది అసాధారణ, ఎవరూ ఊహించని హింసాత్మక ఘటన అని ఆమె పేర్కొన్నారు. అల్ నూర్ మసీదు వద్ద 41 మంది, లిన్‌వుడ్ అవెన్యూ మసీదు వద్ద ఏడుగురు చనిపోయారనీ, ఇంకొకరు ఎక్కడ చనిపోయిందీ స్పష్టత లేదని పోలీసులు చెప్పారు. ముందు జాగ్రత్తగా న్యూజిలాండ్‌లో శుక్రవారం ముస్లింలెవరూ మసీదులకు వెళ్లవద్దని పోలీసులు కోరారు. 9 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు కాల్పుల ఘటన తర్వాత మొత్తం 9 మంది భారతీయులు లేదా భారత సంతతి ప్రజల ఆచూకీ గల్లంతయిందని న్యూజిలాండ్‌లోని భారత హై కమిషన్ కార్యాలయం వెల్లడించింది. అయితే ఇంకా అధికారిక సమాచారమేదీ రాలేదని తెలిపింది. భారత హై కమిషన్ అక్కడి స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోందనీ, కాల్పుల ఘటన వల్ల అక్కడ ఎవరైనా భారతీయులు ఏ రకంగానైనా ప్రభావితులయ్యుంటారని అనుమానం ఉంటే వారి బంధువులు నేరుగా భారత హై కమిషన్ కార్యాలయాన్ని సంప్రదించాలని విదేశాంగ శాఖ కోరింది. ఇందుకోసం 021803899, 021850033 అనే రెండు హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ చెప్పారు. మోదీ దిగ్భ్రాంతి.. న్యూజిలాండ్ ప్రధానికి లేఖ న్యూజిలాండ్‌లో కాల్పుల ఘటనపై భారత ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. ఉగ్రవాదాన్ని, దానికి మద్దతిచ్చే వారిని భారత్ ఖండిస్తోందని మోదీ పునరుద్ఘాటించారంది. కష్టకాలంలో న్యూజిలాండ్‌కు సంఘీభావం తెలుపుతూ ఆ దేశ ప్రధాని జసిండాకు మోదీ ఓ లేఖ రాశారని విదేశాంగ శాఖ వెల్లడించింది. ‘భిన్నత్వంతో కూడిన ప్రజాస్వామ్య సమాజాల్లో హింస, ద్వేషాలకు తావు లేదు. ఈ ఘటనతో నష్టపోయిన కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని మోదీ ఆ లేఖలో పేర్కొన్నారంది. మనుషులని ఎలా పిలుస్తారు?: ఆస్ట్రేలియా ప్రధాని రెండింటిలో ఒక మసీదు వద్ద కాల్పులు జరిపింది తమ దేశంలో పుట్టిన వాడేనని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ వెల్లడించారు. ఇలాంటి ద్వేష, హింసాత్మక ఘటనలకు పాల్పడేవారిని మనుషులని ఎలా పిలుస్తారో తనకు అర్థం కాదని ఆయన అన్నారు. ఈ ఘటనలో అతని పాత్రపై విచారణ ప్రారంభమైందని మారిసన్ చెప్పారు. ఉగ్రవాదుల దుశ్చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. వలసదారులంటే ద్వేషం.. యూరప్ దాడులతో కలత! సిడ్నీ: మసీదు నరమేధంలో పాల్గొన్న వ్యక్తిని ఆస్ట్రేలియాకు చెందిన బ్రెంటన్ టర్రంట్(28)గా అధికారులు గుర్తించారు. వలసదారుల్ని తీవ్రంగా ద్వేషించే బ్రెంటన్, యూరప్‌లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడులతో కలత చెందాడని తెలిపారు. ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్న నిందితుడు ఈ దారుణానికి తెగబడ్డాడని వ్యాఖ్యానించారు. గతంలో ఆస్ట్రేలియాలోని గ్రాఫ్టన్ సిటీలో ‘బిగ్ రివర్ జిమ్’లో పర్సనల్ ట్రైనర్‌గా బ్రెంటన్ పనిచేశాడు. వీరిది దిగువ మధ్యతరగతి కుటుంబం. బ్రెంటన్ తండ్రి రోడ్నీ(49) కేన్సర్‌తో 2010లో కన్నుమూశారు. స్కూలు పూర్తిచేశాక బ్రెంటన్ 2009–11 మధ్యకాలంలో జిమ్ ట్రైనర్‌గా చేశాడు. తర్వాత ‘బిట్‌కనెక్ట్’ అనే క్రిప్టోకరెన్సీ ద్వారా నగదును సమీకరించి ప్రపంచమంతా పర్యటించాడు. ఇందులో భాగంగా ఆసియా, యూరప్‌లోని పలుదేశాలను సందర్శించాడు. పశ్చిమయూరప్ పర్యటనలో ఉండగా 2017లో ఐసిస్ ఉగ్రమూకలు చేపట్టిన దాడులతో ప్రతీకారం తీర్చుకోవాలని బ్రెంటన్ నిర్ణయించుకున్నాడు. ప్రపంచంలోనే మారుమూల ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్ కూడా సురక్షితం కాదని చాటిచెప్పేందుకే నిందితుడు ఈ దారుణానికి తెగబడినట్లు అధికారులు భావిస్తున్నారు. అలాగే న్యూజిలాండ్‌కు భారీగా వలసలు సాగుతుండంపై బ్రెంటన్ ఆగ్రహంతో రగిలిపోయినట్లు అభిప్రాయపడ్డారు. న్యూజిలాండ్‌లో హత్యలు చాలా అరుదుగా జరుగుతాయి. న్యూయార్క్ టైమ్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం న్యూజిలాండ్‌లో 2017లో 35 హత్యలు జరిగాయి. అలాగే తుపాకీ హత్యలు కూడా చాలా అరుదుగా జరుగుతాయని నివేదిక పేర్కొంది. ఘటనాస్థలివద్ద రక్తమోడుతున్న జహంగీర్, కాల్పుల్లో గాయపడ్డ ఫరాజ్ (ఫైల్) ఇద్దరు హైదరాబాదీలకు గాయాలు తీవ్రంగా గాయపడ్డ జహంగీర్‌కు వెంటనే శస్త్రచికిత్స సాక్షి, హైదరాబాద్: న్యూజిలాండ్ క్రైస్ట్‌చర్చిలో దుండగులు జరిపిన కాల్పుల్లో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు చిక్కుకున్నారు. మహమ్మద్ జహంగీర్ (49) అక్కడ హోటల్ వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జహంగీర్‌కు శరీరంలో బుల్లెట్లు దిగాయి. అతనికి ఆదివారం శస్త్రచికిత్స చేయనున్నారని న్యూజిలాండ్ అధికారులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 15 ఏళ్ల క్రితమే న్యూజిలాండ్ వెళ్లి అక్కడే స్థిరపడ్డ జహంగీర్ ఈ ఏడాదిలో రెండుసార్లు హైదరాబాద్‌కు వచ్చాడు. జనవరి 19న ఒకసారి, అదేనెల 30వ తేదీన మరోసారి హైదరాబాద్‌కు వచ్చాడు. ఈమేరకు హైదరాబాద్ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్ విభాగపు స్టాంపులు కూడా ఆయన పాస్‌పోర్టుపై ముద్రించి ఉన్నాయి. ఇదే దుర్ఘటనలో టోలీచౌకీ నదీమ్ కాలనీకి చెందిన హసన్ ఫరాజ్ అనే మరో వ్యక్తి కూడా గాయపడ్డాడు. ఘటన జరిగిన సమయంలో ఫరాజ్ అక్కడ నమాజ్ చేయడానికి వెళ్లినట్లు స్నేహితులు చెబుతున్నారు. 9 ఏళ్ల క్రితం ఉన్నతవిద్య కోసం ఫరాజ్ న్యూజిలాండ్ వెళ్లి స్థిరపడ్డాడు. సాయం చేయండి: అసదుద్దీన్ ఒవైసీ మహమ్మద్ జహంగీర్‌ను కలుసుకునేందుకు వెంటనే వారి కుటుంబ సభ్యులను అనుమతించాలని మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విదేశాంగ శాఖ, ఆ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. జహంగీర్ సోదరుడు ఇక్బాల్ న్యూజిలాండ్ వెళ్లేందుకు సొంతంగా అన్ని ఖర్చులూ భరించుకుంటాడనీ, వెంటనే వీసా మాత్రం ఇప్పించి సాయం చేయాలని ఒవైసీ కోరారు. దీనికి స్పందించిన కేటీఆర్ తప్పకుండా జహంగీర్ కుటుంబ సభ్యులకు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాల్పులు జరుపుతూ ఫేస్బుక్ లైవ్ కాల్పులు జరిపిన ఆస్ట్రేలియా వ్యక్తి ఈ దురాగతం మొత్తాన్ని వీడియో తీస్తూ ఫేస్బుక్లో లైవ్ పెట్టాడు. శుక్రవారం ఉదయమే తాను జరపబోయే కాల్పుల గురించి 74 పేజీల ‘మేనిఫెస్టో’ను దుండగుడు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. కాగా, శరీరంపై కెమెరా అమర్చుకుని ప్రార్థనలు చేసుకుంటున్న వారిని ఒక్కో గదిలోకి వెళ్తూ దగ్గరి నుంచి కాల్పులు జరిపాడు. వీడియో ప్రకారం దుండగుడు మసీదు పక్కన కారు పార్కు చేసి తుపాకీ తీశాడు. కారుడిక్కీలోంచి మరో గన్ తీసుకుని మసీదులోకి నడిచాడు. ద్వారం వద్ద ఉన్న ఓ వ్యక్తిని కాల్చాడు. అక్కడి నుంచి రైఫిల్‌తో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ మసీదులోపలికి వెళ్లాడు. కాల్పులకు భయపడి పరుగులు తీస్తున్న జనంపై బులెట్ల వర్షం కురిపించాడు. దుండగుడు పోస్ట్ చేసిన మేనిఫెస్టోకు ‘ది గ్రేట్ రిప్లేస్మెంట్’అని పేరు పెట్టాడు. ఫ్రాన్స్‌లో ఆవిర్భవించిన కుట్ర సిద్ధాంతమే ఈ ది గ్రేట్ రిప్లేస్మెంట్. దీని ప్రకారం స్వస్థలాల్లో ఎక్కువ జనన రేటు ఉన్న వలసదారులు వచ్చి యూరోపియన్లను వెళ్లగొడుతున్నారని నమ్ముతారు. ఫ్రెంచ్ నేత మారిన్ లె పెన్ 2017 ఎన్నికల్లో ఓడిపోవడం, 2017లో స్టాక్‌హోం ట్రక్ దాడిలో 11 ఏళ్ల ఎబ్బా అకర్లాండ్ బాలిక మరణం తనను అతివాదిగా మార్చాయని పేర్కొన్నాడు. కాల్పులు జరిగిన కొద్ది సేపటికే దుండగుడి ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం ఖాతాలను తొలగించినట్లు ఫేస్బుక్ తెలిపింది. -
బాధను భరిస్తూ కూర్చోం
టోంక్ (రాజస్తాన్): ఉగ్రవాద దాడుల బాధను భరిస్తూ కూర్చునే ప్రభుత్వం తమది కాదనీ, తప్పక ప్రతీకారం ఉంటుందని ప్రధాని∙మోదీ అన్నారు. ఈ విషయంలో ఇప్పటికే భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛనిచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. దళాలు వాటి పని అవి పూర్తి చేస్తాయన్నారు. ప్రభుత్వ పోరాటం కశ్మీర్ కోసమే తప్ప కశ్మీర్‌కు వ్యతిరేకంగానో లేక కశ్మీరీలపైనో కాదని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై పోరులో కశ్మీరీ యవతీ యువకులు ప్రభుత్వంతో కలిసి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని మనతోనే ఉంచుకోవాలి తప్ప వారిపై ఎవరూ దాడులు చేయకూడదని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 14న కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాద దాడి తర్వాత దేశంలో అక్కడక్కడ కశ్మీరీలపై దాడులు జరిగినట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో మోదీ శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం అంతానికే తాము పోరాడుతున్నామనీ, చేతులు ముడుచుకుని కూర్చోబోమని అన్నారు. రాజస్తాన్‌లోని టోంక్‌లో బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ ‘ఉగ్రవాదం అనే ఫ్యాక్టరీ నడుస్తున్నంత కాలం ప్రపంచంలో శాంతి నెలకొనదు. ఆ ఫ్యాక్టరీని నేనే అంతం చేయాలని రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. దాడి తర్వాత మనలో ఎంత కోపం, ప్రతీకారం రగులుతున్నాయో మీరు చూస్తున్నారు. మన కొత్త విధానాల వల్ల పాకిస్తాన్ కష్టాలను ఎదుర్కొంటోంది. ఇది కొత్త ఇండియా. మేం బాధను భరిస్తూ నోర్మూసుకుని కూర్చునే రకం కాదు’ అంటూ పాక్‌ను మోదీ పరోక్షంగా హెచ్చరించారు. ఎన్నో ఏళ్లుగా సైనికులు కోరుతున్న ఒక ర్యాంకు, ఒక పెన్షన్‌ని తమ ప్రభుత్వం అమలు చేసిందనీ, 20 లక్షల మంది విశ్రాంత సైనికులకు రూ. 11 వేల కోట్ల పాత బకాయిలను చెల్లించిందని చెప్పారు. పాక్ ప్రధాని మాట నిలబెట్టుకుంటారా? ‘ఇమ్రాన్ ఖాన్ పాక్ కొత్త ప్రధానిగా ఎన్నికైనప్పుడు మర్యాదపూర్వకంగా ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పా. ఇన్నాళ్లూ పోట్లాడుకున్నామనీ, ఇకపై చేతులు కలిపి పేదరికం, నిరక్షరాస్యతలను రూపుమాపేందుకు కృషి చేద్దామని కోరా. అందుకు ఆయన ఒప్పుకుంటూ తాను పఠాన్ల కుమారుడిననీ, అబద్ధాలు చెప్పనని అన్నారు. మరి ఆ మాటను ఇప్పుడు ఆయన నిలబెట్టుకుంటారో లేదో చూడాలి’ అని మోదీ అన్నారు. ‘మన దేశంలో నివసిస్తున్న కొందరు ప్రజలు పాకిస్తాన్ భాషలో మాట్లాడటం నన్ను బాధిస్తుంది. మీరు ఏమైనా చేయండి, మోదీని పదవి నుంచి దింపేయండి అని పాకిస్తాన్‌కు వెళ్లి చెప్పొచ్చేది వీళ్లే. ముంబైలో ఉగ్రవాద దాడికి పాల్పడిన వారికి సమాధానం ఇవ్వలేని వాళ్లే వీళ్లు’ అని మోదీ కాంగ్రెస్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘ఉగ్రవాద చర్యల్లో కశ్మీర్‌లోని పాఠశాలలు తగలబడి పోకుండా చూసుకోవాలని గతంలో కశ్మీర్ సర్పంచ్‌లను కోరా. తమ ప్రాణాలైనా అడ్డుపెట్టి పాఠశాలలు తగలబడకుండా అడ్డుకుంటామని హామీనిచ్చారు. రెండేళ్లలో ఒక్క పాఠశాల కూడా కశ్మీర్ లోయలో నాశనం కాలేదని చెప్పడానికి గర్వపడుతున్నా’ అన్నారు. స్వాగతించిన నేషనల్ కాన్ఫరెన్స్ కశ్మీరీలపై దాడులను నిరసిస్తూ మోదీ చేసిన వ్యాఖ్యలను నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లాలు స్వాగతించారు. దాడులను ఖండించడంలో మోదీ ఆలస్యంగా స్పందించారనీ, ఇప్పటికైనా దాడులు వద్దంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని స్వాగతిస్తున్నామని ఓ ప్రకటన ద్వారా వారు తెలిపారు. అయితే మాటల్లో చెప్పడం కాకుండా దాడులను నివారించేందుకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. అవినీతికి బదులు అత్యధిక వృద్ధి రేటు ఎకనమిక్ టైమ్స్ పత్రిక ఢిల్లీలో నిర్వహించిన ప్రపంచ వాణిజ్య సదస్సులోనూ మోదీ మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పాలనలో అవినీతిలో పోటీ ఉండేదనీ, ఇప్పుడు తమ ప్రభుత్వం 1991 నాటి ఆర్థిక సంస్కరణల తర్వాత ఎన్నడూ లేనంత అత్యధిక సగటు వృద్ధి రేటును, అత్యల్ప సగటు ద్రవ్యోల్బణాన్ని సాధించిందని మోదీ చెప్పారు. ఇండియాను 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చేందుకు తమ ప్రణాళికలను మోదీ వివరించారు. -
‘రక్షణ’లో పెట్టుబడులకు స్వాగతం
సాక్షి, బెంగళూరు: ప్రధాని మోదీ ప్రకటించిన ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం మరింత విజయవంతమయ్యేలా వైమానిక రంగంలో భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని సంస్థలకు రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. బుధవారం బెంగళూరులోని యలహంక వాయుసేన స్థావరంలో ఐదురోజుల అంతర్జాతీయ వైమానిక ప్రదర్శన ‘ఏరో ఇండియా, 2019’ను నిర్మల ప్రారంభించారు. రక్షణ రంగంలో పరికరాల తయారీ కోసం 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)కు కేంద్రం పచ్చజెండా ఊపిందన్నారు. ఇందులో 600 దేశీయ, 400 విదేశీ సంస్థలు పాల్గొన్నాయి. అత్యాధునిక యుద్ధ, పౌర విమానాలు, హెలికాప్టర్లను ప్రదర్శించాయి. పాకిస్తాన్‌తో యుద్ధానికి సిద్ధం ఉగ్రవాదులు దాడులతో భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని నిర్మల అన్నారు. పాకిస్తాన్‌తో యుద్ధమే వస్తే అందుకు కూడా సైనికులు సిద్ధమేనని చెప్పారు. గడిచిన నాలుగేళ్లలో యుద్ధ విమానాలు, ఆయుధాలు, రక్షణరంగ పరికరాలను కొనుగోలుకు సంబంధించి భారత రక్షణశాఖ రూ. 1,27,500 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుందన్నారు. 2 వేల పౌర విమానాలు అవసరం ప్రతీ భారతీయుడికి విమాన సేవలను అందిం చే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు విమానయాన మంత్రి సురేశ్ ప్రభు చెప్పారు. దేశానికి 2000కుపైగా పౌర విమానాల అవసరముందన్నారు. దేశంలో 235 నగరాలకు విమానసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఎయిర్‌పోర్టుల అభివృద్ధి, కొత్త ఎయిర్‌పోర్ట్‌ల కోసం 65 బిలియన్ డాలర్లను ఖర్చుచేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి త్రివిధ దళాల అధిపతులు, కర్ణాటక సీఎం కుమారస్వామి, ఉన్నతాధికారులు, వందలాది మంది సందర్శకులు హాజరయ్యారు. ప్రత్యేక ఆకర్షణగా రఫేల్ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న రఫేల్ యుద్ధవిమానం ఎయిర్‌షోలో సందర్శకుల మనసు దోచుకుంది. మంగళ వారం సూర్యకిరణ్ విన్యాసవిమానాలు ఢీకొన్న ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వింగ్ కమాండర్, పైలట్ సాహిల్ గాంధీకి నివాళిగా తక్కువ ఎత్తులో, తలకిందులుగా ప్రయాణించింది. షోలో డకోటా విమానం, ధృవ్, హాక్, హెచ్‌టీటీ40 తదితర విమానాలు, హెలికాప్టర్లు విన్యాసాలతో సందర్శకులు అలరించాయి.