రెడీ.. యాక్షన్‌ | 26/11 Mumbai Terrorist Attacks Taj Hotel | Sakshi
Sakshi News home page

రెడీ.. యాక్షన్‌

Published Wed, Nov 8 2017 10:50 AM | Last Updated on Wed, Nov 8 2017 10:50 AM

26/11 Mumbai Terrorist Attacks Taj Hotel - Sakshi

26/11.. ప్రపంచం మరచిపోలేని రోజు.. 2008 నవంబర్‌ 26 భారతదేశ ప్రజలు భయబ్రాంతులయిన రోజు. పాకిస్తాన్‌కు చెందిన పదిమంది ముష్కరులు అరేబియా సముద్ర జలాల నుంచి భారత భూభాగంలోకి అడుగుపెట్టారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో మారణ హోమం సృష్టించారు. ప్రతి భారతీయుడు మరిచిపోలేని ఘట్టం. 166 మందిని పొట్టన పెట్టుకున్నారు. 304 మంది గాయాలపాలయ్యారు. ఆ మారణ హోమంలో స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా అశువులు బాశారు. అంతర్జాతీయ స్థాయి వసతులతో కూడిన పది నక్షత్రాల తాజ్‌ మహల్‌ హోటల్‌లో జరిగిన 60 గంటలపాటు మిలటరీ ఆపరేషన్‌. ఇది భారతదేశ చరిత్రలో రక్తంతో రాజుకున్న పుటలు. అలాంటి పరిస్థితులు ఇక ఎన్నడూ దేశంలో ఏ ఒక్కచోట జరుగకూడదన్నది భారత ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయం. అందులో భాగంగా తీర ప్రాంతంలో కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌ స్టేషన్ల ఏర్పాటు. అప్పుడప్పుడు సాగర్‌ కవచ్‌ పేరుతో తీర ప్రాంతంలో అప్రమత్తం. నిఘా నీడలో రెండు రోజులపాటు జిల్లాలోని తీర ప్రాంతాన్ని జల్లెడ పట్టనున్నారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ప్రత్యేక బందోబస్తు నిర్వహణకు జిల్లా పోలీస్‌ యంత్రాంగం సన్నద్ధమైంది. ప్రజలను అప్రమత్తం చేసేందుకు రెండు రోజులపాటు పోలీసులు మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్నారు.

ఒంగోలు క్రైం: జిల్లాలోని సముద్ర తీర ప్రాంతం పోలీస్‌ నిఘా నీడలో కట్టుదిట్టమైన భద్రత నడుమ అప్రమత్తం చేస్తున్నారు. సాగర్‌ కవచ్‌ పేరుతో పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమయింది. అటు గుంటూరు జిల్లా సరిహద్దు మొదలుకొని ఇటు నెల్లూరు జిల్లా సరిహద్దు చేవూరు వరకు సముద్ర తీరాన్ని పోలీసులు తమ కనుసన్నల్లోకి తీసుకున్నారు. అటు పోలీసులతో పాటు తీర ప్రాంతంలోని ప్రజలను కూడా అప్రమత్తం చేసేవిధంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రెండు రోజులపాటు తీరం వెంబడి పోలీస్‌ కసరత్తు ప్రారంభించారు. బుధవారం తెల్లవారు జాము 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రత్యేక పహారా, కట్టుదిట్టమైన భద్రత కోసం జిల్లా పోలీస్‌ యంత్రాంగం సన్నద్ధమయింది. తీరం వెంబడి కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌ స్టేషన్‌లు రెండు ఉన్నాయి.

 ఒకటి కొత్తపట్నం కాగా రెండోది రామాయపట్నం కోస్టల్‌ సెక్యూరిటీ పోలీస్‌ స్టేషన్లు. ఆ రెండు పోలీస్‌ స్టేషన్ల పోలీసులతో పాటు జిల్లా పోలీస్‌ యంత్రాంగం ప్రత్యేకంగా పోలీస్‌ బృందాలను కేటాయించింది. అందుకుగాను తీరం వెంబడి ఉన్న పోలీస్‌ స్టేషన్ల సిబ్బందితో పాటు వాటికి సంబంధించిన పోలీస్‌ సర్కిళ్ల ఇన్‌స్పెక్టర్లను కూడా జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు అప్రమత్తం చేశారు. ఇటు జిల్లాకు ఈశాన్య సరిహద్దులోని చీరాల రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ మొదలుకొని దక్షిణం వైపున ఉన్న కందుకూరు సర్కిల్‌ వరకు పోలీస్‌ అధికారులు మొదలుకొని సిబ్బంది కళ్లల్లో ఒత్తులు వేసుకొని నిఘా చేపట్టనున్నారు. చీరాల రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ మొదలుకొని ఈపూరు పాలెం, వేటపాలెం, చిన్నగంజాం, నాగులుప్పలపాడు, ఒంగోలు తాలూకా, కొత్తపట్నం, టంగుటూరు, సింగరాయకొండ, ఉలవపాడు, గుడ్లూరు పోలీస్‌ స్టేషన్ల పరిధిలో భద్రత కట్టుదిట్టం చేశారు. 

ప్రత్యేక బందోబస్తు..
సాగర్‌ కవచ్‌ కోసం సముద్ర తీరం వెంబడి గ్రామాల్లో జిల్లా పోలీస్‌ యంత్రాంగం 160 మంది పోలీసులతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తీరం వెంబడి 102 కిలో మీటర్ల మేర 8 చెక్‌ పోస్ట్‌లు, 18 ల్యాండింగ్‌ పాయింట్లు, 12 పోలీస్‌ బీట్లు, 10 పోలీస్‌ పికెట్లు, ఐదు క్విక్‌ రీయాక్షన్‌ టీంలను సిద్ధం చేశారు. 

జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాలే లక్ష్యం....
ముష్కరులు ప్రజలను తద్వారా ప్రభుత్వాలను భయబ్రాంతులను చేసేందుకు జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలను లక్ష్యంగా ఎంచుకుంటారు. అందుకోసం సాగర్‌ కవచ్‌లో భాగంగా పోలీసులు 10 పోలస్‌ పికెట్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా జిల్లా కేంద్రం ఒంగోలులోని పరిపాలనా కేంద్రం వద్ద ప్రత్యేకంగా పికెట్‌ ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఒంగోలు రైల్వే స్టేషన్‌ , ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్, రిమ్స్‌ ఆస్పత్రి, సూరారెడ్డిపాలెం, అమ్మనబ్రోలు, కరవది, సింగరాయకొండ, టంగుటూరు రైల్వే స్టేషన్లు, సింగరాయకొండ బస్టాండ్‌లో పికెట్లు ఏర్పాటు చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement